యుగా౦తాలను సూచించే దేవాలయం
మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లా కైలేశ్వర గ్రామం లో యుగా౦తాలకు సంబంధించిన ఆధారాలున్నాయి .ఇక్కడ హరిశ్చంద్ర ఘడ్ కోట ఉంది .దీని దగ్గర గుహలాంటి నిర్మాణం ఒకటి ఉంది .గుహలో అత్య౦త పురాతన శివలింగం ఎల్లకాలమూ అయిదు అడుగుల లోతు ఉండే నీటిలో ఉంటుంది .ఈ గుడిని కేదారేశ్వర దేవాలయం అంటారు .లింగం నాలుగు స్తంభాల కప్పు లోపల ఉంటుంది. ఈ స్తంభాలు నాలుగు యుగాలకు సంకేతికాలు .ఈ ఆలయ నిర్మాణం ఎవరు, ఎప్పుడు చేశారు అన్న ఆధారాలు ఇప్పటి వరకు ఎవరికీ తెలియలేదు .ఏ చరిత్రలోనూ లేదు .ఇక్కడి నాలుగు స్తంభాలలో ఒక్కొక్క స్తంభం ఒక్కో యుగం తర్వాత కూలి పోయిందట .ఇప్పుడు మిగిలింది కలియుగ స్తంభం ఒక్కటే .ఈస్తంభం కూలిన మర్నాడే కలియుగం అంతరించి పోతుందని విశ్వాసం .కలియుగం ఇప్పటికి 5వేల సంవత్సరాలే గడిచింది ఇంకా చాలా లక్షల సంవత్సరాలు గడవాలి కనుక మనం కంగారు ,భయం పడాల్సిన పని లేదు .
ఈ కేదారేశ్వర దేవాలయం నాలుగు గోడలనుంచీ నిర౦తరం చల్లని నీరు ప్రవహిస్తూనే ఉండటం గొప్ప విశేషం ‘కానీ వర్షాకాలం లో మాత్రం గుడిలో చుక్క నీరు కూడా ఉండకపోవటం మరో వింత .హరిశ్చంద్ర ఘడ్ కోట విషయం అగ్నిపురాణం ,స్కాందపురాణం వగైరా పురాణాలలో చెప్పబడింది అంటే ఎంతో పురాతన కోట అని అర్ధమౌతుంది.కోటలోపల ఒక రహస్యమైన సొరంగమార్గం గుండా వెడితే అక్కడ ఒక నీటి కొలను కనిపిస్తుంది .ఇక్కడే ఉన్న శివలింగం మరకత మణి లింగం .నీరు కూడా ఈ మరకత మణి రంగులో లింగం చుట్టూ ఉంటుంది .కాలక్రమం లో ఆ మరకత మణి లింగం దొంగలపాలయింది .ఈ ఆలయం లో కనకాంబరం రంగులో ఉన్న వినాయక విగ్రహం మరో ఆకర్షణ .ఈ గణేశుని నిత్యం వేలాది భక్తులు సందర్శిస్తారు .ఆలయం నల్ల గ్రానైట్ రాతి నిర్మాణం .స్తంభాలపై సుందర శిల్పాలు కనువిందు చేస్తాయి .గుడిలో ఏకశిలా నందివిగ్రహం దానికెదురుగా అతి పురాతన శివలింగం కనిపిస్తాయి .
హరిశ్చంద్ర ఘడ్ దగ్గర సప్తతరణి అనే చోట ఏడు గుహల వరుస సముదాయం ఉంటుంది .దీనికి ఒకప్రత్యేకత ఉంది .ఈ గుహల వద్ద నిలబడితే చాలు ఎసి లో ఉన్నదానికంటే అతి చల్లదనం అంటే మైనస్ డిగ్రీల చల్లదనం అనుభవించవచ్చు ఈ గుహల ఎదురుగా నీటి కొలనూ ఉన్నది .కొలను నీటి చల్లదనమో గుహల చల్లదనమో ఎవ్వరూ చెప్పలేరత అనుభవించి ఆనందం పొందుతారు . బయట చిన్న జలపాతమూ ఆకర్షణీయమే .లోపల విశ్రాంతి తీసుకొనే చిన్న హాల్ కూడా ఉంటుంది .దీనికి అనుబంధంగా పెద్ద గణేశ విగ్రహం కూడా తప్పక చూడాల్సిందే ..
మీ -గబ్బిట దుర్గాప్రసాద్-5-3-21-ఉయ్యూరు