ఖాద్రీ(కదిరి)క్షేత్ర మహాత్మ్యం -1
బ్రహ్మాండ పురాణా౦తర్గత’’శ్రీ మత్ఖాద్రీ క్షేత్ర మహాత్మ్యం ‘’శ్రీ కారే సిద్దప్ప శెట్టి గారి ద్రవ్య సహాయంతో ఖాద్రి నృసింహస్వామి దేవస్థానం 1953లో ప్రచురించింది .మంగళాశాసనం లో ‘’దంష్ట్రా కరాల వదన మారాలభ్రుజ్వలచ్చిఖం –ఖాద్రి స్థలగతం జీయాన్నార సింహం పరం మహః ‘’ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం –నృసింహం ,భీషణ౦భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం ‘’.’’క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ స్వాహా ‘’(గోపాల అష్ట దశాక్షరీ మంత్రం ).బ్రహ్మాండ పురాణం లో రుద్ర ,నారద సంవాదం లో ఖాద్రి స్థల పురాణం చెప్పబడింది .ఖాద్రి అంటే విష్ణుపదం .విష్ణు పాదాంకితమైన పర్వతం ఇక్కడ ఉండటం చేత ‘’ఖ’’శబ్దానికి విష్ణు పాదాంకిత తత్వ పర్యంతం అనే అర్ధం చెప్పి ,’’అద్రి’’శబ్దాన్ని చేరిస్తే విష్ణుపాదాంకిత మైన పర్వతం ఉన్న చోటు కనుక ‘’ఖాద్రి’’ అయింది .దీనికే ‘’ఖాదిరీ ‘’అనే పేరు కూడా ఉంది .ఖదిరి అరణ్యాలు ఉండటం చేత వృక్ష విశేషవాచకం గా ఖాదిరీ అయింది .ఖాద్రీ అనీ పిలుస్తారు .ఇది ఖాదిరీ శబ్ద దేశ్యరూపం .ఈమహాత్మ్యం లో 13వ అధ్యాయం లో 767శ్లోకం లో ఈ వివరాలున్నాయి .కృతయుగం లో హిరణ్య కశిప దైత్యుని శ్రీ మహా విష్ణువు శ్రీ నృసింహావతారం ఎత్తి సంహరించిన మూల విగ్రహమే ఇక్కడి మూల విరాట్ .ఎనిమిది చేతులు ,కూర్చున్న భంగిమలో స్వామి దర్శనమిస్తాడు .శ్రీదేవీ భూదేవీ లేరు .ఎడమప్రక్కన భక్త ప్రహ్లాద విగ్రహం విరాజమానం గా కనిపిస్తుంది .
భ్రుగు మహర్షి తపస్సు చేస్తే ,ప్రసన్నుడైన నారసింహుడు వరం అడగమంటే అడిగితె ,తనప్రతినిదిగా శ్రీ ,భూదేవులతో మూడు పంచలోహ విగ్రహాలను ఒక పెట్టెలో పెట్టి ,వాటిని నిత్యమూ ఆరాధించమని ఆదేశించాడు ఈ మూర్తులకు 1-వసంత వల్లభుడలు 2వసంత మాధవులు అనేపేర్లు .ఈనాటికీ ఆ పేర్లతోనే పిలుస్తారు .ఇవే ఉత్సవమూర్తులు .వైఖానస విధానం లో పంచ బేరముల పూజ జరుగుతుంది .ధ్రువ ,కౌతుక బలి బేరములు దేవి లేకుండానూ ,ఔత్సవ, స్నాపన బేరములు దేవీ సహిత విష్ణు రూపం లోనూ ఉంటాయి .వేదవ్యాసుడు రాక్షసులకు తెలియకుండా ఉండటం కోసం ఖాద్రి క్షేత్రానికి వచ్చి ,శిష్యులకు ధర్మోపదేశం చేసిన స్థలం కనుక ‘’వేదారణ్యం ‘’అనే పేరు వచ్చింది .హిరణ్యకశిప వధ తర్వాత దేవతలు నృసింహ స్తోత్రాలు చేయటం వలన ఈ పర్వతానికి ‘’స్తోత్రాద్రి ‘’అనే పేరు వచ్చింది .ఇక్కడి నదీ తీరం లో అర్జునుడు తపస్సు చేయటం చేత నదికి ‘’అర్జున నది ‘’అనీ క్షేత్రానికి అర్జున తీర్ధం అనీ పేర్లు .అర్జుననదికి ఆరు పుణ్య తీర్దాలున్నాయి .అవే -శ్వేత పుష్కరిణి ,భ్రుగు తీర్ధము ,లక్ష్మీ తీర్ధము ,గంగాతీర్ధము ,గరుడ తీర్ధం ,భవనాశినీ తీర్ధం .
గంగా తీర్ధం విమాన ప్రదక్షిణ మార్గం లో ఆగ్నేయం లో పాకశాలకు ఎదురుగా ఉంది .ఒకప్పుడు ఇది విశాల నడబావి.ఇప్పుడు చిన్న నుయ్యి .ఈశాన్యం లో భవనాశినీ తీర్ధం ఉంది .ఇది మెట్లు ఉన్న విశాల పుష్కరిణి .ఆలయం వెనుక ఉన్న భ్రుగు తీర్ధం కూడా ఇలానే ఉంటుంది .దీని మధ్య ఉండే నీరాడి మండపం ఇప్పుడు శిదిలరూపం లో కనిపిస్తుంది .దీనికి ఈశాన్యం లో తీర్ధవారి మండపం ఉంది .ఆలయానికి ఆగ్నేయం లో రెండు ఫర్లాంగుల దూరం లో శ్రీ తీర్ధం ఉంది .ఇదికూడా మెట్లతో ఉన్నచిన్న చతురస్రాకార పుష్కరిణి .దీని దక్షిణపు ఒడ్డున ‘’చి౦త పూల ఉట్టి’’ అనే నాలుగు స్తంభాల మండపం ఉంటుంది .దీనికి దక్షిణం గా ఉద్యానవనం లో పాకశాల మండపాలున్నాయి .చైత్ర పౌర్ణమి నాడు స్వామి వారికి ఆస్థాన ఉత్సవం వనభోజనం జరుగుతాయి .దీనికి ఆగ్నేయంగా మైలు దూరం లో శిలాసోపానాలతో పెద్ద చతురస్రాకార౦గ ఉన్న పుష్కరిణి ‘’గరుడ తీర్ధం ‘’.దీనికి తూర్పున విశాల మండపం లో శ్రీ ఆంజనేయస్వామి శిలావిగ్రహం ఉంటుంది .మాఘమాసం లో ఇక్కడ మాఘపురాణ ప్రవచనం జరుగుతుంది .దీనికి మైలు దూరం లో ‘’దేవ చెరువు ‘’ఉంది ‘’.’’ఇక్కడి ‘’నుంచే స్వామి వారలకు అభిషేక జలం తీసుకు వెడతారు .దీన్నే అర్జుననది లేక మద్దు లేరు అంటారు .ఈనది పైన చెప్పిన తీర్థాలను చుట్టి ,భ్రుగు తీర్ధం పడమర భాగం నుంచి ఉత్తరంగా ప్రవహించి ,ఎనిమిది మైళ్ళ దూరం లో ఉన్న చిత్రావతీ నదిలో కలిసి అక్కడినుంచి 70మైళ్ళు ప్రయాణించి కమలాపురం వద్ద ‘’పెన్నా నది’’లో సంగమిస్తుంది .
ఆలయానికి తూర్పున రెండు మైళ్ళ దూరం లో శ్వేత తీర్ధం రాతి మెట్లతో దీర్ఘ చతురస్రాకారంగా ఉంటుంది .ఇది బ్రహ్మ తన కమండల పవిత్ర జలాలతో నరసింహస్వామి పాదాలను కడిగటం వలన ఏర్పడింది .దీనికి దక్షిణంగా గోవర్ధనాద్రి దానికి దక్షిణంగా స్తోత్రాద్రి ఉన్నాయి .ఇక్కడ విష్ణుమూర్తి రెండు పాదాల చిహ్నాలు కనిపిస్తాయి .ఈపర్వతానికి కింద ‘’కొండల నరసింహ దేవుడు ‘’ ఉండే చిన్న ఆలయం ,అందులో శ్రీ లక్ష్మీ నరసింహుని మూల విగ్రహం ఉంటాయి .ప్రతి ఏటా సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ నాడు శ్రీ ఖాద్రి నరసింహ మూర్తి ఆలయం నుంచి ఇక్కడికి వచ్చి ఆస్థానం జరిగి ,శ్రీ గోవర్ధనాద్రి ప్రక్కగా శ్వత తీర్ధ మార్గాన వేంచేసి ,దగ్గరున్న క్షీర మండపం లో పాల నివేదన గ్రహించి ,తర్వాత గ్రామం బయట ఉన్న పార్వేట మండపం లో వినోద ప్రదర్శన తిలకించి ,వీధి ప్రదక్షిణంగా మళ్ళీ సన్నిధికి చేరుతారు .విజయదశమి నాడు ఈ మండపం లో శమీ పూజ చేస్తారు .
కాలక్రమం లో ఆలయం జీర్ణమై పోతోంది .పూర్వం జరిగినట్లుగా వైభవంగా నిత్య పూజా నైవేద్యాలు జరగటం లేదు .అలా జీర్ణోద్ధారణ ,పూజలు జరగాలని భక్తుల కోరిక –‘’దానపాలనాయో ర్మధ్యే దానాత్శ్రేయోనుపాలనం –దానాత్స్వర్గ మవాప్నోతి పాలనాదత్యుతం పదం ‘’ఈ గ్రంధం సంస్కృత ప్రతి ధర్మవరం లో శ్రీ ఆనే గొంది ఆస్థాన పండితులు శ్రీ ఉభయ వేదాంత అర్చకం వెంకట రాఘవ భట్టా చార్యులవారు తమకు ఇచ్చినట్లు ఆకులమన్నాడు లో ఉంటున్న శ్రీ పార్ధ సారధి భట్టాచార్యులవారు తెలిపారు .పైన చెప్పిన విషయాలన్నీ వారు వ్రాసినవే ..ఇది సంస్కృతం లో 13 అధ్యాయాల గ్రంథం.మిగిలిన విషయాలు తర్వాతతెలుసుకొందాం
శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాలోని కదిరిలో నెలకొని ఉన్న ఆలయం. ఈ దేవాలయం ఎత్తైన ప్రహారీతో, విశాలమైన ఆవరణలో విలసిల్లుతున్నది. ఇది 13 వ శతాబ్దంలో దశలవారీగా అభివృద్ధి చెందిందని శాసనాల వలన తెలుస్తున్నది. ఆలయానికి నాలుగు వైపుల గోపురాలు కలిగి ఉంది. ప్రధాన ఆలయంలో గర్భగుడి, అంతరాలయం, ప్రదిక్షిణా పథం, ముఖ మంటపం, అర్థ మంటపం, రంగమంటపం ఉన్నాయి. రంగ మండపంలో ఉన్న నాలుగు స్తంభాలపై ఉన్న శిల్ప కళా రీతులు అత్యంత సుందరంగా ఉంటాయి. ఇక్కడున్న కోనేరును భృగుతీర్థం అంటారు. ఇక్కడి స్వామివారు అమ్మతల్లి, తాయారు, ప్రహ్లాదులతో కలిసి దర్శనమిస్తారు. ఈ అలయంలో రంగ మండపం పై వేసిన రంగుల బొమ్మలు శతాబ్దాల నాటివి. అందుచేత కొంత వెలిసినట్లున్నా, ఇప్పటికీ బాగున్నాయి. ఈ ఆలయం ముందున్న పెద్ద రాతి ధ్వజస్తంభం నిలబెట్టిన విధానం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ధ్వజ స్తంభం పునాదిలో నుండి కా ప్రతి ఏడు సంక్రాంతి సమయాన స్వామి వారి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో వచ్చే పశువుల పండుగ రోజున శ్రీదేవి, భూదేవి లతో కలిసి వసంత వల్లభుడు కదిరి కొండకు పారువేటకు వస్తాడని భక్తుల విశ్వాసం. పారువేట అనంతరం స్వామి వారిని ఊరేగింపుగా ఆలయంలోనికి తీసుకొస్తారు. దీన్నే రథోత్సవం అంటారు. ఈ రథోత్సవానికి చాల ప్రాముఖ్యత ఉంది. ఈ రథం 120 టన్నుల బరువుండి ఆరు చక్రాలతో సుమారు నలబై ఐదు అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఎక్కడా లేని విధంగా ఇక్కడ రథోత్సవం సమయంలో భక్తులు రథంపై దవణం., పండ్లు, ముఖ్యంగా మిరియాలు చల్లుతారు. క్రింద పడిన వీటిని ప్రసాదంగా భావించి ఏరుకొని తింటే సర్వ రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మిక. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు పాల్గుణ బహుళ పౌర్ణమిని కదిరి పున్నమిగా జరుపుతారు. ఈ రోజు భక్తులు ఉపవాస ముంటారు. ఏటా ఈ ఆలయంలో నృసింహ జయంతిని, వైశాఖ శుద్ధ చతుర్దశి, మల్లెపూల తిరుణాళ్లను వైశాఖ శుద్ధ పౌర్ణమి, చింతపూల తిరుణాళ్లను, అషాడపౌర్ణమి, ఉట్ల తిరుణాళ్లను, శ్రావణ బహుళ నవమి, దసరా వేడుకల్ని, వైకుంఠ ఏకాదశి రోజుల్లో జరుపుతారు.కుండా ఒక బండ పైనే అలా నిలబెట్టి ఉంది.[1]
.
ఉత్సవాల సమయంలో ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ స్వామిని కొలవడం ఈ ఆలయ ప్రత్యేకత. ఇక్కడికి భక్తులు సమీపంలోని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా వస్తుంటారు. ఇక్కడి ఇంకో విశేష మేమంటే, కదిరి పట్టణానికి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో తిమ్మమ్మ మర్రి మాను ఉంది. ఇది ఏడున్నర ఎకరాల స్థలంలో విస్తరించి, 1100 ఊడలతో ఉంది. దీని వయస్సు సుమారు ఆరు వందల సంవత్సరాలు ఉంటుందని నమ్మకం. ఇది గిన్నిసు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా స్థానం సంపాదించు కున్నది. కదిరికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో కటారు పల్లెలో యోగి వేమన సమాధి కూడా ఉంది. ఇది కూడా పర్యాటకులను ఆకర్షిస్తున్నది.
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-2-21-ఉయ్యూరు 19:24 10-02-2021