ఖాద్రీ(కదిరి)క్షేత్ర మహాత్మ్యం -2(చివరిభాగం )

మొదటి అధ్యాయం లో నారదుడు పరమేశ్వరుని ఖాద్రీ మహాత్య్మం వివరించమని కోరగా ఆయన ‘’ సువర్ణమఖీ తీరం లో ఉన్న వెంకటాచలానికి పది యోజనాలదూరం లో వేదారణ్యం అందులో స్తోత్రాద్రిపై శ్రీ విష్ణుపాద చిహ్నాలున్నాయి ,దానిప్రక్కన అర్జుననది ప్రవహిస్తుంది అనేక రకాల వృక్ష జంతు పక్షిజాలాలకు నిలయం .నదికి తూర్పున నృసింహ దేవాలయమున్నది .స్వామి సర్వకామ ప్రదుడు .అష్ట భుజాలతో పద్మాసనం లో సహస్ర కోటి సూర్యకా౦తితో విరాజిల్లెవాడు .ఖేట ఖడ్గ శంఖ చక్రధరుడు .అక్కడి ఖాదిరీనగరం వైభావోపేతమై,చతుర్ వర్ణాలతో మేడలు ఉద్యానవనాలు పుష్పవాటికలతో భూలోక స్వర్గం గా ఉంటుంది .

  రెండవ అధ్యాయం లో హిరణ్య కశిప ,ప్రహ్లాద కరథా విధానం ,కొడుకును బాధలుపెట్టటం విష్ణువు భక్త ప్రహ్లాదుడిని కాపాడటం స్తంభం లో ఉంటె చూపుమనటం గదతో దానిపై కొట్టగా  నరసింహావతారం లో శ్రీహరి వచ్చి సంహరించటం ,ఉగ్రరూపం శాంతి౦చ టానికి దేవ, మహర్షులు స్తోత్రం చేయటం ,మహాలక్ష్మి ప్రహ్లాదుని ముందుపెట్టుకొని వచ్చి స్తుతించటం ,ఆయన ప్రసన్నుడై భయంకరరూప౦ ఉపసంహరించి తనపాదాల ముద్ర పడేట్లు చేసి ,నదికి పడమట ఒకదివ్యాలయం లో ప్రవేశించి ,దేవమహర్షులు పూజించటం ,తనపాద దర్శనం చేసినవారికి మోక్షం ప్రసాదిస్తానని చెప్పటం అందుకే ఆ పర్వతానికి స్తోత్రాద్రి పేరు వచ్చిందని చెప్పటం,ఈ క్షేత్ర మహాత్మ్యం శివుడే చెప్పగలడని బ్రహ్మాదులకు చెప్పటం తో  రెండవ అధ్యాయం ముగుస్తుంది .

 మూడవ అధ్యాయం లో నారదునికి  శివుడు వసంత కాలం లో నరసింహస్వామికి బ్రహ్మఉత్సవాలు జరిపాడనీ అప్పటినుంచి రివాజుగా జరుగుతున్నాయనీ వైఖానసాది మునులుకూడా ఆఉత్సవం లో పాల్గొన్నారనీ ,ఉత్సవ విశేషాలన్నీ వివరించాడు .నాలుగవ అధ్యాయం లో  అక్కడి ఆరు పుణ్యతీర్దాల వివరాలు చెప్పాడు , బ్రహ్మ తనకమండల జలం తో నారసిహుని పాదాలు కడగట౦ చెప్పాడు .అయిదవ అధ్యాయం లో జాబాలికొడుకు శ్వేతుడు యాగం చేయాలని తపస్సు చేసి ఈపుష్కరిని లోని గోవర్ధన గిరిపై శ్రీకృష్ణ అష్టాదశాక్షర మహామంతాన్ని దీక్షగా జపించగా శోణితుడు అనే రాక్షసుడు ఆయనను చంపాలనుకొని వేచిఉంటే  శ్వేతర్షి అదే సమయం లో రాగా ఆయన్ను మి౦గ బోతే మహర్షి చేసిన హుంకారం తో రాక్షసుడు రెప్పపాటుకాలంలో చచ్చి కిందపడగా వాడి శరీరం నుంచి సుందర గంధర్వుడు బయటికి వచ్చి ,దివ్యవిమానంలో పైకి వెళ్లి మళ్ళీ క్రిందికిదిగి మునికి కృతజ్ఞతలు చెప్పి ,తన వృత్తాంతం చెప్పాడు. తాను చిత్రాంగదుడు  అనే గాంధర్వ రాజు కొడుకు. గానం లో ప్రతిభకలవాడు .ఒకసారి గాలవముని తపస్సు చేస్తుంటే ఇంద్రుడు విఘ్నాలు కలిగి౦చటానికి తనను నియమించి అప్సరసలతో పంపగా ,తానూ గానం తో మహర్షి మనసును ఆకర్షించ గా ఆయన ప్రక్కనే ఉన్న జింక పిల్లను మెడపట్టి కొరికి చంపగా ముని రాక్షసివి కమ్మని  శపిస్తే ,బ్రతిమాలితే మీవలన శాప విమోచనం కలుగుతుందని చెప్పి వెళ్ళిపోగా ముని అష్టదశాక్షరీ మంత్రం జపిస్తూ ఉన్నాడు .అక్కడ గోవర్ధన పర్వతం పై ఆవులమందలు మేసేవి .ఒక ఆవుమాత్రం ఇక్కడీ ఉండేది. ఒక సారి నరసింహస్వామి ప్రత్యక్షమై వరం కోరుకోమనగా తాను దేనికోసం చేస్తున్నాడో మరచిపోయి మోక్షం ప్రసాదించమని కోరితే ,ఆయనే జ్ఞాపకం చేసి ,హవిస్సులు సాధించే ఉపాయం చెప్పిఆ ఆవును హోమదేనువుగా భావించమని యజ్నంచేసి సాయుజ్యం పొందమని   మునిపేర శ్వేత పుష్కరిణి గా అది పిలువబడుతుందని చెప్పి చెప్పి అదృశ్యుడయ్యాడు  . శ్వేత పుష్కరిణి లో  స్నానం ఖాద్రి నరసింహ దర్శనం అపురూపమైనవి ..

   ఆరవ ఆధ్యాయం  లో  భ్రుగు తీర్ధ వివరాలున్నాయి .మహర్షులు అక్కడ తపస్సు చేస్తూ బ్రహ్మ విచారం చేస్తుంటే త్రిమూర్తులలో ఎవరు గొప్ప అనే ప్రశ్న కలగగా భ్రుగు మహర్షి తాను  నిర్నయిస్తానని ముందు సత్యలోకం వెళ్లగా బ్రహ్మ ఈయనను పట్టించుకోకపోతే’’బ్రాహ్మణులు నిన్ను సాకార రూపంగా అర్చించరు’’అని   శపించి కైలాసం వెళ్ళగా  నంది  అడ్డగిస్తే  శివుడికి వార్త చెప్పేవారు లేక కోపం తో ‘’నీ శరీరం స్త్రీపురుష జననాంగం చిహ్నం అవుతుంది .నీకు నైవేద్యం చేసినవి అపవిత్రాలై నీ నిర్మాల్యం అపవిత్రమౌతుంది ,నందిని పశువుగాపుడతావని కూడా  ‘ శపించి ,విష్ణులోకం వెళ్లి లక్ష్మీదేవితో సరస సల్లాపాలు చేస్తున్నతనను పట్టించుకోని  విష్ణువును వక్షస్తలంపై కాలితో తన్నగా ,కోపించక ఆసనం పై కూర్చోపెట్టి ‘’నా శరీరం కాయలు కాచింది దాన్ని తన్నగా మీకోమలపాదం కంది పోయి ఉంటుంది నా అపరాధం మన్నించు ‘’అనగా పరవశుడై ‘’నువ్వు లోకరాధ్యుడవు నీనివేదన పరమపవిత్రం ‘’అని చెప్పి మళ్ళీ మహర్షులను చేరి విష్ణువే త్రిమూర్తులలో ఉత్తముడు అని ప్రకటించి విష్ణువుకి తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ‘’స్వామీ నీ అర్చా బింబాన్ని పూజించటానికి ఇవ్వండి ‘’అనికోరగా శ్రీదేవీ భూదేవి లతో కూడిన దివ్య మంగళ విగ్రహాన్ని ప్రసాదిచాగా ‘’వసంతకాలం లో నాకు నీ విగ్రహం ఇచ్చావుకనుక వసంత నాధుడు అనీ వసంత మాధవుడు అనీ పేరు పెట్టి అర్చన చేస్తాను ‘’అని చెప్పాడు భ్రుగువు తపస్సు చేసిన ఈతీర్ధమే భ్రుగు తీర్ధం .ఏడవ అధ్యాయం లో శ్రీ తీర్ధ వివరాలున్నాయి .దీనిలో నారసింహుడు ఎప్పుడూ ఉంటాడు ఇక్కడ చేసిన స్నాన దానాదులు మోక్షాన్నిస్తాయి .ఎనిమిదవ అధ్యాయం లో గంగాతీర్ధ వర్ణన ఉంది .వ్యాసుడు శిష్యులతో ఇక్కడికి వచ్చి వేదాంత చర్చ చేస్తుంటే రాక్షసులు  మోసం చేయదలిస్తే తానూ మాయావేషం లో అక్కడే ఉండిపోతే ,గంగానదికూడా వేదారణ్యం అనే ఖాద్రి క్షేత్రం లో ప్రవహించి పవిత్రం చేసి౦ది కనుక గంగాతీర్ధం .వినత ఇక్కడే తపస్సు చేస్తే విష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ‘’నీతో సమానమైన బలం కలవాడిని పుత్రునిగా ప్రసాదించు ‘’అని కోరగా గరుత్మంతుడు పుట్టి ఆయన వాహనమయ్యాడు .అమృతాన్ని రాక్షసులకు దక్కకుండా కాపాడాడు .

  తొమ్మిదవ అధ్యాయం అర్జున తీర్ధ వర్ణన .అర్జునుడు తీర్ధయాత్ర చేస్తూ ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించి అర్జున వృక్షం క్రింద ఇంద్రియ నిగ్రహం తో తపస్సు చేయగా నరసింహస్వామి ప్రత్యక్షమవగా ,స్తుతిస్తుంటే ,అక్కడి అర్జున వృక్షం ముని కుమారుడుగా ఆవిర్భవించి ‘’నేను మౌద్గాల్యముని పుత్రుడను పేరు పుణ్య శ్రవణుడు .మానాన్న గారి ఆజ్ఞతో నృసింహ మహామంత్రం జపిస్తూ చాలా కాలం తపస్సు చేశాను .ఒకసారి విద్యాధరరాజు రాణీవాసంతో ఇక్కడికి వచ్చి జలక్రీడలు,రతిక్రీడలు  జరుపుతుంటే అందులో ఒక సుందరిపై ఆశకలిగి ,ఆమెకూ నాపైప్రేమకలుగగా నేను విద్యాధర చక్రవర్తికి నా కోరిక చెప్పగా ,అతడు అంగీకరించి ఆమెను నాకు ఇచ్చేశాడు .ఆమెతో కామక్రీడలు జరుపుతూ సిగ్గూ ఎగ్గూలేక  నగ్నంగా ల సంచరిస్తుంటే దుర్వాసముని వచ్చి కోపం తో మద్ది వృక్షంగా మారు అని శపిస్తే  బ్రతిమాలితే అర్జునునివలన శాప విమోచనం జరుగుతుందని చెప్పాడు ‘’అని వివరించాడు .

 దశమోధ్యాయం లో శివుడు నారదమహర్షికి భవనాషిని తీర్ధ మహాత్మ్యం చెప్పాడు –ఒకప్పుడు భారద్వాజ గోత్రుడు భూరిశ్రవుడు వెయ్యేళ్ళు తీర్ధయాత్రలు చేసినా  ,మనసు కుదుటబడక ,గంగాతీరం లో ఉన్న వ్యాసభగవానుని దర్శించి  వెయ్యేళ్ళనుంచి మోక్షం కోసం ప్రయత్నిస్తున్నా ఫలితం కలగలేదని పాదాలపై వ్రాలి చెప్పగా ఆమహర్షి ‘’స్తోద్రాద్రి లో ఖాద్రి క్షేత్రం ఉంది ,దానికి ఈశాన్యం లో భవనాశిని తీర్ధం సకల పాపహరం మోక్ష దాయకం .అక్కడికి వెళ్లి తపోధ్యానాలు చేయి నీ కోరిక సిద్ధిస్తుంది ‘’అని బోధించగా ,ఖాద్రి క్షేత్రం చేరి భవనాశినీ స్నాన పునీతుడై నరసింహస్వామిని సేవిస్తూ  చాలాకాలం నృహరికోసం తపస్సుచేశాడు .అతడిని పరీక్షించాలని నరహరి కామినీ  వేషం లో వచ్చి ప్రలోభాపెట్టాడు .చిత్తాన్ని చలి౦ప నీయకుండా అతడు తపస్సు కొనసాగించగా నరసింహుడు ప్రత్యక్షమై ,భూరిశ్రవుడికి మోక్షం అనుగ్రహించాడు .

  పదకొండవ అధ్యాయం లో ఆక్షేత్రానికి ఖాద్రి అనే పేరు ఎందుకు వచ్చిందని అడిగిన నారదునికి శివుడు –ద్వాపరయుగం చివర శ్రీకృష్ణుడు కాలనేమి మొదలైన రాక్షస సంహారం చేసి ధర్మ సంస్థాపనం చేసి ,యాదవకులనాశానమూ చేసి ,అవతారం చాలించగా ,పాండవులు శ్రీకృష్ణుని సాయం తో కౌరవులను జయించి రాజ్యం పొంది ద్రౌపది తో కలిసి రాజ్యపాలన చేశారు .కలియుగం ప్రారంభమైతే ధర్మనాశనం జరుగుతుందని రాజర్షులు దేవర్షులు హిమాలయాలలో కనపడని చోట ఉండిపోయారు .కలియుగం ప్రారంభమై రాజులు నశించి మ్లేచ్చపాలన ఏర్పడి పౌరులను పీడించారు .అప్పుడు అక్కడి ప్రజలు దట్టంగా ఉండే  అరణ్యం  లో చేరి ,మంచి నగర నిర్మాణం సర్వ సంపత్తులతో ఏర్పాటు చేసుకొన్నారు  .అది ఖాద్రి క్షేత్రంగా పిలువబడింది .ఈక్షేత్రం లో మంత్రోచ్చటనతో సకల భూత ప్రేతాలు పారిపోతాయి కుష్టు మొదలైన వ్యాధులు నశిస్తాయి ,దారిద్ర్యం ఉండదు .దేవతలూ ఇక్కడికే వచ్చి నివాసమున్నారు .

 పన్నెండవ అధ్యాయం లో బ్రహ్మమానస పుత్రుడు వైఖానసముని కొడుకు విష్ణు శర్మ కు జ్ఞానం ఉపదేశించమని బ్రహ్మ దగ్గరకు పంపాడు .అతడు తన సర్వ శాస్త్ర పాండిత్యాన్ని వివరింఛి మోక్షం ఇమ్మని కోరగా ‘’నువ్వు చిన్నవాడివి మోక్షానికి ఇంకా సమయం ఉంది వేదారణ్యం లో మద్ది వృక్షాలున్న వనం లో తపస్సు చేయి ‘’అని పంపగా వచ్చి ఏకాగ్రచిత్తం తో చాలాకాలం తపస్సు చేస్తుంటే దుర్వాస ముని రాగా సమాధిస్థితి లో ఉండటం వలన గమనించకపోతే కోపం తో వృక్షంగా మారమని శపించి కాసేపటికి అతడు తపస్సు చేస్తున్నాడని తెలుసుకొని దగ్గరకు రాగా సమాధి నుంచి లేచిన విష్ణు శర్మ స్వాగతించి పూజించగా ,కరగినమనస్సుతో ముని ‘’ఒక పుణ్య క్షేత్రం లో వృక్షమై జన్మించకతప్పదు .నీ పూర్వజన్మ సుకృతం తో శ్రీహరి నీకు నరహరి రూపం లో ప్రత్యక్షమై నీ శాపం తీర్చి నీ కోరికకూడా సాఫల్యం చేస్తాడు ‘’అని చెప్పి వెళ్ళిపోయాడు .

  కొంతకాలానికి గరుడ వానహుడై శ్రీహరి ఆ వృక్షం దగ్గరకు రాగా ,అది సమూలంగా కదలి ,అందులో నుంచి మునికుమారుడు బయటికివచ్చి పాదాలపై వ్రాలి స్తుతింఛి తనభక్తి స్థిరం గా ఉండేట్లు అనుగ్రహించమని వేడుకొనగా నారసింహ స్వరూపంగా అర్చా స్వరూపంగా దర్శనమిచ్చి సుప్రతిష్టుడై ఖాద్రి నరసింహుడు అయ్యాడు  ,భుజంగ ప్రయాత స్తోత్రం తో నారసి౦హుని ప్రసన్నుని చేసుకోగా ఆ స్తోత్రం విష్ణుశర్మ స్తోత్రం గా లోకం లో ప్రసిద్ధమైంది .

  చివరిదైన పదమూడవ అధ్యాయం లో నారదుడు ఖాద్రి క్షేత్ర మహాత్మ్యాన్ని శివుడిని అడిగి వివరంగా తెలుసుకొన్నాడు .భ్రుగు మహర్షి ఒకసారి వసంతకాలం లో బ్రహ్మోత్సవాలు చూడటానికి ఇక్కడికి వచ్ఛి మహర్షులకోరికపైభాగవత్కదలు చెప్పాడు.ఒకప్పుడు బ్రహ్మను,శంకరుడిని  శపించటం ,ఇద్దరూ కూడబలుక్కొని పాములతో ఆయన్ను కరవమని చెప్పటం ,అవి కాటు వేయలేక పారిపోవటం జరిగింది .బ్రహ్మ గర్వం ఖర్వమై పాదాలపై వ్రాలి ఏనాడో భ్రుగు మహర్షి పరీక్షించి  స్థాపించిన  ‘’విష్ణు సర్వేశ్వర తత్వ సిద్ధాంతం ‘’అంగీకరించి ,విష్ణువే త్రిమూర్తులలో శ్రేష్టుడనిప్రకటించాడు .బ్రహ్మ మునిని ‘’విష్ణువు వాగామగోచరుడు అయితే ఆయన దివ్య మంగళ విగ్రహం ఎలా ఏర్పడుతుంది? ‘’   అని సందేహం వెలిబుచ్చగా మహర్షి ధ్యానయోగం తో ఆ మహానుభావుని దివ్య మంగళ విగ్రహాన్ని సాక్షాత్కరింప జేయగా దేవతలు మహర్షులు ఆనందంతో స్తోత్రగానాలు చేశారు .స్వామి సర్వవ్యాపకత్వాన్ని అర్ధం చేసుకొన్నారు .బ్రహ్మ చేసిన స్తోత్రం లోకప్రసిద్ధమైనది .శివుడితో భ్రుగువు ‘’స్వామీ ఒకప్పుడు నిన్ను లింగ రూపంలో ఉండమని శపించాను .నీ మూల రూపం అలాగే ఉంటుంది .కాని ఉత్సవ సమయాలలో పార్వతీ దేవితో దర్శనమిచ్చి భక్తులకోర్కే తీరుస్తావు .తర్వాత ఖాద్రి నృసి౦హునికిభ్రుగు మహర్షి మంగళా శాసన౦ తో వైభవం గా స్తోత్రం చేసి,తన ఆశ్రమానికి వెళ్ళాడు .శంకరుడు ,దేవతలు ఇక్కడే ఉండామనుకొన్నారు లక్ష్మీ దేవి భైరవుడుమాత్రం సన్ని దానాలకు  వెళ్ళిపోయారు .లక్ష్మీ దేవి ఎడమ చేతిలో ఒక పండు ,కుడి చేతిలో పద్మం,భైరవుడు నాలుగు చేతులలో ఖడ్గ డమరుక త్రిశూల కపాలాలు ,శిరసుపై రత్నకిరీటం చెవులకు కుండలాలు మెడలో కపాలమాల ,యజ్ఞోపవీతం పాదాలలో అందెలు హస్తాలలో కంకణాలు ధరించి నృసింహ  స్వామి సన్నిధిలో ఉన్నారు’’ అని సవిస్తరంగా శివుడు నారదమహర్షికి ఖాద్రి క్షేత్ర మహాత్మ్యం వివరించాడు

  విష్ణుశర్మ చేసి ఖాద్రి నరింహ స్తుతి-‘’రక్షోవర హిరణ్యాక్ష వక్షస్థల విదారిణం – శిక్షితాక్షం మహాబాహుం ఖాదిరీ నృహరిం భజే ‘’-వందే వందారు మందారం కుండహాస ప్రకాశినం –ఖాదరీ నృహరిం వందే మందహాస శుభానన౦ –ఖాదిరీ నృసింహ స్తోత్రం త్రిసంధ్యం య ఇదం పతేత్-నాపమృత్యు భయం  తస్య కాల మృత్యు భయం న చ –కరోమి త్వదీయాంసపర్యాయాం సుపూర్ణం –సదాహం విధానేన వైఖనసేన-న బాహ్యాగమేస్తుపూజా కదాపి –ప్రసీద ప్రభో ఖాదిరీశ ప్రసీద ‘.

   బ్రహ్మ  చేసిన స్తోత్రం –‘’కళా కాస్టాముహూర్తాస్వం పక్షమాసర్తుమూర్తిమాన్ –కాలస్త్వం కనకాద్రీస్త్వంకారణం కార్యమేవచ –త్వామాది రనంతశ్చత్వం చిద్రూప మాత్మభూనమస్తే ధృత ధైర్యాయ – విశ్వ భోక్త్రేనమోనమః ‘’

భ్రుగుమహర్షి చేసిన స్తోత్రం –‘’సాలగ్రామ శిలావారి సహితం త్వన్ని వేదితం –గ్రాహ్యమస్తు ద్విజాతీనా మిత రేషాం చ పావనం –త్వత్పూజన పరాణా౦చ త్వమిష్టఫలదో భవ-భావనామ తధాస్తే స్తు స్మరతాం భవ మోచనం ‘’

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-2-21-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.