సాంఖ్య సిద్ధాంతము –కపిలుడు -2
‘’ప్రపంచ చరిత్రలో మొట్టమొదట మనస్సు యొక్కస్వాతంత్ర్యం ,దాని శక్తి సామర్ధ్యాలపై పూర్తి విశ్వాసాన్ని ప్రకటించింది సాంఖ్యమే’’అన్నాడు రిచార్డ్ గార్బ్.’’ప్రపంచం లో ఇదివరకు ఎన్నడూ లేని ఔక్తిక విధానం అంటే రేషనల్ సిస్టం సాంఖ్యం మాత్రమె ప్రవేశపెట్టింది ‘’అన్నాడు వివేకానందుడు .’’కపిల సిద్ధాంతానికి చారిత్రిక ప్రాధాన్యం ఉంది .మానవ మనో చరిత్ర లో ఇది అత్య౦త అద్భుత విషయం .కారణం –ఆలోచించే ప్రతి మనసులో ప్రపంచ సృష్టి ,మానవ ప్రకృతి సంబంధాలు ,వాటి భవిష్యత్ నిర్ణయాలు మొదలైన వాటిపై వచ్చే అగోచరమైన సమస్యలకు యుక్తి యుక్తం గా సంతృప్తి కలిగే సమాధానం చెప్పింది సాంఖ్యం ఒక్కటే ‘’అన్నాడు సాంఖ్య కారిక లో డా.జాన్ డేవిస్.’’సాంఖ్యం పరిపక్వమైన ,మనోధర్మమైన తత్వ శాస్త్రం .ఎందుకంటె భగవ౦తుని ఆస్తికత ను, యుక్తిమూలం గా నిరూపించటం సాధ్యం కాదని తెలిసి కూడా దాని విషయం లో మౌనం చూపింది అనే సత్యాన్ని బట్టి దర్శనాలు సాంప్రదాయక మతాల నుండియెంత స్వతంత్రంగా వ్యక్తమయ్యాయో తెలుస్తోంది .శుద్ధ తత్వ శాస్త్రం లో సాంఖ్యం ఒక ప్రఖ్యాతమైన ప్రయత్నం అని ‘’శ్రీనివాస అయ్య౦గార్ ,రాధాకృష్ణన్ అభిప్రాయ పడ్డారు .జాన్ డేవిస్ కూడా ‘’కపిలుని సా౦ఖ్యదర్శనం శుద్ధ తత్వ విషయం లో భారత దేశం వెలువరించిన విషయ సమగ్రత పొందింది ‘’అన్నాడు .మహాభారతం కూడా సాంఖ్యం లాంటి జ్ఞానం లేనే లేదు అన్నది .’’ప్రకృతి తత్వ శాస్త్రాలు వ్యత్యస్తాలై ,ఏకత్వ సాధనకు అసాధ్యంగా ఉన్నా ,ప్రకృతి శాస్త్ర ఫలితాలకు అన్వయిస్తూ తాత్విక విధానం ఉండాలి ‘’అన్నాడు రాధా కృష్ణ పండితుడు .’’ మానవ నిత్యానుభూతి ,యుక్తియుక్తంగా విచారణ చేయటం సాంఖ్యం నిరూపించింది .ఈమార్గం లో ప్రతివాడూ తన అనుభవం తో ప్రారంభించి ,తర్వాత తనకు అందని సర్వాన్నీ బహిర్గతం చేస్తాడు .అనుభవం ఎందుకు అవసరమో ,అనుభూతి సాధించటం ఎలాగో ,సాంఖ్యం విస్పష్టంగా వివరించింది ‘’అంటాడు రాధాకృష్ణన్ .’’అధ్యాత్మం కాని యుక్తి విధానం సాంఖ్యం అవలంబించి౦ది. దీని అంకురార్పణ నిత్యానుభవం .అనుభవం యొక్క సరైన నిర్వచనమే సాంఖ్యం తత్త్వం ‘’అని జేఎన్ ముఖర్జీ స్పష్ట పరచాడు .మానవలోకానికి అసాధారణమైన ,సాటిలేని తాత్విక సిద్ధాంతాన్ని ప్రసాదించిన ఈ సాంఖ్యం ను తక్కువ చేసి మాట్లాడే వారిపై కోపం తో ‘’భారతీయుల షట్ దర్శనాల శ్రేష్టత్వాన్ని బట్టి వేదాంతాన్ని కొందరు భారతీయ తత్వ వేత్తలు క్రమంగా ఏర్పాటు చేశారు .సాంఖ్యానికి రెండవ స్థానం కల్పించారు .ఈ అప్రదాన్యతకు సాంఖ్యం తన అసమ్మతిని తీవ్రంగా ప్రకటించింది .సాంఖ్యం ఒక అద్భుత తత్వ శాస్త్రాన్ని ప్రబోధించింది .ఇలాంటిదాన్ని వేదాంతానికి రెండవది గా చేయటం దాని సిద్ధాంత జ్ఞాన లోపం ,అవగాహనా రాహిత్యం వల్లనే ‘’అంటాడు ముఖర్జీ .
‘’వ్యాకుల చిత్తులైన ,నిరాశాపరుల ఊహలతో ,ఊహాతీత తన్మయత్వాన్ని అనుభవించటానికి ,విపరీత వ్యామోహం తోకానీ ,సాంఖ్యం ఆకర్షింప బడదు .’’ప్రపంచం ద్వారా ,ప్రపంచం లో ,ప్రపంచం కోసం ‘’దృఢమైన ,నిశితమైన ,నిత్యమైన జీవిత సందేశాన్ని సాంఖ్యం అందిస్తోంది .దాని విశాల భవనం మీద వేదం ఒక ప్రత్యెక గ్రంథం గా కాక ,ఒక సాహిత్యమే అయింది అన్నాడు ముఖర్జీ పండితుడు సాంఖ్యం పై ఉన్న అవ్యాజ గౌరవం తో .
‘’సర్వ సిద్ధాంతాలతో ఖండన మండనాలు పొందిన సాంఖ్యం ఎంతటి ప్రధాన స్థానం ఆక్రమి౦ చిందో అర్ధమౌతుంది . వేదాంత సూత్రాలు సాంఖ్యం తో ఢీ కొట్టే ప్రయత్నాలు చేశాయి .కొందరు బౌద్ధులు ఖండించారు .’’కార్యం ,కారణం లో అంతర్గతంగా ఉంటుంది ‘’అన్నసాంఖ్యాన్ని వైశేషికులు ప్రతిఘటించారు .కానీ ఇతర వాదాలచేత సాంఖ్యం ‘’శ్రౌతం ‘’గా పరిగణింప బడి ,క్రమ౦గా పూర్తిగా లయింప బడి ,తర్వాత హైందవ విజ్ఞానం లో సుస్థిరంగా పొదగబడిందని పండితభావం .వేదాంత సూత్రాలు కానివన్నీ తామసికాలు అని పద్మ పురాణం ,.వైశేషిక సాంఖ్యాలు మహర్షులచేత రాయబడినా, అవి మందబుద్దులకోసమే అని సూత సంహిత ,అంటూ కీర్తించినా ని౦దించినా ,బౌద్ధానికి ముందున్న పురాణ విజ్ఞానం లో సాంఖ్యం సర్వాదిపత్యం ఉన్న సిద్దా౦త౦గా చెలామణి అయింది’’అన్నారు శ్రీనివాస అయ్యంగార్ ,ముఖర్జీ లు .శంకర భగవత్పాదులు కూడా పూర్వోక్త చందం కార్యకార ణాలకు అనన్యత్వ అంగీకారం ఉండటం వలన ,ధర్మశాస్త్ర వేత్తలైన దేవలుడు మొదలైన వారిచే అనుసరించబడటం వలన సాంఖ్యం ప్రఖ్యాత మై౦దికనుక ,దాని ఖండనం వేదాంత భాష్యం లో దాని ఘనతను అంగీకరించారు .ఈవిధంగా కపిలముని చెప్పిన సంఖ్య సిద్ధాంత సూత్రాలప్రాధాన్యత అగణితం ,అపూర్వం అని అర్ధమౌతోంది .
ఆధారం – శ్రీ అనుభవానంద స్వామి వారి –‘’సర్వ సిద్ధాంత సౌరభం’’.
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-5-21-ఉయ్యూరు