బందరు ఖొజ్జిల్లిపేట శ్రీ నాగేశ్వరస్వామి మహాత్మ్యం -3(చివరి భాగం )
ద్వితీయాశ్వాసం లో గ్రీష్మర్తు వర్ణన చేశాక నాగేశ్వర సంభవం వివరించాడు కవి టేకుమళ్ళ.ఆ వేసవిలో నీరు లేక జనం అల్లాల్లాడుతుంటే ఉద్యానవనం లో ఒక బావి త్రవ్వించే ప్రయత్నం చేశాడు జమీందారు .భూమి త్రవ్వుతుంటే ఆశ్చర్యంగా ఒక శివలింగం కనబడితే ,దానివెంట అనేకనాగుబాములు బయటికి వచ్చి లింగానికి చుట్టుకొని తమ మణులను వేసినట్లుగా పూజించి నాగేన్ద్రస్వామిగా కనిపించింది లింగం .ఇది చూసి బోడపాటి గురురాజు భక్తిగా స్తుతింఛి నీరులేకపోవటం వలన అక్కడ నుయ్యి తవ్వామని క్షమించి పూజలు అందుకోమని ప్రార్ధింఛి నాగేశ్వరస్వామిని తమకు అప్పగించి నాగులను కూడా దయచేసి ఆస్థలాన్ని వదిలి వెళ్ళిపొమ్మని కోరాడు .సరే అన్నట్లు పాములు లింగం చుట్టూ బిరబిర ప్రదక్షిణలు చేసి నెరియల్లోకి దూరి మళ్ళీ కనిపించాలేదు .గురురాజు స్నానం చేసివచ్చి నాగేశ్వరస్వామికి షోడశోపచార పూజ చేయగా ఆసాయంత్రం ,ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై కుండపోత వర్షం కురిసి నీటి ఎద్దడి తగ్గింది .
నాగేశ్వరస్వామికి ఒక పర్ణశాలకట్టించి నిత్యపూజ జరిగే ఏర్పాట్లు చేశారు .గుర్రాజు సోదరి సుభద్ర భర్త 13రోజులుగా ఎక్కడికి వెళ్ళాడో కనపడక ఎదురు చూస్తూ,విసుగుతోకాశీకి వెళ్లి ఉండిపోవాలనుకొంటే ,శివుడు ఎక్కడైనా శివుడే ,ఇక్కడికే వచ్చి కొలువైన నాగేశ్వర స్వామిని నిత్యం పూజించమని ఊరడించి హితం చెప్పగా ,ఆపర్ణ శాలలోనే అన్నతోపాటు గడుపుతూ శ్రద్ధగా స్వామి సేవలు చేస్తోంది .స్వామికి ఆలయం నిర్మించాలనే కోరిక గుర్రాజు మనసు నిండా ఉంది .దివాను గుర్రాజు సరిగ్గా పనులకు రాకపోవటం గమనించి ఆశ్చర్యపడిన జమీందార్ రామచంద్రరావు రాణీగారితో సహా ఆ ఉద్యానవన౦ వచ్చాడు .అప్పుడే పూజముగించిన గుర్రాజు ప్రభువుకు తీర్ధ ప్రసాదాలిచ్చాడు .కలలో కనిపించి స్వామి అమ్మవారు చెప్పినట్లు ఇక్కడ ఉద్భవించారని గ్రహించి ఆలయనిర్మాణం తదితర దేవత విగ్రహాల నిర్మాణం తానే చేయిస్తానని మాట ఇవ్వగా కోఠీ పండితుడు బ్రహ్మానందపడ్డాడు .దైవజ్నులచే శుభ ముహూర్త నిర్ణయం చేయించారు .శాలివాహన శకం 1684,శ్రీ చిత్రభాను సంవత్సర మాఘ శివరాత్రి నాడు పనులు.వినాయక షణ్ముఖవీరభద్ర నంది వాహన ప్రతిష్టలు పగలు ,సర్వమంగళతో విశ్వనాథుల ప్రతిష్ట ఆ రాత్రి చేయాలని నిర్ణయించారు .కవిగారు తర్వాత సాయంకాల వర్ణన చేసి ,కోఠీ రామచంద్రరావు ఆలయ నిర్మాణం గురించి ఆలోచిస్తూ ముందుగా బందరు గ్రామదేవత ‘’మాచకాంబ ‘’ను దర్శించి ఆచల్లని తల్లి అనుగ్రహం తో పనులు ప్రారంభించాలని భావించి ,గోడుగుపేటలో తన భవనానికి తూర్పుగా ఉద్యానవనానికి ఉత్తరంగా ఉన్న శ్రీమహాలక్ష్మి అనే మాచకాంబ మందిరానికి రానీతో సహా వెళ్లి చీరసారే వగైరా సమర్పించి ,ఆమె కు నాగేశ్వరస్వామి వృత్తాంతం వివరించి ,అనుగ్రహాన్ని పొందారు .
అనుకొన్న ముహూర్తంలో ఊరి ప్రజలందర్నీ ఆహ్వానించి వినాయక పూజ చేసి శంకుస్థాపన జరిపించగా నిజాం నవాబు నరసింహారావు అనే మంత్రితో ఒక జాబు దానితోపాటు అరబ్బీ గుర్రం కాసులపేరు మనికాన్చన హారం కానుకగా పంపాడు .ఆమంత్రికి రాణికి రాజుకు శివుని విభూతి బిల్వదలాలు కానుకగా పంపాడు రామచంద్రరావు .పనులు వేగంగా జరుగుతున్నాయి తర్వాత వర్షర్తు వర్ణన చేశాడు కవి .పనులు ఎలా జరుగుతున్నాయో చూద్దామని రావు ,దివాను వెళ్ళగా అక్కడ ఒక బాలిక బాలుడు ఆనీతిలో పడవల ఆట ఆడుతున్నారు .ఆబాలుడు శివుడిని శ్రద్దహ్తో పూజిస్తే వర్షాలు ఆగిపోతాయని అన్నాడు .అలాంటి చిన్న చిన్న కోర్కెలు దేవుడిని కోరకూడదు రావు అనగా ,బాలిక ‘’ఆలయనిర్మాణం అయ్యేవరకు ఇకనుంచి ఇక్కడ పగలు వర్షం పడదు ‘’అనగా అవాక్కై ,ఎవరిపిల్లలు వారు అని ఆరాతీయగా ఎవరూ చెప్పలేకపోయారు. పార్వతీ పరమేశ్వరులే వాళ్ళు అనుకొన్నారు అందరూ .ఈవార్త భార్యకు చెప్పాలని ఆత్రంతో రావు ఇంటికి వెళ్ళగా భార్య ‘’మనింటికి పార్వతీ పరమేశ్వరులు వచ్చి భోజనం చేసి వెళ్లారండీ.మళ్ళీ శివరాత్రికి వస్తామని చెప్పారండీ ‘’ ‘’అనే శుభవార్త చెప్పగా ఆనంద పరవశు డై,తానూ చూసిన బాల,బాలికా విషయాలు ఆమెకు చెప్పాడు .ఆమె పార్వతీ పరమేశ్వరులను మూడురోజులు ఉండివెళ్ళమని కోరాననీ ,ఎప్పుడూ ఎక్కడికో అక్కడికి వెళ్ళే తమకు అలాఉండటం కుదరదనీ శివరాత్రి నుంచి ఇక్కడే ఉంటూ మీ అందరి యోగక్షేమాలు చూస్తాం కదా అని అన్నారని భార్య చెప్పింది .తర్వాత శరదృతువు చంద్రోదయ వర్ణనం చేశాడు కవి .
ఆశ్వయుజమాస శుక్లపక్షం లో రావు గారికి తాము కట్టే దేవాలయం లో అమ్మవారి అయ్యవారి కి ఏపేర్లు పెట్టాలని ఆలోచిస్తూ ,విజయదశమికి పెద్దలను పిలిపించి అడిగితె తలోకరకంగా చెబితే లింగం ఉద్భవించిన విధానం నాగుల విషయం బాలిక ఉద్యానవనం లో కనపడటం అన్నీ వివరించి స్వామి శ్రీ నాగేశ్వరస్వామి అని అమ్మవారికి శ్రీ బాలా త్రిపుర సుందరి అని పేర్లు చాలా సముచితంగా ఉంటాయని చెప్పగా అందరూ ఆమోదించారు .అందులో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ద్వాదశ జ్యోతిర్లింగాల విషయాలు సవిస్తరంగా చెప్పి ,దారువనం లో ఉన్న నాగేశ్వర జ్యోతిర్లింగ వివరాలు చెప్పాడు ..శివ పార్వతుల కల్యాణం జరిగాక ఒక రోజు పార్వతి తల్లి మేనక ‘’శివుడు రూపహీనుడు భిక్షుకుడు స్మశానవాసి ,ధనహీనుడు ‘’అని ఎద్దేవా చేయగా ఆది దంపతులు భరించలేక దారు వనానికి వెళ్లి ,అక్కడినుంచి కాశికి అక్కడినుంచి కైలాసం వెళ్లి స్థిరంగా ఉండి పోయారు .ఒకరోజు ఒక వైశ్యుడు దారువనం గుండా వెడుతుంటే ఒకరాక్షసుడు అతడినీ పరివారాన్ని అక్కడే బంధించి జైలులో పెట్టాడు .అతడు ఉమాపతిని ధ్యానించి పూజించగా శివపార్వతులు ప్రత్యక్షమై పాశుపతం ఇవ్వగా దానితో రాక్షసుడిని చంపి అక్కడున్న స్వయంభు లింగాన్ని పూజించి నాగేశ్వర లింగం గా పేరుపెట్టాడు .ఈయన్ను దర్శిస్తే ద్వాదశ జ్యోతిర్లింగా దర్శన ఫలితం కలుగుతుంది .తర్వాత సృష్టి విధానం ,పార్వతీ దేవి తపస్సు శివపార్వతులకల్యాణ,శివరాత్రి మహిమ చెప్పి శివరాత్రి నాడు ఇక్కడ నాగేశ్వర బాలాత్రిపురసుందరి ప్రతిష్ట చేయటం అత్యంత పవివిత్రం అనీ ప్రతిష్ట తర్వాత కల్యాణం కూడా జరిపించాలనీ చెప్పాడు .అందరూ అలానే చేద్దామని నిర్ణయించారు . దీనితో ద్వితీయ ఆశ్వాసం పూర్తి .
తృతీయ ఆశ్వాసం లో ముందుగా ‘’శక్తిత్రయ ‘’వర్ణన చేసి మహిషాసుర మర్దన చెప్పాడుకవి .తర్వాత న౦దీశ్వరుడు కామధేనువుకుజన్మించి తపస్సు చేయటం, శాశ్వతంగా పరమేశ్వర సన్నిధానం లో ఉండిపోవటం ,రావణ విషయం, సతీ దేవి సంగతి ,దక్షయజ్ఞం ,దక్షాధ్వర ధ్వంసం ,పార్వతిగా మేనకా హిమవంతులకు జన్మించటం ,పార్వతి శివుని వరునిగా పొందటానికి చేసిన తపస్సు ,శివుని మూడవ నేత్రం తో మన్మధ దహనం ,భార్య రతీ దేవి పార్వతిని పతిభిక్ష పెట్టమని ప్రార్ధించటం ,ఆమెకు తప్ప ఎవరికీ మన్మధుడు కనిపించకుండా ఉండేట్లు వరం ప్రసాదించటం ,పెళ్లి రాయబారం ,వసంత రుతు వర్ణన ,పార్వతీ పరిణయం ,వినాయక కద పరశురాముని గొడ్డలి దెబ్బతో ఒక దంతం విరిగి ఏకదంతుడు అవటం ,కుమారస్వామి జననం పెద్దాయన కు గణాధిపత్యం చిన్నాయనకు దేవ సేనాధి పత్యం లభించటం ,లోకాలన్నీ శుఖ శాంతులతో వర్దిల్లటం మొదలైన అన్ని విషయాలు ఆ వృద్ధ బ్రాహ్మణుడు రామ చంద్రరావు జమీందారుకు అక్కడున్న పురజనులకు వివరంగా చెప్పాడు .రావుగారు ఆయన్ను ఉచిత విధంగా సత్కరించి శ్రీనాగేశ్వర శ్రీ బాలా త్రిపుర సుందరీ ప్రతిష్ట రోజు శివరాత్రి నాడు మళ్ళీ అందరం కలుద్దామని చెప్పి పంపాడు .దీనితర్వాత లయగ్రాహి, ద్రుత విలంబితం భుజంగ ప్రయాత లో లో ఆశ్వాశాంత పద్యాలు, గద్యమూ చెప్పి కావ్యం పూర్తిచేశాడు కవి టేకుమళ్ళ రామ చంద్రరావు .
కవి కవిత్వం ధారా ప్రవాహం .లలితపదాలతో భావ సుందరంగా ఛందో వైవిధ్యంగా ,సాగింది .ఈ కావ్యం గురించి బందరు ప్రజలకు గుర్తు ఉందొ లేదో తెలియదు ఎవరూ ఎప్పుడూ ఉదాహరించినజాడ కూడా నాకు కనిపించలేదు .మహాకావ్యంగా దీన్ని తీర్చిదిడ్డాడుకవి .ఆయన ప్రతిభకు జేజేలు .ఇంతటి ఉత్కృష్ట బందరు లాయరు కవిని ఆయన కావ్యాన్నీ పరిచయం చేసే అదృష్టం నాకు దక్కినందుకు మహదానందం గా ఉంది .రుచికోసం చివరిపద్యాలు –
లయగ్రాహి –‘’ఇందుధర ,దాత్రీ తలకంధర భుజంగ సహమందిర-పృదాకు చయ సుందర మహేశా –కందర విముక్త సుమబృందసహవాస సుకబంధనిక టేశ –యరవింద దళ నేత్రా-నందిత కోతీజలనిదీందుహృదయోత్పల సు గంధ –మధుసక్త శివమందిర నివాసా –బందరు పురీ నిలయ- వందిత సమస్త జన నంది ఘన శత్రు చర యందుమివే మ్రొక్కుల్ ‘’
ద్రుత విలంబితం –సతిని చేకొని సంతసమంది య –య్యతివ లేని మనో వ్యధమాన్పి పా-ర్వతి వివాహము స్వాస్త్యము గూర్ప మా-కతుల సౌఖ్య చయ మ్మిడు ఈశ్వరా’’ .
భుజంగ ప్రయాతం –‘’ భవానీ తపంబుల్ వివాహాది గాధల్ –భవత్స్వీయ వాక్యప్రవాహోర్ము లందున్ –ధ్రువ స్ధేయమై స్వాంత సంతోషంబు గూర్చెన్-నవోద్యత్ గృహావాస నాగేశ ఈశా ‘’
గద్యం –ఇది శ్రీ శ్రీవత్స స గోత్రా౦తర్గత టేకుమళ్లాన్వాయ సంజనిత రాజగోపాల రావు తనూభవ రామ చంద్రరావు నామ ధేయ ప్రణీతంబైన’’శ్రీ బాలా త్రిపుర సుందరీ సహిత శ్రీ నాగేశ్వర మహాత్మ్యమ్ము నందు తృతీయాశ్వాసము –మంగళం మహాత్ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-2-21-ఉయ్యూరు
—