డా. పోరంకి దక్షిణామూర్తి
పోరంకి దక్షిణామూర్తి తూర్పు గోదావరి జిల్లా ఆరులో 29-12-1935న జన్మించారు తెలుగు అకాడమి ఉపసంచాలకుడిగా పనిచేసి 1993 లో పదవీ విరమణ చేశారు.
ఆయన అనేక నవలలు, కథలు, కథానికలు, పరిశోధనా వ్యాసాలూ రాశారు. ‘వెలుగూ’,రంగల్లి’ అన్న నవలలను తీరాంధ్ర, తెలంగాణా, రాయలసీమ మాండలికాలలో రచించారు.
తెలుగు కథానిక స్వరూప స్వభావాలపై సిద్ధాంత వ్యాసం రచించి డాక్టరేట్ పట్టా పొందారు. తెలుగు కథానికపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన ఆయన తెలుగు భాషకు ఎనలేని సేవ చేశారు. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరులో 1935 డిసెంబరు 24న దక్షిణామూర్తి జన్మించారు. డిగ్రీ వరకూ కాకినాడలో చదివారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేశారు. అనంతరం, అదే యూనివర్సిటీలో తెలుగు శాఖ రీడర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 1969లో తెలుగు అకాడమీకి బదిలీ అయ్యారు. ఆ సమయంలో పలు నిఘంటు నిర్మాణాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. వృత్తి పదకోశం రూపకల్పనలో ప్రఖ్యాత భాషావేత్త భద్రిరాజు కృష్ణమూర్తికి సహాయకుడిగా పని చేశారు. నలభై వేల పదాలతో ‘ఇంగ్లిషు-తెలుగు-ఇంగ్లిషు’ నిఘంటువును సంకలనం చేశారు.
పాఠ్య పుస్తకాల రూపకల్పనలోనూ ముఖ్య భూమిక పోషించారు. తెలుగు అకాడమీలో సుదీర్ఘ కాలం సేవలు అందించిన పోరంకి దక్షిణామూర్తి డిప్యూటీ డైరెక్టరుగా 1993లో పదవీ విరమణ చేశారు. అనంతరం పాత్రికేయ విద్యార్థులకు తెలుగు పాఠాలు బోధించారు. తెలంగాణ మాండలికంలో ‘ముత్యాల పందిరి’, రాయలసీమ మాండలికంలో ‘రంగవల్లి’, కోస్తాంధ్ర మాండలికంలో ‘వెలుగూ వెన్నెలా గోదారి’ నవలలను ఆయన రచించారు. అలా మూడు మాండలికాల్లోనూ నవలలు రచించిన తొలి వ్యక్తిగా ఖ్యాతి పొందారు.
మరెన్నో కథలు, నవలలు, పరిశోధనా వ్యాసాలతో కలిపి సుమారు 40 పుస్తకాలు రచించారు. లెక్కకు మిక్కిలిగా అనువాదాలు చేశారు. అన్నిటి కంటే ముఖ్యంగా, పరమహంస యోగానంద జీవిత చరిత్ర ‘ఒక యోగి ఆత్మకథ’ను ఆయన తెలుగులోకి అనువదించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రియా యోగులందరికీ ఇది ఓ పాఠ్య గ్రంథమైంది. ఇదే పుస్తకానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ అనువాద పురస్కారాన్ని ప్రదానం చేసింది. కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు కమిటీకి సభ్యుడిగానూ ఆయన పని చేశారు.