కణాద వైశేషిక విశేషాలు
ఎంతో ప్రాచీనమైనదైనా కణాద వైశేషిక సూత్రాలకు ప్రాచీన భాష్యం ఒక్కటి కూడా లేకపోవటం దురదృష్టం .’’ఇతి రావణ ప్రణీతే భాష్యే దృశ్యత’’అని బ్రహ్మ సూత్ర భాష్యం లో శంకరాచార్యులు చెప్పి ఉండటం చేత వైశేషికానికి’’ రావణ భాష్యం ‘’ఉండేదని తెలుస్తోంది .వైశేషికానికి ‘’భారద్వాజ వృత్తి ‘’కూడా ఉందని అంటారు .కానీ ఈ రెండూ లభించలేదని రాధాకృష్ణ పండితుడు అన్నాడు .తర్వాత లభించిన భాష్యాలలో ‘’ప్రశస్త పాదాచార్యుడు ‘’రాసిన ‘’పదార్ధ ధర్మ సంగ్రహం ‘’ముఖ్యమైనది అనుకొన్నా ‘’అది సర్వ స్వతంత్రమైనది’’ అన్నాడు మాక్డోనాల్డ్.కాని అందులో విషయం మాత్రం సక్రమంగా ఉందనీ ,కొన్ని ముఖ్యవిషయాలు కలిపితే అది సంపూర్ణ,వినూత్న గ్రంథం అవుతుందని మాక్డోనాల్డ్ ఉవాచ .’’ఈభాష్య౦ వ్యాఖ్య కాక ,వైశేషిక దర్శనం యొక్క సక్రమ సంక్షిప్తరూపం ‘’అన్నారు శ్రీనివాస అయ్యంగార్ .ప్రశస్త పాదుని రచన వైశేషికం పై భాష్యం కాక స్వతంత్ర గ్రంథం అన్నాడు రాధాకృష్ణన్ కూడా .’’ప్రశస్త పాదుడు పతంజలి న్యాయ భాష్యకర్త వాత్సాయనుని భావాలను తీసుకొన్నాడు కనుక క్రీ.శ 4వ శతాబ్ది వాడు అయి ఉంటాడు ‘’అన్నాడు రాధాకృష్ణ పండిట్ .’’న్యాయ సిద్ధాంత ప్రభావం కణాద సూత్రాల ప్రశస్త పాదుని పదార్ధ ధర్మ సంగ్రహణం లో లేదుకానీ ,వైశేషిక భావాల గౌతమ సూత్రాలు ,వాత్సాయన భాష్య౦ తీసుకున్నాడని చెప్పటానికి ఆధారాలున్నాయి .తర్కభావాలను దిగ్నాగుని నుంచి ,తీసుకోన్నాడుకనుక ఆకాలం పై ఆధారపడాలి కనుక క్రీశ 5వ శతాబ్దివాడు ప్రశస్త పాడుదు’’ అన్నాడు మాక్డోనాల్డ్.కాని ఇది తప్పు ,అతడికాలం క్రీశ 1వ శతాబ్దికి తర్వాత మాత్రమె అన్నారు శ్రీనివాస అయ్యంగార్.
పండితలోకం ప్రశస్త పాదుని భాష్యాన్ని’’ లైట్ తీసుకోక పోయినా’’ , శంకర మిశ్రరాసిన ‘’ఉపస్కార ‘’ అనేది వైశేషిక సూత్రా’’లకు సరైన మొదటిభాష్య౦ అన్నాడు మాక్డోనాల్డ్. సాంప్రదాయక నిర్వచనం అంతరించి పోయాక చాలాకాలం తర్వాత క్రీశ 1600లో రాయబడింది కనుక ప్రాధాన్యం పొందలేదు.ప్రశస్త పాద భాష్యానికి న్యాయాచార్యుడు ఉదయనుడు ‘’కిరణావళి’’అనే వృత్తి,శ్రీధరాచార్యులు’’న్యాయ కండలి’’అనే టీకా రాశారు .క్రీశ 1400లో శివాదిత్యుడు రాసిన ‘’సప్త పదార్ధి ‘’కి విశ్వనాథపంచానన భట్టా చార్యుడు ‘’భాషా పరిచ్ఛేదం’’అనేకారిక ,దీనికి ‘’న్యాయ సిద్ధాంత ముక్తావళి ‘’అనే ప్రశస్త రచన చేశాడు .
‘’వైశేషిక దర్శన దృక్పధం ఊహకంటే శాస్త్రీయం, సంకలనం కంటే విమర్శారూపం కనుక అరుదైన గొప్ప వైజ్ఞానిక శాస్త్రం ‘’అన్నాడు రాధాకృష్ణన్ .’’సర్వ ధర్మాలకుఆధారమై ,అన్ని కర్మలకు అనుష్టానమై ,ఉండే తత్వ శాస్త్రం సర్వ విజ్ఞానానికి వెలుగు బంతి’’అని చెప్పిన కౌటిల్యుని మాటను బట్టి న్యాయ వైశేషికాలు మాత్రమె సైన్స్ ను ,సామాన్య జ్ఞానాన్ని సమర్ధిస్తూ,పరిశీలంతో ఉన్న తత్వ శాస్త్రాన్ని తెలియజేస్తాయి .కనుక వైశేషికం తత్వ శాస్త్ర రాజం .న్యాయ వైశేషికాలు ఒకదానిభావాలు మరొకటి తీసుకున్నా ,న్యాయం పూర్తిగా తర్కాన్నిస్తే ,ప్రాకృతిక ప్రపంచానికి ఆధారమైన పరమాణువులు ఉన్నాయనే భౌతిక భావాన్ని తెలియ జేసింది వైశేషికం మాత్రమె అంటాడు సర్వేపల్లి పండితుడు .బాహ్య, అంతర ప్రపంచాలను తీసుకొని న్యాయం, వాద జ్ఞానం ద్వారా ,అంతాభ్రాంతి అనే వాదాన్ని ఖండిస్తే ,అనుభవ జ్ఞాన మీమాంస ను వైశేషికం సమర్ధించి ప్రత్యక్ష అనుమాన ఆగమాలద్వారా తెలియబడే విషయాలకు అన్వయించే సామాన్య సూత్రాలను ఇది నిర్మించింది .’’అన్నాడు రాధా కృష్ణన్ .ఫలప్రదమైన సర్వ తత్వ శాస్త్రం కూడా భౌతిక ప్రపంచ నిర్మాణాన్ని గురించి ఆలోచించాలి అని వైశేషికం హెచ్చరించి ,పరమావధి అయిన సత్యం లోనేకాక ,నానాత్వమైన భౌతికం పై కూడా శ్రద్ధ చూపించింది .అందుకే పరమాణు వస్తుత్వ విచారాన్ని అభి వృద్ధి చేసింది .పదార్ధ పరిశోధనా రహస్యాలను చాటే వైశేషికానికి తర్కం అనే పునాది పైన కాక ,సుస్థిర తత్వ శాస్త్రము మిగిలిన వాటిపై ఆధారపడి నిర్మించబడ జాలదు .న్యాయ దర్శనం ,తర్కాన్నీ పూరిస్తే ,ఈ రెండు దర్శనాలు పరస్పర అపేక్షకాలై సమానమైన తంత్రాలయ్యాయి ‘’అంటాడు పండిత రాధాకృష్ణన్ .ఇంతటి సన్నిహిత సంబంధం తో గౌతమ ,కణాదులు సోదరులులాగా సోమశర్మ పాదాల వద్ద విద్య నేర్వటం వలన వారి దర్శనాలు కూడా పరస్పర అన్యోన్యతతో కలిసి ఒకటిగా అనిపించటం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు.అనటం అత్య౦త సముచితం .ఈ సిద్ధాంత ద్వయ సమన్వయ వాక్యమా అన్నట్లు ‘’వ్యావహారికం అనాశ్రిత్య నిర్వాణం నోప లభ్యతే ‘’అని తంత్ర శాస్త్రం కూడా స్పష్టంగా చెప్పింది .దేన్ని ఎదుర్కోవాలో దేన్ని జయించాలో తెలుసుకొని పోరాడితేకాని విజయశ్రీ లభించదు –‘’యదేవ విద్యయా కరోతి శ్రద్ధయోపనిషదా,తదేవ వీర్య వత్తరం భవతి ‘’అన్న ఛాందోగ్య ఉపనిషత్ ను అనుసరించి దేన్నీ తెలిసికొని శ్రద్ధా శక్తులతో చేస్తామో ఆకార్యం సంపూర్ణం గా ఫలప్రదమౌతుంది .దీన్ని బట్టి ‘’ప్రపంచ తత్త్వాన్ని విమర్శనా దృష్టితో పరిశీలించి ,నానాత్వ ,వికార ,విభేదన రూప ప్రపంచానికి జంకని వాడే వైశేషికుడు’’అనే సామెత లోకంలో వ్యాప్తి చెందింది .’’సాధన సముదాయానికి ధీరత్వం ,జ్ఞానం ప్రసాదించి ,తత్వ శాస్త్రం లో ప్రస్ఫుటంగా ,నిరాటంకం గా ,చర్చించ బడనట్టి విషయం ఒక్కటి కూడా వైశేషికం లో లేనే లేదు ‘’అన్న మాక్స్ ముల్లర్ పండితుని శేముషీ గరిమకు జోహార్లు .
వైశేషికంపై మరిన్ని విషయాలు మరో సారి తెలుసుకొందాం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-5-21-ఉయ్యూరు