మోదుకూరి చెన్న కేశవ శతకం
గుంటూరు మండలం ఆలపాడు గ్రామ వాసి ధనకుధరవంశీకుడు శ్రీమాన్ రామానుజా చార్యులుకవి ‘’మోదుకూరి చెన్నకేశవ శతకం ‘’రచించగా,పెంటపాడు శ్రీ వైష్ణవ ముద్రాక్షరశాలలో 1925లో ముద్రింపబడింది .వెల అర్ధరూపాయ .కవిగారు శ్రీగోపాలశతకం ,శ్రీ రామ చంద్ర శతకాలు కూడా అంతకు ముందే రాసిపేరు పొందారు .ఈ చెన్న కేశవ శతకం లో ‘’శ్రీ మోదుకూరి చెన్న ‘’అనేది మకుటం .చివరలో మాత్రమే తన గురించి కవి చెప్పుకొన్నాడు .ఔషధ వైద్యం సద్భూషణ వైశద్యం ,జల ,సూర్య చికిత్సావిధానం ,జ్యోతిషార్ణవ మధనం ,,తాళ మృదంగ చతురిమ ,సత్పఠనం,కవితా చతుష్క కళ,గణిత శాస్త్ర విజ్ఞానం ,శ్రీ పాంచరాత్ర విశిష్ట గుణ సంపన్నత ,ఇద్దరు పుత్రులు ,ఒక కుమార్తె ,ధన ధాన్య గృహ క్షేత్ర దాస దాసీ జనం ఉన్న వాడు కవి శ్రీరామానుజా చార్య .’’గుంటూరు డిస్ట్రిక్టు నంటుతెనాలితాలూకాలో’’ సుక్షేత్రమైన మాగాణులతో ఆలపాడు గ్రామంలో శ్రీ వేణు గోపాలస్వామి ఉన్నాడు .ఆస్వామి కోవెలలో కవి అర్చకస్వామి .నాలుగు వర్ణాలతో సౌభాగ్య వృద్ధిగా ఉన్న ఊరు మోదుకూరు .ఈ స్వామి అర్చనలో కూడా కవి భాగ స్వామ్యముంది .ఈ స్వామిపైనే ఇప్పుడు ఈశతకం ‘’హూణ శకం,వేదయుగ నవ స౦ఖ్య,సమరక్త నేత్ర వత్సరం ,మార్గ శిర శుక్ల సప్తమి నాటికి శతకం పూర్తి చేశాడు .అ౦తకు పూర్వమే గోపాల ,రామ చంద్ర శతక రచన చేశాడు . తండ్రి ప్రబంధ అచ్యుతాచార్య. నరసమ తల్లి .భార్యపేరుకూడా నరసమ .సంతానం ముగ్గురు –ఇద్దరు కొడుకులు ,ఒక్క కూతురు .ఇంతకంటే ఎక్కువగా యేమీచేప్పలేదు .
కవి అనేక ఛందో రీతులతో శతక శతపత్రాన్ని సుపరిమళ భరితం చేశాడు .ఆకవితా ప్రవాహం లో అలా కొట్టుకుపోతాం భక్తీ యుక్తీ నేర్పూ చాకచక్యం పద గుంభన,భావ విన్యాసం చూస్తే ప్రబంధకవుల సరసన నిలుస్తాడని పిస్తుంది .ఉదహరించాలంటే అన్ని పద్యాలూ ఉదాహరించాలి .దేన్నీ వదలి పెట్ట లేము .అంతటి ప్రతిభా విశేషాలున్నకవి శ్రేష్టుడు ఆచార్య వర్యుడైన కవి .ముఖ్యమైన కొన్ని వైవిధ్య భరిత పద్యాల చరణ మంజీర నాదం విందాం .
మొదటి సీస పద్యం లో –శ్రీ రమా వరసర్వ-శ్రితజనావన శర్వ –నుతపుణ్య జనగర్వహతసపర్వ –హరివంశ సత్పూర్వ హరత రణి కుల యుర్వ –రాది సఘన పూర్వ రాజపర్వ —‘’ఈశ గోవింద పూర్వ ఈశ సర్వ –క్షోణి సంపన్న శ్రీ మోదుకూరి చెన్న ‘’.తర్వాతపద్యం లో మనవాళముని మొదలైన వారి స్మరణ చేశాడు .ముక్త పద గ్రస్తం లో –సత్పుణ్య చారిత్ర సజ్జన నుతపాత్ర –సకల మోహన గాత్ర సర్వ మిత్ర –మిత్ర లోక పవిత్ర మిహిరకుల క్షేత్ర –మేదినీశ సు-పుత్ర మీననేత్ర ‘’అంటూ సాగిస్తాడు .దశావతార వర్ణన –‘’మీనావతార దుర్దానవ సోమ ర-క్ష స్సుసంహార వర్చస్సుధీర ‘’అని పరిగెత్తిస్తాడు .తర్వాత శుద్ధాంధ్ర౦ లో దశరధ రామావతారం వర్ణించాడు –‘’పదియరదముల దొర,పజదొరముగ్గుర-తల్లుల మురువలర జెల్లు జివర – లలిత దమ్ముల లరనా –గలివరజుపేరమర –వల తెదగరమిరవు జెలువుడు దిర’’అని మన బుర్రలకు పని కల్పిస్తాడు .ఆతర్వాత నిర్యోష్ట్య సీసం లో –‘’శంఖు గదావాసి శాన్గ్య నాయక రుషి-లోకసన్నుతరాశి లోలదాసి –‘’అని లాగించి ,సర్వ లఘు సీసం లో –‘’దనుజహర మురహర –ఘన సమత ను వరద –సురనుత మనుజపతి ధరధర హరి’’,సగర్భ చంకమాలా వృత్త ద్వయ సీసం లో –‘’పరమత మేఘవా-త రస పాప విదార –ణ ప్రభ సోమయానన శశి వర’’,సీస గర్భ చంపక మాల –‘’పరమత మేఘవాత రసపాపవిదారణసోమయానదా –శరపతి శీలఈశ హరి సంస్తుత ప్రాకృత నాశనారతా’’
అలాగే సగర్భ మత్తేభం ,సీస గర్భ మత్తేభం ,సగర్భోత్పలమాలా,కంద వృత్త ద్వయం ,సీస గర్భ క౦ద౦,స్వరూప కైంకర్య శుద్ధాంధ్ర సర్వత్రయ సీసం ,నిత్య తత్సమ ద్రుత యతి సీసం ,సర్వత్ర శకట రేఫప్రాస శుద్ధా౦ద్ద్ర సీసంలలో చమక్కులు మెరిపించాడు .,శుద్దాంధ్రస్వరయతి సీసం –‘’ఓడు వారలకొప్పు నొదుగు సంతోషంబు –నోర్పు రుసులకు బువి నోగిరంబు ‘’.సర్వత్ర ప్రాసగర్భ క౦ద౦ రాసి మురిపించాడు .గర్భ క౦ద౦-‘’నిజ మెదజేతుల మురి –బజలకు నందరికి మగడ వనగల మీమే –లు జదల బువిలో –నసమెస-గుజ వరమేబాసవాలు క్రొన్న ప్రోల మేల్’’.శుద్ధాంధ్ర నిర్యోష్ట్యసగర్భ ద్విపద ద్వ్యర్ధి సీసం లో –‘’దణి కొలదణి యునై –తగి నేలలోను నని –సేయగా నౌనన జెల్ల’’, అని ప్రతిభ చూపాడు .
సంస్కృత తత్సమ సగర్భ ద్విపద -‘’శ్రీ రుక్మిణీ ధవ శ్రిత పారిజాత శ్రీ –రజత వాస శ్రీ రమ్య వేష .’’శుద్ధాంద్రఅన్త్యప్రాసం –‘’చిలువల దణి సెజ్జ-చిని జగంబులు బొజ్జ –ససి చెదలు గడు హజ్జసావు రజ్జ ‘’శుద్ధాంధ్ర అంత్యప్రాస సీసం –‘’అక్కునగద లక్కి ,పక్కి గుఱ్ఱము నెక్కి –టక్కర సురల జెక్కి చొక్కమక్కి –లెక్కెదబోరక్కి చక్కని మెయి దక్కి –మక్కువ వలపెక్కి ,యక్కరెక్కి ‘’అని ‘’కిక్కిస్తాడు’’ ..సర్వ లఘు నిర్యోష్ట్యగర్భ కాదం,దానిచిత్రం కూడా గీసి చూపాడు .సచిత్రోష్ట్యావృత శుద్ధాంధ్ర సీసం కరిగించి పద్యం లో పోతపోశాడు .విషమ సీసమూ కూర్చాడు –‘’దేనుపురినివాస సుదీరసార సాక్షశ్రీ –వేణుకరధరాఖిల విష్ణు శబ్ద బోధ రా –మానుజ యభిదాన మమాత్మ రక్షణా౦ద్రపూ –ర్ణానిజ గురు నాథసురాధిపాష్ఠ మాతృకా ‘’.
గర్భోత్తర మాలిక లో-‘’రంగడు రాయడౌరమణ రాణిని గూడి బువి ప్రియంబుగ-ద్రుంగుడుగంగ నౌ దొలసిరూడి నడుంగులగుట్ర లేకను –గ్రు౦కెదబూజలోకువను గోరిక జేసియు నిట్రనిక్క మ-గ్రుంగుడుబత్తులన్మొదల బ్రోచుయు నెంతయు వట్రిలందగన్’’.
చివరి పద్యం –‘’చింతిత సంతాన సంతత గోధన ని-రంతరాశ్రయ జన కంతు జనన –జంతుసంతాన నిజాంతరంగనిధాన –యంతక విజయఘన యంత మనన –యంతర సుభావన యంతఃపురావన –యంతి కాంతర సదన యంత రసన –యత ర్ముఖాధీన ,కుంతి సుత స్వాధీన –కుంతలాళి సమాన జంత్ర నటన –తంత్ర కామల వర కనకాంత తలిన –మంత్ర మంత్రార్ధ సద్భవన తాంత్రిక జన –తాంతి హర లోకపాలన ,నితాంత కరుణ –క్షోణి సంపన్నశ్రీ మోదుకూరి చెన్న ‘’
అర్ధాల కోసం వెంపర లాడకుండా హాయిగా మందార మకరందం లాంటి పద్యాలు పాడుకొంటూ కేశవ స్మరణతో జన్మ ధన్యం చేసుకోవచ్చు .అమృత రసప్రవాహ మాధురీ విలసిత పద్య రచన మనల్ని ఎక్కడికో తీసుకు వెడుతుంది ఎక్కడికి ఏమిటి ?చెన్నకేశవ సాన్నిధ్యానికే తీసుకు వెడుతుంది .చెన్న అంటే అందమైన అని అర్ధం .పద్యాలూ అంత చెన్నం గా ఉన్నాయి .ఈ శతకమూ ఎక్కడా ఎవరూ ప్రస్తావించినట్లు లేదు .ఈ దువ్వూరి చెన్నకేశవ శతకాన్నీ ,కవి శ్రీ రామానుజాచార్యను పరిచయం చేసే మహద్భాగ్యం నాకు కలిగి నందుకు ఆనందంగా సంతృప్తి గా ఉంది .ఇలాంటి వాటిని వెతికి నాకు పంపి పరిచయం చేయిస్తున్న మా అబ్బాయి శర్మకు అభినందనలు .ఇప్పటి దాకా వీకీ పీడియాలో చోటు చేసుకోని ఇలాంటి వాటిని చేర్చి అందరికి అందుబాటు లోకి తెస్తున్నాడు.
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-2-21-ఉయ్యూరు