మాతృ భాషా సేవలో తరిస్తున్న ఐస్ లాండ్ దేశం(తెలుగు వెలుగు కు ప్రత్యేకం )

మాతృ భాషా సేవలో తరిస్తున్న ఐస్ లాండ్ దేశం(తెలుగు వెలుగు కు ప్రత్యేకం )

ఎక్కువకాలం చీకటిలో ఉంటూ .ఉద్యోగావకాశాలు తక్కువేఅయినా , అస్థిరమైన భూభాగం
ఉన్నా ,మహిళా మణులను గౌరవిస్తూ ,తమ భాషా సంస్కృతులసేవలో తరిస్తూ, నిరంతరం పరి
రక్షించు కొంటూ ,ఆర్ధికాభి వృద్ధి చెంది ,ప్రపంచానికే ఆదర్శ ప్రాయం గా నిలిచిన
దేశం ఐస్ లాండ్ .అక్కడి భాషా సాంస్కృతిక సేవలను తెలుసు కొనే ముందు ఆ దేశ
పరిస్థితి ని గమనిద్దాం .

అస్థిర అస్తవ్యస్త దేశం

ఐస్ లాండ్ దేశం అంటే మనలాగా నిశ్చింతగా ఉన్న దేశం కాదు .ప్రపంచం లో ఉన్న అగ్ని
పర్వతాలలో మూడవ వంతు ఇక్కడే ఉన్నాయి .ఉత్తర అట్లాంటిక్ ఆర్కిటిక్ సముద్రాల మధ్య
ఉన్న ప్రాంతం .ప్రతి అయిదేళ్లకోసారి ఏదో ఒక అగ్ని పర్వతం బద్దలై భీభత్సం
సృష్టిస్తుంది .దీన్నే అక్కడి వారు ‘’యాత్రిక విస్ఫోటనం (టూరిస్ట్ ఎరప్షన్)అని
సరదాగా అంటారు .అందువల్ల భూభాగం అస్థిరం గా ఉంటుంది .అయితే ఈ అస్థిరత వల్లనే
ఎనభై శాతం ఉష్ణాన్ని పొందుతారు .ఇదొక విపరీతం ..గడ్డకట్టిన మహా సముద్రం ఐస్
లాండ్ .దీన్ని మొదట గుర్తించిన బ్రిటిష్ నావికుడు దీనికి ‘’ధూలే’’అని
పేరుపెట్టాడు .. ఇక్కడి అనిశ్చిత వాతావరణా,న్ని చూసి ‘’నరకానికి ఘనీభవించిన
మార్గం’’ అంటారు.ఐస్ లాండ్ రాజధాని ‘’రెక్ జవిక్ ‘’.ఇక్కడిప్రజలను వైకింగులు
అంటారు .జనాభా సుమారు మూడు లక్షలు .దేశ విస్తీర్ణం 103చదరపు కిలో మీటర్లు .
.3,200అడుగుల మ౦ద౦ మంచు ఉన్న ప్రాంతం .పర్వతాలు ,హిమానీ నదులున్న ప్రాంతం
.హిమానీ నదులు లోతట్టు ప్రాంతాలనుండి సముద్రం వైపుకు ప్రవహిస్తాయి . యూరప్
మొత్తం మీద ఐస్ లాండ్ అతి పెద్ద’’ మంచు టోపీ’’(ఐస్ కాప్).మిగతా దేశాలలో ఉన్న
మంచుప్రాంతాలన్నీ కలిపినా దీనికంటే తక్కువే . ఉష్ణోగ్రత ఎప్పుడూ పది సెంటి
గ్రేడ్ డిగ్రీలకంటె తక్కువే .అంటే పద్నాలుగు డిగ్రీల ఫారెన్ హీట్ .విపరీతమైన
గాలి ,వర్షాలే ఈదేశానికి ‘’పెద్ద ప్లేగు వ్యాధి ‘’అని చమత్కరిస్తారు ..వర్షం
అన్ని వైపులా నుంచే కాదు ,సమాంతర వర్షం కూడా పడటం ఇక్కడి ప్రత్యేకత .ఆర్కిటిక్
వలయానికి అవతలి వైపు ,ఉన్నత అక్షా౦శ రేఖ మీద ఉండటం వలన ఎప్పుడూ చీకటి గా ఉండటం
మరో విశేషం .డిసెంబర్ జనవరి నెలల్లో రోజుకు 5గంటలు మాత్రమే సూర్యుడు
కనిపిస్తాడు .దీనివలన ‘’షార్ట్ డే డిప్రెషన్ ‘’వీరికి ఎక్కువ .శీతాకాలం
లో ‘’మిరుమిట్లు
గొలిపే భయంకర ఉత్తర కాంతులు ‘’(ఘో స్ట్లీ ఆరోరా బొరియాలిస్ )దర్శన మిస్తాయి
.ఆకాశం లో మెరుపుల్లా విద్యుత్ తరంగాలు భయ భ్రా౦తుల్ని చేస్తాయి.ఉష్ణోగ్రతలు
12సెంటి గ్రేడ్ నుంచి మైనస్ 15సెంటిగ్రేడ్ డిగ్రీలవరకూ మారుతూ ఉంటాయి
.ఆర్కిటిక్ వలయం పైన ఉండటం వలన ‘’అర్ధ రాత్రి సూర్యుడు ‘’కనిపిస్తాడు .సమాంతర
రేఖలో ఎప్పుడూ ఇక్కడ సూర్యుడు కుంకడు.ఇదొక వింత .పడమటి ఫిజార్డ్స్ లో పర్వతాలు
సూర్య కాంతిని అడ్డ గించటం వలన చాలా గ్రామాలు చీకట్లోనే శీతాకాలమంతా ఉంటాయి
.ఫిబ్రవరి మార్చి నెలలలో వచ్చే సూర్య దర్శనానికి పులకరించి ఈ ప్రజలు ‘’సన్ షైన్
కాఫీ ‘’త్రాగుతారు .జూన్ ,జులై నెలలో నిజమైన చీకటి రాత్రులు రావు .సూర్యుడు
అర్ధ రాత్రి వేళ దిక్చక్రానికి కిందుగా ఉండటం తో మసక గా ఉండి పగలు అయిపోయి
నట్లు భావిస్తారు .ఆగస్ట్ దాకా నక్షత్రాలుకూడా రావు .ఇక్కడ ‘’శాండీ గ్లేసియల్
డెసర్ట్’’’’పైమంచు ప్రదేశం ,లేక రాళ్ళ ఆకృతులు దిక్చక్రం దగ్గర
‘’ఏర్పడి ‘’తమాషా
ఎండమావి ‘’(ఫాటా మార్గానా ) లా ఉండటం మరో విశేషం .

అస్టిరత లోనూ ఆత్మ స్థైర్యం

ఐస్ లాండ్ ప్రజలు కస్ట జీవులు .వారానికి 46 నుండి 50గంటలు కష్టపడి పని
చేస్తేనే వారి కడుపు నిండు తుంది .ఉద్యోగ స్థాయి 4శాతం కంటే తక్కువ .ఇది
ప్రపంచం లోనే అతి తక్కువ శాతం .ఒకప్పుడు మద్య నిషేధం అమలు పరచారుకాని ఇప్పుడు
ఎత్తేశారు .ఇక్కడి చేపలు పట్టే వారి జీవితం చాలా దుర్భరం గా ఉంటుంది .సముద్రం
పై చేపల వేటకు వెళ్ళిన జాలర్లు సురక్షితం గా తిరిగి వస్తారనే నమ్మకం ఉండదు
.అందుకే భర్తలను కోల్పోయిన జాలరి భార్యలు ఎక్కువగా ఉంటారు .ఇరవై వ శతాబ్దం వరకు
చేపలవేట ఒక్కటే ముఖ్య వృత్తి .ప్రపంచం లో ఉండే తిమింగిలాలు అంటే ‘వేల్స్’’ లో
సగం అయిస్ లాండ్ లోనే ఉండటం విశేషం .వీరికి ఎగుమతులు పెద్దగా ఉండవు .అన్నీ ఇతర
దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే .అందుకే ధరలుఎప్పుడూ ఆకాశాన్ని అంటి
ఉంటాయి .’’ఊహకందని అరుపులు ,ఉంటాయి వృక్షాలు కాని రైళ్ళు కాని ఉండవు .భవన
నిర్మాణ కళ(ఆర్కి టెక్చర్ ) ఉండదు.పండ్లు ,పచ్చదనం ఆరోగ్యావసరాలకు చాలవు .సంపద
తక్కువ కనుక సంస్కృతీ తక్కువగానే ఉంటుంది .యాత్రికుల కు ఆకర్షణీయ అంశాలు చాలా
తక్కువే .సాహిత్యం పగ ప్రతీకారం కేంద్ర మై ఉంటుంది.అయినా ఐస్ లాండ్ ను ఎందుకు
ప్రేమిస్తానంటే ఇక్కడ జనాభా తక్కువ అవటం వల్ల’’అని ప్రముఖ ఆంగ్లో అమెరికన్ కవి
డబ్ల్యు .హెచ్ .ఆడెన్ ‘’లెటర్స్ ఫ్రం ఐస్ లాండ్ ‘’కవిత లో అంటాడు .దేశం ఎన్నో
శతాబ్దాలకాలం నార్వేజియన్ ల పాలన కింద ఉంది .తర్వాత డెన్మార్క్ అధీనం లోకి
వచ్చింది . 1944లో డెన్మార్క్ కబంధ హస్తాలనుండి విడివడి ఐస్ లాండ్
స్వాతంత్ర్యాన్ని పొంది, రిపబ్లిక్ దేశమైంది ..ఇవన్నీ ఈదేశ విపరీత పరిస్థితులే
.అయినా ప్రజలు ఏంతో బాధ్యతగా దేశ నిర్మాణం లో ,సంస్కృతీ ,భాషా పరిరక్షణ లో
నిబద్ధులై ప్రపంచానికి ఆదర్శ ప్రాయం గా ఉన్నారు .రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత
దేశం తీరే మారిపోయింది .అత్యంత సంపన్న దేశాలలో ఒకటిగా అభి వృద్ధి చెందింది
.ఐరోపా ఆర్ధిక వ్యవస్థలో భాగస్వామ్య దేశ మైంది .ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన
ఆర్ధిక సంక్షోభానికిగురై,రాజకీయ ఆస్థిరత్వమేర్పడి, మళ్ళీ క్రమంగా పుంజుకొని
యాత్రికాకర్షణ దేశంగా నిలబడింది .స్వేచ్చా వాణిజ్యం అమలు పరుస్తోంది .సాంఘిక
సంక్షేమం ,ఆరోగ్య సంరక్షణ అందరికీ విద్య అందిస్తూ ప్రగతి పధం లో నడుస్తోంది .
ఇప్పుడు ఆర్ధిక ,రాజకీయ ,సాంఘిక రంగాలలో సుస్థిరమైన దేశమైంది . పునరుజ్జీవన
ఇంధన శక్తి వాడకం లో అగ్రగామి దేశం ఐస్ లాండ్ . ’’రెన్యూడ్ హైడ్రో
ఎలెక్ట్రిక్ పవర్ (హెచ్ యి డి )ను విశేషంగా ఉపయోగిస్తారు .’’భూ ఉష్ణోగ్రత తో
వేడి పొందే బాహ్య ఈత కొలను’’ (జియో దేర్మల్ వార్మేడ్ ఓపెన్ ఎయిర్ స్విమ్మింగ్
పూల్) ఐస్ లాండ్ ప్రత్యేకతలలో ఒకటి .

సంస్కృతీ సేవలో ఐస్ లాండ్

ఐస్ లాండ్ దేశీయుల జాతీయ భాష ను ‘’ఐస్ లాండిక్ ‘’అంటారు .అందరు కలసి మెలసి
ఉండటం అనేది వీరి గొప్ప సంస్కృతి .చిన్న చిన్న కుటుంబాలే ఇక్కడ ఎక్కువ .కొన్ని
కుటుంబాలకు జియోగా ,స్కార్మ్,రిచిటర్ ‘’వంటి ఇంటి పేర్లు ఉంటాయి .తండ్రి పేరు
లోని మొదటి పదాన్ని ‘’టాగ్ ‘’గా ఉపయోగిస్తారు .ఉదాహరణకు ‘’బిజోర్క్ గు౦డు
మండ్స్ డాట్టర్’’అంటే బిజోర్క్ అనే ఆమె, గుండు మ౦డు కూతురు అని అర్ధం .అదే
కొడుకైతే చివర్ ‘’సన్’’ఉంటుంది .వీరి సంస్కృతి ‘’మా ప్రజ మీ ప్రజ ‘’ .అంటే
కలిసి మెలసి ఉండటం .వీరిది అహింసా సమాజ సిద్ధాంతం.97శాతం ప్రజలు దేవుని
నమ్ముతారు .చాలా కొద్ది మందిమాత్రమే అలవాటుగా చర్చి కి వెడతారు .
‘’సుమో ఆట ‘’లాగా
వీళ్ళకి ‘’గ్లిమో ‘’ఆట బాగా ఇష్టం.వీరి జాతీయ చిహ్నం ‘’పర్వత మహిళ’’.దీనిని
బట్టి స్త్రీలంటే వీరికి యెంత గౌరవమో తెలుస్తోంది .ప్రపంచం లోనే మొట్ట మొదటి
సారిగా మహిళా వోటు హక్కు అమలు చేసిన దేశం ఐస్ లాండ్ .1922లో జరిగిన ఎన్నికలలో
మహిళకే ఎక్కువ స్థానాలు లభించాయి .

మాతృభాషా సేవలో ఐస్ లాండ్

ప్రపంచం లోనే మొదటి ‘’బ్రాస్క్యు ‘’నిఘంటువు ను ఐస్ లాండ్ దేశపు వాయవ్య భాగం
లో మారు మూల ఉన్న ఒక రైతు తయారు చేశాడు బాస్క్యు నావికులు చేపల వేటకు దగ్గరలో
ఉన్న తీరానికి వచ్చినప్పడు ,ఈయన వారి నుండి భాష నేర్చుకొన్నాడు .ప్రపంచం లో ఏ
దేశానికంటే తలసరి పుస్తక రచన ,ప్రచురణ ,అమ్మకం ఐస్ లాండ్ లో చాలా ఎక్కువ .ప్రతి
ఏడాది కనీసం 500 కొత్త పుస్తకాలు ప్రచురిస్తారు .ఇది అమెరికాలో రోజుకు
విడుదలయ్యే 1200 పుస్తకాలకు సమానం .ఐస్ ల్యాండ్ దేశపు దేశ భక్త కవి ‘స్నార్రి
హిజార్ట సన్ ‘’.’’భూమి ,జాతి ,భాష (లాండ్ ,నేషన్ ,లాంగ్వేజ్)అనేవి
మాత్రమేనిజమైన మూర్తి త్రయం ‘’(ట్రినిటి )అని ఆయన రాశాడు. అందుకే వారి ‘’జాతీయ
కవిగా’’ గౌరవింప బడుతున్నాడు .ఐస్ లాండ్ ప్రజలు కవిని ‘’స్కాల్డ్ ‘’అంటారు
.కవికి అందరికంటే ఉన్నతమైన ఉత్క్రుస్టమైన స్థానాన్నిస్తారు .వీరాభిమానం
ప్రదర్శిస్తారు .సమాజం లో కవికి చాలా గౌరవం ఇస్తారు .దీనికి కారణం కవి సంఘం లో
నీతిని వ్యాపి౦ప జేస్తాడన్న నమ్మకమే .ఐస్ లాండ్ స్వాతంత్ర్య సమరం లో కవులు గణ
నీయమైన పాత్ర పోషించారు .కవిత్వ ప్రతిభను ఉదాత్త వ్యక్తిత్వం గా పరిగణిస్తారు .

ఐస్ లాండ్ ప్రజలు తమ భాషను చాలా పవిత్రం గా, స్వచ్చం గాఉండేట్లు
కాపాడు కొంటారు .పర భాషా ప్రభావం తమ భాష మీద పడ కుండా ఏంతో జాగ్రత్త
తీసుకొంటారు. భాష పలచ బడకుండా కాపాడుకొంటారు .ప్రపంచ మంతా వాడే . అంతర్జాతీయ
అరువు పదాలైన కంప్యూటర్ , రేడియో ,టెలివిజన్ ,టెలిఫోన్ లను అస్సలు వాడరు .వారి
భాషలో వీటికి తగిన ,అర్ధవంతమైన పద సృష్టి చేసుకొన్నారు . ఈ పద సృష్టి కోసం
విద్యా సభలను (ఎకడమిక్ కమిటీ )లను ఏర్పాటు చేస్తారు .కంప్యూటర్ ను
‘’టోల్వా ‘’అంటారు
.టోలా అంటేవీళ్ళ భాష లో సంఖ్యఅని అర్ధం .’’వోల్వా’’అంటే ఊహించి చెప్పటం
(ప్రాఫెటైజ్ )అంటే సంఖ్యా దర్శిని అని అర్ధం .టెలిఫోన్ ను ‘’సిమి ‘’అని
పిలుస్తారు .సిమి అంటే దారం .తీగ ద్వారా వార్తలు పంపటం అనే అర్దం.హెలికాప్టర్
ను ‘’పిర్లా ‘’అంటారు .అంటే ‘’విర్లర్ ‘’తిరిగేది అని అర్ధం హెలికాప్టర్
ఎగరాలంటే పైన ఉన్న రెక్కలు తిరగాలిగా .దానికి సూచన .జెట్ ఎయిర్ క్రాఫ్ట్ ను’’
పోటా లేక జూమర్ ‘’అంటారు .శాస్త్ర సాంకేతిక పదాలపై లాటిన్ భాషా ప్రభావం పడకుండా
చూసుకొంటారు .సాధారణ ప్రజానీకానికి’’ పద నిర్మాణం’’(వర్డ్ బిల్డింగ్ ) ఒక సరదా
.వీటిపై తరచుగా చర్చలు జరుపుతారు .వీటిలో నూతన శబ్ద ప్రయోగాలు చాలా హాస్య
స్పోరకం గా ఉంటాయి .’’పెజేర్స్ ‘’అనే పదానికి ‘ఫ్రియోప్ జో ఫర్ ‘’అనే సమానమైన
పదం సృష్టించుకున్నారు .దీని అర్ధం ‘’శాంతి దొంగ ‘’అని .ఇవి మన జేబుల్లో ఉండి
రోద చేస్తాయికదా అందుకని . .

’’ఐస్ లాండిక్ భాష ప్రపంచం లో ఏ జాతి భాష కన్నా ఉత్తమమైనది ‘’ అన్నాడు వాళ్ళ
మహాకవి ‘’ఐనార్ బెనడిక్స్సన్’’.ఇదే ఐస్లాండ్ ప్రజలకు వేద మంత్రం అయింది .ఈ
ప్రజలకు మాతృ భాష భావ వినియోగానికి మాత్రమే కాదు, సంస్కృతీ సారం .అది వారి
జాతీయ అస్తిత్వ .సూచకం,జాతి గర్వం ,మనుగడ . వారి హృదయపు లోతుల్లో’’ ఐస్
లాండిక్ భాష ఏ ఇతర జాతీయ భాష కంటే నాణ్యమైన భాష ‘’అని త్రికరణ శుద్ధిగా నమ్మకం
ఉంటుంది .సాధారణం గా వీరి భాష ఉత్తర జర్మన్ కుటుంబ భాష కు దగ్గర గా ఉంటుంది
.నార్వేజియన్ ఫారోస్ భాషలకు సన్నిహితం గా ఉంటుంది . . లాటిన్ భాష లాగా మార్పు
చెందకుండా పూర్వపు రూపం లోనే ఉండటం .సాహిత్యాన్ని పరిరక్షించుకోవటం
,ప్రాచీన ‘’నార్సే
సంస్కృతి ‘’ని భద్రంగా రక్షించుకోవటం వలన ఐస్ లాండిక్ భాష ను ‘’ఉత్తర లాటిన్
భాష ‘’అంటారు .ఐస్ లాండ్ వారి ‘’స్వర్ణ యుగం ‘’క్రీ. శ .1100నుండి ప్రారంభమైంది
.మొదటి నుంచి ఈజాతి కవిజాతియే .9,11శతాబ్దాల కాలం లో 100 మంది ఐస్ లాండ్ కవులు
యూరప్ దేశాలలో ఉన్నారు .10వ శతాబ్దపు చివరలో ఉన్న స్కాండినేవియా రాజాస్థాన
కవి పేరు ’’ ఐస్ లాండర్ ‘’అన్నవిషయం నూటికి నూరు శాతం యదార్ధం .

అంతర్గత అంత్య ప్రాస (యమకం),అనుప్రాస నియమాలను ఖచ్చితంగా పాటిస్తారు
.వీరికి పౌరాణిక ,వీరోచిత గాధలంటే గౌరవం ఎక్కువ . దీనినే ‘’వైకింగ్
మైండ్ ‘’అంటారు
. ‘’పశువులు చనిపోతాయి ,బంధువులు చనిపోతారు ,చివరికి మనమూ చనిపోతాం ‘’అనే
సామెతనువీళ్ళు తరచుగా వాడతారు .మరొకటి ‘’స్నేహితుడికి స్నేహ హస్తం చాచాలి
.కానుకకు కానుక అందించాలి .నవ్వుకు నవ్వూ ఇవ్వాలి ‘’.ఐస్ లాండ్ దేశం లో1807లో
జన్మించిన ‘’జోనస్ హాల్ గ్రిమ్సన్ ‘’ కవి ప్రజా హృదయాలను దోచుకున్నకవి .జాతికి
ప్రియ పుత్రుడు .అభిమానం తో ప్రజలు ఆయన శిలా విగ్రహం నిర్మించి స్మరిస్తున్నారు
.ఇలా మొట్ట మొదటి గౌరవం దక్కించుకొన్న కవి ఈయనే .ఈయనను ఆంగ్ల కవి విలియం
వర్డ్స్ వర్త్ లాగా ‘కవితా తీవ్ర వాది ‘’ ‘’గా భావిస్తారు .ప్రజల భాషలో కవిత్వం
రాశాడు .వృక్ష శాస్త్ర వేత్త కూడా .నేచురల్ హిస్టరీ గ్రంధం రాశాడు .

1864-1940 లో జీవించిన మరోకవి’’ ఐనార్ బెనేడిట్సన్ ‘’కలకాలం గుర్తుంచుకోదగిన
,ప్రజల నాలుకలపై నర్తించే అద్భుత కవిత్వం రాశాడు .ఈయన నగర,లోక కవి(కాస్మా
పాలిటిక్ ) .ఐస్ లాండ్ కే ప్రత్యేక మైన’’ ఉత్తర కాంతిని ,గల్ ఫాస్ ను
జలపాతాలను’’
సహజ సుందరంగా వర్ణించాడు .

ఈ దేశకవి ‘’హోల్డార్ కిల్జాన్ లాక్స్ నెస్1955లో ‘’సాహిత్యం లో నోబెల్
బహుమతి కూడా పొంది ,దేశ గౌరవాన్ని ఇనుమడింప జేశాడు . .దేశపు గ్రామీణ
జీవితానికి కవిత్వం లో అద్దం పట్టాడు .’’బెల్ ఆఫ్ ఐస్ లాండ్ ‘’నవల రాసి ,అందులో
18వశతాబ్ది విశేషాలన్నీ వివరించాడు .ఆ దేశ స్వాతంత్ర్య పోరాట చరిత్ర అందులో
సవివరంగా వర్ణించాడు .రెండవ ప్రపంచ యుద్ధానంతరం ‘’ఆటం స్టేషన్ ‘’అనే రచన
చేశాడు .ఆయన రాసిన కవితాపంక్తి ‘’దెబ్బ తిన్న బానిస మహా గొప్పవాడు –అతని హృదయం
లో స్వేచ్చ ఉంది ‘’ ఆ దేశస్తులకు స్పూర్తి నిస్తుంది .’’వరల్డ్ లైట్ ‘అనే
త్రిపుటి రచన లో సమాజం లో తన పాత్రను గురించి రాశాడు .ఎన్నో వర్ణ క్రమాలను
(స్పెల్లింగ్)మార్చేసి రాశాడు .వీధి భాష(స్ట్రీట్ లాంగ్వేజ్ ) రాశాడు
.ఆర్ధికాది రంగాలలోనే కాక సాహిత్య౦ లోను ఐస్ లాండ్ అగ్రగామిగా
ఉండి,ప్రపంచానికి ఆదర్శ ప్రాయమైంది . మాట్లాడే జనం లేక భాషలు అంతరించి
పోతున్నాయనే దాన్ని సవాలుగా తీసుకొని ,మాతృ భాషను కాపాడుకొంటూ,సేవచేస్తూ ,బాష
ఆంగ్లపదాలతో కలుషితం కాకుండా అర్ధ వంతమైన పదాలను ఎప్పటికప్పుడు సృస్టిం చుకొంటూ
,స్త్రీ కి ఉన్నత గౌరవాన్ని కలిగిస్తూ ,సంస్కృతీ పరిరక్షణలో అందరికీ ఆదర్శంగా
నిలిచింది ఐస్ లాండ్ దేశం .

గబ్బిట దుర్గా ప్రసాద్ -27-10-15-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.