అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య   శ్రీశంకర సాహిత్యం -3 శంకర భాష్యాలు -2

అద్వైత భాస్కరులు ఆది శంకరాచార్య

  శ్రీశంకర సాహిత్యం -3

శంకర భాష్యాలు -2

ఉపనిషత్తులను వ్యాఖ్యాని౦చేటప్పుడు శ్రీ శంకరులు ,బాదరాయణ సూత్రాలకు అనుగుణంగా భాష్యం రాయలేదని ప్రొఫెసర్ సురేంద్రనాథ దాస్ గుప్త –ఎ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీలో రాశాడు ,బాదరాయణుడు  అద్వైతి కాదు సగుణ బ్రహ్మవాది అయినా శంకరభాష్య౦ ‘’Attained  wonderful celebrity both on account of subtle and deep ideas it contains ,and also it contains ,and also on account of the association of the illustrious personality of Sankara ‘’అంటే అందులోని అతి గాఢ,సూక్ష్మ భావజాల ప్రభావం చేత శంకర ప్రఖ్యాత వ్యక్తిత్వ కారణం గా అద్భుత ప్రశస్తి పొందింది అని దాస్ గుప్త అభిప్రాయ పడ్డాడు .’’గ్రంథప్రభావం ఎక్కువగా వ్యక్తి ప్రభావం తాత్కాలికంగా ఉంటుందని అందుకే శంకర వ్యక్త్యాకర్షణ భాష్యం లో ముఖ్యంగా ఉన్నా ,అందులోని సారమే సకల జనాలను ఆకర్షించి౦ది .ఉపనిషత్తుల భావ వైవిధ్యాన్ని వ్యాసుడు తొలగించగా ,శంకర భాష్యం ఉపనిషత్ ప్రమాణాలై  ఉండగా వ్యాసుని భావాలకు విరుద్ధం అనటం తప్పు .ఉపనిషత్ ఆధార సూత్ర గ్రంథాన్ని ఉపనిషద్భాష్య గ్రంథాల ద్వారా రక్షించి ,దాని నిర్మల స్థానాన్ని పదిలపరచాడు ‘’అన్న శ్రీ అనుభావానందుల వాక్యాలు సప్రమాణాలు . అందుకే వివేకానందుడు ‘’వ్యాస భావాలకు అత్యద్భుత రూపాన్నిచ్చే అసామాన్య ప్రజ్ఞా శక్తి భాష్యకారుడైన శ్రీ శంకరా చార్య మహిమ ‘’అన్నాడు .

   ఈ విధంగా శ్రుతి,యుక్తి ల ననుసరించి ఉపనిషత్ సూత్రాలకు భాష్యం రాసి ,అనుభవ భాష్య రచనకోసం ‘’The most beautiful perhaps the only true philosophical song existing in any known language ‘’ఏ భాషలోనైనా అత్యంత సుందరమైన బహుశా యదార్ధ తాత్విక గీత౦’’అని  విలియం వాన్ హువార్ బోల్ట్అని ప్రశంసించిన భగవద్గీతా శాస్త్రాన్ని తీసుకొని శంకరులు భాష్యరచన చేశారు .భగవద్గీత ‘’is rightly regarded as one of the greatest master piece of Hindu Vedanta ‘’భారతీయ వేదాంతం లో సర్వోత్తమ శిరో భూషణం ‘’అన్నాడు దాస్ గుప్తా .ఇందులో కృష్ణ పరమాత్మ స్వానుభవ యుక్తంగా బ్రహ్మ సిద్ధికి ఉపాయాలను ప్రతిపాదించి ,దాని ఫలితమైన స్థిత ప్రజ్ఞత్వం మొదలైన సిద్ధి లక్షణాలు బోధించి ‘’అహం బ్రహ్మాస్మి ‘’అనే చరమ వృత్తి సూచకంగా ఉన్న అద్వైత అనుభూతికి ముఖ్యమైన ‘’సగుణ బ్రహ్మైవాహం ‘’అనే విధంగా తన విరాట్ స్వరూపాన్ని కూడా వ్యక్తపరచి వేదప్రతిపాదితమై,సూత్రాలచేత నిర్ధారితమైన స్థితిని అనుభూతి గా దర్శించటానికి గీతా శాస్త్రాన్ని శంకరులు ఉచితమైనదిగా తోచి ,అంతకు ముందు అది ముఖ్యమైనదిగా కాక ,ప్రఖ్యాతి పొందక ఏరకమైన భాష్యాలు ఉన్నాయనే ఆధారం లేకపోయినా ,శంకరులు దాన్ని గ్రహించి ,భాష్యం రాయటం తో అంతకు ముందున్న వాటి కంటే మహా ప్రాముఖ్యం కలిగి ,ఆనాటి నుంచి అనేక భాష్య వ్యాఖ్య వివరణలు రాయబడి ప్రపంచ వ్యాప్తి పొంది ,అందరి హస్తాలకు ఆభరణమై,సర్వోత్కృష్ట గ్రంథ రాజం గా విరాజిల్లుతోంది. ఇది శంకర హస్త స్పర్శా మహాత్మ్య ఫలితమేమో ?’’అని కీర్తించారు శ్రీ అనుభవానందులు .ఈ విధంగా బ్రహ్మ విద్యా శిఖరానికి తీసుకు పోయే ప్రస్థాన త్రయమైన బ్రహ్మ సూత్రా ఉపనిషత్ సూత్రా ,గీతా భాష్యాలు మూడింటిని అత్యంత ప్రతిభతో చిత్రించిన శ్రీ శంకర భగవత్పాదులు ,తన అద్వైత సిద్ధాంతానికి ఒక అద్భుత రూపాన్ని సృష్టించి ,ఆతర్వాత స్వంతరచనలకు శ్రీకారం చుట్టారు.

              శ్రీశంకర  ప్రకరణ గ్రంథాలు

‘’శాస్త్రైక దేశ విషయం ,శాస్త్ర కార్యా౦తరేస్థితం –ఆహుః ప్రకరణం నామ గ్రంథ భేదం మనీషిణః’’-అంటే శాస్త్రం లో చెప్పిన విషయాన్నే కలిగి ,ఆశాస్త్రానికి ప్రత్యేకంగా నిర్మించిన గ్రంథమే ప్రకరణం .పూర్వం తన చేత భాష్యగ్రందాలలో ప్రతిపాదింప బడి,లోకం లో స్థిరమైన అద్వైత   విషయాలనే  ఇంకా సులభంగా అందరికి తేలికగా అర్ధమయ్యేట్లు చెయ్యాలని శ్రీ శంకరులు ఈ ప్రకరణ గ్రంథ రచన చేయాలని సంకల్పించారు .అంతేకాక ,భాష్యాలలో తన మనసులోని విషయప్రవచనానికి ఆయా రచనలలోని భావాలు నిరోధిస్తూ ,నిరటంకానికి అడ్డుగా ఉన్నాయని తెలుసుకొని ప్రత్యెక రచనలు చేయాలని ఆయనకు అనిపించి ఉండవచ్చు .ప్రకరణ సాహిత్యం లోనూ ఆయన ఆయన మేధాశక్తి అవిచ్చిన్నంగా స్పష్టంగా ,అజేయంగా ప్రజ్వరిల్లింది. కనుక అద్వైత జిజ్ఞాసువులకు భాష్య గ్రంథాలకంటే,ప్రకరణాలే ప్రధానంగా ,సులభ గ్రాహ్యాలుగా కనిపించి ఆయన ఆలోచనకు అద్దంపట్టాయి .

   శంకర కృత ప్రకరణాలు 41-1-ఉపదేశ సాహస్రి 2-వివేక చూడామణి ,3-ప్రపంచ సార ,4-మహావాక్య దర్పణ ,5-అపరోక్షానుభూతి ,6-శత శ్లోకి ,7-ప్రబోధ సుధాకర ,8-వేదాంత సార ,9-వేదాంత డిండిమ,10-సదాచార ,11-వాక్య వృత్తి,12-ఆత్మ బోధ ,13-ఆత్మానాత్మ వివేక 14,ఆత్మ చింతన ,15-హరి మీడేస్తుతి ,16- ,విజ్ఞాన నౌక ,17-యోగ తారావళి 18-స్వాత్మానంద ప్రకాశ ,19-జీవన్ముక్తానంద లహరి,20 శివానంద లహరి ,21-సౌందర్య లహరి ,22-ప్రశ్నోత్తర మాల ,23-పంచీకరణ ,24-రాజయోగ ,25-బ్రహ్మ విద్యా విలాస ,26-దశ శ్లోకి ,27-అద్వైతానుభూతి 28- అనాత్మ శ్రీ నిగర్హణ,29-స్వరూపాను సంధాన ,30-ప్రౌఢానుభూతి ,31-బ్రహ్మజ్ఞానావళీ మాల ,32-లఘు వాక్య వృత్తి,33-నిర్వాణ మంజరి ,34-బ్రహ్మాను చింతనం ,35-తత్వోపదేశ,36-మాయా పంచక 37-ఏక శ్లోకి ,38-రామకర్ణామృత ,39-గాయత్రీ భాష్య ,40-సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహ ,41దేవ పూజా విధానం .

  ఇందులోని శివానంద లహరి సౌందర్యలహరి ,హరిమీడే స్తోత్రం లను కొందరు స్తోత్ర గ్రంథాలలో చేర్చారు  .ప్రకరణాలలో వివేక చూడామణి ,ఉపదేశ సాహస్రి,సర్వవేదాంత సిద్ధాంత సార సంగ్రహం అతి ముఖ్యమైనవి .బెల్వార్కర్ పండితుడు ప్రకరణాల సంఖ్య112అని తేల్చాడు .వీటిలో అపర్క్షానుభూతి ఆత్మబోధ ,ఉపదేశి సాహస్రిలోని పద్యభాగం, పంచీకరణ ప్రక్రియ,శతశ్లోకి అనే ఎనిమిదింటిని మాత్రమె శంకర కృతాలన్నాడు  .

  తర్వాత శంకర స్తోత్ర రచనలు తెలుసుకొందాం .

  ఆధారం –శ్రీ అనుభవానంద స్వామి వారి –‘’సర్వ  సిద్ధాంత  సౌరభం’’

రేపు 25-5-21 మంగళవారం వైశాఖ శుద్ధ చతుర్దశి –‘’శ్రీ నృసింహ  జయంతి ‘’శుభా కాంక్షలు

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-5-21-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అవర్గీకృతం. Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.