శ్రీ శంకరుల  దేశ పర్యటన -3(చివరిభాగం )

శ్రీ శంకరుల  దేశ పర్యటన -3(చివరిభాగం )

 

ద్వారకలో శారదా పీఠం నెలకొల్పి ,అక్కడి నుంచి మధ్యభారతం లో ఉన్న ఉజ్జయిని చేరి ,గంగాతీరం వెంట ప్రయాణించి భట్టభాస్కరాదులను జయించి ,కాశ్మీర్ సర్వజ్ఞ పీఠం విషయం విని ,దాన్ని అధిష్టించాలని శ్రీ శంకరులు కాశ్మీరం చేరారు .అక్కడున్న ఒక దేవాలయానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలున్నాయి .ఒక్క దక్షిణ ద్వారం మాత్రం సరైన సర్వజ్ఞుడైన పండితుడు లేక మూయబడి ఉంది.ఆ ఆలయం చేరి ,పరివేష్టించి ,సర్వజ్ఞపీఠాన్ని కాపాడుతున్న పండితులు శంకరుల విద్యా పాటవం పై పలు ప్రశ్నలు సంధించగా ,అన్నిటికీ సమాధానాలు సంతృప్తిగా చెప్పి ,వారు పూర్తిగా సమర్ధించగా ఆలయ ప్రవేశం చేశారు .కానీ దక్షిణ ద్వారం దగ్గరకురాగానే సరస్వతీ దేవి సాక్షాత్కరించి సర్వజ్ఞత్వమే కాక బ్రహ్మ చర్యం కూడా పీఠాధి రోహణకు ముఖ్యమని ,తన పూర్వ కర్మలను ఒకసారి గుర్తుకు తెచ్చుకొని నిరూపించుకోమని కోరింది .తాను  అమరుక దేహంలో ప్రవేశించిన విషయం పై అడిగిన విషయంగాతెలుసుకొని ,అది జరిగింది అమరుక శరీరంలోనే కానీ శంకర దేహం లో కాదని సమర్ధించుకోగా శారదామాత ఆ సమాధానానికి సంతోషించి సంతృప్తి చెంది శంకరులు సర్వవిధాలా స్సర్వజ్ఞ శారదా పీఠం అది రోహించటానికి  పూర్తిగా అర్హుడే అని తీర్పు చెప్పగా ,పండితులందరి  హర్షధ్వానాలమధ్య శ్రీ శంకర భగవత్పాదులు కాశ్మీర సర్వజ్ఞ శారదా పీఠం అధిష్టించి దక్షిణ భారత దేశానికే కాక యావద్భారతదేశానికీ అపూర్వ గౌరవాన్ని కల్గించారు అని ఆనంద గిరి మొదలైన వారు రాశారు .కానీ ప్రమాణాలు సరిగ్గాలేవు అంటారు శ్రీ అనుభవానందులు .

  కాశ్మీర రాజధాని శ్రీనగర్ లో శంకరాచార్యులకు ఒక ప్రాచీన దేవాలయం 100 అడుగుల ఎత్తున ఉన్న కొండపై ఇప్పటికీ ఉన్నది .శంకర సర్వజ్ఞ పీఠాదిరోహణ గాథ విన్న ,తెలుసుకొన్న గోపాదిత్యుడు అనే రాజు క్రీ.పూ.36-306మధ్యలో శంకర ఆధ్యాత్మిక జ్ఞాన చేతనత్వం అందరికీ తెలియ జేయటానికి ఆ శంకరాలయం నిర్మించాడని డా.పి.ఘ్వాషాలాల్ తన ‘’ఎ షార్ట్ హిస్టరీ ఆఫ్ కాశ్మీర్ ‘’లో రాశాడు .కాలక్రమం లో ఈ ఆలయం శిధిలమై పోగా ,జైన్ ఉల్ అబ్దిన్అనే మహమ్మదీయ రాజు దాన్ని పునరుద్ధరించాడని ఆ ఆలయంలో శాసనాలున్నట్లు 17-7-1949 ది హిందూ పత్రిక ప్రచురించింది .

   చేయాల్సిన పని ఇంకా కొంత మిగిలి ఉందని భావించి,దాన్ని సాఫల్యం చేయటానికి నిశ్చయించి , శంకరులు ,కాశ్మీర్ నుంచి కామరూప దేశం అని పిలువబడే పూర్తిగా శాక్తేయులతో నిండి ఉన్న అస్సాం వెళ్ళారు  .అక్కడ వారి నాయకుడు అభినవ గుప్త అసాధారణ  ప్రజ్ఞా పాటవాలు కలవాడు .శంకరుని ముందు వాదం లో నిలవలేక ఓడిపోయి,ఆచారం ప్రకారం మండనుడు మొదలైన ఇతర సిద్ధాంతుల్లాగా శంకరుని అనుసరించి ,సన్యాసం తీసుకోక పోయినా ,అద్వైతాన్ని అనుసరించక ,కుయుక్తి పన్ని శంకరునిపై ప్రయోగం చేసి తీవ్రమూల వ్యాధి   పాలు చేసి పాపి అయ్యాడు .ఆవ్యాధితో నిరంతర రక్త స్రావముతో శంకరులు విపరీతమైన బాధ పొందారు .వైద్య చికిత్స చేసినా ఫలితం కనిపించలేదు .పద్మపాదుడు ఆచార్యునిపై ఎవరో విష ప్రయోగం చేశారని అవగాహన చేసుకొని ,అది అభినవ గుప్తుడి పరాభవ ప్రతీకారమే అని తెలుసుకొని ,ఆతడిపైనే మళ్ళీ ప్రయోగం చేయగా  శంకరుని ఆరోగ్యం కుదుటబడి ఆ వ్యాధి అభినవ గుప్తుడిలో ప్రవేశించి ప్రాణం తీసింది .

         అస్సాం నుంచి నేపాల దేశం చేరి ,అనేక ప్రదేశాలలో పర్యటించి ,అక్కడి రాజు వృష సేన వర్మకు అతిధిగా ఉంటూ ,అద్వైత మత వ్యాప్తి చేసి ,  .శంకరానుగ్రహం తో జన్మించిన తనకుమారునికి వృష వర్మ శంకరవర్మ అనే పేరు పెట్టుకొన్నాడు  తర్వాత శంకరులు బదరికాశ్రమం చేరారు.నేపాల చరిత్రలో శంకరులు ఆ దేశానికి క్రీ.పూ.488-487లో వచ్చినట్లు లిఖి౦పబడి ఉంది .

              శ్రీ శంకరుల బ్రహ్మైక్యం

బదరీ క్షేత్రాన్ని చేరిన శంకరులకు అస్సాం లో సంక్రమించిన వ్యాధి పూర్తిగా నివారణ కాక చాలా ఇబ్బంది పడ్డారు .శిష్యులకు భాష్యం బోధించటం నిర్విరామంగా చేస్తూనే ఉన్నారు .తమ చే స్థాపింపబడిన పీఠాలు శృంగేరికి సురేశ్వరాచార్యులను ,ద్వారకకు హస్తామలకా చార్యుని ,జగన్నాధగోవర్ధన పీఠానికిపద్మపాదా చార్యులను ,బదరీ జ్యోతిర్మఠానికి తోటకాచార్యులను నియమించి ,వాటి నిర్వహణకు నిబంధనావళి తయారు చేయించారు .విశ్రాంతి తీసుకోవటానికి బదరి నుంచి కేదార క్షేత్రం చేరారు .అక్కడి శీతల బాధ నివారణకోసం ఉష్ణోదక గుండాన్ని నిర్మించారు .తమ 32వ ఏట కలియుగం 2625అంటే క్రీ.పూ.477 శ్రీ రక్తాక్షినామ సంవత్సర వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ శంకర భగవత్పాదులు బ్రహ్మైక్యం చెందారు అని మాధవ విద్యారణ్య శంకర విజయం లో ఉన్నది .

  కాని ‘’గురువంశ కావ్యం’’ ప్రకారం శంకరులు బదరికాశ్రమం లో ఉండగానే ,దత్తాత్రేయ మహర్షి ఆనందించి శంకరుని దగ్గరకు వచ్చి తన గుహలోనికి తీసుకు వెళ్ళినట్లు మాత్రం ఉంది కానీ శంకర నిర్యాణ విషయం చెప్పబడ లేదు .చిత్సుఖాచార్యుని బృహత్ శంకర విజయం ,ఆన౦దగిరి కృత శంకర విజయం ,లలో శంకరులు దేశ పర్యటన పూర్తి చేసి కాంచీపురం వచ్ఛి అక్కడే సిద్ధిపొందారని ఉన్నది .కంచిలో కామాక్షీ దేవి ప్రతిష్టచేసి ,,ఆనగరం లో పండిత ప్రకా౦డులు వెంటరాగా ,వేద ఘోష మిన్నంటుతుండగా శ్రీ రాజ రాజేశ్వరీ సన్నిధానం లో శ్రీ సర్వజ్ఞ పీఠంఅధిరోహించారు .ఇదే తర్వాత కామకోటి పీఠం గా ప్రసిద్ధి చెందింది .ఈ కంచికామకోటి పీఠానికి’’సర్వజ్ఞాత్ముని ‘’ఆచార్యునిగా నియమించారు .తర్వాత కాలం లో కామాక్షీ అమ్మవారి ఆలయం లో బ్రహ్మనిష్ఠ పూని శంకరులు ,బ్రహ్మైక్యం చెందారని బృహత్ శంకర విజయం చెప్పింది .దీనికి ప్రమాణం ఆలయంలోని శంకరుల శిలా విగ్రహం ఉంది అంటారు .ఇది బలీయమైన ఆధారం కాదన్నారు శ్రీశ్రేష్టులూరి కృష్ణస్వామయ్య తమ ‘’జగద్గురు శంకరాచార్య చరిత్రం ‘’లో .ఇప్పటికీ శంకర నిర్యాణ ప్రదేశం నిర్దారణకాలేదు జగద్గురువై ,ప్రజ్ఞా శక్తియై ,జగత్ ఉద్ధరణ చేసిన అద్భుత పవిత్ర మూర్తి శ్రీ శంకర భగవత్పాదులకుఉచితమైన స్మారక చిహ్నాన్ని నిర్మించటం అత్యావశ్యకం అని సుమారు అరవై ఏళ్ళ క్రితం ద్వారకా పీఠాధిపతి దేశం లోని పండితులందరికి శ్రీముఖం పంపారు ,అలాగే ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి డా.సంపూర్ణానంద్ చేసిన కృషి కూడా అభినందనీయం ‘’అన్నారు శ్రీ అనుభవానంద స్వామి.

  ‘’The greatest expositor of the Upanishads ‘’ఉపనిషత్తులకు ఉన్నతోన్నత వ్యాఖ్యాత అని పేరుపొందినవారు శంకరులు అన్నాడు డా.ఆర్చి బాల్డ్ ఎడ్వర్డ్ తన ‘’దిఫిలాసఫీ ఆఫ్ ఉపనిషద్స్’’లో ‘’ అనాదిగా ఉన్న అవిద్యా ప్రాబల్యాన్ని ,అహంకారాన్ని రూపుమాపి,అసంఖ్యాక మానవ కోటి నిజతత్వ పరిశీలన తో సర్వ పరిమిత ,సంకుచిత్వాదులకు అతీతమైన ,’’అఖండానంత బ్రహ్మ రూపం తానే ‘’అనే పరమార్ధాన్ని ,స్థూలత్వ ,పశుత్వాది లక్షణాలను ,అగోచరత్వాది సర్వ విలక్షణ సంస్థితి నొందించ టానికి జన్మించి ,శ్రమించి ,తపించి ,సంకల్ప సిద్ధిని సాధించిన జగద్గురువులు శ్రీ ఆది శంకర భాగవత్పాదా చార్యుల  సన్మూర్తి స్థూల దేహాన్ని త్యజించినా ,అన౦త ముముక్షు హృదయాలను వికసింప జేసి ,ప్రకాశింప జేసి ,ప్రకాశిస్తూనే ఉంటారు .అందు చేత ఆయన మూర్తి నాటికీ నేటికీ నవ యౌవనమై ,కుశలమై ,తేజో పూర్ణమై,శుద్ధమై ,జరామరణ దూరమై ,అద్భుతమై వెలుగొందుతూనే ఉన్నది .అలాంటి పరమ పావన మూర్తికి ,సర్వ బంధ విచ్ఛేద కోపాయ ప్రదాతకు ,త్రాత కు నమ్ర నమోవాకాలు .,శ్రేష్ఠ సాష్టాంగ దండ ప్రణామాలు ,సర్వార్పణం ‘’అని పులకిత గాత్రం తో పలికిన శ్రీ అనుభావానంద స్వామికి శత సహస్ర వందనాలు .

  ‘’సర్వతంత్ర స్వతంత్రాయ సదాత్మా ద్వైత వేదినే –శ్రీమతే శంకరార్యాయ  వేదాంత గురవే నమః ‘’(విద్యారణ్యులు )

   తర్వాత శ్రీ శంకర సారస్వతం గూర్చి తెలుసుకొందాం .

 సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-5-21-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అవర్గీకృతం. Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.