శ్రీ శంకరుల దేశ పర్యటన -2
శంకరుల మాతృమూర్తి ఆర్యాంబ మరణం
శంకరులు శృంగేరిలో ఉండగానే తల్లి అవసాన దశ లో ఉన్నదని గ్రహించారు .కానీ బృహత్ శంకర విజయం లో శంకరులు గోవింద భాగవత్పాడులవద్ద తురీయ ఆశ్రమమం తీసుకొని , బదరీ కైలాసాలు దర్శించి మళ్ళీ బదరిని చేరాక తల్లి అనారోగ్యం తెలిసింది అని ఉన్నది .అగ్ని శర్మ అనే బంధువు శంకరుని తల్లి సందేశాన్ని తెలియ జేయగా ,చిత్సుఖా చార్యునితో కలిసి శంకరులు స్వగ్రామం కాలడి చేరారు ,విద్యారణ్య రచన ప్రకారం శృంగేరి స్థాపన తర్వాతనే తల్లి మరణం జరిగిందని ఉంది .ఇంటికి వెళ్లి తల్లికి సేవలు చేసి ,ఆమెనిత్యం నదీ స్నానానికి వెళ్ళలేని స్థితి గమనించి తపోశక్తి తో పూర్ణానది దిశమార్చి తనింటి ముందు ప్రవహించేట్లు చేశారు .అప్పటినుంచి అది ‘’అంబా నది ‘’పేరుతొ పిలువబడింది.అవసాన దశలో తనకు తత్వోపదేశం చేయమని కుమారుని కోరితే, శంకరులు ‘’తత్వ బోధ ‘’అనే గ్రంథం రాసి ,బోధించటం మొదలుపెడితే ఆమెకు అర్ధంకాక ఇంకొంచెం సులభంగా చేసి చెప్పమని కోరితే ,శ్రీ కృష్ణ పరమైన శ్లోకాలు రాసి వివరించారు .భగవధ్యానం తో తన్మయురాలై ఆర్యాంబ తనువు చాలించింది .పూర్వాశ్రమ బంధువులను పిలిచి ,తాను తల్లికి చేసే దహన సంస్కారాలకు ఆహ్వానించగా ,వాళ్ళంతా బహిష్కరించారు.శంకరుడు తల్లికిచ్చిన వాగ్దానం నెరవేర్చాలని కృత నిశ్చయంతో ఉంటె ,సన్యాసి దహన సంస్కారాలకు అర్హుడు కాదని వారు వాదించి భీష్మించారు .ఈ విధ౦గా సి.ఎన్ .కృష్ణస్వామి అయ్యర్ చెప్పినట్లు ‘’Shankara failed to become a prophet in his own land ‘’ స్వస్థలం లో’’ జగద్గురువు’’ అని పించుకోలేక పోయిన శంకరులు ,తల్లిని స్మశానానికి ఒక్కడే తీసుకు వెళ్ళలేక ,తన ఇంటి ఆవరణ లోనే ఒకమూల తల్లిపార్ధివ దేహానికి దహన సంస్కారం చేయాల్సి వచ్చింది .ఉత్తర క్రియలనూ యధావిధిగా నిర్వహించారు .విద్యారణ్య శంకర విజయం ప్రకారం అప్పుడు శంకరులతో పాటు ఒక్కశిష్యుడు కూడా లేడు.వెంట వచ్చిన చిత్సుఖా చార్యుడు ఏమయ్యాడో తెలియదు .గత్యంతరం లేక తల్లి దేహాన్ని ముక్కలు ముక్కలుగా ఖండించి ,సమిధలు కూడా లేకపోవటం చేత ఎండిన అరటి ఆకులతో అగ్ని సంస్కారం చేసినట్లు తెలుస్తోంది .అందుకనే బంధువులమీద విపరీతమైన కోపం వచ్చి శపించటం చేత అప్పటినుంచీ దేశం లో శవదహనాలు తమ ఇంటి ప్రాంగణం లోనే నిర్వర్తిస్తున్నారు .శవం పై కత్తితో అక్కడక్కడ గాయాలు చేసి మరీ దహనం చేస్తున్నారని కృష్ణస్వామి అయ్యర్ ఉవాచ .’’మాతృమూర్తిపై ఉన్న ప్రేమాతిశయాలతో ఎన్ని ప్రతిబంధాలు ఏర్పడినా ,శాస్త్రం నిషేధించినా ,ఆప్తులు బహిష్కరించినా ,తల్లిప్రేమ ముందు ఇవన్నీ తృణప్రాయంగా భావించి, తల్లి అంత్యక్రియలు నిర్వహించి తల్లికిచ్చిన మాట నిలబెట్టుకొన్నారు శంకులు .ఆయన సంకల్ప బలం ఎంత అమోఘమో ,పట్టుదల ఎలాంటిదో ,మనో ధైర్యం ఎంతటి ఉత్కృష్టమైనదో తెలియ జేసే సంఘటన ఇది.అందు చేతనే అతి తక్కువకాలం లో సాధారణ మానవ ప్రజ్ఞకు అందరాని విద్యా వైదుష్యాన్ని సాధించి ,పండిత చక్రవర్తులను సునాయాసంగా ఓడించి ,రాజాధిరాజుల్ని పాదాక్రాంతుల్ని చేసుకొని ,సర్వ శాస్త్రాతీతమై ,అనంతమైన అఖండ అద్వైతసిద్ధాంతాన్ని స్థాపించి, తానుకూడా ,సామాన్యమానవ ప్రజ్ఞాతీతుడై ,అతి దూరుడై ,దుర్ఘట సమస్యయై ,అతీతుడై ,సర్వ ప్రపంచ మానవ కోటికి అలంకారమై శంకర భగవత్పాదులు భాసి౦చారు ‘’ అన్న శ్రీ అనుభవానందుల వారి అమృతోపమానమైన వాక్కులు శిరో ధార్యం . ఆయనది ఒక అద్భుత మూర్తిమత్వం ,,అతిమానుషం ,దివ్యం .
తల్లి దహన సంస్కారాలు పూర్తి చేసి ,శంకరులు మళ్ళీ శృంగేరి చేరారు .పద్మపాదుడు రామేశ్వరయాత్ర పూర్తి చేసుకొని శృంగేరి చేరుకొన్నాడు .శంకరులు దేశ పర్యటన కొనసాగించాలనే సంకల్పంతో తూర్పు తీర దేశాలవైపు బయల్దేరారు .ముందుగా శాక్తేయులకు ఆలవాలమైన కాంచీనగరం చేరారు .కొంతకాలం ఉండి ,పరమత సిద్ధాంతాలను ఖండించి ,ముఖ్యులను వాదం లో ఓడించి ,శిష్యులను చేసుకొని ,కామాక్షీ దేవికి ముందుభాగంలో శ్రీ చక్రం స్థాపించి ,ఆమెలోని రౌద్రాన్ని తగ్గించి సౌమ్యత్వాన్ని ప్రకటింప జేశారు .ఆమె అనుగ్రహం కోసం తపస్సు చేసి ,కృపా సిద్ధిపొంది ,హృదయం నిండా అమందానందాన్ని పొందారు .అక్కడినుంచి జంబుకేశ్వరం వెళ్లి ,అక్కడి అమ్మవారు అఖిలా౦డేశ్వరి ఉగ్రరూపాన్ని కూడా సౌమ్యంగా మార్చటానికి శ్రీ చక్రకమలం స్థాపించి ఆమె ఎదురుగా వినాయక విగ్రహం ప్రతిష్టించి జనాలపై పుత్ర వాత్సల్యం కలిగేట్లు చేశారు .అమ్మ అనుగ్రహం పొంది ,మధుర వెళ్లి మీనాక్షీ సుందరేశ్వర దర్శనం చేసి ,మీనాక్షీదేవిని కొంతకాలం ఉపాసించి అనుగ్రహం సాధించారు . .ఈకాలం లోనే దక్షిణాది రాజుల అండ మెండుగా లభించింది .పరమత ఖండనం చేసి అద్వైత మతస్థాపనాన్ని సుస్థిరం చేసి శృంగేరి పీఠాన్ని సర్వ శక్తి మంతం గావించారు ..
క్రీపూ .494లో శంకరులు కాలడిలో తల్లి దహన సంస్కారాలుపూర్తిచేసిన సమయం లో నర్మదానదీ తీరంలోని మాంధాత ద్వీపం లో అమరేశ్వరం లో ఉన్న గోవింద భగవత్పాదులు వ్యాధి గ్రస్తులై ఉన్నారని తెలిసి ,వెంటనే బయల్దేరి వెళ్లి గురుపాదులను దర్శింఛి సేవలు చేస్తూ ఉన్నారు శంకరులు .కార్తీక శుద్ధ పౌర్ణమినాడు గోవింద భగవత్పాదులు బ్రహ్మైక్యం చెందారని బృహత్ శంకర విజయం తెలిపింది .
నర్మదా తీరం నుంచి తూర్పున ఉన్న పూరీ జగన్నాధ క్షేత్రం చేరి ,కొంతకాలం ఉండి మఠ స్థాపన చేసి’’ గోవర్ధన మఠం ‘’అని పేరుపెట్టారు .సేతు రామేశ్వరం నుంచి ప్రారంభమైన ఈ తూర్పు దేశ యాత్ర లో ద్రవిడ,పాండ్య , చోళ ,ఆంద్ర రాజ్యాలలో ఉన్న క్షేత్రాలను విద్యాస్థానాలను దర్శిస్తూ ,రామేశ్వర మధుర ,శ్రీరంగం, కంచి వేంకటాచల ,జగన్నాధాది క్షేత్రాలను దర్శించి ,ఆయా దేవతల అనుగ్రహం పొంది శంకరులు విదర్భ దేశం ప్రవేశించారు .
విదర్భనుంచి కర్నాటకం వెళ్లి అక్కడి కాపాలిక నాయకుడు శ్రీకచుడు మొదలైనవారిని వాదం లో ఓడించి ,భూకైలాసం అనబడే గోకర్ణ క్షేత్రం చేరి ,అక్కడినుంచి సౌరాష్ట్ర దేశం వెళ్ళారు .అక్కడి రాజు సుధన్వుడు పూర్వం జైన బౌద్ధమతావలంబి అయినా ,కుమారిలభట్టు ప్రభావంతో వైదిక మతావలంబి అయ్యాడని పూర్వమే చెప్పుకొన్నాం .సుధన్వుడిని అద్వైతానికి మార్చి ,అతని ప్రోత్సాహంతో శ్రీకృష్ణ ద్వారకలో ఒక మఠం స్థాపించి ‘’శారదా పీఠం’’అని పేరుపెట్టారు .రాజు సుధన్వుడు శంకరుల వెంట నడుస్తూ అద్వైత వ్యాప్తికి గొప్ప కృషి చేసి శంకరాభిమానం పొందాడు .ఎందరో రాజులు శంకరులకుసహాయం చేసినా సుధన్వుడి ని మాత్రమె ఆదర్శ ప్రభువు గా గ్రంథాలు పేర్కొన్నాయి .శంకరాచార్యులు కూడా అతడిని అమరుడిని చేయటం ఆరాజు గొప్ప అదృష్టం .
ఆధారం -శ్రీ అనుభవానంద స్వామి వారి -”సర్వ సిద్ధాంత సౌరభం ”
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -20-5-21-ఉయ్యూరు .