మహా భక్త శిఖామణులు
33-తారక బ్రహ్మ వంగల నారాయణప్ప
గుంటూరు జిల్లా నరసరావు పేట తాలూకా జగ్గాపురం లో 19వ శతాబ్దిలో వంగల కొండ౦భొట్లు ,కావేరమ్మ దంపతులకు కేశవభొట్లు ,సుబ్బమ్మ ,నరసమ్మ, సీతమ్మ సంతానం .ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయి రామకూరు ,వేలూరు, ధర్మవరాలలో హాయిగా కాపురాలు చేసుకొంటూ వృద్ధిపొందారు ,కేశవ నే నారాయణ మూర్తి , నారాయణ భొట్లు అనేవారు .వ్యవసాయమే ఆధారమైనా ఎవర్నీ చెయ్యి సాచి అడగని అభిమాన ధనుడు .నిత్యం ఎవరో ఒకరు ప్రక్కన కూర్చుని భోజనం చేస్తేకాని ఆయనకు తృప్తి ఉండేదికాదు ..వారింట్లో ఎప్పుడో ఒకప్పుడు భోజనం చేయని గుంటూరు వాసి ఎవరూ లేరు .
ఒకసారి కోనసీమ నుంచి వేద వేత్తలైన ముగ్గురు బ్రాహ్మణులు దేశాటనం చేస్తూ వస్తే, వారిని బంధువులను ఆదరించినట్లు ఆదరించి భోజనాలు పెట్టి సంతృప్తి చెందించిన పుణ్యమూర్తి.వీరితో పాటు 10 మంది బ్రాహ్మణులు కూడా పంక్తిలో కూర్చుని భోజనం చేస్తున్నారు .నవలాయ పిండి వంటలతో భోజనం తయారు చేసి వడ్డించి తినిపిస్తున్నారు ఆ దంపతులు .చివరికి మరదలు లక్ష్మీ నరసమ్మగారు పెరుగు వడ్డించింది .అందరూ తృప్తిగా తిన్నారు కానీ ఒక బ్రాహ్మణుడు పెరుగన్నం లో చెయ్యి పెట్టి ఏడుస్తున్నాడు .’’భోజనలోపమా ఆదరణలోపమా ఎందుకు భోజనం చేయట్లేదని అడిగాడు గృహస్తు.అప్పుడాయన ‘’ఏ లోపమూ లేదు. నాకు ముగ్గురు కొడుకులు ,నలుగురు కూతుళ్ళు .వాళ్లకు ఎప్పుడూ ఇలాంటి భోజనం నేను పెట్టనే లేదు .నా కడుపున పుట్టి వాళ్ళు నిర్భాగ్యులుగా పెరుగుతున్నారు .మీలాంటి సంపన్నుల ఇంట్లో పుడితే మృష్టాన్న భోజనం తినే వారు కదా అని ఏడుస్తున్నాను ‘’అని బావురుమన్నాడు .నారాయణప్ప ‘’మీ కోరిక భగవంతుడు తప్పక తీరుస్తాడు దుఖిచకండి ‘’అని ఓదార్చి తినిపించాడు .
భోజనాలయ్యాక అందరూ తాంబూలాలు వేసుకొన్ కబుర్లు చెప్పు కొంటు౦డగా ,పూటకు మానెడు పాలిచ్చే గేదె తో తనదగ్గరకు వచ్చిన పాలేరు చేతిలో కొంత డబ్బు దారి ఖర్చులకోసం పెట్టి ,ఆ గేదెను ,ఆ బ్రాహ్మణుడి ఇంటికి తోలుకు వెళ్లి అప్పగించి రమ్మని చెప్పాడు . దాని పోషణ కోసం ఒక యకారం భూమికూడా దానం చేశాడు ఉదార హృదయం తో .నిష్కామ సేవా పరుడైన నారాయనప్ప ఆరాధన పేరుతొ ప్రతి ఏడాది తన శిష్యబృందాన్ని అందరినీ పిలిచి సోదరులలాగా ఆదరించి భోజన సత్కారాలు చేసి,బహుమానాలిచ్చి పంపేవాడు .కోనసీమ పండితులు చెప్పుడుమాటలు విని అసూయతో పరీక్షించటానికి వస్తే బ్రహ్మ విద్యలో తన స్వానుభవం చూపించి నిరుత్తరుల్ని చేశాడు .
వరుసగా ఇరవై ఏళ్ళు భద్రాద్రి శ్రీ సీతారామ కల్యాణానికి కాలినడకన వెళ్లి చూసి తరించిన భాగ్య శీలుడు నారాయణప్ప .భక్త బృందం తో ఇంటి నుంచి భజన చేస్తూ బయల్దేరి ,భద్రాద్రి కల్యాణ శోభ తిలకించి ,పర్ణశాల చూసి ,మళ్ళీ ఇంటికి చేరి మహా సంతర్పణ శ్రీ రామార్పణం అంటూ చేసేవాడు .మూడు సార్లు కాశీ యాత్ర ,రెండు సార్లు రామేశ్వర యాత్ర చేసి ,తెచ్చిన గంగాజలం తో తలిదండ్రులను అభిషె కించేవాడు .చివరి సారి తలిదండ్రులతో కాశీ వెళ్లి దేహాన్ని విశ్వేశ్వరునికి అర్పించి రుణత్రయ విముక్తు డయ్యాడు .
పన్నెండవ ఏట నుంచి గురువు వద్ద చక్కగా వేద శాస్త్రాలు అభ్యసించి ,వాటి సూక్తుల్ని అనుభవం లోకి తెచ్చుకొని ,పాలేళ్ళతో మంచి వ్యవసాయం చేస్తూ చేయిస్తూ ,ధనధాన్య సమృద్ధి పొంది దాన ధర్మాలు నిరంతరం కొనసాగించాడు .తన ఊళ్ళోతన స్థలం లో ఒక చిన్న కుటీరం నిర్మించుకొని పూల వనం పెంచి బావి త్రవ్వించి ,ఆ బావి జలం తో ప్రతి ఉదయం స్నానించి సంధ్యావందనం చేసి కుటీరం లో జప దీక్షలో మునిగిపోయేవాడు .నారాయణ భొట్లు .ఆసమయం లో గాయత్రీ మాట సర్పాకృతి ధరించి ఆకుటీర ప్రాంతం లో తిరుగుతూ ,ఆయన సమాధి నుంచి లేచే సమయానికి అదృశ్యమయ్యేది అని అందరూ చెప్పుకొనే వారు. ఈ మాట తెలిసి ,ఎవ్వరూ ఆయన దీక్షకు అంతరాయం కలిగించేవారు కాదు .
ఒక సారి శిష్యులైన వేద విద్యార్ధులతో రాత్రి భోజనం చేసి ఆ కుటీరం లో పడుకొని ఉన్నాడు .ఒక నాగు పాము అర్ధరాత్రి సమయం లో వచ్చి నారాయణప్ప ప్రక్కలో పడుకొని ,ఆయన చెవిపై పడగ ఉంచిందట .ఇంతలో ఒక శిష్యుడికి మెలకువ వచ్చి ఆ దృశ్యం చూసి నోటమాట రాలేదట .తర్వాత అందర్నీ లేపి ఒళ్ళూ వాళ్ళను పిలిచి చూస్తే పాము కనిపించలేదు .ఈ హడావిడికి గురువు గారు లేచి విషయం తెలుసుకొని ‘’మా రామప్ప ఈ రకంగా దర్శనమిచ్చాడు కాబోలు ‘’అన్నాడట .అప్పటి నుంచి శ్రీరాముడు ఆయన వెంట ఉండేవాడు .అందుకే ఆయన స్పర్శ తగిలితే వ్యాధులు నయమయ్యేవి .ఒకసారి కుమారస్వామి అనే కుష్టు రోగం తో బాధ పడే బ్రాహ్మణుడు నారాయణప్ప పొలం దున్నుతుంటే వెళ్లి తన గోడు చెప్పుకోగానే దగ్గరలో ఉన్న పొదరింట్లోని ఒక ఔషధ మొక్కను తీసి తినిపించగా ,గుణం కనిపించి నెలరోజుల్లో వ్యాధి మాయమైపోయింది .ఇలాంటివి చాలా ఉన్నాయి .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-2-21-ఉయ్యూరు
—