శ్రీ శంకర దిగ్విజయ యాత్ర

శ్రీ శంకర దిగ్విజయ యాత్ర

కాశీ రాజు రత్న సింహుడు శ్రీ శంకరాచార్యుల అప్రతిహత విద్యా వైభవ సంపత్తి గుర్తించి ,గౌరవించి ,కాశీలోనే ఉంటూ తనకు ఆనందాన్ని కలిగించమని ప్రార్ధించాడు .సన్యాసి అలా ఒకే చోట ఉండటం ధర్మం కాదని చెప్పి ,ఒకచోటే కాలక్షేపం చేయటానికి తాను  పుట్టలేదని తెలియజేసి ,అక్కడి నుంచి బయల్దేరారు.ఆనంద గిరి ,చిద్విలాసుల కథనం ప్రకారం శంకరులు సామాన్య యతీశ్వరుడిగా కాక ,కాశీరాజు ప్రాపకం తో లభించిన అనేక రాజ లాంఛనాలతో పటాతోపంగా దిగ్విజయ యాత్ర ప్రారంభించారు .ద్వారక రాజు సుధన్వుడు శంకరుని గురువుగా స్వీకరించి ,సేవ చేయాలనే కోరికతో ఆయన వెంట నడిచాడు .అప్పుడు భగవత్పాదుల వయస్సు 25ఏళ్ళు .కొందరి లెక్కప్రకారం కుమారిల భట్టును కలిసే నాటికి శంకరుల వయసు 15మాత్రమే .

  మొదటిసారిగా ప్రయాగ క్షేత్రం చేరి త్రివేణీ సంగమ స్నానాలు చేస్తూ ,జిజ్ఞాసులకు బోధ చేస్తూ ,ప్రత్యర్ధులను ఓడిస్తూ ,మీమాంసా శాస్త్ర దురంధరుడైన కుమారిల భట్టు ఆత్మ పవిత్రత కోసం తుషాగ్నిలో  ప్రవేశించ బోతున్నాడని తెలిసి ,అంతకు ముందే ఆయనతో సంభాషించాలనే కోరిక ఉండటం చేత శంకరులు రుద్రపురంలో ఉన్న కుమారిలుని చూడటానికి వెళ్ళారు .ఈయన జైన ,బౌద్ధ సిద్ధాంతాలను ఆయా గురువులనుంచి రహస్యంగా గ్రహించి ,దొరికిపోయి ,బహిష్కరింపబడి,క్రోధా వేశాలతో రాజాశ్రయాన్ని పొంది ,ఆమతాలను రూపుమాపి ,అవసానకాలం లో గురు ద్రోహ మహాపాతకం నివారణకోసం ,ప్రాయశ్చిత్తంగా’’ ఊక కొలిమి’’లో ప్రవేశించి చనిపోవాలని భావించాడు .శంకరులు అక్కడికి చేరే సమయానికే ఆయన అగ్ని ప్రవేశం చేసి కొంతవరకు దహింప బడినా, శంకరునితో ఆనందంగా మాట్లాడి ,మాహిష్మతి నగరంలో ఉన్న తన శిష్యుడు మండన మిశ్రుని కలిసి ఓడింఛి శిష్యునిగా గ్రహించమని  చెప్పి చనిపోయాడు .  కుమారిలభట్టు సుధాన్వాదిఅనేక బౌద్ధరాజులను సంస్కరించి వైదిక మార్గ ప్రవర్తకులను చేసి ,వారిద్వారా దేశం లో వైదికాన్ని స్థాపించిన మహాపురుషుడు గా కీర్తి పొందాడు .ఆ కాలం లో ఆయనకు ఎదురు లేదు .కుమారిలుడు కామరూపం అనబడే అస్సాం కు చెందినవాడని కొందరు ,తమిళ దేశం వాడని కొందరు అంటారు .అతని ప్రత్యర్ధులైన ‘’జిన విజయ ‘’కర్తలు కుమారిలుడు ఆంధ్రుడే అన్నారు .కానీ ఆయన జీవితమంతా ఉత్తర దేశం లోనే గడిచిపోయింది కనుక అతని ప్రభావం ఆంద్ర దేశం లో కనిపించలేదు .క్రీ.పూ 494లో శంకరుల 15వ ఏట కుమారిలభట్టు మరణించాడు .’’శంకర –కుమారిల సమాగమనం కు చారిత్రక సాక్ష్యాదారాలు  దొరకక పోవటం చేత దాన్ని సమ్మ తి౦చటం లో ప్రాముఖ్యం లేదన్నారు ప్రొఫెసర్ సూర్యనారాయణ శాస్త్రి .కుమారిలుడు శంకరులకు చాలా ప్రాచీనుడు కనుక వీళ్ళిద్దరూ కలుసుకోవటం అసంభవం అన్నారు కృష్ణస్వామి మొదలైన ఆధునికులు .

  కుమారిల యతి సార్వ భౌముడితో చర్చించే అవకాశం దొరకక పోయినందుకు శంకర యతీంద్రులు ,నిరాశ చెంది ,కుమారిలుని ముఖ్య శిష్యుడేకాక ,బావమరిది కూడా అయిన మండన మిశ్రుని తో వాదించటానికి మాహిష్మతీ నగరం చేరారు .అది మగధ సామ్రాజ్య రాజధాని అని విద్యారణ్యులు చెబితే, హస్తినాపురానికి దగ్గరలో ఉందని ఆనంద గిరి రాశాడు .ఈనగరం నర్మదా నదీ తీరంలో ఉందని రఘువంశం,మాఘకావ్యం  అన్నాయని ‘’తెలంగ్’’ తెలిపాడు .మండన మిశ్రుడు రాజ గురువు అవటం చేత అత్యధిక భోగాభాగ్యాలతో వర్ధిల్లుతున్నాడు .శిష్యులనేకులున్నారు .వారికి కర్మకాండ బోధిస్తూఉంటె ఇంటి ప్రాంగణం లోని పంజరపు చిలకలు ‘’వేదాలు స్వతః ,పరతః ప్రమాణాలే-  ‘’స్వతః ప్రమాణం పరతః ప్రమాణం కీరా౦గనా యత్ర గిరం గిర౦తి ‘’పలుకుతుంటాయి .అంటే సంపూర్ణ వైదిక కర్మభావ వాతావరణాన్ని ఆయన స్వయంగా నిర్మించాడు .’’మీమా౦సాను క్రమణినిక ‘’,విధి వివేకం ‘’అనే అపూర్వ గ్రంథాలు రాసి మహా ప్రఖ్యాతుడైనాడు .ఇలాంటి బలమైన ప్రత్యర్ధితో వాదించిజయించి అద్వైత ప్రతిష్ట చేయాలని  శంకరుల కోరిక . ఈ సంఘటన అత్య౦త ప్రధానమై శంకరుల జీవితం కొత్తమలుపు తిరిగింది .మండనుని ఓటమితో ,ఆనాటి కర్మ వాదులంతా తలవంచి మగధ రాజుతో సహా అనేకమంది రాజులు శంకరులకు అధీనులైనందున  ,శంకర సంకల్పమైన అద్వైత సిద్ధాంత స్థాపన కార్యక్రమం జయప్రదమైంది .మండన పండితుడే విశ్వరూపాచార్యుడు .శంకర శిష్యుడై సురేశ్వరాచార్యుడు అయ్యాడు .

  మండన మిశ్ర ,శంకరులు ఏడు రోజులు చర్చోపచర్చలు ఉభయభారతి అధ్యక్షతలో జరిపారు .శంకరుల ప్రజ్ఞకు సమాధానాలు చెప్పలేక మండనుడు ఉక్కిరి బిక్కిరై భార్య ఉభయభారతి ప్రకటించినట్లుగా ఓటమిని అంగీకరించాడు .శంకర ఉభయభారతి వాదాలు తర్వాత సాగి ,ఆధ్యాత్మిక విద్యా స్వరూపుడై ,చిద్రూపుడైన అపర శంకరునికి ,సర్వ విద్యాపాదపమైన అపర శారద కు జరిగే వాదాలను చూడటానికి దేవ ముని గణం అంతా తిలకించి పులకించింది .చివరికి ఆమెకూడా ఓడిపోయి శంకరుని సత్కారం చేసి భర్త మండనుడి  సన్యాస  దీక్షకు ఒప్పుకొని శంకర సూటి వాద ఘాతాలకు తీవ్రంగా బాధపడి అపరసరస్వతి ఉభయ భారతి శంకరుల భాగవత్పాదులతో శృంగేరి చేరి శారదామాతగా పూజ లండుకొంటున్నది అని ‘’గురు వంశ కావ్యం ‘’తెలియ ఎసింది .

  అమరుక రాజు శరీరంలో పరకాయ ప్రవేశం చేసిన శంకరులు శృంగారాన్ని గ్రహించి ,ఉభాయభారతితో వాదించి ఓడించాడు .మండన మిశ్రునికి ఆత్మబోధ చేసి మహావాక్యాలు ఉపదేశించి తురీయాశ్రమమిచ్చి క్రీ.పూ.491లో సురేశ్వరాచార్యుడనే ఆశ్రమనామం అందించారు .వీటితో ఉత్తర భారతం లో శంకరునికి ఎదురు లేకపోయింది పండితపామరులు, రాజులు శిష్యలయ్యారు .అద్వైతామృతసారం గ్రోలారు.ఇతర మతాలను నిరాకరిస్తూ ,శంకర ప్రోక్త అద్వైత సిద్ధాంతాన్ని ఆచరిస్తూ జన్మ ధన్యం చేసుకొని ముక్తి పొందారు .ఉభయభారతి కూడా శంకరుని  సన్యాసిని గా అనుసరిస్తూ,  సంపూర్ణ వైరాగ్యంతో కాలం గడుపుతూ ,శృంగేరి మఠ స్థాపన వరకు శంకర భాగవత్పాదులతో పర్యటన చేస్తూ , తీవ్రమైన సాధనాలతో అనేక అనుభూతులు పొంది ,అందరికి ఆరాధ్యయై ,చివరికి శృంగేరిలో ఒక ఆలయం లో పూజింప బడుతోంది చరిత్ర తెలిపింది .

ఆధారం –శ్రీ అనుభవానంద స్వామి వారి ‘’సర్వ వేదాంత సౌరభం ‘’.

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-5-21-ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అవర్గీకృతం. Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.