ఆది కాలం లో బ్రహ్మ దేవుని వద్ద ఉన్న వేదాలను సోమకాసురుడు దొంగిలించి సముద్రం లో దాక్కున్నాడు .బ్రహ్మ తనతండ్రి విష్ణు మూర్తి దగ్గరకు వెళ్లి వేదోద్ధరణ చేయమని ప్రార్ధించాడు .సరే అని మత్సావతారుడై సముద్రం లో దిగి ,సోమకుని చంపి ,పంచవేదాలను తీసుకొని బయటికి రాగా అపుడు వేదాలు పురుషరూపం దాల్చి విష్ణు మూర్తిని స్తుతించి ‘’నిన్ను మా శిరస్సులపై దాల్చే భాగ్యం ప్రసాదించు ‘’అని కోరగా సరే అని ‘’ఈ అవతారం లో కాదు .నృసింహావతారం పొంది హిరణ్య కశిపుని సంహరించి ,ప్రహ్లాదుని రక్షించి ,అప్పుడు పంచ మూర్తి స్వరూపం దాలుస్తాను .అప్పటిదాకా మీరు కృష్ణ వేణీ నదీ గర్భం లో సాలగ్రామాలుగా ఉండండి. ఆ నది కూడా నన్ను అభిషేకించాలని తహతహ చెందుతోంది .ఈ రకంగా ఆమె కోరిక కూడా తీరుతుంది ‘’అని చెప్పగా వేదాలు కృష్ణానదిలో సాలగ్రామాలుగా ఉండి పోయాయి .
విష్ణువు నరసింహావతారం దాల్చి ప్రహ్లాద వరడుడై హిరణ్య కశిపుని సంహరించి ,పూర్వం వేదాలకు ఇచ్చిన మాట ప్రకారం కృష్ణాతీరం లో కొండపై జ్వాలా నృసింహ మూర్తి ‘’గా వెలిశాడు బ్రహ్మవచ్చి సాలగ్రామ నరసింహ మూర్తిగా తన సత్యలోకం లో ఉండమని కోరగా ,సరే అని వెళ్ళాడు . బ్రహ్మ పూజ చేద్దామను కొంటె సత్యలోకం తగలబడి పోయింది .భయపడిన బ్రహ్మ మళ్ళీ కృష్ణా నదీ గర్భం లో సాలగ్రామ పర్వతం పై ప్రతిష్టించి సత్యలోకం వెళ్ళాడు .మళ్ళీ నదిని స్వామి తరి౦ప జేశాడు .
కొంతకాలానికి ఋష్యశృంగుడు మొదలైన మహర్షులు ,మనువు మొదలైన మహా రాజులు ప్రార్ధిస్తే ,యోగానంద నరసింహుడై పర్వత మద్యం పై ఉన్నాడు .గరుడుడు మొదలైన వారు ప్రార్ధించగా వీర నరసింహ మూర్తి రూపం పొందాడు .వనదేవతలు ప్రార్ధిస్తే లక్ష్మీ నారసింహ రూపం పొందాడు .ఈ విధంగా పంచ నారసి౦హులు ఒకే చోట ఉన్న పవిత్ర క్షేత్రం ఇంకెక్కడా లేదు ఒక్క వేదాద్రికే దక్కింది ఆ అదృష్టం ..బ్రహ్మాండ పురాణం లో వేదాచల క్షేత్ర మహాత్మ్యం వర్ణన సవివరంగా ఉన్నది .ఇందులో కృష్ణవేణీ నది అష్టకం కూడా ఉన్నది .
మూడు ఆశ్వసాలున్న గ్రంథం ఇది .పై వివరాలన్నీ మూడు ఆశ్వాసాలలో ఉంటాయి .దీన్ని తెలుగు లో వివిధ ఛందో పద్యాలలో అనువాదం శ్రీ వేద గిరీంద్ర కవి చేశాడు .తరువాత నరసింహస్వామి సహస్ర నామావళి,శ్రీ ఆంజనేయ సహస్రనామావళి ,పర్యంకాసనోత్సవ కీర్తనలు(పవళింపు సేవ ) అన్ని రాగాలలో తాళాలలో ఉన్నాయి .
మొదటి ఆశ్వాసం లో –‘’శ్రీ వేదాద్రి వికుంఠ పట్టణముగా శ్రీ కృష్ణ వేణిన్ భువిన్ భావిర్వ వీరజానదీ ఝారముగా బ్రాకార సౌదాంచిత –గ్రావంబే తెలిదీవి గాగలిగి యోగానందుడౌ-రుష్యశృంగావిర్భూత నృసిమ్హుం డీవుత తదీయావాప్తి మా కెప్పుడున్ ‘’.చివర షష్ట్యంతాలున్నాయి .దండకం కూడా ఉంటుంది .
. రెండవ ఆశ్వాసం –‘’శ్రీ వసుధా నీళాహృ-జ్జీవ౦జీవోపజీవ శిశిర మయూఖ –ప్రావీణ్య వదనజలరుహ –శ్రీ వేదం గిరీంద్ర ర౦హ శ్రీ నరసింహా ‘’అనే కాండం తో అందంగా మొదలు పెట్టాడు కవి .
మూడవ ఆశ్వాసం లో –శ్రీమత్క్రుష్ణా తటినీ –భూసుర సానంద కంద భూభ్రుత్ప్రభవ-ద్డాను ధగద్ధిగితసురా –స్తేమ తటి త్పటల జిహ్వ శ్రీ నరసింహా ‘’అనే కదం తో మొదలుపెట్టి చివర పంచచామరం తో వీచి ,గీత పద్యాలతో సమాప్తి చేశాడు .
మొదట్లోనే ఉన్న శ్రీ కృష్ణ వేణ్యస్టకం –1-‘’శ్రీ మత్కైవల్య నిశ్రే ణీ౦-చిదానంద స్వరూపిణీ౦-కల్యాణీం సైకతశ్రోణీ౦-కృష్ణ వేణీ నమామ్యహం
8-‘’పరమానంద సరణీ౦ కరుణా౦బు తరంగిణీ౦-దురితాంబోధి తరణి౦ –కృష్ణ వేణీ నమామ్యహం ‘’
పవళింపు సేవ కీర్తనలు -1-‘’శ్రీ రాజ్యలక్ష్మీ మనోరమా కరుణాబ్ది పరమ యోగానంద బహుపరాకు –హలకులిశాది రేఖాంకిత కమనీయ –పాద సరోజాత బహుపరాకు ‘’
చివర – ‘’చేతిలో చేయి వేసి చేతి కందిచ్చి –ఖ్యాతి కౌగిట జేర్చి కన్నీరు నించి –అత్య౦త సంతోష మంది దంపతులు –నిత్య సంపద లొంది నెగడి రెల్లప్పుడు ‘’
శ్లోకం –శ్రీ జ్వాలా నారసింహో విధిముఖ సుర సంప్రార్ధితఃకృష్ణ వేణ్యాం –సాలగ్రామ స్వరూపో గరుడ ముఖ నుతో భూన్మహా వీర సింహః –యోగానందో వసిష్ట్యాద్యఖిల మునిమతం ప్రాప్య లక్ష్మీ నృసి౦హొ-వేదాద్రౌ భాతి భక్త ప్రకర నిరత సంరక్షణే బద్ధ దీక్షః’’
‘’కృష్ణా నదీ శీతలవాత పోత -నిర్ధూత హేమా సురకోప వహ్నిహ్ –లక్ష్మీ కటాక్షామృతపూర తృప్తో-వేదాద్రి శృంగం భజతే నృసిమ్హః ‘’
ఈ గ్రంథం ఎప్పుడు ఎక్కడ ప్రచురి౦పబడిందో తెలియదు కవిగారి వివరాలూ లేవు .కాని మంచి ధారాశుద్ధి భక్తీ తాత్పర్యాలతో సరళ భాషలో కవి గొప్ప అనువాదం చేశాడు అభినంద నీయుడు .ఇది కూడా ఎవరి దృష్టిలోనూ పడి నట్లు లేదు .పరిచయం చేసే భాగ్యం నాకు దక్కినందుకు సంతోషం గా ఉంది .
Click to access 2015.386882.Srivedachala-Mahatyam.pdf
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -14-2-21-ఉయ్యూరు