బౌద్ధం లో దుఖం –నివారణోపాయం

బౌద్ధం లో దుఖం –నివారణోపాయం

దుఖానికి ముఖ్యకారణం ఒక శరీరాన్నుంచి ఇంకొక శరీరానికి సంక్రమించే అంటే పరకాయ ప్రవేశం చేసేదే అంటే సంసారమే .బృహదారణ్యక ఉపనిషత్ లో దీన్ని బాగా వర్ణించారు .పుట్టుక అంటే ఏమిటి ?జీవి శరీర౦, అవయవాలు పొందుతాడు. వాటినే పాప్మాలు అంటారు .అవి సంక్రమించాక చెడు భావాలు వ్యాపిస్తాయి .అవే దుఖాలకు కారణాలౌతాయి.చావు అంటే ఏమిటి ?జీవి శరీరాన్ని ,అవయవాలను వదిలటమే మరణం . ఇది ఎలా జరుగుతుంది ?బాగా బరువుతో నిండిన బండి  ఘర్షణకు లోనై కీచు ధ్వని కల్గి౦చినట్లు ,జీవుడుకూడా శ్వాస అందక యేవో అస్పష్ట శబ్దాలు చేస్తూఉండగా ఊపిరి ఆగిపోవటమే చావు .శరీరం దుర్బలమై  ముసలితనం తోనో జబ్బులతోనో  కృశించి పోతుంది .పండిన పండు చెట్టును వదిలి రాలిపోయినట్లు ,జీవికూడా శరీరం లోకి ఎలా ప్రవేశించాడో అలాగే అందులోఉండే అన్ని అవయవాల నుంచి విడివడి  బయటికి వెళ్ళిపోతాడు .శరీరగతమైన జీవి చావుకు ముందు బాధలతో అనేక శబ్దాలు చేస్తూ,జీవపదార్ధమంతా ఖర్చైపోగా ఊపిరి పీల్చుకోవటానికి నానా బాధలు పడుతూ ,జ్ఞాపకశక్తికోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉంటాడు అని   శంకరాచార్యులు వివరించారు.

  కస్టాలు, అశాశ్వతత్వం లతో ప్రపంచం ఏర్పడింది అని భగవద్గీత చెప్పింది –‘’అనిత్యం అసుఖం లోకం ఇమాం ప్రాప్య భజస్వమాం’’.అశాశ్వతత్వాన్ని బోధిస్తూ ఒకే ఒక విషయం దుఖం ,దాని విరమణ ‘’గూర్చే చెప్పాను అన్నాడు భగవాన్ .దుఖం అంటే భౌతిక ,మానసికమైనది కాదు .బౌద్ధమేధావి’’ ప్రియదర్శి తేరా’’చెప్పినట్లు అసాధారణమైన అస్తిత్వం యొక్క అసంతృప్తి విధానమే దుఖం .బుద్ధుడికి ఆయన సందేశాలకు అర్ధం దుఖాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవటం ,ఈ అసంతృప్తులనుంచి బయట పడటం మాత్రమె .బౌద్ధ సిద్ధాంతం నిరాశావాదమూ కాదు, అశావాదమూ కాదు .కానీయదార్ధమైనది .దుఖం అనేది జీవితం లో మూల తత్వమే .అశాశ్వతాలు, అసంతృప్తి కారకాలను పట్టుకొని వ్రేలాడటమే దుఖం.జీవితాన్నీ ,లోకాన్నీ నిజస్వరూపం లో అర్ధం చేసుకోవటానికి తోడ్పదేదే దుఖం .

  ‘’లామా సూర్య దాస్ ‘’అనే పండితుడు దుఖ స్వభావాన్ని బాగా వర్ణించాడు .ప్రతివాడూ దుఖంతో బాధపడుతున్నాడని బౌద్ధం చెప్పలేదు .బౌద్ధం ప్రకారం జీవితం అంటే కష్టతరమైనదీ అసంపూర్తిగా ఉండేది  ‘ఇదే జీవితం యొక్క స్వభావం .ప్రపంచంలో సుఖ సంతోషాలను త్రోసిపుచ్చాలని బౌద్ధం చెప్పలేదు  .అయితే ఈ సంతోషం అశాశ్వతం ,మార్పు చెందేది అని బోధించింది .ఈ అశాశ్వత  స్వభావం వలన ,మనం అనుభవించేది అంతా మూల దుఃఖ భాగమే ,అసంతృప్తి నిచ్చేదే .సంతోషంగా ఉన్నప్పటికీ దుఖం ,అసంతృప్తి వెంటనంటే ఉంటాయి అని బౌద్ధం బోధించింది .

  దుఖాలు మూడు రకాలు -1-సాధారణ దుఖం .అంటే శారీరక మానసిక దుఖం .పుట్టుక ,రోగాలు ముసలితనం ,చావు ,ఆదుర్దా ,ఫ్రష్ట్రేషన్,కోరింది లభించని  అసంతృప్తి .జోసెఫ్ గోల్డ్ స్టెయిన్ అనే బౌద్ధపడితుడు యుద్ధాలు ఆకలి హింస ,జబ్బులు మొదలైనవి కూడా దుఖాన్ని కలిగించేవే అన్నాడు .ఇవి అనుల్లంఘనీయాలుకావు కానీ ఆ సమయానికి వచ్చేవి .

2-విపరిణామ దుఖం –ఈ స్థాయి దుఖం లో పరిస్థితులు మారిపోతాయి .ఇందులో యంక్సైటీ,స్ట్రెస్ ఉంటాయి అనుకొన్నది జరగకపోయినా ,కోరింది దొరకక పోయినా ఈ స్థితి కలుగుతుంది .ఈస్థితిలో అసంతృప్తి ,ప్రపంచ స్వభావం నిజంగా లేదనే భావం ,వాటిలో వస్తున్న మార్పూ కనిపిస్తాయి .ఇదే అశాశ్వతభావన అంటుంది బౌద్ధం .వస్తువులు మనజీవితం లో ఎలా ప్రవేశించి నిలిచి కనుమరుగై పోతాయో అర్ధమౌతుంది .ఇంతమాత్రం చేత ఆన౦దాన్నిచ్చేవి అనుభవి౦చ వద్దనికాదు .మన సుఖ దుఖాలకు సంబంధంలేకుండా పదార్ధాలు స్వతంత్రంగా ఉంటాయి .మనభావనలకు కొత్తదనాన్నీ ,చూసే దృక్పధం లో మార్పును తెలియ జేస్తాయి .

3-శంకర దుఖం –దీన్నే కండిషన్డ్  ఎక్స్పీరిఎన్స్ అంటారు .జీవితం లో అన్ని అస్తిత్వాలు అన్ని రూపాలు అస్థిరమని  వస్తువులమార్పులు లేకపోవటాలవలన తెలిసి వస్తుంది .బౌద్ధ పండితుడు ‘’ప్రేమ చోడ్రాన్ ‘’ఈ స్థితిలో మన ఈగో తో ఆటలాడటం గా దాన్ని వర్ణించాడు .’’ఫిలిప్ మొట్ ఫిట్’’ వేదాంతి పరిస్థితులపై కోపం, ద్వేషం, ఈర్ష్య, అసూయ లు ఏర్పడి ,అస్తిత్వం పైనే అనుమానం కలుగుతుంది .దీనిపై బుద్ధుడు స్పందిస్తూ ‘’జీవితం లో అసంతృప్తులు మనం ఉన్న ప్రతిక్షణ అనుభూతి వలన కలుగుతాయన్నాడు .’’గేషె తాషి సెర్వింగ్ ‘’అనే టిబెట్ లామా ఇదంతా తప్పించుకోలేని దుఖం, బాధలు .మనం ఎక్కడ ఎప్పుడు పుట్టినా ఉండేవే అన్నాడు .

దుఖానికి వేదాంత నివృత్తి మార్గం –దుఖమనేదిమన దినదిన సమస్యకాదు .అనిత్యాలైన వాటికోసం ప్రాకులాడి చేతులారాడుఖాన్ని కొని తెచ్చుకొంటున్నాం  .వీటికంటే శాశ్వత మైన సత్యాన్ని మనం గ్రహించాలి .విశ్వ చైతన్యం మనకు ఎండమావిలా చుట్టూ కనిపిస్తుంది .అశాశ్వతాలను పట్టుకొని, శాశ్వతమైన దాన్ని అందుకోలేము .ప్రపంచాతీత స్థిర శాశ్వత సత్యాన్వేషణ జరపాలి .మాండూక్య ఉపనిషత్ లో ‘’పరీక్షస్య లోకానకర్మ చితాన్ బ్రాహ్మణో నిర్వేదం ఆయాన్ నాశ్చయ కృతః క్రితేన’’అంటే బుద్ధిమంతుడు కర్మల చేతఎర్పడిన ప్రపంచాన్ని పరీక్షించి కర్మల చేత శాశ్వతమైనది సాధింపబడదు అని గ్రహిస్తాడు .సుఖాలనిచ్చే లోకాలన్నీ కర్మజన్యాలే .అవి శాశ్వతాలు కావుకనుక, శాశ్వత సుఖాన్నిచ్చేవికావు .ఉపనిషత్తుల సారాంశం ఏమిటంటే శాశ్వతాన్ని అందుకోకపోవటమే దుఖాలకు కారణం .కనుక సద్గురువును ఆశ్రయించి పరబ్రహ్మజ్ఞానం సాధించాలి .సర్వోత్కృష్టమైన దాన్ని సాధించే ప్రయత్నం చేయనంతవరకూ దుఖం బాధిస్తూనే ఉంటుందని వేదాంతం చెబుతోంది .దుఃఖ నివారణకు మరో మార్గమే లేదు .శ్వేతాశ్వతర ఉపనిషత్ లో ఒక బుద్ధిజీవి’’ చీకటిని చీల్చుకొని సూర్య చంద్రుల్లాగా ప్రకాశామానమైన వాడిని నేను చూశాను .ఒంటరిగా అతడిని అర్ధం చేసుకోవటం వలన దుఖాన్ని మృత్యువును జయించవచ్చు ‘’అని చెప్పాడు .ఆత్మజ్ఞానం పొందాలని ఒకడు ఒక గురువును ఆశ్రయి౦చాలి .దీన్ని వివేక  చూడామణిలో  శంకరభగవత్పాదులు ‘’నన్ను చావునుంచి తప్పించండి .తప్పించుకోలేని ప్రపంచంలోని అరణ్యాగ్ని  మధ్య ఉన్నాను .భయోత్పాతం కలిగించే జంఝామారుతం లాగి కొడుతోంది .నువ్వేనాకు శరణ్యం నన్ను రక్షించే దిక్కు వేరే లేదు ‘’అన్నారు .

   దుఃఖ నివారణకు బౌద్ధ మార్గాలు

గౌతమబుద్ధుడు చెప్పిన నాలుగు సత్యాలపై ఆధారపడి దుఃఖ నివారణ మార్గం బుద్ధుడు ఉపదేశించాడు .ఒకప్పుడు ప్రయాగ దగ్గరున్న కౌశాంబి లోని గుహలో ఆయన ఉండగా,అక్కడి  భిక్షువుల నుద్దేశించి బుద్ధుడు ఇలా ప్రవచించాడు ‘-‘’భిక్షువుల్లారా !మీ దగ్గరుండే నాలుగు వస్తువుల్ని వదిలేయాలి .అందులో ఒకటి దుఖం .ఇదే కష్టాలకు మూలం .ఇదే బాదానివారణ .ఇదే ఉత్తమ మార్గమైన నిర్యాణానికి దారి .బౌద్ధ ఆచారం లో బుద్ధుడిని ‘’భిక్షో ‘’అని సంబోధిస్తారు .అంటే గొప్ప వైద్యుడు అని అర్ధం .దుఖం తో బాధపడే వారి వ్యాధులను నివారించే ఘనవైద్యుడు బుద్ధుడు అని వారి భావం .ఆయన చెప్పిన నాలుగు సూత్రాలు రోగికి వైద్యుడు సూచి౦చేవే .మొదటి సూత్రం లో దుఖం ఒక వ్యాధి అని నిర్ధారణ చేయటం .రెండవ సూత్రం లో దుఖం అనే వ్యాధికి కారణం కోరిక అని కనిపెట్టటం .మూడవది మందు వేయటం కోరికపై నిరోధమే గొప్పమందు దుఖం పోవటానికి .

  మానవ జీవితం లో దుఖాన్ని గుర్తించకుండా ఎప్పుడూ ఉండరాదు .దాని గురించి అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి .దుఖం అంటే అభిన్నేయం .అంటే తీవ్రమైన రోగం .దీనికి శాశ్వత నివారణ కోరిక లేకుండా చేసుకోవటమే  కోరిక  పహతాభ కనుక వెంటనే విసర్జించాలి .మరి ఏమి ఆచరించాలి అంటే -అష్టాంగ మార్గం .ఇదే దుఖానికి శాశ్వతమైన నివారణ మార్గం మందు .అప్పుడే నిర్వాణ మార్గం సాధ్యమౌతుంది .అష్టాంగ మార్గం లో 1-సరైన దృక్పధం అంటే సత్యాన్ని,దుఖాన్నీ  అర్ధం చేసుకోవటం 2-సరైన నిర్ణయం –మంచి మార్గంలో మంచి ఆలోచనలు చేయటం 3-సత్యం పలకటం అంటే నిజాలు మాట్లాడటం బాధకలిగించే మాటలు ఉపయోగించ కుండా ఉండటం 4-సరైన పనిచేయటం –దొంగతనం హింస మొదలైనవి చేయకుండా మంచి ఉపయోగమైన కార్యాలు చేయటం 5-మంచి జీవిక –నిజాయితీగా యోగ్యమైన మార్గం లో సంపాదించటం 6-సత్ ప్రయత్నం –పనులన్నీ శక్తివంచన లేకుండా అంకితభావంతో నైపుణ్యంగా చేయటం 7-సద్భావన –శారీరక మానసిక భావాలలపై నియంత్రణ కలిగి ఉండటం 8-సరైన ధ్యానం –బుద్ధి కేంద్రీకరించి నిశ్చల చిత్తం తో ధ్యానం చేయటం .

‘’విషయ స్పర్శ లేనివాడికి సంసార బంధం ఉండదు .ఆంతరిక స్వేచ్చ పొందినవాడికి ,ఏ రకమైన భ్రాంతులూ ఏమీ చేయలేవు .విషయ సుఖా పేక్ష నిండా ఉన్నవాడికి ,కనిపించేదంతా నిజం అనుకుని భ్రమపడే వాడు ఈ ప్రపంచంలో వ్రేలాడుతూనే ఉంటాడు ‘’అని గౌతమ బుద్ధుడు తన అనుభవాలను ఆధారంగా బోధించాడు .’’సేలుడు’’ అనే ఒక బ్రాహ్మణుడు బుద్ధుని ప్రజ్ఞపై  తనకు అనుమానం ఉందని ఆయనతోనే అన్నాడు .దానికి గౌతముడు ‘’ఏదితెలుసుకోవాలో దాన్ని తెలుసుకొన్నాను .దేన్నీ అలవరుచు కోవాలో దాన్ని అలవరచుకొన్నాను .దేన్నీ త్యజించాలో దాన్ని త్యజించాను .కనుక ఓపండితా !నేను ‘’బుద్ధుడిని ‘’‘’అన్నాడు

  ఆధునిక ప్రపంచానికి గౌతమ బుద్ధుని సందేశం

బాధ అనేది మానవ జీవితంలో తప్పించరానిది .దాన్ని గూర్చి భయపడరాదు.యదార్ధమైన దాన్ని ఉపనిషత్తులు చెప్పినట్లు, బుద్ధుడు బోధించినట్లు తెలుసుకోవాలి .వీటి సారాన్ని వివేకాన౦దులు ఇలా తెలియజేశారు –‘’తల్లి గర్భం నుంచి నగ్నంగా బయటికి వచ్చాను అలాగే జీవితం ను౦చి కూడా నిష్క్రమించాను .’’దైవం ఇచ్చాడు ఆయనే ఇచ్చిన దాన్ని  తీసుకు వెళ్ళాడు ‘’అన్నాడు గొప్ప జ్యూయిష్ వేదాంతి .బాధ కష్టాలలో కూడా ప్రశాంతత అలవాటు చేసుకోవాలి కాని తప్పుచేయరాదు.ఇందులోనే జీవిత పరమార్ధమంతా ఉంది .తుఫానుకు సముద్ర కెరటాలు విజ్రు౦భిస్తాయి .కాని సముద్రపు అట్టడుగున పరమ ప్రశాంతంగా ఉంటుంది .దుఃఖించే వారిని పైవాడు ఓదారుస్తాడు  నిరాశా నిస్పృహ నిర్వేదం పొందినవాడికి తల్లీ తండ్రీ సంసారం ఆసమయం లో గుర్తుకు రావు తర్వాత వివేకం కలిగి దుఖం నశించి కల చెదిరిపోతే ప్రకృతి యొక్క అస్తిత్వాన్ని ముఖాముఖిగా చూసి స్పష్టంగా ఏది యదార్ధమో అర్ధం చేసుకొంటాం ‘’అన్నాడు వివేకానంద.ఎంతటి కఠోర స్థితిలోనైనా స్వామి వివేకానందకు ఆశా కిరణం గోచరించేది .

ఈ పూర్వ రంగంలో, భగవాన్ బుద్ధుని అత్యంత ప్రధాన బోధనలలో ముఖ్యమైనవి అయిన నాలుగు బ్రహ్మ విహారాలను గురించి చూద్దాం.

అవే మైత్రికరుణముదితఉపేక్ష. తన శిష్యు లందరికీ ఈ నాలుగు గుణాలను పరిపూర్ణంగా, అనంతంగా, వారువీరనక, శత్రువులు మిత్రులు అందరికీ  అభ్యాసం చెయ్యమని బుద్దుడు ఆదేశించాడు.

ధ్యాన అభ్యాసి ఈ నాలుగు గుణాలనూ ప్రతిరోజూ లోతైన ధ్యానం చెయ్యటం ద్వారా తనవిగా చేసుకొనడం ద్వారా అతడు ఉన్నత లోకాలను పొందగలడు. మరణానంతరం వ్యధా భరితములైన తక్కువ లోకాలలో జన్మించటం జరుగదు. జీవించినంత కాలం చెదరని మనో నిశ్చలత తో అతడు జీవించగలడు. మరణం తరువాత బ్రహ్మ లోకాన్ని అతడు చేరుకుంటాడు.

ఈ నాలుగు బ్రహ్మ విహారాలు బ్రహ్మ లోకంలో ఉండే ఉన్నత తరగతికి చెందిన జీవులకు సహజంగా ఉండే లక్షణాలు . బ్రహ్మ లోకం అంటే ఊర్ధ్వ లోకాలలో చాలా పైది అని తలచవచ్చు. జంతులోకానికి మన లోకానికి చాలా భేదం ఉంది. ఆ సంగతి మనకు తెలుసు. అలాగే మనకు దేవతా లోకాలకు భావనలలో, అనుభవాలలో, పరిస్థితులలో చాలా తేడా ఉంటుంది. ఈ లోకాలలో ఉండే జీవులను దేవతలు అని మనం తలచ వచ్చు. ఈ గుణాలు పరిపూర్ణం గా అభ్యాసం చెయ్యటం వలన మానవుడు దేవతా స్థానాన్ని పొందగలడు. వారి గుణాలను తనవిగా చేసుకోవటం వల్ల వారి లోకాన్ని అతడు పొంద గలడు .

>మైత్రి:

సాధారణంగా మానవులకు ఉండే సహజ గుణం ఓర్వలేనితనం మరియు ద్వేషం. మైత్రీ గుణాన్ని ఎల్లలులేకుండా అభ్యాసం చెయ్యటం ద్వారా మనిషి లో మైత్రీ భావన నిండుతుంది. అతనికి ఈ భూమ్మీదే కాదు ఇతర ఏ లోకంలోనూ శత్రువులు అంటూ ఉండరు. క్రూర జంతువులు సైతం అతని సమక్షంలో తమ సహజ స్వభావాన్ని వదలి సాదుజంతువులుగా మారతాయి. ఇక మనుషుల మాట చెప్పేదేమి?

మనసులో మైత్రీ భావనతో ఉన్న మనిషి ఎల్లప్పుడూ ప్రశాంత వదనంతో ఉండగలడు. ప్రసన్న చిత్తం కలిగి ఉండటం ద్వారా ముందు సాధకునికే ఎంతో మంచి జరుగుతుంది. అనవసర ఆదుర్దాలు ఆందోళనలు లేకపోవటం వల్ల శారీరిక మానసిక ఆరోగ్యం బాగుంటుంది.

ఈ భావనా అభ్యాసం వల్ల సాధకుడు మనో ప్రశాంతతను పొందగలడు. ద్వేష భావం నుంచి విముక్తుడు కావటంతో అతనికి మనసు ఎల్లప్పుడూ తేలికగా సంతోషంగా ఉంటుంది. ఎవరిని చూచినా అతనికి ద్వేష భావం కలుగదు. మైత్రీ భావం తో నిండి ఉండటంతో ముల్లోకాలలో ఎవ్వరితోనూ అతనికి శత్రుత్వం ఉండదు.

>కరుణ:

మోహ గ్రస్తులై చరిస్తున్న మానవులను ఇతర జీవకోటిని తలచి ఈ కరుణా భావనను అభ్యాసం చెయ్యాలి. గొప్ప దైన దైవీ సంపదను పొందగలిగే అవకాశాన్ని కలిగి ఉండి కూడా మానవులు ఇంద్రియ వ్యామోహ పరులై తాను రాజునన్న సంగతి మరచి చిల్లరకోసం పరిగెత్తే మూర్ఖుని వలె ప్రవర్తిస్తూ ఉన్నారు. అజ్ఞాన పీడితులై జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తూ అనేక బాధలు పడుతూ ఉన్నారు. తమ కర్మలు తమను పట్టి బంధించే పాశాలన్న సంగతి తెలియక క్షణిక లాభాలకోసం ఆరాట పడుతూ చెయ్య రాని పనులు చేస్తూ దుస్సంస్కారాలను పోగేసుకొని తమ అధోగతికి మెట్లను తామే నిర్మించుకుంటున్నారు.సమస్త ప్రపంచాన్నీ కట్టి నడిపిస్తున్న అజ్ఞాన భ్రాంతి ఎంత గొప్పది? ఈ అజ్ఞాన సీమ ఆవల ఎంతటి తేజోమయ లోకాలున్నాయి. వాటి సంగతి తెలియక మానవులు భ్రాంతిలో మునిగి ఇదే సర్వస్వం అనుకొని పంచేంద్రియ భోగాల కోసం తుచ్చమైన కర్మలు చేస్తూ క్షణ క్షణానికి ఊబిలో కూరుకొని పోతున్న వాని వలె తమ వినాశాన్ని తామే కొని తెచ్చుకుంటున్నారు. సమస్త లోకాలూ వాటిలోని జీవులు ఇదే తీరులో ఉన్నాయి.

ఈ ధ్యానాన్ని చక్కగా అభ్యాసం చేసి కరుణ అనేభావనను ఎల్లలు లేకుండా ధారణ చెయ్యటం వల్ల మనిషి కరుణా పూరితుడు అవుతాడు. తప్పులు చేసిన వారిమీద అతనికి కోపం రాదు. కరుణ పెల్లుబుకుతుంది. ఇది కూడా ఒక దైవ గుణం. బోధిసత్వులందరూ ఈ కరుణా భావనతో పరిపూర్ణు లైనవారే. ఈ భావనా బలం వల్ల ఇతరుల చెడు కర్మను, రోగాలను పోగొట్టగల సంకల్ప బలం దైవీ శక్తి సాధకునికి కలుగుతాయి.

>ముదిత:

అంటే సంతోషం అని అర్థం. మంచి సంస్కార వంతులను, సంపన్నులను, ధార్మిక పరులను , ఉన్నతులను, సాధనా మార్గంలో పురోగమించిన వారిని చూచినపుడు వారి మంచి కర్మకు, పుణ్య బలానికి తాను కూడా సంతోషం పొందటాన్ని ‘’ముదిత ‘’అని పిలవాలి. ఇదిచక్కని దైవీ గుణం.

అసూయ, ద్వేషం, ఈర్ష్య మొదలైన చీకటి గుణాలు ఈ ముదితా భావన తో పారదోల బడతాయి. ఎవరైతే సుఖంగా ఉన్నారో వారిని చూచి వారి సంతోషాన్ని తన సంతోషం గా భావించి అంతకంటే ఆనందాన్ని సంతోషాన్నిసాధకుడు ఈ భావనా బలంతో పొందగలడు. తన వద్ద ఏమీ లేకున్నాఇతరులను వారి పుణ్య బలాన్ని చూచి సంతోషంగా ఆనందం గా ఉండ గలగ టాన్ని ఈ భావనా ధ్యానం ఇస్తుంది. ఇది కూడా దేవతా లక్షణమే.

>ఉపేక్ష:ఇక దుర్మార్గులను, తనను ఎగతాళి చేసేవారిని, హాని చేసేవారిని ఈ ఉపేక్షా భావనతో విస్మరించి ఊరుకోవాలి. దీని సాధన వల్ల మనసులో ఉక్రోషం, ఏడుపు, నిస్సహాయత, కుంగిపోవటం, కోపం, కసి వంటి నిమ్న స్థాయికి చెందిన భావనలు మాయం అవుతాయి. మనసు ఆకాశం వలె నిర్మలంగా ఉండగలుగుతుంది. అన్నిటి కంటే ఈ ఉపేక్షా భావన అభ్యాసం కష్టం.

కారణం ఏమనగా ఉపేక్షా భావనలో ప్రతిష్టితుడు కావడానికి అహంకారం చాలా వరకూ తగ్గిపోవాలి. అది బలం గా ఉంటే ప్రతీకారం వంటి భావాలు పొంగి మనిషిని ఉన్మత్తున్ని చేస్తాయి. అహంకార మాలిన్యాన్ని కడిగి వెయ్యాలంటే ద్వంద్వాలను  సాక్షి గా చూస్తూ ఉండగల ఉపేక్షా భావనా ధ్యానంలో నిష్ణాతుడు కావాలి.

శ్రీ రామకృష్ణుని ప్రత్యక్ష శిష్యులలో ఒకరు ( రాఖాల్) స్వామి బ్రహ్మానంద. ఆయన పరివ్రాజకుడుగా దేశమంతా తిరుగుతూ ఉన్న రోజులలో హిమాలయ ప్రాంతాలలో ఉన్నపుడు ఒక సంఘటన జరిగింది. అక్కడ చలి విపరీతంగా ఉంది. స్వామి ఒక నదీ తీరం లో కూర్చొని ప్రశాంత భావం తో ఉన్నాడు. అంతలో ఒక వ్యక్తి వచ్చి ఒక కంబళిని స్వామి వద్ద ఉంచి వెళ్ళి పోయాడు. స్వామి చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఇంకొక వ్యక్తి వచ్చి ఆ కంబళిని తీసుకొని వెళ్ళిపోయాడు. స్వామి అదే ప్రశాంత చిత్తంతో చూస్తూ ఉన్నాడు. మనసులో ఇది నాది అన్న భావన కు అతీతమైన సాక్షీ స్థితి ఈ ఉపేక్షా భావనా ధ్యానం ఇస్తుంది. దీనివల్ల సాధకుని మనస్సు ఆటు పోట్లకు చెదరని ప్రశాంత సరస్సు లాగా నిర్మలంగా ఉండగలుగుతుంది.

ఈ భావనలు అన్నీ మనస్సు పైపైన మాత్రమె కాక లోలోతులకు చొచ్చుకొని పోయి కలలో కూడా ఇతర భావనలు కలుగనంత ధ్యాన బలాన్ని సాధకుడు సంపాదించాలి. అప్పుడే వాటిలో సిద్ధత్వం కలిగినట్లు లెక్క.

మనిషి మనో మయుడు. మనస్సు వల్లనే మనిషి రాక్షసుడు అవుతున్నాడు, దేవతా అవుతున్నాడు. దీన్ని సమర్థించే అనేక శ్లోకాలు ధమ్మపదం లో మనకు కనిపిస్తాయి. భగవత్ గీత కూడా ఇదే చెబుతుంది. బంధ మోక్షాలకు మనస్సే కారణం అంటుంది. బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మనస్సును అదుపులో ఉంచుకొన్న మనిషి చలించకుండా ఉండగలగటమే కాదు వాటికి సరిగా స్పందించగలడు. సరిగా స్పందించ గలిగిన శక్తి ధ్యాన బలం వల్లనే వస్తుంది.

బాహ్య పరిస్థితులకు మనం ఇచ్చే స్పందన వల్లనే మన మనస్సులో సంస్కారాలు ఏర్పడతాయి. అవే మన ఉత్తమగతికి గాని, అధోగతికి గాని కారణాలు అవుతాయి. కనుక మన స్పందన వల్ల అంతిమంగా లాభపడేది లేదా నష్ట పోయేది మనమే గాని ఇతరులు గాదు.

ఈ విషయం అర్థమైతే బాహ్య పరిస్థితులకు మన స్పందన ఎలా ఉండాలి అనేదాని ప్రాముఖ్యత మనకు అర్థం అవుతుంది. ఇది అర్థం అయినప్పుడు ఈ నాలుగు బ్రహ్మ విహారాల ప్రాముఖ్యత మనకు చక్కగా తెలుస్తుంది.

ఈ నాలుగు భావనలు చాలా ముఖ్యమైనవి. కానీ వీటిని అనుసరించటం తేలికైన విషయం కాదు. దానికి ప్రతిరోజూ కనీసం ఉదయం సాయంత్రం చెరొక గంట ఈ భావనల పైన ధ్యానం అవసరం. తరువాత అనుక్షణం జీవితంలో ఎదురౌతున్న పరిస్థితులు వాటికి మన మనః స్పందనలు గమనించుకుంటూ ఉండాలి. ఇదొక సాధనా మార్గం. ఎప్పుడైతే ప్రతి పరిస్తితికీ ఈ నాలుగు స్పందనలు తప్ప ఇతర స్పందనలు మన మనస్సులో కలుగకుండా ఉంటాయో అప్పుడు మనం కొంతవరకూ ఈ సాధనలో ముందడుగు వేసినట్లు లెక్క.

ఈ భావనా ధ్యానం ఎలా చెయ్యాలి అనేదాన్ని భగవాన్ బుద్ధుడు అనేక సూత్రాలలో చక్కగా వివరంగా చెప్పాడు. కావలసిన వారు త్రిపిటకములలో ఒకటైన సూత్ర పిటకంలోని ” దీర్ఘ నికాయం ” లో ఒక్కొక్క భావనా ధ్యానం పైన ఇవ్వబడిన బుద్ధుని ప్రవచనాలు చూడండి. ” తేవిజ్జ సూత్ర ” అనే సూత్ర భాగం లో కూడా వసిష్టుడు భరద్వాజుడు అనబడే ఇద్దరు బ్రాహ్మణులకు (వీరు ఈ గోత్ర నామంతో ఉండే మూల ఋషులు కారు) బుద్దుడు ఇచ్చిన ఉపదేశంలో ఈ బ్రహ్మ విహార భావనా ధ్యానం గురించి బుద్ధుని వివరణాత్మక ఉపదేశం చూడవచ్చు. అలాగే బుద్ధఘోషుని ” విశుద్ది మార్గం ” లో కూడా ఈ నాలుగు బ్రహ్మ విహార భావనా ధ్యానము గురించి అత్యంత వివరంగా ఇవ్వబడింది.
ధ్యానా భ్యాసి ఈ భావనలను అనంతంగా విస్తరించుకుంటూ పోయి నక్షత్ర మండలాలను దాటి విశ్వం లోని నలుమూలలకూ తన నుండి ఈ భావనలను ప్రసరింప చేయగల ధ్యాన శక్తిని సంపాదించాలి. అప్పుడే బ్రహ్మ విహార ధ్యాన సాధనలో పరిపూర్ణత వస్తుంది. ఏ ఇతర సాధనలు చెయ్యక పోయినా ఈ ఒక్క సాధన వల్లనే మనిషి జీవితం ధన్యతను పొందగలుగుతుంది. ఇది బుద్దుని మౌలిక బోధనలలో ముఖ్యమైన సాధన.

  ఈరోజు26-5-21 బుధ వారం  వైశాఖ పౌర్ణమి బుద్ధ జయంతి సందర్భంగా  ఈ ప్రత్యేక వ్యాసం

“పాపం – పుణ్యం – జ్ఞానం”“పాపం – పుణ్యం  జ్ఞానం”

ధమ్మపదం లో

బుద్ధుడు చెప్పాడు

ఇద సోచతిపెచ్చ సోచతిపాపకారీ ఉభయత్థ సోచతి . .

ఇథ మోదతిపెచ్చ మోదతికతపుజ్ఞ ఉభయత్థ మోదతి” (పాళీ భాష)

“పాపకర్ముడు ఇహపరాలు రెండింటిలోనూ దుఃఖిస్తాడు ;

పుణ్యకర్ముడు ఇహపరాలు రెండింటిలోనూ సుఖిస్తాడు”

పాపం            =                 అజ్ఞానం, అధర్మాచరణం వలన

పుణ్యం           =                 ధర్మాచరణం వలన

దివ్యజ్ఞానం       =                 ధ్యానం వలన

అధర్మాచరణ వలన ఈ లోకం లోనూ, పరలోకాల్లోనూ,

దుఃఖప్రాప్తి, మరి తిరిగి జననం కలుగుతాయి;

ధర్మాచరణం వలన ఈ లోకంలోనూ, పరలోకాల్లోనూ,

సుఖప్రాప్తి లభిస్తుంది;

అయితే, తిరిగి జననం ఖచ్చితంగా సంప్రాప్తిస్తుంది

క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి” అన్నారు కదా గీతాచార్యులు కానీ,

దివ్యజ్ఞానప్రకాశం వలన ఈ లోకంలోనూ, పరలోకాల్లోనూ

అఖండానంద ప్రాప్తితో పాటు జన్మరాహిత్యస్థితి కూడా లభిస్తుంది

  • కనుకమన దినచర్యలన్నింటిలోనూ ధర్మాచరణాన్ని అవలంబిస్తూ,మిగిలిన సమయాన్ని దివ్యజ్ఞానప్రకాశ సంప్రాప్తికి వెచ్చించాలి;అలా జీవితం మొత్తం గడపాలిఅదే సరియైన జీవితం.
  • గౌతమ బుద్ధుడు సన్మార్గ దార్శనికుడు .తనకు తానూ దేవుదినిఅని ఎప్పుడూ చెప్పుకోలేదు .అవతార పురుషుడనని నమ్మించలేదు .ఎలాంటి మహిమలు ప్రదర్శించలేదు .అయినా ఆయన కన్నుల్లో కరుణ ,మాటలలో ప్రేమ ఉట్టిపడేవి ..త్యాగశీలత ,తనలోనిజ్ఞాన దీపాన్ని అందరిలో వెలిగించాలని తాపత్రయపడ్డాడు .అందుకే బుద్ధభగవానుడు అని పించుకొన్నాడు .
  •   ఈరోజు26-5-21 బుధ వారం  వైశాఖ పౌర్ణమి బుద్ధ జయంతి సందర్భంగా  ఈ ప్రత్యేక వ్యాసం
  • బుద్ధ జయంతి శుభాకాంక్షలతో
  • మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -26-5-21-ఉయ్యూరు 

సన్మార్గ దార్శనికుడు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.