బందరు ఖొజ్జిల్లిపేట నాగేశ్వరస్వామి మహాత్మ్యం -1
అనే ఈ పద్యకావ్య కవి శ్రీవత్స గోత్రికుడు ,టేకుమళ్ళ వంశీకుడు రామచంద్రరావు .తండ్రి రాజగోపాలరావు కవిగారు ధాత నామ సంవత్సరం ఆషాఢ కృష్ణపక్ష తదియనాడు జన్మించాడు .తల్లి రంగనాయకమ్మ .తండ్రి గొప్పపండితుడు .నన్నయకు ముందు తెలుగులేదని ,జయంతి రామయ్య గారు చెప్పగా యుద్ధమల్లుని శాసనం లో ఉన్నది వచనం కాదనీ ,మధ్యాక్కర పద్యాలనీ ఈయన చెప్పాడు .కాశీ భట్ల బ్రహ్మయ్యగారిని కూడా ఒప్పించిన ఘనుడు .దీన్నీ బట్టి తెలుగు కవిత్వ ప్రాచీనత,మధ్యాక్కరల ఉనికి రుజువు చేశాడు.దీనితోపాటు పదాలపుట్టుక ,ఇతరభాషల ఛందోరీతులు బాగా అధ్యయనం చేసి లోకానికి చాటాడు .తెలుగు మళయాళ కన్నడ తుళుతమిళ ట్యుటోనిక్ భాషలలోని తొలిశబ్దాలు ఛందస్సు ఒకే విధమైనవని ,ఇవన్నీ ఆర్యభాషల మొదటి శాఖలని ఉదాహరణపూర్వకంగా వివరించాడు .తెలుగు భాషకు సూర్యుడిలా వెలిగి ,మద్రాస్ యూని వర్సిటి లో ఉన్నతాధికారి యై ,అనేక గ్రంథాలు రాసి ,అమోఘ విజ్ఞానం తో ,వినయ శాంత స్వభావాలతో తనకు సాటి తానే అన్నట్లుగా వెలిగిన తండ్రి బహుధాన్య మార్గశిర బహుళ పాడ్యమి నాడు 63వ ఏట మరణించాడు .తర్వాత తల్లికూడా చనిపోయింది .తలిదండ్రుల సంతానం లో మనకవి రామచంద్రరావు అగ్రజుడు.ఈయనకు ఇద్దరుకొడుకులు .బందరులో విద్యార్ధి, గ్రంథాలయ,ఆంధ్రోద్యమలాలలో నాయకత్వం వహించాడు .’’సంఘసేవకు జీవన సౌరభం అర్పించి ‘’ ప్రజలమేలుకోసం పాటుపడ్డాడు .నవలలు ,నాటకాలు , వ్యాసాలు ,కథలు,కొన్ని గ్రంథాలు రాశాడు .బందరులో న్యాయవాదిగా పని చేస్తూ సంఘం లో పేరు ప్రఖ్యాతులు పొందాడు .’’సరళకవితా విలాస వైశద్యమొసగు ఈ’’ఖొజ్జిల్లిపేట నాగేశ్వరమహాత్మ్యం ‘’ కావ్యం ‘’ నాగేశ్వరస్వామికి అ౦కితమిస్తున్నానని చెప్పాడు.
ఈకవి వంశ చరిత్ర తెలిపాడు .టేకుమళ్ళ వారు మొగల్ ఫౌజు దార్ల ,ఉద్యోగ ముఖ్యజనుల గోల్కొండ ఆర్కాటు ప్రభువుల మంత్రులుగా మాన్య వంశం వారు .దక్కన్ సైన్యాధ్యక్షుడు ‘’వీరబల’’ బిరుదాంకితుడు ,కపిల నరసింహుడు హైదరాబాద్ దగ్గర’’ టేకుమళ్ళ’’ గ్రామవాసి ..ఈయనకొడుకు రామూజీకి ధర్మాజీ ,ఈయనకు కృష్ణప్ప ,నరసింహారావు పుట్టారు .నరసింహారావు ఆసఫ్ జాహి ఆదిపితామహుడికి ఇష్టమైన మంత్రిగా ఉంటూ ,బందిపోటు దొంగలను అణచి వర్తక వాణిజ్యాలు చేసేవారిపై రాజుకు ఆదరం కలిగేట్లు చేసి తన ధర్మాన్ని న్యాయంగా నిర్వహించాడు .ఎక్కడ అన్యాయం దోపిడీ ఉన్నా వెళ్లి వారిని కట్టడి చేసి ప్రజల ధనమాన ప్రాణాలకు రక్షణ కల్పింఛి ‘’తెలుగు సింహం ‘’అని కీర్తి పొందాడు .
కపిల నరసింహారావు మొదటికొడుకు రంగశాయి కవితా సంపన్నుడు .మనవడు అచ్చన్న పంతులు ‘’వీరవర ‘’ ‘’ఫౌజుదార్ ‘’ అనే వంశ బిరుదనామాలు,’’రాయజీ ‘’అనే లౌకికనామం పొంది ,ఆర్కాటు నవాబుకు ప్రధానమంత్రి అయ్యాడు . హిందూ ముస్లిం ఐక్యత నెలకొల్పి ,అరాచకం ప్రబలకుండా చేసి దేశాన్ని సస్యశ్యామలం చేసి కరువుకాటకాలు లేకుండా చేసి అందరి మెప్పూ పొందాడు .అనేక చోట్ల చెరువులు త్రవ్వించి సాగు తాగు నీటికి లోపం లేకుండా చేశాడు .
ఒక రోజు ఒక కులస్త్రీ బహిష్టు అయి ,వాకిట్లో చాపచుట్ట పెట్టి ,కోనేట్లో స్నానం చేసి వచ్చేలోపు ,ఒక గూ౦డావచ్చి చాపచుట్టలో మాంసం దాచగా, ఆమెరాగా వాడు అన్నమని ఆఎంగిలి కూడుతిని పించి ఆమెతో కలిసి ‘’నాతోకాపురం చెయ్యి ‘’అని బలవంత పెట్టాడు .తనకేపాపం తెలీదు మొర్రో అన్నా వినిపించుకోక చాపచుట్ట తీసి వాడు చూపిస్తే అందులో మాంసం కనిపించి అవాక్కైనదిఆమె .ఇంతలో జనం ప్రోగై కొందరు ఆమెను దుష్టురాలని మరికొందరు శిష్టురాలని అనేకరకాలుగా మాట్లాడారు .ఆమె ఆమె భర్త ఆ గూండా కు ఎన్నో రకాలుగా నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు .ఆమె మామగారు రాయజీ కిఫిర్యాదు చేయగా ,వెంటనే రాజభటులను పంపి ఆ గూ౦డాల కొంపలు పీకించి భయపెట్టి ఊరిను౦చి పారద్రోలించాడు .సాయబులు నవాబు దగ్గరకు వెళ్లి ముసల్మానుల్ని రాయజీ బతకనివ్వటం లేదని ఫిర్యాదు చేస్తే ,ఆయన ‘’మంచివాడుకనుక మంత్రిగారు మిమ్మల్ని వదిలిపెట్టాడు.నేనైతే కత్తికి ఖండఖండాలుగా నరికేసేవాడిని .మన పవిత్ర గ్రంథం కురాను ఐకమత్యాన్ని బోధిస్తే ,మీరు దానికి వ్యతిరేకంగా ప్రవర్తించటం నేను సహించను ..రాయజీ తప్పు చేయడు.ప్రజాక్షేమం న్యాయధర్మాలు దైవభక్తీ నాయోగక్షేమాలే ఆయనకు ముఖ్యం .మీరు ఇంక ఆ వూరిలో ఉండద్దు .ఎక్కదడికైనా వెళ్లిబతకండి .అతిక్రమిస్తే కఠిన దండన తప్పదు ‘’అని నిర్మొహమాటం గా చెప్పాడు నవాబు . మరోసారి స్నానఘట్టం మెట్లకు ఆనుకొని ఉన్న రాతి ఏనుగు తలమీద లో ఎవరో స్త్రీ ,ముక్కు పుడక మర్చి పోయి వెడితే ,అది ఎవరిదో తేలేదాకా కాపలా పెట్టించాడు రాయజీ .ఒక ఏడాది తర్వాత ఒక తల్లీ కూతురు వచ్చి అక్కడి ముక్కుపుడక తనదే అని ఆ కూతురు చెప్పగా ,ఆమెకు దాన్ని రాయజీ అందింప జేశాడు .అనేక చోట్ల త్రవ్వించిన చెరువులు రాయజీ చెరువులుగా పిలువబడుతున్నాయి ఇప్పటికీ
పైన చెప్పిన నృసి౦హా మాత్యుడికి శాయన్న ,ఆయనకు శ్రీనివాసరావు పుట్టారు .శ్రీనివాసరావు, కొడుకు రామారావు నిడదవోలు సెట్టిపేటలో ఉండేవారు .రామారావు తర్వాత విజయనగరం వెళ్లి అక్కడే ఉండిపోయాడు .ఈయనకు ఈ కవిగారి తాత నారాయణరావు పుట్టాడు .ఈయనగురించి ముందే చెప్పుకొన్నాం .ఇక కావ్యం ,అందులోని విశేషాలు రేపు తెలుసుకొందాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-2-21-ఉయ్యూరు
—