కణాద వైశేషిక విశేషాలు -2(చివరిభాగం

కణాద వైశేషిక విశేషాలు -2(చివరిభాగం )

కణాద సిద్ధాంతం లో ఈశ్వర స్థానం ఏమిటి ?అనేదానిపై అభిప్రాయ భేదాలున్నాయి .ఈశ్వరుని గూర్చి ఆయన ప్రస్ఫుటంగా చెప్పలేదనీ ,విశ్వ సమస్యా పరిష్కారం లో అదృష్ట సిద్ధాంతం తో తృప్తి పొందాడని ,పండిత రాధాకృష్ణన్ భావించాడు .వైశేషిక సూత్రాలలో కొన్ని ఈశ్వర అస్తిత్వం తెలిపేవి ఉన్నాయని  అంటారుకాని అది సత్యదూరం అన్నాడు పండితుడు .ఈశ్వరుడినికాని ,పరమ సృష్టికర్తను కాని కణాదుడు సూచి౦చ లేదని శ్రీని వాస అయ్యంగార్ కూడా చెప్పాడు .కానీ సృష్టి కారణానికి అధిష్టానం అయిన పరమాణు స్పందనకు ,జీవ సంచలనానికీ అదృష్టమే కారణమని వైశేషికం నమ్మింది .కణాదుని అనుచరులు మాత్రం అదృష్ట సిద్ధాంతం అవిస్పస్టం అనాధ్యాత్మికం అని నమ్మి ,ఈశ్వర సంకల్పానికి దాన్ని అధీనంగా చేశారు –Made it dependent on God’s will.కనుక తర్వాతకాలం లో ‘’ఈశ్వరుడు విశ్వానికి నిమిత్తకారణమనీ ,పరమాణువులు ఉపాదానకారణం’’ అనీ భావించారని రాధాకృష్ణన్ చెప్పాడు .

 ‘’ భౌతిక ప్రపంచానికి తమ సిద్ధాంతాలు సంబంధించి ఉండటం వలన ,దానికి అతీతంగా కణాదుడు మొదట్లో ఈశ్వర ప్రస్తావన చేసి ఉండక పోవచ్చుననీ ,అభౌతిక కతృత్వాలను కోరకుండా సూత్ర కర్తలు .భౌతిక విషయాలపైనే దృష్టిపెట్టి ఉంటారనీ ,భాష్యకర్తలు దీన్ని లోపంగా భావించి ,అవకాశం ఉన్న ప్రతిచోటా ఈశ్వర భావాన్ని చొప్పించి ,ఆ లోపాన్ని పూరిచారు ‘’అని  ‘’అథల్యే ‘’అభిప్రాయ పడ్డాడు .వీటిని బట్టి కణాదుడు నాస్తికుడు కాదు .సృష్టి  సిద్ధా౦తానికి ఈశ్వరుడు అక్కర్లేదు అనిభావించి ప్రస్తావించలేదు .త్యాజ్యమైన ఈ సృష్టిని అధిగమించటానికి మొదట్లో ప్రకృతి విధానం తీసుకోవటం ముఖ్యావసరమై ,సాంఖ్యం కూడా ఈశ్వర విషయం లో మౌనంగా ఉండటం వలన ,యోగం వైశేషికాలు పరమాత్మను ఒప్పుకొంటూ ,అతడికి విశ్వ కర్త్రుత్వాన్ని మాత్రం కట్టబెట్టలేదు .దర్శనాలు వచ్చిన క్రమాలను ఆలోచిస్తే ,న్యాయ, వైశేషికాలు స్థూలాన్నీ ,సాంఖ్య,యోగాలు మానసికాన్ని ,మీమా౦సా ద్వయం అద్వైతాన్ని నొక్కి చెప్పాయి .కనుక వైశేషిక ప్రతిపాదన అంతా స్థూల విశ్వాన్ని గూర్చి మాత్రమె అని తెలుస్తోంది .ఈ మూల రహస్యాన్ని పాటించకుండా బహుశా శంకరాచార్యులు తమ సూత్ర భాష్యం లో ప్రధానమైన పరమాణు సృష్టి కర్త్రుత్వాన్ని ఖండించి ,’’తదేవ మసారతర తర్క సందృబ్ధత్వా దీశ్వర కారణ శ్రుతి విరుద్ధత్వా చ్చ్రుతి ప్రవణై శ్చ శిష్టైర్మన్వాదిరపరీ గృహీతత్వా దత్య౦త మేవాన పేక్షా స్మిన్,పరమాణుకారణ వాదేకార్యార్యైహ్-శ్రేయో నర్ధి భిరితి ‘’భావం-నిస్సార మైన మాటలతో కూడినదికనుక, , ఈశ్వర జగత్కారణం చెప్పే శ్రుతులకు విరుద్ధం కనుక ,వేదాదులపై ఆదరమున్న మనువు మొదలైనవారు దీన్ని స్వీకరించ లేదు కనుక పరమాణు కారణ వాదం పై శ్రేయస్సు కోరే ఆచార్యులు ఉపేక్ష వహించారు .శిష్టులు గ్రహించకపోయినా ,ప్రతిష్ట ప్రాబల్యాలకు లోపం  వచ్చేఅవకాశమున్నా ,తమ సిద్ధాంతాలను వాటి ప్రతిఫలాన్నీ ,తత్వ వేత్తలు మరుగున పడేట్లు చేయక పోవటం చేతనే భారతీయ తత్వ శాస్త్రం లో తాను ఎక్కువగా మెచ్చుకొనే అంశం ‘’అన్నాడు మాక్స్ ముల్లర్ పండితుడు .ఇతరులచేత నాస్తికం ,అవైదికం గా పరిగణింప బడుతున్నా ,గౌరవ మర్యాదలు పొందకపోయినా .లక్ష్య పెట్టక తన దారిలో తాను  వైశేషికం నడుస్తూ ప్రత్యేకత చాటుతోంది అని శ్రీ అనుభావానంద స్వామి అభిప్రాయం .

     ‘’ప్రశస్తమైన ఉపనిషత్ లలో న్యాయ వైశేషికాలు కనిపించవు .పతంజలి ,కణాదపేర్లు కూడా కనిపించవు.అయినా సూత్రకర్తలుగా చెప్పబడే తత్వ వేత్తలు భారత తత్వ శాస్త్రం లో ఆదిపురుషులుగా  గుర్తింప బడటానికిఅవకాశం లేదు ‘’అన్న మాక్స్ ముల్లర్ మాటలు గణనీయాలు  .’’ఈ సూత్ర కర్తలకుఆధార౦గా ఒక భావ ధార ఉండాలి.మీరు చూసిన విన్న దర్శనాలన్నీ ఉపనిషత్ ప్రమాణం పై ఆధార పడి ఉన్నవే ‘’అన్నాడు వివేకాన౦ద స్వామి .’’ఉపనిషత్కాలం తర్వాత  ఒక్కొక్క సిద్దా౦తాన్నీ గ్రహించి ,తమ తత్వ విజ్ఞాన పాఠ శాలలలోగురు పరంపరగా బోధిస్తూ అభి వృద్ధి చేయబడుతూ ఉన్న సిద్ధాంతాలకు ఒక ప్రస్ఫుట స్వరూపం ఇచ్చే కాలం వచ్చింది.దర్శనాలకు మూలాధారం ఉపనిషత్తులే’’అని బల్లగుద్ది మరీ చెప్పాడు   మాక్డోనాల్డ్ .

‘’తద్వచనాదామ్నాయస్య ప్రామాణ్యం’’-‘’తస్మాదాగమికం’’- , ‘’వేదం లింగాచ్చ’’,వైదికం చ ,బుద్ధిపూర్వా వాక్య కృతిర్వేదే’’మొదలైన సూత్రాలు ప్రత్యక్షంగా వేదాన్ని ప్రస్తావించి ,ప్రమాణంగా గ్రహించింది కనుక వైశేషికం అవైదికం అనటం అసంబద్ధం అసమంజసం అన్నారు అనుభవానందులు . అన్ని దర్శనాలకు వేదమే ప్రమాణం .ఆయా దర్శనాలు వాటిలో తమకు ఉచితమైన స్వంత సిద్ధాంత ప్రతిపాదనకు ఉపయుక్తాలైన విషయాలను మాత్రమె గ్రహించి ,దర్శన  నిర్మాణం చేసి భారతీయ తత్వ జ్ఞానాన్ని షట్ దర్శనాలలో సమగ్రత పొందింది ‘’అని కీర్తించిన మాక్స్ ముల్లర్ పండితుని మాటలను ,బట్టి భారతీయ తత్వ శాస్త్ర భావ సంపత్తు ఆకాశాన్ని అంటి,అసమాన యశస్సు ప్రసాదించి అమృతత్వాన్ని ఆర్జించాయి అనటం ఉత్తమోత్తమం అన్నారు శ్రీ అనుభావానంద స్వామీజీ .

   పరమాణువు

  వైశేషికం లో పరమాణువు ,అంటే ఆటం,గురుత్వం అంటే గ్రావిటిఅనే మాటలు బాగా ప్రాధాన్యం వహించాయి .ఇందులోని నిర్వచనాలకు ఇప్పుడు మనం చెప్పుకొనే నిర్వచనాలకు తేడా ఉంది .త్రికాలాభాద్యమైన వస్తువు ఉంది అని సాంఖ్యం,సర్వ సృష్టికి ఆధారమై నిత్యమైన పరమాణువు ఉందని వైశేషికం , నిత్య శబ్దం నుంచే సృష్టి జరిగిందని మీమాంసకులు చెప్పారు .ప్రాచీన ఋషులకు ద్రవ్యం యొక్క అనశ్వరత్వం తెలియక పోలేదు .కపిల గౌతమ కణాద,పతంజలి జైమిని మొదలైన వారికి పదార్ధం యొక్క నిత్యత్వం తెల్సు అని రామకృష్ణానందులు చెప్పారు  .ఆధునిక విజ్ఞాన శాస్త్ర పారిభాషిక పదాలే భారతీయ విజ్ఞాన శాస్త్రం లో ఉండటం చేత ,ముఖ్యంగా వైశేషికం పరమాణు సిద్ధాంతం ,గురుత్వాన్నీ సూచించి ఉండటం చేత ,వాటిని ఈనాటి సైన్స్ కు అన్వయి౦చ కూడదనీ ,,అలా చేస్తే అనేక సమస్యలేర్పడతాయనీ ,ప్రాచీనుల దృక్పధం భౌతికమూ అభౌతికమూ కనుక తత్వ విషయం లో సంకలనం చేయటం సర్వ సాధారణం కాదనీ మాక్డోనాల్డ్ అన్నాడు .ఇతడి భావనలో వైశేషికంలోని పరమాణు సిద్ధాంతం సమగ్రం కాకపోవచ్చు .కానీ సైన్స్ ఎప్పటికీ సంపూర్ణం కానేరదు .ప్రాచీన ఆధునిక కాలాలో పరమాణు సిద్ధాంతం ఎప్పుడూ సక్రమంగా నిరూపి౦చ బడలేదన్నాడు రాధాకృష్ణన్ .కనుక సమగ్రం కాకపోయినా ,ప్రపంచం లో మొట్టమొదట పరమాణు సిద్ధాంతం ప్రతిపాది౦చిన వాడు మాత్రం కణాద మహర్షియే.లౌకిక అలౌకికాలకు ,ప్రాపంచిక ,ఆధ్యాత్మికతలకు ,భౌతిక విజ్ఞాన ఆధ్యాత్మిక విజ్ఞానానికి కణాద మహర్షి సమన్వయము చేశాడు అన్నది నిర్వివాద విషయం .’’sciece without religion is lame ,religion without science is blind ‘’అని చెప్పిన ఆధునిక విజ్ఞానఖని ఆల్బర్ట్ అయిన్ స్టీన్ వాక్య రహస్యాన్ని ఆనాడే కాణాద ముని గ్రహించాడు .

     గురుత్వ సిద్ధాంతం

  గ్రావిటి అంటే గురుత్వ సిద్ధాంతాన్ని కూడా  వైశేషికం లో కణాదముని చెప్పాడు .ఇది కూడా సర్వ ప్రపంచానికి ఆశ్చర్య విషయమే –గురుత్వ ప్రయత్నా సంయోగానాత్ క్షేపణ౦’,,సంయోగ భావే గురుత్వాత్ పతనం ,సంస్కారభావే గురుత్వాత్ పతనం ,,అపాం సంయోగ భావే గురుత్వాత్ పతనం ,మొదలైన సూత్రాలలో గురుత్వాకర్షణ చెప్పబడింది .మొదటి సూత్రానికి ఉపస్కార కారుడు ‘’అత్ర గురుత్వ స్య హస్త లోష్టాది వర్తినో నిమిత్త కారణత్వం ‘’అంటే గురుత్వం హస్తాదికాలలో కలిగి ఉత్ క్షేపణ కార్యానికి –అంటే పైకి వెళ్ళటానికి నిమిత్తమౌతుంది .అలాగే ‘’ప్రతి బంధ భావే గురుత్వా దసమవాయి కారణాత్ పతనం అథ  సంయోగ  ఫలికా క్రియా  జాయతే ‘’అంటే ప్రతిబందికా భావం లో అసమవాయి కారణమైన గురుత్వం వలన పతనం ,ఆతర్వాత సంయోగరూప ఫలితం లభిస్తుంది .’’ఫలాదౌ ‘’పడే పండు నే వ్యాఖ్యాత ఉదాహరణగాతీసుకొన్నాడు.దీన్నే న్యూటన్ ఆపిల్ పండు పడటం చూసి గ్రావిటి చెప్పాడు .గురుత్వం పృధివీ జల వృత్తిహ్ ‘’ అని తర్క స సంగ్రహణం కూడా సమర్ధించింది .గురుత్వం అనే శక్తి భూమి నీరు లలో ఉన్నా ,ఇంద్రియ గోచరం కాదు .’’సామగ్ర్య భావా న్న గురుత్వా దేహ్ ప్రత్యక్షం ‘’కంటికి కనిపించటానికి సామగ్ర్యం లేక పోవటం చేత  గురుత్వం  అగోచరం ‘’అని రాస్తూ ,గురుత్వం స్పర్శ చేత కనిపిస్తుందని వల్లభా చార్యుడు ఉదాహరించాడని వృత్తి కారుడు చెప్పాడు .కారికా వలీకర్త కూడా ‘’  ,గురుత్వం స్యాత్ ,పృధిర్యాది ద్వయే తుతత్ ‘’ గురుత్వం అతీంద్రియమై భూమి నీరు లలో ఉందనీ ,’’తదేవాసమవాయిస్యాత్ పతనాఖ్యే తు కర్మణి’’అంటే అది అసమవాయి కారణంగా ఉంటూ పతన క్రియను కలగ జేస్తోంది అని రాశాడు .’’సంయోగ జన్య క్రియాదిత్యమనుమానే న గురుత్వ సిద్ధిరితిభావః ‘’అనగా సంయోగం జన్యాన్ని బట్టి ,గురుత్వం ఉన్నట్లు సిద్ధమని ముక్తావళి చెప్పింది .కనుక గురుత్వం ఫలాదులలో ,భూమిలో ఉన్నది అని భావం .ఇది ఆధునిక గ్రావిటి కి అతి దగ్గరభావమే ‘’gravitation was kown by the Indians thousands of years before Newton was born ‘’అని వివేకానందుడు  నిర్ద్వంద్వంగా  మరీ చెప్పాడు  .’’భౌతిక ,విజ్ఞాన తత్వాలను సమన్వయ పరచి ,జిజ్ఞాసువు లందరికీ అతి సూక్ష్మ౦గా పరిశోధనా విధానాన్ని ప్రసాదించి ,ముముక్షువులకు తరుణోపాయాన్ని కటాక్షించిన  కణాదమహర్షి మిక్కిలి స్తవనీయుడు ,చిరస్మరణీయుడు ,ఆమహామహుడికి సర్వ విజ్ఞానలోకం సదా తజ్ఞులై ఉండాలి అన్నారు స్వామి అనుభవానంద స్వామీజీ ‘’

    17వ తేది సోమవారం శ్రీ శంకర జయ౦తి సందర్భంగా రేపటినుంచి శంకరాద్వైతం గురించి  తెలుసుకొందాం .

ఆధారం –శ్రీ అనుభవానంద స్వామి వారి –‘’సర్వ సిద్ధాంత సౌరభం ‘’

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-5-21-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.