అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య
శ్రీశంకర సాహిత్యం -2
శ్రీ శంకర భాష్యాలు –‘’సూత్రార్దో వర్ణతో ఏన సదైహ్సూత్రాను సారిభిః స్వవచనాని వర్ణ్యతే భాష్యం-భాష్య విదోవిదుః’’స్వంతవాక్యాల సూత్రాభి ప్రాయాలను అనుసరించి ,సూత్రార్ధాన్ని వర్ణించేది భాష్యం అని భాష్యజ్ఞుల అభిప్రాయం .అంటే గ్రంథం లో ఉన్న భావాన్ని తనమాటలతో వర్ణించి ,అందులో స్వంతభావాలను చెప్పటమే భాష్యం .తన ప్రత్యేకభావాలు ,అనుభూతి నుంచి వాటి నిరూపణకోసం వేదోక్తులను ఉపయోగించటం కూడా భాష్యమే .రచయిత స్వతంత్ర వ్యక్తిత్వం నిరూపించబడాలి .భాష్య రచనచేసిన భగవత్పాదులకు తత్వ శాస్త్ర వేత్తలలో ఉన్నత స్థానం ఉన్నది .’’Philosophers greatness lies in two things ,originality of subject matter and the critical method of presentation ‘’విషయ స్వాపేక్షిత్వానికి, ఉక్తి రచనా విధానానికీ తత్వ వేత్తల గొప్పతనం ఇమిడి ఉండినట్లేశంకరులు కొన్ని స్వతంత్ర భావాలు కలిగి ఉండి,వాటిని శాస్త్రాదులలోనూ చూసి ,,ఉప్పొంగి ,గురు సాన్నిధ్యం లో తపో కృషి వలన వాటిని స్థిరం చేసుకొని వాటికి అనుగుణంగా బోధించి రచించటం వలన ఆయన ప్రపంచ తత్వ వేత్తలలో అగ్రగణ్యులు అనటం సముచితం ‘’అన్నారు మాహానామ వ్రతబ్రహ్మచారి తమ ‘’కళ్యాణ కల్ప తరు ‘’లో .శ్రుతి ప్రమాణాలను విరివిగా చూపించటం,తనభావాలను సమర్ధించే పూర్వ గ్రంథ ఆచార్యులకు తన కృతజ్ఞత చెప్పటం వలన తాను వేద తాత్పర్యాన్నే బోధిస్తున్నానని ,శంకరులు సప్రమాణంగా చూపించారు ‘’అని డా. ద్రుపద్ఎస్ దేశాయ్ ‘’ప్రబుద్ధ భారత’’లో రాశాడు .అందుకే అతి తక్కువ కాలం లోనే వేదవేదాంగాధ్యయనం పూర్తి చేసి ,తన సంస్కారానికి అనువైన అద్వైతాన్ని వాటిని నుంచి గ్రహించి ,గోవింద భగవత్పాద గురువుల సన్నిధానం లో దాన్ని పెంచి పోషించి ,అంతగా విజ్రు౦భి౦చ గలిగారాయన .అందుకే అద్వైత వాదం వైదికమై ,ఉపనిషత్ ప్రబోధకమై ఉంటూ,దాన్ని లోకం లో ప్రసరిప జేసిన శంకరుల వ్యక్తిత్వం ఆయా శాస్త్రాల్ని కప్పి పుచ్చి ,తానె దాని కర్త అయినట్లు విపర్యయ జ్ఞానాన్ని ,అజాగ్రత్ ప్రజ్ఞులలో కలుగ జేసింది ‘’అంటారు అనుభవాన౦దులు .
‘’ ఉపనిషత్తులలో అనేకరీతులుగా ఉన్న విషయాన్ని ‘’A consistent philosophical system ‘ఒక సుస్థిర తత్వ సిద్ధాంతంగా ’ నిర్మించటం అంత సులభమైన పనికాదు ‘’అంటాడు ప్రొఫెసర్ పాల్ దేవ్ సేన్ .అయినా జీవులకు హిమాలయమ అనీ ,నిత్యాలని పేరుపొందిన భారతీయ ఆధ్యాత్మిక తత్వ సారాలైన ఉపనిషత్తులనే ప్రధానంగాతీసుకొని,వాటికి అనుగుణంగా సమన్వయాలు చేసి,ఒక విశిష్ట సిద్ధాంతాన్ని శంకరాచార్య రూపొందించారు .గౌడ పాదుడు అద్వైత సిద్ధాంత గ్రంథాలు రాసినా ,శంకరులే తన సర్వకాల ,సర్వావస్థ సర్వ శక్తులను అద్వైత సిద్ధాంత నిర్మాణానికి ఉపయోగించి ,పూర్వ విషయాలను అను సంధించి మహాద్భుత సిద్ధాంత నిర్మాణం చేశారు ,’’అందుచేతనే ‘’We must admit without hesitation that Sankara’s doctrine faithfully represents the prevailing teachings of the Upanishads ‘’ఉపనిషత్ బోధలను అనుసరించేశంకర వాదం ఉంది అని నిస్సందేహంగా చెప్పవచ్చు అన్నాడు ప్రముఖ వేదాంతి ,పండితుడు డా.జార్జి తిబౌట్ .శంకరవాదం అత్యంత మృదువుగా వివిధ సిద్ధాంతాల సమన్వయంగాఉంది అంటూ ‘’Its fundamental doctrines are manifestly in greater harmony with the essential teachings of Upanishads ,than those other systems ‘’ఇతర సిద్ధాంతాలకంటే ఉపనిషత్తుల ముఖ్య సూత్రాలను ,దీని మూల సిద్ధాంతాలు మరింత ఎక్కువగా అనుగుణంగా ఉన్నాయి ,శంకర వాద చాతుర్యం అద్భుతమనీ ,’’He does more justice to Upanishads ‘’ఉపనిషత్తులకు అత్యధిక న్యాయం చేకూర్చినవాడుశంకరుడే ‘’అనీ డా.ఎబి కీత్ పండితుడు –ఏ హిస్టరీ ఆఫ్ సాంస్క్రిట్ లిటరేచర్’’లో రాశాడు.
‘’శంకరుడు దేనికది ప్రత్యేకంగా ఉపనిషత్తులను పరిశీలించి ,అక్కడికక్కడే సిద్ధాంత సమన్వయము చేసి ,అందులో ఇతర సిద్ధాంత అన్వయం కు కూడా తగినట్లు మంత్రార్ధాలను అద్వైతపరంగా ఏకీకృతం చేసినట్లు ,పూర్వకాలం లో బాదరాయణ వ్యాసుడు కూడా ఉపనిషత్ వాక్ ఐక్యత ప్రతిపాదన కోసం బ్రహ్మ సూత్ర రచన చేసి ఉంటాడు ‘’అన్నారు అత్యంత అనుభవంతో శ్రీ అనుభవానందస్వామి..ఇద్దరి గమ్యం ఒక్కటే .శంకర భావ ధారకు వ్యాస తాత్పర్యం విరుద్ధంగా ఉంటె ,శంకరులు ఆగ్రంథ ప్రశంస అస్సలు చేసే వారు కాదేమో .
‘’లఘూని సూచితార్ధాని స్వల్పాక్షర ప్రధానిచః సర్వతః సారభూతాని సూత్రాణ్యా హుర్మనీషిణః’’అని భామతిలో చెప్పబడినట్లు స్వల్పాలై ,అర్ధ స్పూర్తిగా అల్పాక్షర పదాలతో సారభూతాలైన సూత్ర రూపంగా రచించటం చేతనే అవి సామాన్య ప్రజ్ఞకు అతీతంగా ఉన్నాయి.ఈ విధమైన రచనావిధానం ప్రపంచం లో ఒక్క భారత దేశం లో మాత్రమె జన్మించి ప్రావీణ్యత పొందింది ‘’అని డా.ఎం.వింటర్నిట్జ్ పండితుడు ప్రశంసించాడు .ప్రతి కొత్త మతశాఖ తమ సిద్ధాంతాలకు అనుగుణంగా వ్యాస సూత్రాలకు ఒక కొత్త వ్యాఖ్యానాన్ని ప్రారంభిస్తుంది ‘’అన్నారు వివేకానంద స్వామి .శంకరాచార్యకాలం లో ‘’తత్వ విచార’’ కర్త ఉమామహేశ్వరుని వాక్యాలను బట్టి 99వ్యాఖ్యానాల ను ఈ వ్యాస సూత్రం లో ఉన్నాయి .అందులో ముఖ్యమైనవి ఉపవర్ష,బోధాయన ,భర్త్రుప్రపంచ ,ద్రావిడా చార్య ,తంక,గుహాదేవ ,కపర్ది ,భరుచి మొదలైన వారి వ్యాఖ్యానాలు ప్రసిద్ధమైనవి .అందుకే శంకరులు శ్రుతివిరుద్ధమైన కల్పనల నుంచి సూత్రాలను ఉద్ధరించే కార్యక్రమం లో ‘’భాష్యం ప్రసన్న గంభీరం ‘’అని వాచస్పతి మిశ్రుడు భామతి లో చెప్పినట్లు శంకరులు సూత్ర భాష్యంరాశారు .శంకరుల సూత్ర భాష్య రచనతో పూర్వ వ్యాఖ్యానాలన్నీ అప్రదానాలై కాలక్రమ౦లో నశించిపోయాయి .’’సర్వ సూత్ర భాష్య గ్రంధాలకేఅతి ప్రాచీనమై ,’’Master piece of Sankaracharya’s life’’శంకరాచార్య జీవితం లో అది శిరో భూషణమైంది అన్న సోదరి నివేదిత వాక్యం పూజనీయం స్వామి రామతీర్ధ దీన్ని ‘’The oldest and the best ‘’సర్వోత్తమ ,ప్రాచీన శ్రేష్టం ‘’అన్నారు .’’His expositions agree in all essentials with the meaning of the Brahma Sutras ‘’ అన్ని ముఖ్య విషయాలలో బ్రహ్మ సూత్రార్ధాలకు అనుగుణమైన వివరణం .ఇతర భాష్యాలకంటే శంకర భాష్యమే ‘’The only true representative of the Sankara’s views ‘’బ్రహ్మసూత్ర కారుడు వ్యాసుని తత్పర్యాలకు సరియైన ప్రతిబింబాలుగా ,శంకర భాష్యసూత్రాలు సర్వ ముఖ ప్రశస్తి పొందాయి’’అన్నారు స్వామి రామతీర్ధ .’’శంకర భాష్యం ఉపనిషత్తులలో బ్రహ్మ౦ అనీ ,పరమాత్మ అనీ చెప్పబడే తత్వాన్ని ఖండితంగా సమర్ధించే సనాతన వైదిక మతాన్ని ప్రవచిస్తోంది .ఆయన తాత్విక సిద్ధాంతం భారత దేశం లో పురుడుపోసుకొన్న అనేక సిద్ధాంతాల కంటేఅతి ముఖ్యమైంది .దానిలో ప్రకటింప బడిన ‘’ boldness ,depth ,subtility of speculation ‘’ధైర్య౦ అగాధత్వం సూక్ష్మత్వం ఆలోచనా పటిమ అసాదారణాలు ‘’అన్నాడు శంకర ,రామానుజ భాష్యాలను ఇంగ్లీష్ లోకి అనువదించిన ప్రముఖ సంస్కృత విద్వాంసుడు తిబౌట్ పండితుడు.సూత్రభాష్య ఉపోద్ఘాతం లో అగాధ అధ్యాస భాష్యంచూసి అవాక్కైపోవాల్సిందే అన్నాడు సి .మహాదేవయ్య .’’శంకరుల మేధాశక్తి వ్యాస సూత్రాలలో కాకుండా భాష్యంలోదర్శించవచ్చు ‘.’’ఆయన భాష్యం పూర్వ భాష్యాలను మరుగు పరచి సూక్ష్మ హిందూ చిత్తాలనుకదిలించి ఈనాటికీ ఆశ్చర్య పరుస్తోంది ‘’ ‘’అన్నాడు ఆచార్య ఎర్నెస్ట్ పి.హార్విట్జ్. నిస్సందేహంగా భాష్య రచనా విధానానికి శంకర భాగవత్పాదులే మిగిలిన వారికి ప్రమాణం అన్నారు శ్రీ అనుభవానందులు .
ఆధారం –శ్రీ అనుభవాన౦ద స్వామి వారి ‘’సర్వ సిద్ధాంత సౌరభం ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-5-21-ఉయ్యూరు