మూడు నామాల ‘’చేపలున్నశ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం
తెలంగాణా భువనగిరిజిల్లా వలిగొండ మండలం వెంకటాపురం లో శ్రీ మత్స్య గిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం కొండపై ఉన్నది .ఈ ఆలయవిష్ణు పుష్కరిణి లోని చేపలన్నీ అరమీటరు పొడవుగా ఉండటం తలపై మూడు ఊర్ధ్వ నామాలు కలిగి ఉండటం ప్రత్యేకం .అందుకే మత్ష్యగిరి అనే పేరొచ్చింది.మాత్స్యాద్రి అనీ అంటారు .హైదరాబాద్ కు 70కిలోమీటర్ల దూరం లో ఉన్న ఆలయం .స్వామి శ్రీమన్నారాయణ మూర్తి ఆది అవతారంగా భావిస్తారు .కొండమీదికి మెట్ల దారి ఉంది .స్లోపు గా ఉన్న దారి లో వెళ్ళటం తేలిక .పొట్టిగుట్ట అనే ఊరునుంచి స్వామి వారి దర్శనం చేప ఆకారం లో కనిపిస్తుంది .గిరిపైనుంది చూస్తె అద్భుత ప్రకృతి పులకింప జేస్తుంది .పూర్వం మునులు అర్చనకోసం కొలను కు నీరు తేవటానికి వెడితే అందులో నామాలతో ఉన్న చేపలు కనిపించాయి .అందుకే వీటిని మత్స్యావతారంగా భావించారు .యాదాద్రి తర్వాత అంతటి విశిష్టమైన ఆలయమిది .
ఈఆలయ పుష్కరిణి నీటిని పోలాలలో చిమ్మితే పంటలకు చీడపీడలు రావు అని గొప్ప నమ్మకం .వ్యాపారస్తులు వ్యాపార సంస్థలలో చల్లుకొంటే వ్యాపారం విపరీతంగా పెరుగుతుందని విశ్వాసం .అనారోగ్యం తో ఉన్నవారు పుష్కరిణి స్నానం చేసి స్వామిని దర్శి౦చి నిద్ర చేస్తే పూర్ణారోగ్యం కలుగుతుంది .బ్రహ్మోత్సవాలు ,నరసింహజయంతి ,ఉగాది ఘనంగా నిర్వహిస్తారు .ధనుర్మాస ఉత్సవాలు ,గోదా రంగనాధ స్వామి కళ్యాణమూ వైభవంగా చేస్తారు ఆలయాన్ని ఆనుకొని మూడు గుండాలకలయికతో ఉన్న కొలను అన్నికాలాల్లో ఒకే స్థాయిలో నీరు కలిగి ఉండటం ఆశ్చర్యం .కొండ చుట్టూ కొలను నీరు ప్రవహిస్తూ వింత శోభ కలిగిస్తుంది .పుష్కరిణి లోని నామాల చేపలు సంవత్సరం లో అన్ని రోజుల్లోనూ కనిపిస్తాయి .నామాలు స్పష్టంగా కనిపిస్తాయి .శ్రావణం నుంచి కార్తీకం వరకు పుష్కలంగా కనిపిస్తాయి .సంతానం లేనివారు పుష్కరిణిలో స్నానించి ,దగ్గరలో ఉన్న ఒక చెట్టుకు కొబ్బరి కాయలు ముడుపుగా కడతారు .పుష్కరిణి నీటిని 11 రోజులు తీర్ధంగా సేవిస్తే వ్యాధులు మటుమాయం అంటారు .స్వామివారి అర్చన ,అభిషేకాలకు ఈ జలాన్నే ఉపయోగిస్తారు .ఇక్కడి లక్ష్మీ నరసింహస్వామి సాలగ్రామ రూపంగా లక్ష్మీ సమేతంగా శంకు చక్రాలతో దర్శనమిస్తాడు .చక్రం లో స్వామివారి ముఖం మధ్యలో నామం ,చేప ఉదరభాగం గా చివరి శంఖంచేప తోకగా దర్శనమనుగ్రహిస్తాడుస్వామి .క్షేత్రపాలకుడు శ్రీ ఆ౦జనేయ స్వామి.గోదా దేవి సీతారామస్వామి దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి .
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -3-3-21-ఉయ్యూరు