శ్రీ కపాలీశ్వర విభూతి -1
శ్రీ వాసా సూర్య నారాయణ శాస్త్రి గారు ‘’కపాలీశ్వర విభూతి ‘’అనే సంస్కృత కావ్యం రాశారు .కవిగారు సాలూరు వేద సమాజం లో విద్యనేరుస్తున్నప్పుడు సుమారు వందేళ్ళక్రితం కావ్యకంఠ గణపతి ముని గారితోకలిసి వేగవతీ నదిలో స్నానించి ,చంద్ర గ్రహణం కోసం ఎదురు చూస్తున్నారు .అప్పుడు వారికి లుప్తమై పోతున్న సంస్కృత భాషలో ప్రాచీన మహాకవుల శైలికి దగ్గరగా ఉండేట్లు గీర్వాణ గ్రంథాలు రచించాలన్న సంకల్పంకలిగింది .మహాతపస్వి అయిన గణపతిశాస్త్రిగారు అపర కాళిదాసు అవతారం కనుక ‘’ఉమా సహస్రం ‘’మొదలైన సంస్కృత కావ్యాలు రాయగలిగారు .కానీ కవి గారు దారిద్ర్యం తో బాధపడుతూ క్రుంగి కృశిస్తూ ఉన్నా సంకల్పం మాత్రం వదలలేదు .కళింగ దేశం లోని వైశ్యజాతి లో లోపించిపోయిన ఉపనయనం మొదలైన సంస్కారాలను పునరుద్ధరించాలన్న కోరిక బలీయమైంది .దానికోసం పదేళ్ళు తీవ్ర కృషి చేశారు .మహామహోపాధ్యాయ శ్రీ తాతా సుబ్బారాయ శాస్త్రి గారు ,కళాప్రపూర్ణ శ్రీ గిడుగు వెంకటరామ మూర్తి గార్ల సంపూర్ణ సహకారం తో ‘’సావిత్రీ పతితప్రాయశ్చిత్తపూర్వకం ‘’గా ,శాస్త్రీయ పద్ధతిలో సంస్కారాలను వైశ్యకులం లో ప్రవేశ పెట్టి బ్రిటిష్ వారిచే ‘’సంఘ సంస్కర్త ‘’గా గుర్తిప బడ్డారు.శారదా శాసనం అమలు లోకి వచ్చినప్పుడు ,కలకత్తా మొదలైన చోట్ల పండితులతో శాస్త్ర చర్చ చేసి స్వాములవారి సన్నిధిలో ‘’కపాలీశ్వర విభూతి’’వినిపించి ,కాశీ హిందూ విశ్వ విద్యాలయలోని సంస్కృత విద్యాలయ మీమాంసా శాస్త్ర ప్రధానాచార్యులు ,ఉభయ మీమాంసా పట్ట భద్రులు,మహా పండిత ప్రకాండులు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు విని బాగా ప్రశంసించారు .కవిగారి ‘’నెహ్రూ చరిత్ర’’లోకోత్తరమనీ ,అందులో కవితా కాదంబిని ప్రకాశించింది అన్నారు .హరదత్తా చార్యులు అప్పయ్య దీక్షితులు మొదలైనవారిచే శివ భక్తి చిగిరించి పుష్పించి ఫలించి,గంగానది లా దేశమంతా ప్రవహిస్తోందని తెలియ జేశారు .’’యది సంతి గుణాః పుమ్సా౦ –వికసంత్యైవ తే స్వయం –నహి కస్తూరికామోద శ్శపధేన నివార్యతే ‘’అనీ ‘’ఆకారశ్చ హస్వః-కీర్తి శ్చ మహతీ –భోభో !ఆగమైక శరణాఆస్తిక శిఖా ణయః’’అని కేర్తించారు .ఆతర్వాత ప్రతి శ్లోకాన్నీ హిందీ లోకి అనువదించారు కూడా .కవిగారికి చిన్నతనం లో శ్రీ చేబోలు నాగేశ్వరరావు శాస్త్రులు గారు శివ భక్తీ బీజాలు నాటారు .సంస్కృత కవితకు ప్రోత్సహించారు . వీరి కుమారులు శ్రీ చేబోలు వెంకట సోమయాజులుగారు కవిగారి కంటికి వైద్యం చేసి ,కొన్ని నెలలు వారి౦ట్లోనే ఉంచుకొన్న ఉదార హృదయులు .కనుక ఈ కృతిని అత్యంత గౌరవంగా నాగేశ్వరరావు గారికి అంకితమిచ్చారు .
ఈ కృతికి ముందుమాట రాస్తూ డా భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ‘’ఇవాళకూడా సంస్కృత కవులు మన దేశం లో ఉన్నారని విని గర్వపడుతున్నాను .నేను నరసన్న పేట వచ్చినపుడు మీరు ఈకావ్యం చదివి వినిపిస్తే ఆనందం పొందాను .శ౦కరుల శివానంద లహిరి లాంటివి చాలాఉన్నాయి కదా మళ్ళీ అలాంటిదే కావాలా అని దివాన్ బహదూర్ రామస్వామి శాస్త్రులు అన్నా ,ఎవరి అనుభూతి వారిది .వీటికి తెలుగు పద్యాలు కూడా ఉంటె బాగా శోభించేది .కానీ మీకు సంస్కృత ప్రచారం అభిలష ణీయం కనుక దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక సంస్కృత వ్యాప్తి బాగా జరుగుతుందని భావిస్తాను ‘’అన్నారు .
ఈ కావ్యం ద్వితీయ ముద్రణ కూడా పొందింది అంటే గొప్ప ఆదరాభిమానాలు పొందినట్లే .ద్వితీయం లో సంస్కృత శ్లోకానికి తెలుగు అనువాద పద్యాలు కూడా జోడించి డా పట్టాభి గారి కోరిక తీర్చారు .కవిగారి అంకిత శ్లోకం –‘’భవ్యామసి౦చ దభవస్యపదాబ్జ భక్తిం –నాగేశ్వరో హృదిపురా మమ భాగ్య యోగాత్ –ప్రాచోయరత్సుర గవీ కవితాను రక్తిం –తద్వంశ మిత్థపుమవర్ణ్యకృతీ భవేయం కృతి పతివంశాన్ని గూర్చి సంస్కృత శ్లోకాలో లో తెలుగు పద్యాలతో చెప్పాడు కవి . .కులపతి ఖ్యాతిపొంది యజ్ఞయాగాదులు చేసిన చేబ్రోలు సంతతి వారు .దానిలో రామావధాని యజ్వ జన్మించారు .సర్వ వేదాది విద్యలు ఆయన నాలుక కొసమీద నర్తిస్తాయి .ఆయనకు విశ్వేశ ,కామేశ అనే ఇద్దరు కుమారులు .సప్తసంతానాలను వెలయించిన పుణ్య మూర్తులు .సంతానం లేని మాతామహుని కోరిక మేరకు జామి గ్రామం వదిలి వడ్డాది గ్రామం చేరారు .అక్కడ వివాహం చేసుకొని భైరవ ,వెంకట అనే కుమారులను కన్నారు .నారాయణ అప్పలాచార్యులు అనే ఆయన తమ్మయ్య గా ప్రసిద్ధుడై భైరవ సూరికి పుట్టారు .ఈయనకు సరస నారాయణ ,సాంబమూర్తి కొడుకులు .సాంబమూర్తి డాక్టర్ బిరుదు పొందారు .‘’ తమ్మయ్యగారికి కృష్ణమూర్తి ,రామమూర్తి నరసింహ మూర్తి కుమారులు .నరసింహమూర్తి దత్తతకు వెళ్ళాడు .బలిజేపల్లి పార్వతీశం అనే న్యాయవాది కుమార్తె సుభద్రను వెంకటాధ్వరిపెళ్లి చేసుకొన్నాడు .వడ్డాది వదిలి వేంకటాధ్వరి ఖండేవర గ్రామం చేరాడు నాగేశుడు భమిడిపాటి వీరన్న కుమార్తె సోమిదేవమ్మ ను వివాహమాడగా మొదటి సంతానంగా సుబ్బమాంబ పుట్టింది .సుబ్బమాంబ ను దూర్వాసుల పార్వతీశానికిచ్చి పెళ్లిచేయగా వెంకట సోమాశి పుట్టాడు .పట్ట భద్రుడు.ఈయనకు వెంకట సోమయాజి అనేదాత న్యాయవాది పుట్టాడు.ఈయన శ్రీపాద వెంకటరమణ గారి అమ్మాయి లక్ష్మీ నర్సును పెళ్ళాడి పుత్ర పౌత్రాభి వృద్ధి చెందాడనీ,ఇంకా వంశం అభి వృద్ధి చెందాలనీ కోరారుకవి.
కావ్యం చివరలో తన గురించి కవి చెప్పుకొన్నాడు –వాధూలస గోత్రం .వెంకమా౦బా ,వెంకటరామ ప్రధమ పుత్రుడు శ్రీ సామవేద అన్నప శాస్త్రి కులపతి ప్రియ శిష్యుడు వాసా సూర్యనారాయణ శాస్త్రి విరచిత శ్రీ కల్పవల్లీ కపాలీశ్వర విభూతి సమాప్తం అని అని 134వ చివరి శ్లోకం లో చెప్పాడు .పట్టాభి గారు ముందుమాటలను 19-2-1949 న ఢిల్లీనుంచి రాసి పంపారు .కనుక ఈ కావ్యం 1949లో మొదటి ముద్రణ పొందిందని భావించవచ్చు . ఎక్కడ ముద్రించారో , వెలఎంతో వివరాలు లేవు . మిగిలిన వివరాలు రేపు తెలుసుకొందాం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-2-21-ఉయ్యూరు