బందరు ఖొజ్జిల్లిపేట శ్రీ నాగేశ్వరస్వామి మహాత్మ్యం -2
ఈ కావ్యం లో కవి టేకుమళ్ళ రామచంద్రరావు మొదటి ఆశ్వాసం లో శ్రీ లక్ష్మీనారాయణ ,శివ పార్వతి ,సరస్వతీ బ్రహ్మ ,వినాయక మొదలైన ఇష్ట దేవతలను,,తెలుగు కవులకను వివిధ మధ్యాక్కర లలో స్తుతించాడు .తర్వాత శ్రీ నాగేశ్వరాలయం విషయం వివరించాడు .స్వామి స్వయంభు అని తెలిపాడు .వేకువ జామునుంచే స్వామికి నిత్యార్చనలు,గీత గాత్ర గోష్టులు జరుగుతాయి .సాయం వేళ స్త్రీలంతా సామూహిక గానం భజనలు చేస్తారు .మహాపండితులు వివిధ పురాణాలపై ఉపన్యాసాలు చేస్తారు .ప్రతిరోజూ వందలాది జనం స్వామిని దర్శించి తరిస్తారు .రాత్రిపూట ఇచ్చే చివరి హారతి చూస్తే దేవాలయం భూలోక కైలాసంగా కనిపిస్తుంది .అభీష్ట సిద్ధికి ఆరోగ్య సిద్ధికి నిత్యాభి షేకాలు జరిపిస్తారు.ఇలాంటి ప్రసిద్ధ ఆలయానికి దగ్గరలో మనకవి 18 ఏళ్ళు కాపురమున్నాడు .
ఒకరోజు కవి కూతురు ధర్మావతి స్వామిపై కావ్యం రాయమని కోరింది .శరత్ నవరాత్రులలో సరస్వతీ పూజ నాడు కొన్ని అమ్మవారు శ్రీ బాలా త్రిపురసుందరి అయ్యవారు శ్రీ నాగేశ్వరస్వామి ,మొదలగు దేవతలపై పద్యాలు రాసి స్వామి సన్నిధానం లో చదివి వినిపించాడు .కూతురు కూడా ఇందులో కొన్ని పద్యాలు రాసింది .’’ఈ కృతిని అంకిత మిచ్చుచున్నాడ దేవా స్వీకరి౦పుము ‘’అని సభక్తికంగా అంకితమిచ్చాడు .షష్ట్య౦తాలు కూడారాసి కథా ప్రారంభం చేశాడు .ముందుగా బందరు పురవర్ణన చేశాడు –‘’రేడోకండు చేపకంటితో రేవుగవని గట్టగ’’మచిలీ బందరై ‘’క్రాలె పురము –‘బందడ’’ను నొకజాలరి పట్టెన౦ట-యా మహా ఝషమొక యుపాయముపన్ని ‘’అని బందరు కు చేపకన్ను ద్వారం పెట్టటం వలన మచిలీ బందరు అయింది .ఆ పెద్ద చేపను పట్టినవాడు’’ బందడు ‘’అనే జాలరి రెండూకలిసి వచ్చేట్లు ‘’మచిలీ బందరు’’ అయింది .గోప్పరేవుపట్టణంగా మచిలీబందరు ప్రసిద్ధమయింది .
పూర్వం బందరు సముద్రంలో పెద్ద చేపలాగా ఒదిగి ఉండేది .పార్వతీ దేవికిచ్చిన మాటప్రకారం సముద్రం లో లింగరూపం లో శివుడు ఉద్భవించాడు .సముద్రం కాలాంతరం లో మెరక వేయగా ఏర్పడిన భూమియే శివునికి ఇల్లు అయి ,అనంత వాసుకి మొదలైన నాగులు తెల్లగొడుగుపట్టారు –‘’నాగమందిరుండు నాగ సేవితుండు –నాగ భూష ణు౦ డు,నాగవరదు –డై గిరీశుడేసగే ‘’నాగేశ్వరుండయి ‘’-భూమి లోన నూరు పుష్కరములు ‘’.
18వ శతాబ్దం లో బందరునగరం జనం భవనాలు తోటలు పంటపొలాలతో బాగా విస్తరిల్లింది .నవాబుల దేవిడీలు ,కోఠీ మహలులబారు,కా0ద్రేగులవారి మేడలు , మాజేటి వైశ్యప్రముఖులమేడలు ,పచ్చమేడ వగైరాలేర్పడ్డాయి .నవాబులిచ్చిన మాన్యాలలో బ్రిటిష్ వారు వర్తకం చేశారు .కొన్ని గిడ్డంగులు ,కోట కట్టి చాకిరేవుకు ఈశాన్యం లో ఇంగేలీష్ పాలెం నిర్మించారు .దీనికి తూర్పున ఫ్రెంచ్ వర్తకుల ఇళ్ళు,గిడ్డంగులు తో ఫ్రెంచ్ పేట ఏర్పడింది .దీనికి ఉత్తరంగా వల౦దాలు గిడ్డంగులు ఇళ్ళు చెరువులు ఏర్పరచి హాలండ్ లాగా సుందరం చేసి వల౦దపాలెం అన్నారు .ఇనుగుదురు దక్షిణ ప్రాంతం లో నవాబులు షియాలు సున్నీలు ఉన్నారు .గొడుగుపేట ,ఈడేపల్లి మొదలైన చోట్ల హిందువుల ఆవాసాలు వచ్చాయి. హిందువుల ఇళ్ళు అన్నీ లక్ష్మీ ప్రదంగా సర్వ శోభాయమానంగా ఉన్నాయి .వస్త్రాలనేత ,కలంకారీ అద్దకం ‘’మసిలిన్ వస్త్రాలు ‘’ నేతగాళ్ళతో పాటు నేతగత్తేలు కూడా నాణ్యంగా నేసేవారు .ఊరిమద్యలో వర్తక సంస్థలు చాలా వచ్చాయి .
బందరు ముఖ్యవీధిలో ఏనుగులు గుర్రాలు శకటాలు వగైరా సంచారం ఎక్కువై రక్కిస చెట్లు విస్తారంగా పెరిగాయి .బొమ్మ జెముడు రేగు తుమ్మ పల్లేరు నాగజెముడు కొండగోగు,కానుగ కసంది ,ఉమ్మెత్త,జిల్లేడు పొదలు పెరిగాయి .గచ్చ కుక్కమేడి,గర్దభాండం దురదగొండి తాండ్ర,దిరిసెన,మంగ ,కలిమార , కాకివెదురు,తిప్ప చాగ ,ఈత తాటిగుబురు మొదలైనవి విపరీతంగా పెరిగి కాక ఘూక ,ఝిల్లిక తేళ్ళు,నక్కబొక్కలు అక్కడక్కడ పెద్ద పాముల పుట్టలుపెరిగి’’ రక్కిస దిబ్బ’’అనే పెరుపొంది౦ది ఆ మెరకప్రదేశం .
ఆకాలం లో జమీ౦దారు కోఠీ రామ చంద్రరావు అనే ద్వైతి,పూర్ణ బోధ ప్రశిష్యుడు ,ధర్మపరాయణుడు ఉండేవాడు .రేవుల అజమాయిషీ వర్తకవాణిజ్యాల పై పట్టు ఉన్నవాడు ,నైజాముకు హితుడు ,సన్నిహితుడు .నీతి,దక్షత రుజువర్తనం ,కార్య తత్పరత ,విశ్వాసం సత్యనిరతి కలిగిన వాడు .క్షణం తీరిక లేకుండా ఉండే ఆయన ఒక సాయంత్రం వాహ్యాళి వెళ్లి రక్కిస దిబ్బను చూసి అక్కడ ఒక ఉద్యానవనం నిర్మిస్తే బాగుంటుందని భావించాడు .ఊరిమద్యలో ఇలాంటివి ఉండటం ఊరికి మంచిదికాదని దైవజ్నులను పిలిపించి ,అందరితో చర్చించి ,ఆదిబ్బ ఉన్న చోట ఒక ఉద్యానవనం ఏర్పాటు చేసే ప్రయత్నం చేశాడు .అందరు గొప్ప ఆలోచన అని మెచ్చారు .ముహూర్తం నిర్ణయించి ,ఆమధ్యాహ్ణమే దివాన్ గురురాజు కు కబురుపంపి పిలిపించి ఉద్యానవన బాధ్యత అప్పగించాడు .కొద్దిరోజుల్లోనే రక్కిస దిబ్బ సుందర ఉద్యానవనంగా మార్పు చెంది అనేక పుష్పజాతులు ,కుంద క్రోటను వగైరాలతో కను విందు చేసేట్లు తయారైంది .చెరువులో తామరకలువలు మానసికనందాన్నిచ్చాయి .
ఒకరోజు పండు వెన్నెలలో జమీందారు ఆఉద్యానవన విహారం చేశాడు .ఆరాత్రి ఆయనభార్య జానకీబాయమ్మకు స్వప్నం లో పార్వతీ మాత బాలాత్రిపుర సుందరీ దేవిగా దివ్య దర్శనమిచ్చి శివుని త్రిపురాసురవధ వృత్తాంతం అంతా చెప్పి ‘’అమ్మా ! నీ కడుపులో నేను పుత్రికగా సరస్వతీ లక్ష్మీ నాకు చెల్లెళ్ళు గా జన్మిస్తారు .మమ్మల్ని చక్కగా సాకి పెద్దవాళ్ళను చేయి .నాభర్త శివుడు ఇక్కడ పుడతాడు .ఆయనా నేనూ ఈప్రదేశం లో ఉంటూ ప్రజారక్షణ చేస్తూ కోరికలు తీరుస్తాం .మళ్ళీ నీకు కనిపిస్తాను అని చెప్పి సర్వాలంకార శోభితగా పరమేశ్వరునితో కనులపండువుగా దర్శనమిచ్చి అంతర్ధానమైంది .
మర్నాడు ఉదయమే భర్తకు స్వప్న వృత్తాంతం అంతా చెప్పగా ,తమ జీవితాలు ధన్యమయ్యాయని ఆ దంపతులు ఎంతో సంతోషించి భక్తితో ప్రార్ధనలు- చేశారు .జానకమ్మకు కన్పించిన ఆది దంపతులు అర్ధనారీశ్వర స్వరూపం ఎలాఉన్నదో కవిగారి పద్యం లో చూద్దాం –‘’శ్యామారుణ జటాశైలేందు కలికతో –గాల వేణీ ఫణాగ్రమణి తోడ –గాత్ర ప్రభావలీ కలశ వీచికలతో –దేహేంద్రు నీల చంద్రికల తోడ –గటి వేష్టిత ద్విప కాలచర్మమ్ముతో –బరిధీయవల్కలా౦బ రములతో-బాదార్యమోదయ పాండుర ప్రభలతో –నబ్జోదయే౦దీవరాంఘ్రి తోడ –హరిణములజంట యాశ్రమమందు వోలె –నంది హరియు నెసగ ,ఫణుల్ నగలు గాగ –న౦బకంబులు సుధా కలశంబు లగుచు –గరుణ స్రవియింప,బతి యందు గలిసి నిలిచి ‘’అని వర్ణించాడు కవి టేకుమళ్ళ రామ చంద్రరావు .ప్రధమ ఆశ్వాసం చివర శాలిని ,ఉత్సాహ వృత్త పద్యాలు ,గద్యం చెప్పి ముగించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-2-21-ఉయ్యూరు