కణాద సిద్ధాంతం
‘’Science sorts up ,while philosophy sums up ‘’ అంటే విజ్ఞాన శాస్త్రం విభజిస్తే ,తత్వ శాస్త్రం సంకలనం చేస్తుంది .వైశేషిక సిద్ధాంతం ఊహా మాత్రమె కాకుండా ఎక్కువ శాస్త్రీయంగా ,సంకలనం గా కాకుండా విమర్శనా రూపం గా ఉంటూ ,ముఖ్యంగా భౌతిక ,అభౌతిక విజ్ఞానం గా వెలుగొందింది .దీన్ని అగ్రశ్రేణి విధానంగా చేసిన వాడు కణాద మహర్షి .మొదట కాశ్యపుడు అనే పేరుతొ ప్రసిద్ధుడై ,ఉలూక మహర్షి కుమారుడు అవటం చేత ఔలుక్యుడు అని పిలువబడ్డాడు .’’సప్త వింశతి మే ప్రాప్తే ,పరివర్తే ,క్రమాగతే –జాతు కర్ణ్యో యదా వ్యాసో ,భవిష్యతి తపొధనః .తదాహం సంభావిష్యామి సోమశర్మా ద్విజోత్తమః-ప్రభాస తీర్ధ మా సాద్య,యోగాత్మా లోక విశ్రుతః-తత్రాపి మమ తే పుత్రా భవిష్యంతి తపోధనాః-అక్షపాదః కణాదశ్చ ఉలూకో వత్స ఏవచ ‘’జాతుకర్న్య వ్యాసుని కాలం లో ,ప్రభాస తీర్ధం లో అపర శివావతారం అని పేరుపొందిన తపోధనుడైన సోమశర్మ అనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు .అతడికి అక్షపాద,ఉలూక ,కణాదులు అనే ముగ్గురు కొడుకులు అని వాయు పురాణం చెప్పింది .దీనిని బట్టి కణాదుడున్యాయ దర్శన కర్త గౌతముని సహాధ్యాయుడుగా గుజరాత్ లోని ప్రభాస తీర్ధం లో సోమ శర్మ అనే గురువు వద్ద అన్ని విద్యలు నేర్చాడు .దీన్ని ఇ.వి.కౌవెల్ పండితుడు కూడా తన ‘’సర్వ దర్శన సంగ్రహాను వాదం ‘’లో సమర్ధించాడు .ఉలూక మహర్షి కొడుకు అవటం వలన కణాదుడు వైశేషికులను ‘’ఔలూక్యులు ‘’అంటారని హేమచంద్రుని అభిదాన చింతామణి లో చెప్పినట్లు కౌవెల్ రాశాడు .
విద్యాభ్యాసం తర్వాత అంతర్ముఖుడై మహర్షి యై ,అవదూతయై బాహ్యాభ్యన్తరాలు మరిచి పక్షిలాగా తిరుగుతూ ,భిక్షకూడా తీసుకోకుండా ,వీధులలో తిరుగుతూ రోడ్డుపై పడిన ధాన్యపు గింజలను ఏరుకొని తినేవాడు .అందుకే కణాదుడు అనే పేరొచ్చింది .కణ భుక్ ,కణభక్షక ,కణభుజ అనీ పిలిచేవారు .ఇదికల్పితనామమని ,మారుపేరు అనీ ,మాక్డోనాల్డ్ అన్నాడు .కశ్యప వంశజుడు కనుక కాశ్యపుడు .ఉలూకుని కొడుకు కనుక ఔలూక్యుడు ,తృణ ధాన్య భోక్తకనుక కణాదుడు. కణాద అనే పేరుతోనే బాగా ప్రసిద్దుదయాడు లోకం లో .కణాదుడు అంటే గణాలను భుజించే వాడు కనుక ఇతర సిద్దాన్తాలకంటే సృష్టికి కారణమైన విశిష్టమైన పరమాణువులను ప్రతిపాదించాడు కనుక గణాలన్నా ,పరమాణువులన్నా పర్యాయ పదాలే కనుక , గణ సిద్ధాంతం చెప్పాడు కనుక గణాదుడు అనటం సముచితం .వ్యాస ,అక్షపాద పదాలు కూడా ఇలా ఏర్పడినవే .
కణాద మహర్షి తపో వృత్తిలో ఉంటూనే ,తన తీవ్ర సాధనచే లభించిన జ్ఞాన సంపదను ,మరుగు పడనీయకుండా ,శ్రోత్రియత్వం బ్రహ్మ నిష్టత్వం ఉండటం చేత ‘’సమ్యక్ ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ ‘’అనే శంకర మిశ్రుడు చెప్పిన వైశేషిక సూత్రం ప్రకారం ఉత్తమ ప్రశాంత చిత్తులు ,శమాన్వితులు,క్రమ వేదాధ్యయన శీలురు అయిన శిష్యుల తరుణోపాయం కోసం ‘’పరమ కారుణికః మునిహ్’’అని వృత్తి కారులు చెప్పినట్లు సంపూర్ణ దయతో ‘’కాణాదేనతు యత్ప్రోక్తం శాస్త్రం వైశేషికం మహత్ ‘’అనే పద్మ పురాణ వాక్యం ప్రకారం కణాద యోగికుల సార్వ భౌముడు మహా శాస్త్రమై ,దశాధ్యాయీ తంత్రం అనే ఈ ‘’వైశేషిక దర్శన౦’’ను సూత్ర రూపంగా బోధించాడు .
వైశేషిక సూత్ర రచనాకాలం ఎప్పుడు ?
‘’Dates are the weak points in the Literary History of India ‘’అంటే ,భారతీయ సాహిత్య చరిత్రలో కాలనిర్ణయమే లోపం అని మాక్స్ ముల్లర్ పండితుని అభిప్రాయం.కనుక కాల నిర్ణయానికి అలవాటు పడిన విద్యార్దులకు ఇక్కడ కాలనిర్ణయం క్లిష్టం అని పిఆచి ఆశాభంగం కలిగిస్తుంది అనీ అన్నాడు ముల్లర్ ..’’అంతకు ముందు చాలాకాలం ,ప్రత్యేకమైన కాలం లో మరుగు పడిన వైశేషిక సిద్ధాంతపరిణామం ,సాహిత్యం యొక్క పర్యవసానం ను మాత్రమె సిద్ధాంతానికి ఆధారమైన మూలసూత్రాలను తెలియజేస్తుంది ‘’అంటాడు మాక్డో నాల్డ్.అంటే దర్శనాల సిద్ధాంత సూత్ర రచన అతి ప్రాచీన కాలం లోనే జరిగింది .కారణం అవి ఒక వ్యక్తికీ ఒక కాలానికి మాత్రమె చెందకుండా ,విస్తృతంగా అనేక తరాలకు సంబంధించి తత్వ వేత్తల పరంపరవరకు సిద్ధాంత పరిణామం ప్రసరించి ఉంటుంది .ఒక వేళ సూత్ర కాలాన్ని మనం నిర్ణ యించ గలిగినా ,సిద్ధాంతాలు ఎప్పుడు పుట్టాయో తెలుసుకోవటం దుర్లభమే .సిద్దా౦తకాల నిర్ణయం అసంభవం కనుక సూత్రకాల నిర్ణయం చేసి సంతృప్తి పడాలి అని అనుభవజ్ఞు లన్నారు .
సూత్రకాల నిర్ణయం కూడా అంత తేలిక కాదు .’’మూల గ్రందాల కాలం నిర్ణయించటం కష్టం నామమాత్రంగా శిష్టులైన కర్త లను గుర్తించటం కూడా కష్టమే .అంతమాత్రం చేత పండితులు మౌనంగా ఉండకుండా కొంత శ్రమ కాల నిర్ణయం చేశారు .నిరాధారంగా కొంత ఉండటం వలన దోషాలుగా అనిపిస్తాయి .వైశేషికం –జైన బౌద్ధులకు ముందే క్రీ .పూ.2వ శతాబ్దిలో వ్యాపించి ఉండచ్చు అని మాక్డోనాల్డ్ అభిప్రాయపడ్డాడు .కాని వైశేషిక సూత్రాలు మాత్రం అంత ప్రాచీనం కాదు అన్నాడు .అశ్వ ఘోషుడు దీన్ని ఖండించాడు కనుక వైశేషిక ప్రాబల్యం క్రీ.పూ .రెండవ శతాబ్దికి చెందింది అని తీర్మానించాడు .ఈ సూత్రాలు బుద్ధుడికాలానికితర్వాత ఎక్కువ దూరం లో లేవని శ్రీనివాస అయ్యంగార్ ఉవాచ. జాకోబి ప్రకారం న్యాయ, వేదాంతాలు క్రీశ .200-400 కాలం నాటివి అన్నాడు .జైమినీయ ,కాణాదాలు వీటికంటే కొంచెం ముందువి .తర్క సంగ్రహం ను అనువాదం చేసిన Bodas తన ఉపోద్ఘాతం లో వైశేషిక సూత్రన్యాయ భాష్య కర్త వాత్సాయనుడి కాలం తో చూస్తూ ,క్రీపూ 400కు పూర్వం కానీ క్రీశ 500కానీ అయి ఉండవచ్చు అన్నాడు .క్రీపూ 6వ శతాబ్దికికి చెందిన బుద్ధ ,మహా వీరులకాలం లో వైశేషికం వ్యాపించి ఉంది అని రాదా కృష్ణ పండితుడు గట్టిగా చెప్పాడు .
వైశేషికం పూర్వ మీమాంస నుంచి పుట్టింది .ఇటీవలి జైన గ్రంథం ‘’ఆవశ్యక ‘లో క్రీ.శ 18లో రాహగుత్త అనే జైన గురువు వైశేషికం రాశాడని ఉందట .’’వైశేషికం జైన శాఖ కాదు ‘’అని నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చాడు రాధా కృష్ణ పండితుడు .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-5-21-ఉయ్యూరు