సాంఖ్య సిద్ధాంతం –కపిల మహర్షి
‘’యావత్ ప్రపంచం లో భారతీయ తత్వ శాస్త్రం తో పోల్చదగినది ఇంకొకటి లేదు’’అన్నాడు యువి సోవాని అనే విమర్శక నిపుణుడు . వైజ్ఞానిక అంతరిక్షం లో మన తత్వ శాస్త్రం తేజో విరాజమానమైన సూర్యుడుగా ప్రసిద్ధమైనది సాంఖ్య సిద్ధాంతం .’’సాంఖ్యం భారతీయ తత్వ శాస్త్రాలలో అతి ప్రాచీనం ‘’అన్నారు డా.ఎస్ఎస్ సూర్యనారాయణ శాస్త్రి . వెబర్ పండితుడుకూడా ‘’సాంఖ్యం అతి పురాతనమైనది’’అని నిర్ధారించాడు .స్వామి వివేకానంద ‘’సాంఖ్యా పేక్ష లేకుండా ,ప్రపంచాన్ని సరైన రీతిలో అర్ధం చేసుకోవటం కుదరదు .దీన్ని లౌకిక అలౌకికంగా తెలుసుకోవచ్చు కనుక అనేక దర్శనాలద్వారా సాంఖ్యానికి ప్రాధాన్యత పెరిగింది .వివిధ దర్శనాలకు సాంఖ్య తత్త్వం ఒక్కటి మాత్రమె సామాన్యంగా ఉన్నది .కనుక యావత్ప్రపంచం సాంఖ్య౦ను అంతగా గౌరవిస్తోంది .ఇదే అన్ని దేశాల దర్శనాలకు ముఖ్య ఆధారం .ప్రపంచం లో ఎప్పుడు ఎక్కడ తత్వ శాస్త్ర విచారణ జరిగినా అందులో కొంతవరకైనా కపిలమహర్షి సంఖ్య సిద్ధాంతం తప్పక ఉంటుంది ‘’అన్నాడు .
ఇంకాస్త ముందుకు వెళ్లి మాక్స్ ముల్లర్ ‘’పైధాగరస్ భారత దేశానికి వచ్చి సాంఖ్యం నేర్చి ,తన గ్రీసు దేశం లో బోధించాడు .తర్వాత ప్లేటో కూడా దీన్నే సూచించాడు .ఆతర్వాత నాస్టిక్ శాఖీయులు సాంఖ్యాన్నిఅలెగ్జాండ్రియా కు తీసుకు వెళ్ళారు .అక్కడి నుంచి యూరప్ చేరింది .కనుక ప్రపంచం లో ఎక్కడ ఏ తత్వ శాస్త్ర ,ఆధ్యాత్మిక కృషి ఉన్నా ,దానికి పరమపిత ‘’కపిలా చార్యుడే ‘’.కనుక ప్రాచీన హిందూ తత్వ శాస్త్రం లో ప్రధాన సిద్ధాంతాలైన వేదాంత ,సాంఖ్యాల పరిచయం లేని వాడు తత్వవేత్త కాదు అని పించుకొనే కాలం వచ్చేసింది’’అన్నాడు అనుమానం లేకుండా .
సాంఖ్య కర్త కపిల ముని
‘’సర్వ ప్రపంచ తత్వ శాస్త్రాలకు పునాది అయిన సాంఖ్య శాస్త్ర కర్త ఎవరు ఆయన జీవిత విశేషాలేమిటో తెలుసుకొందాం .అనేక దేశాలలో ఆయా దేశాల తత్వ శాస్త్ర ఆచార్యుల ,వ్యాప్తి చేసిన వారి జీవిత చారిత్రలు స్పష్టంగా ఉన్నాయి .కానీ భారత దేశం లో ఆవివరాలు తెలుసుకోవటం చాలాకష్టం .ధేల్స్ ఎవరో, ప్లేట్ ఎవరో ఎప్పుడు ఎక్కడ పుట్టారో ,ఏం చేశారో మనకు భావించటానికి అవకాశమున్నది .కానీ కపిల గౌతమ కణాద,బాదరాయణ జైమినుల గురించి మనకు తెలిసింది శూన్యం ‘’అని వాపోయాడు మాక్స్ ముల్లర్ పండితుడు .’’సాంఖ్య దర్శన తత్వాభి వృద్ధి చారిత్రం ,అభేద్యం అయిన అంధకారం లో మునిగిపోయి,మరుగున పడింది ‘’అని భారతీయ తత్వ శాస్త్ర పరిణామ చరిత్ర రాసిన పిటిశ్రీనివాస అయ్యంగార్ కూడా అభిప్రాయ పడ్డారు .
అయినా ‘’సా౦ఖ్యస్య వక్తా కపిలః పరమ ఋషిహి,పురాతనః –హిరణ్య గర్భో యోగస్య వక్తా నాన్యః పురాతనః ‘’అనేభారతం లో శాంతిపర్వం లోని మోక్ష ధర్మ ప్రకరణం లో ఉన్నదాన్ని బట్టి ,సాంఖ్యకారుడు పరమ రుషి వరేణ్యుడు,అతిప్రాచీనుడు హిరణ్య గర్భుడు అయిన కపిలాచార్యుడే అని పూర్తిగా రూఢి అవుతోంది .వేదాంత సూత్రకర్త వ్యాసుడు స్మృత్యదికరణ లో కాపిల సా౦ఖ్యాన్నిచర్చించాడు .పద్మపురాణం కూడా కపిలుడే సాంఖ్య కర్త అన్నది .వైశేషిక సాంఖ్య దర్శనా చార్యుల సూత సంహిత లో ‘’కాణాద,కపిలాద్యైస్తు,మునీ౦న్ద్రై రపి కీర్తితం –మంద బుధ్యను సారేణ కేవలం పరి కీర్తితం ‘’అని ఉండటం విష్ణు సహస్రనామం లో మహర్షి కపిలా చార్యః ‘’అని ఉండటం చేత శంకరాచార్యులు కూడా భాష్యం రాస్తూ ‘’మహర్షి కపిలాచార్య అన్నది ఏకనామం అనీ సాంఖ్య శుద్ధాత్మతత్వ విజ్ఞానాచార్యుడు కపిల ముని అని స్పష్టంగా చెప్పారు .ఆది విద్వాంసుడు మహర్షి చంద్రుడు అయిన కపిలమహర్షి కరుణ తో నిర్మాణ చిత్తాన్ని అధిష్టించి ‘’అసురి ‘’అనే శిష్యుడికి తంత్రాన్ని బోధించాడు అన్నారు శంకరులు .దీనికి వ్యాఖ్యానం రాసిన వాచస్పతి మిశ్రా ‘’పంచమావతారమైన కపిలుడు అసురి కి మొదట సాంఖ్యం బోధించాడనీ ,భారతాది ఇతిహాస పురాణాలలో కూడా సాంఖ్య దర్శనా చార్యుడు కపిల మహర్షి యే అని ధృవీకరించాయి’’అన్నాడు .
జేమ్స్ జీన్స్ పండితుడు ‘’భౌతిక విజ్ఞానం యదార్ధాన్ని గ్రహింప జాలనిది అవటం వలన మనం ఇంకా పరమార్ధ స్పర్శకు దూరం గానే ఉన్నాం’’అనగా ,’’.ప్రస్తుత భౌతిక జ్ఞాన విశ్వం అగమ్య గోచరం .ప్రకృతి పరిణామ వాదం ఎక్కువైంది .అన్ని చోట్లా అసందర్భాలు ,పరస్పర వ్యతిరేకతలు ఉండటం చేత ఈ విజ్ఞానం సంతృప్తికరం కాదు ‘’అన్నాడు సల్లినాన్ పండితుడు.మరింత ముందుకు వెళ్లి లింకన్ బార్నెట్ ‘’ప్రకృతి రహస్యాల తెరలు తొలగించిన కొద్దీ , సంక్షోభం నుంచీ క్రమత్వం ఏర్పడి ,నానాత్వం నుంచి ఏకత్వం కలిగి ,భావాలన్నీ లయించి మూల సూత్రాలు అధిక తరంగా సులభ మౌతాయి ‘’అన్నాడు .
ఇంతటి ముఖ్య దర్శనాచార్యుడైన కపిలుడి పుట్టుపూర్వోత్తరాలు తెలియటం లేదని డా.ఎస్ ఎస్ సూర్యనారాయణ శాస్త్రి బాధపడ్డారు .సాంఖ్య ఉపనిషత్ గా ప్రసిద్ధి చెందిన ‘’శ్వేతాశ్వతర ఉపనిషత్ ‘’మొదటగా కపిలుని నామం స్మరించినది .సర్వ సృష్టికి కారణమైన బ్రహ్మ సృష్టిలో మొదట పుట్టిన తనకుమారుడైన కపిలునికి సర్వ విజ్ఞానాలు ప్రసాదించాడు అని ఉన్నది .కనుక కపిలుడు బ్రహ్మ మానస పుత్రుడు ,సర్వజ్ఞుడు.గౌడ పాదుడుకూడా కపిలముని ని బ్రహ్మమానస పుత్రునిగానే చెప్పాడు .సాంఖ్య కారికా భాష్యం లో గౌడపాదుడు ‘’ధర్మజ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాలు సృష్టి మొదట్లో భగవంతుడైన కపిలాచార్యునికి సహజంగా అలవడినాయి ‘’అని కీర్తించాడు .కపిలుని తర్వాత ఉద్భవించిన సనక, సనందన,సనాతన ,సనత్కుమారులు షోడశ వర్ష శరీర దారులనీ ,వారితో పుట్టిన భావాలు ప్రకృతికాలు అని గౌడపాదుడు చెప్పాడు .శ్వేతాశ్వరోపనిషత్ లో ‘’నిత్యాలకు నిత్యుడు ,చేతనాలకు చేతనుడు ,అనేకులలో ఏకుడు,సర్వకామ ప్రదాత అయినవాడు ఆత్మ.’’సాంఖ్య యోగం తో దీన్ని గ్రహించి ,ఆ దేవతను ఎవడు తెలుసుకొంటాడో వాడు అన్ని బంధాలనుంచి విముక్తు డౌతాడు ‘’అని కపిల ప్రోక్త సాంఖ్యం చెబుతోంది .కనుక’’ శ్వేతాశ్వతర ఉపనిషత్ కాలానికే సాంఖ్యం బాగా ప్రాచుర్యం పొందింది’’అన్నాడు డా.ఇ.రోయర్.కపిలముని పై మరి కొన్ని విషయాలు మరోసారి తెలుసుకొందాం .
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -10-5-21-ఉయ్యూరు