32నుంచి మహా భక్త శిఖామణులు
32-భక్త మణి పాటిబండ్ల వీరయార్య
పాటిబండ్ల వీరయ్య గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా దీపాలదిన్నె గ్రామం లో బాపయ్య ,బాపమ్మ దంపతులకు 1867లో పుట్టాడు .భార్య వెంకట నరసమ్మ .ఎనిమిదో ఏట బులహరి పీరోజీ మహర్షి వారం రోజులు ఆధ్యాత్మిక ప్రవచాలు చేస్తున్నప్పుడు ,విని అడగకుండా గురు సేవ చేశాడు .నిర౦తరం ఆయన వెంటఉంటూ అనుగ్రహం పొందాడు .12వ ఏట దేవాబత్తుని అచ్చమాంబ ను తనకు పీరోజీ తో ఉపదేశం ఇప్పించమని కోరగా ,ఆమె ఆయనకు చెప్పగా ,సమయం కోసం వేచి ఉండమని చెప్పారు .15వ ఏడు రాగానే పీరోజీ గురువు పిలిపించి కోర్కె తీర్చారు. అప్పటి నుంచి ఇంటిపనులలో తలిదండ్రులకు తోడ్పడుతూ ,రాత్రి భోజనం చేసి,సత్తేనపల్లి వెళ్లి ,గురు సేవ చేసి ఉదయాన్నే మళ్ళీ ఇల్లు చేరేవాడు .ఇలా మూడేళ్ళు గడిచాయి .
ఒక రోజు గురు సేవలో నిద్రరాగా తనను తాననే సంబాలించుకొని పొరపాటు క్షమించమని గురువును కోరగా ఏమీ అనకుండా అనుగ్రహం చూపాడు .గురూప దేశం పొందిన మూడేళ్ళకు ఏదైనా మహిమ ప్రయోగించమని కోరగా .హస్తమస్తకప్రయోగం తో ఏకత్వాన్ని ప్రసాదించాడు .యోగ సిద్ధి లభించింది .సాత్విక లక్షణాలు పెరిగి ,అప్పుడప్పుడు మైమరచిపోతున్నా వ్యవసాయ కార్యాలు యధా విధిగా చేసేవాడు .ఒక రోజు ఉదయం చద్ది తిని అరక దున్నటానికి పొలం వెళ్ళాడు .ఎద్దులని మేతకు వదిలి ,తుమ్మచెట్టుకింద ఖేచరీ ముద్రతో కూర్చుని ,సమాధిగతుడయ్యాడు .మేత తిన్న ఎడ్లు ఇల్లు చేరాయి .కొడుకు రాలేదని భయపడి తండ్రి వస్తే నిశ్చలలసమాది లో కనిపించగా ఆశ్చర్యపోయాడు .ఒళ్ళంతా గండు చీమలు పాకుతున్నాయి .తన ఉత్తరీయం తో చీమల్ని దులుపుతుంటే వీరయ్య స్పృహలోకి వచ్చాడు .తండ్రితో ఇంటికి చేరాడు .
కొడుకు ధ్యానయోగం అర్ధం చేసుకొని పొలం పనులు చెప్పటం మానేశాడు తండ్రి .సత్తెనపల్లి లోనే ఉంటూ గురు సేవలో ,ఆధ్యాత్మిక విషయ అవగాహనలో ధన్యుడయ్యాడు వీరయ్య .పీరోజీ గారికి నంజువ్యాది ఎక్కువై నందున కంటికి రెప్పలాగా గురువును కాపాడాడు .8-7-1886 న ఉదయం 8గంటలకు తండ్రి నుంచి వచ్చిన ఉత్తరం చూసి ఆయన తీవ్రవ్యాధితో బాధపడుతున్నాడని గ్రహించి గురువు ఆనతి పొంది ఇంటికి చేరి తండ్రి ఆరోగ్యం కుదుటపడటానికి అన్ని ప్రయత్నాలు చేస్తుండగా 19-7-1886న పీరోజీ గురువు మహా సమాధి చెందినట్లు తెలిసినా వెళ్ళలేక పోయాడు వీరయ్య .పగలంతా తండ్రి సేవలో గడిపి రాత్రి నిద్రపోతే గురువు కలలో కనిపించి తాను శివ సన్నిధికి చేరానని చెప్పి అదృశ్యమయ్యారు .మర్నాడు ఉదయం ఆ వార్త తండ్రికి చెప్పి అనుమతి పొంది సత్తెనపల్లి వెళ్లి ,అంత్యక్రియలు యధావిధిగా జరిపించి గురుపత్ని వీరాబాయిని, గురుపుత్రులను ఓదార్ఛి మైమరచి ఉండగా గురు దర్శనం కలిగి తానూ ,శిష్యుడూ శాశ్వతులమే అనీ ,ఇద్దరి గమ్య౦ ఒక్కటే అని బోధచేశారు .ఈ విషయం గురుపత్నికి కుమారులకు అందరికీ తెలిపి అందరి వద్దా సెలవు పొంది స్వగ్రామం చేరాడు .
పెళ్లి చేసుకోను అన్న వీరయ్యను గురుపత్ని ఒప్పించి వెంకట నరసమ్మ అనే కన్యతో వివాహం జరిపించారు .ఒక కూతురుపుట్ట గానే ఆత్మ సన్యాసం తీసుకొని ,జీవితాంతం బ్రహ్మ చర్యాన్ని పాటించాడు వీరయ్య .గురువుగారి సమాధికిఅధ్యక్షులైన గురుపుత్రుడు లక్ష్మోజీ గారికీ నంజు వ్యాధి వచ్చి ,పిఠాపురం తీసుకు వెళ్లి మందులు ఇప్పించినా తగ్గకపోతే లక్ష్మోజీ,గురుపత్నుల కోరికపై వీరయ్యార్యుడు పీఠాదిపత్యం స్వీకరించారు.గురుపత్ని సాయంతో ఆశ్రమాన్ని అన్ని విధాలుగా అభి వృద్ధి చేసి సంస్కృతాంధ్రాలలో గొప్ప పాండిత్యం సాధి౦చి ,ఆశుకవిత్వ౦ చెప్పటం తో మహాకవి అయ్యాడు . గురువుగారి మనవడుపీరోజీ బాబుకు ఆశ్రమ బాధ్యత అప్పగించి దుందుభి నామ సంవత్సర కార్తీక శుద్ధ పంచమి 9-11-1922 న హరి నామ స్మరణ చేస్తూ వీరయార్యుడు పరమపదం పొందారు .తనకు జరగాల్సిన అపర కర్మ విధానం శిష్యులకు వివరిస్తూ గురువు రాసిన ఆచలాద్వైత సిద్ధాంత గ్రంథం మననం చేస్తూ ,పూర్తి స్పృహతో వీరయార్యుడు దేహం వదిలారు .భార్య వెంకట నరసమ్మ ‘’నాకేమి సందేశం ఇస్తున్నారు ?’’అని అడిగితే ‘’ఐహికం అనేది లేదు సర్వ వ్యాపకమైన సచ్చిదానంద పరబ్రహ్మమే ఉంది .దాన్ని అనుభవించు ‘’అని చెప్పారు .పీరోజీ గారి సమాధి దగ్గరే ఈయన సమాథి కూడా ఏర్పాటు చేశారు .ఇనగంటి పున్నమార్యుడు వీరయార్యుని ముఖ్య శిష్యుడు .గురువు గారి వెంట తిరిగే కుక్క అనుకోకుండా వస్తే ,దాన్ని తన ఇష్ట దైవంగా భావించి పాదప్రక్షాళనం మొదలైన సపర్యలు చేసి పూజించి ,గురువుకు అప్పగించిన ధన్యజీవి వీరయార్యుడు .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -31-1-21-ఉయ్యూరు
—