శ్రీమదష్టోత్తర హనుమచ్చతకం
శ్రీ పాటి బండ్ల వీరదాసు అనే భక్త శిఖామణి వ్రాసిన’’ శ్రీమదష్టోత్తర హనుమచ్చతకం’’ను సత్తెనపల్లి లోని శ్రీ వీరయార్య వాజ్మయ సమితి 1952లో రేపల్లె ప్రభాత్ ప్రింటర్స్ లో ముద్రించింది . దీనికి శ్రీ వీరయార్య వాజ్మయసమితి కార్యదర్శి శ్రీ బోడేపూడి వెంకటరావు రాసిన ‘’ఒక్కమాట’’ లో –వీరయార్యునిస్వగ్రామం దీపాల దిన్నెపాలెం లో వెలసిన శ్రీ హనుమతుని పై ఉన్న భక్తి తాత్పర్యాలకు నిదర్శనం గా ఈ శతకం రచించారు ద్వితీయముద్రణ 1998లో జరిగింది .శ్రీ దాసరి పరిపూర్ణయ్య నాయుడు గారు పూర్తి ఆర్ధికసాయం అందించారు .అలాగే వీరయార్యుని ఇతర కృతులూ ముద్రించాలని భావిస్తున్నాం ‘’అని తెలియజేశారు .
వీరయార్యునిశతకంకం లో మొదటి పద్యం –‘’శ్రీ వసుధాత్మజ రాముల –సేవన్మేప్పించి తత్వ సిద్ధు డవౌ నీ- సేవకుడను గీర్తించెద-బ్రోవుము దీపాల దిన్నెపురవర హనుమా ‘’
నాలుగవ పద్యం –‘’భవవార్ధి దాటవచ్చును –భువనాత్మక నీదు పాద పూజ నటంచున్ –దవిలి వచి౦తురు ప్రాజ్ఞులు-పవనజ దీపాల దిన్నె పాలెపు హనుమా ‘’’ఛందస్సు తెలియకపొయినా స్వామి కృపతో సుందర కందాలు గూర్చగలిగే నేర్పు కలిగిందనీ –‘’శంకలు మాని ఛి బ్రోవుము –సంకటహర జాలమేల ?’’అంటాడు .’’వక్ష చరోత్తమ నీవతి-దక్షుడవై వనము బెరికిదర్ప మెలర్పన్ –యక్షుని జంపియు గరువపు –రాక్షసులగొట్టి నావు రణమున హనుమా ‘’అని లంకలో వీరహనుమాన్ కృత్యాన్ని వీరోచితంగా పొగిడాడు కవి .’’నీరాటం లో పట్టిన దాన్ని పోరాటం చేసి చంపి ,దీరాటోపత రాముని ఆరాటం తీర్చావంటాడు .రోగాలు, రాగాలు వేగంగా పరిమార్చమన్నాడు .’’హరి కమలాకర హంసా –వరతాపస నిచయ హృదయ వారిజ హంసా –యరివర్గ భయద హంసా –పరమాత్మా నను గావు భక్తుడహనుమా ‘’అని హంస శబ్దాన్ని సాభిప్రాయంగా ప్రయోగించి భక్త హంస అని పించాడు .
చండీ మొండీ దండీ గ్రహాలన్నీ హనుమపేరు చెబితే పరార్ అంటూ ‘’అరయంగ సువర్చలయను –తరుణీ మణితోడ నిరుపమ సౌఖ్యము నొందెడు-కరుణాకరనాకు నీవె గతి యగు హనుమా ‘’అని సువర్చలాన్జనేయం ను స్తుతించాడు ,’’అంజని వరపుత్రుని భవ –భంజను దీపాల దిన్నెపాలెపు వాసున్ –రంజను గొల్చెద రయమున –మంజుల తరగాత్రు నిన్ను మది నిడిహనుమా ‘’అని దీపాలదిన్నె హనుమకు కంద దీపాల దివ్వెల వెలుగు కురిపించాడు సత్కవి వీరయార్య ..పరధన,పరభామల హరి౦చాలనుకొనే మనసును అతి రయంగా మార్చేవి స్వామి చరణాలు అంటాడు ‘’తత్వ బోధ చేస్తూ –‘’కాయముధారుణిపాలగు –ప్రాయము బల్వెతలపాలగు పసిడియు గలుగన్ – దాయలపాలగు నెదలో –బాయని నీ సేవ తనదు పాలగు హనుమా ‘’అని యదార్ధం చెప్పాడు .
‘’శరణంటినినీవే నా-దొరవంటినిదునుము నాదుదురితము లంటిన్-పరమంటిని నీ సేవ యే-కరుణాకర బ్రోవమంటి గదరా హనుమా ‘’అలాగే ‘’హనుమంత వాయుతనయా –వనచర వరకీర్తి మంతవరగుణ నిలయా –దనుజాంతక దీనావన –యని నిను నమ్మి స్మరియి౦చు వాడనయ్యా హనుమా ‘’.తనశతకం చదివితే ఎలాంటి ఫలితం కలుగుతుందో చెబుతూ –‘’భూతలి నీశతకంబును –భూతంబులు సోకి దుఖమొందెడిజనముల్ –బ్రాతిగ బూజించిన నా –భూతములే దుఖమొందిపోవును హనుమా ‘’
చివరలో తన వంశం గురించి చెప్పుకొన్నాడుకవి –‘’ధర బాపయ సుబ్బమలకు –వరపుత్రుడపాటి బండ్ల వంశోడ్భవుడన్ –గరుణించు వీరయాఖ్యుడ-గరువలి సుత వేరు సేయగాదిక హనుమా ‘’.తనగురువు పీరోజీ గురించి ఘనంగా –‘’పులహరి పీర్దేశికవరు –విలసత్కృప నొందినాడ వేడుకలలరన్ -లలితంబుగ జెప్పితి నిటు –వలదిక దప్పొప్పు లెన్నవాయుజ హనుమా ‘’108వ పద్యం –‘’పుడమిని నీ శతంబును –గడు భక్తినిజదువ ,వినిన గాంతురు వారల్ – కడు సంపదలును సిరులును –గడకును గైవల్యపదవి గలుగును హనుమా ‘’అని ఫలశ్రుతి చెప్పి సాయుజ్యం కూడా లభిస్తుందని నొక్కి వక్కాణించాడు వీరయార్య హనుమ భక్తకవి .చక్కని ధారా, శబ్దసౌందర్యం ,భావ పరిమళం ,భక్తి గరిమ శ్రేష్ఠ కవనం తో శతకం ముగ్ధమనోహరంగా ఉంది .భక్తి శతకాలలో తప్పక చేరాల్సిన శతకం వీరయార్యుని ‘’శ్రీ హనుమష్టోత్తర శతకం ‘’.
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-2-21-ఉయ్యూరు