బెంగాల్ తొలితరం కవి నవలా రచయిత్రి ,సాంఘిక సేవాకార్యకర్త –స్వర్ణ కుమారీ దేవి ( వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -జూన్ 

బెంగాల్ తొలితరం కవి నవలా రచయిత్రి ,సాంఘిక సేవాకార్యకర్త –స్వర్ణ కుమారీ దేవి ( వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -జూన్ 

01/06/2021గబ్బిట దుర్గాప్రసాద్

మహర్షి దేవేంద్ర నాథ టాగూర్ కుమార్తెలలో నాల్గవ కుమార్తె స్వర్ణ కుమారీ దేవి 28-8-1855న జన్మించింది .తాతగారు ద్వారకానాథ టాగూర్ .ఈమె ముగ్గురు సోదరిలు సౌదామిని ,సుకుమారి ,శరత్ కుమారి .బర్నకుమారి చివరి చెల్లెలు .కలకత్తా బెతూన్ కాలేజిలో చదిన మొదటి తరం విద్యార్ధిని సౌదామిని .మిగిలిన వారంతా ఈమెనే అనుసరించారు .స్వర్ణకుమారి మాత్రం ప్రాధమిక విద్య ఇంటి వద్దనే నేర్చింది .విశ్వకవి రవీ౦ద్ర నాథ టాగూర్ కంటే ఈమె అయిదేళ్ళు పెద్దది.

జోరా సంకో బారి లో విద్య కు అధిక ప్రాదాన్యమిచ్చేవారు .ఇంటివద్ద చదువు చెప్పే గవర్నెస్ ,పలక మీద రాసి ,పిల్లలచేత దాన్నికాపీ చేయించటం తండ్రి ఒక రోజు గమనించాడు .ఈ యాంత్రిక విధానపు చదువు నచ్చక గవర్నెస్ దృష్టికి తెచ్చాడు .అంతే కాక ఆమెను మాన్పించి కొత్త టీచర్ ను ఏర్పాటు చేశాడు .ఈవిషయాలను రవీంద్రుడు ‘’బడిలో నేర్చుకోనేదాని కంటే చాలా ఎక్కువగానే మేము ఇంటి వద్దనే నేర్చుకొన్నాం ‘’అని తన జ్ఞాపకాలలో రాశాడు .

చురుకుపాలు ఎక్కువైన స్వర్ణకుమారి బాల్యం లోనే చాలామంది స్నేహితురాళ్ల తో పరిచయం సాధించింది .ఆ రోజుల్లో ప్రతి జంట స్నేహితులకు ఒక సామాన్యపేరు ఉండేది ఆపేరు తోనే ఒకరినొకరు పిలుచుకోనేవారు .స్వర్ణకుమారికి చాలామంది తో స్నేహం ఉండేది .ఆమె ముఖ్య స్నేహితురాళ్ళు మిష్టిహసి ,మిలన్ ,బిహ౦గిని.మొదలైన వారు .

1868 లో పదమూడవ ఏట స్వర్ణ కుమారి వివాహం మహా విద్యావంతుడు ,స్థిర మనస్కుడు ,నాడియా జిల్లాలో సంపన్న కుటుంబానికి చెందిన జానకీనాథ్ ఘోషాల్ తో జరిగింది .బ్రహ్మ సమాజ అభిమాని ,ఆ సమాజ కట్టుబాట్లతో వివాహం చేసుకొన్న జానకీ నాథుని అతని కుటుంబం వెలివేసి ,,పిత్రార్జితం లో చిల్లి గవ్వకూడా ఇవ్వకుండా బహిష్కరించింది .కాని అతని అమోఘ సంకల్పం ,దీక్ష శక్తి సామర్ధ్యాలతో బిజినెస్ లో విజయం సాధించి స్వంత జమీందారిని ఏర్పాటు చేసుకొన్నాడు .ప్రభుత్వం చేత ‘’రాజ ‘’బిరుదు కూడా పొందాడు .దివ్యజ్ఞాన సమాజం తో మంచి సంబంధాలు కలిగి ఉంటూ ,భారత జాతీయ కాంగ్రెస్ సంస్థతో కలిసి పని చేసేవాడు .భారత జాతీయ కాంగ్రెస్ సంస్థాపకులలో జానకీనాథ ఘోషాల్ ముఖ్య పాత్ర పోషించాడు.

ఘోషాల్, స్వర్ణ కుమారీ దేవి దంపతులకు హిరణ్మయీ దేవి ,జ్యోత్స్నానాథ్ ఘోషాల్ ,సరళాదేవి చౌదరాణి సంతానం . జ్యోత్స్నానాథ్ ఐ.సి.ఎస్ .కు సెలెక్ట్ అయి ,పశ్చిమ భారతం లో సేవలందించాడు .టాగూర్ కుటుంబం లోని వారు సంగీత ,నాటక ,రచనలలో ప్రసిద్ధులవటం వలన స్వర్ణకుమారికి సహజం గా అవి అబ్బాయి .జ్యోతిరింద్ర నాథ టాగూర్ ,సంగీతం,నాటకం ,రచనలతో లో ప్రయోగాలు చేస్తూ ,అక్షయ చంద్ర చౌదరి , రవీంద్రుల సహాయం పొందాడు .తన ‘’జ్యోతిరి౦ద్ర స్మృతి’’లో ‘’జానకి ఇంగ్లాండ్ వెళ్ళటం ,మా చిన్న చెల్లెలు స్వర్ణకుమారి మా ఇంట్లో ఉండటం తో సాహిత్యప్రయోగాలలో మా కుటుంబంలో మరొక తో్డు మాకు చేకూరింది ‘’అని రాసుకొన్నాడు .జ్ఞానదానందినీ దేవి కుటుంబం లోని స్త్రీలపై ఉన్న చాదస్త నిషేధాలను అతిక్రమిస్తే ,స్వర్ణకుమారి సృజనాత్మక రచనలతో వికసించింది .

స్వర్ణకుమారి స్వీయ ప్రతిభతో మొట్టమొదటి నవల ‘’దీప్ నిర్వాణ్’’ రాసి ,1876లో ప్రచురించింది .హనా కేధరిన్ ముల్లెన్స్ బెంగాలీ భాషలో మొదటి నవలా రచయిత్రిగా ‘’ఫూల్మణి ఓ కరుణార్ బిబరణ్’’అనే 1952లో ప్రచురించిన మొదటి నవలతో గుర్తింపు పొందితే ,స్వర్ణకుమారీ దేవి ‘’బెంగాల్ ప్రజలలో మొదటి మహిళా నవలారచయిత్రిగా’’ పేరుపొందింది .ఈమె రాసిన నవల జాతీయభావాన్ని ప్రజలలో పాదుకొల్పింది .మొదటి జాతీయభావ నవల రాసిందీ కూడా స్వర్ణకుమారియే .ఆ తర్వాత స్వర్ణకుమారి పుంఖాను పుంఖాలుగా నవలలు ,నాటకాలు కవితలు ,శాస్త్రీయ వ్యాసాలు రాసేసింది .బెంగాలీ భాషలో సైంటిఫిక్ టర్మినాలజి ని అభి వృద్ధి చేసింది స్వర్ణ .అనేక గీతాలను రాసి సంగీతం కూర్చింది .బెంగాలీ సాహిత్యం లో స్వర్ణకుమారి ,కామినీ రాయ్ ల పాత్ర స్వర్ణయుగమే అయి ,వారి ప్రాధాన్యత కు గుర్తింపు అభించిందని ప్రముఖ విశ్లేషకుడు స్వపన్ మజుందార్ అభి ప్రాయ పడ్డాడు . They “represented a flourishing generation of educated women writers, discharging with total zeal the responsibilities of their pursuit”.అని కీర్తించాడు మనస్పూర్తిగా .1879లో స్వర్ణకుమారి బెంగాలీ భాషలో మొట్టమొదటి ఒపేరా ‘’’బసంత ఉత్సవ్ ‘’రచించింది .బెంగాలీ ఒపేరా రచన లో కూడా ఆద్యురాలయింది .

1877లో జ్యోతిరింద్ర నాద టాగూర్ ‘’భారతి ‘’అనే కుటుంబ మేగజైన్ ను ప్రారంభించి ,ద్విజేంద్రనాథ టాగూర్ సంపాదకత్వం లో ప్రచురించాడు .భారతి పత్రికకు 7ఏళ్ళు ఎడిటర్ గా ద్విజేంద్ర ఉండగా ,ఆతర్వాత స్వర్ణకుమారి 11 సంవత్సరాలు భారతి మేగజైన్ కు సంపాదకురాలుగా సమర్ధవంతంగా నిర్వహించింది .రవీంద్రుడు ఒక ఏడాది మాత్రమె ఎడిటర్ గా ఉన్నాడు . 9ఏళ్ళ విరామం తర్వాత స్వర్ణకుమారి మళ్ళీ సంపాదక బాధ్యతలు తీసుకొని రెండేళ్ళు నడిపి చివరికి భారతి మేగజైన్ ముద్రణ ఆపేసింది .దాదాపుగా అర్ధశతబ్దికాలం బెంగాల్ ను సాహితీ రంగంలో ముందుకు నడిపించింది భారతి పత్రిక .భారతి మొదటి ప్రచురణ నాటికి రవీంద్రుని వయసు 16 ఏళ్ళు మాత్రమే .మొదటి సంచికనుండి తన రచనలతో భారతి పత్రికకు నిరంతరంగా రచనలు చేశాడు .భారతిలో రవీంద్రుని రచనలకోసం అత్యంత ఉత్కంఠ తో పాఠకులు ప్రతినెలా ఎదురు చూసేవారు .

భారత జాతీయ కాంగ్రెస్ కు ప్రధాన కార్యదర్శి గా భర్త ఉండటం తో స్వర్ణకుమారి ,రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించింది . 1889,1890 కాలం లో స్వర్ణ కాంగ్రెస్ లో పని చేసింది .భారత జాతీయ కాంగ్రెస్ లో మొట్టమొదటిసారిగా మహిళలు పాల్గొనటం స్వర్ణకుమారి తోనే మొదలైంది .1896లో స్వర్ణకుమారి నిస్సహాయ అనాధల ,విధవలకు సాయం చేయటానికి ‘’సాక్షి సమితి ‘’అంటే ఫ్రెండ్స్ సొసైటీ స్థాపించి ,తన టాగూర్ కుటుంబం వారందర్నీ చేర్పించింది .సభ్యత్వ రుసుము నిర్వహణకు చాలక పోవటం తో బెతూన్ కాలేజ్ లో ప్రతి ఏడాది ఎక్సిబిషన్ నిర్వహించి నిధులు సమకూర్చింది .ఢక్కా ,శాంతిపూర్ లనుంచి చీరలు ,కృష్ణనగర్ కాశ్మీర్ ,మురాదాబాద్ ,వారణాసి ఆగ్రా ,జైపూర్ ,బొంబాయి మొదలైన చోట్ల నుంచి చేతి తో తయారైన వస్తువులు తెప్పించి ప్రదర్శన నిర్వహించింది .ఆ రోజుల్లో ఈ ప్రదర్శనలు పెద్ద సెన్సేషన్ గా ఉండేవి .1906దాకా ఈ ప్రదర్శనలు నిర్వహించి తర్వాత ‘’విధవ ఆశ్రమం ‘’కు అప్పగించింది స్వర్ణకుమారి ..బారానగర్ లో శశిపాద ముఖర్జీ విధవాశ్రమాన్ని స్థాపించాడు .దేశం లో అదే మొట్టమొదటి ఆ తరహా ఆశ్రమం .స్వర్ణకుమారి కుమార్తె హిరణ్మయీ దేవి, దీనితో ప్రేరణ పొంది ‘’మహిళా విధవ ఆశ్రమం ‘’నెలకొల్పి సేవలు కోన సాగించింది .ఈమె మరణం తర్వాత ఆశ్రమం ఆమె పేరుతొ పిలువబడింది .ఈ సంస్థ కార్యనిర్వాహక మండలిలో స్వర్ణకుమారి ,మయూర్ భంజ్ మహారాణి సుచారు దేవి ,కూచ్ బిహార్ రాణి ( కేశవ చంద్ర సేన్ కుమార్తె ) సునీతి దేవి ,లేడీ హామిల్టన్,ప్రియం వదాదేవి ,మిసెస్ చాప్మన్ ,మిసెస్ ఎ.స్పి’ సిన్హా ,,హిరణ్మయీ దేవి వంటి ప్రముఖ మహిళలున్నారు .హిరణ్మయి సెక్రేటరిగా సేవలందించింది .ఇప్పటికీ ఈ సంస్థ నిర్విఘ్నంగా సమర్దులచేత నిర్వహి౦ప బడుతూ విధవ మహిళా సేవలో ధన్యమౌతోంది .తర్వాతకాలం లో సరళారాయ్ కోరికపై దీన్ని రవీంద్రుడు’’ సాక్షి సమితి’’ గా పేరు మార్చాడు .దీని నిధులకోసం రవీంద్రుడు ‘’మాయార్ ఖేలా ‘’అనే సంగీత నృత్యనాటిక రాసి ప్రదర్శించాడు .

రచనలు –స్వర్నకుమారీ దేవి –దీప నిర్వాన్ ,మిబార్ రాజ్ ,చిన్న ముకుల్ ,మాలతి ,హుగిర్ ఇమాం బాది,విద్రోహ ,స్నేహలతా బా పలిత,ఫులేమాల ,కహాకే ,బిచిత్ర ,స్వప్నాబని ,మిలన్ రతి,ఫూలేర్ మాలా అనే 13నవలు ,కోనేబాదా,పాక్ చక్ర ,రాజ్ కన్య , ,దివ్యకమల్ అనే నాలుగు నాటకాలు ,బసంత్ ఉత్సవ్ అనే ఒపేరా ,పృధివి అనే వ్యాస సంపుటి రాసి ప్రచురించింది .

కలకత్తా యూని వర్సిటి స్వర్ణకుమారికి 1927లో ‘’జగత్తారిణి’’పురస్కారం అందించి సత్కరించింది .కవి, రచయిత్రి నవలాకారిణి,,మహిళాభ్యుదయం కోసం అందులోనూ నిస్సహాయులైన విధవల ఆలనా పాలనా కోసం అహర్నిశలు పని చేసి,భారత స్వాతంత్ర్య ఉద్యమం లోనూ పాల్గొన్న మహిళా జాతి మాణిక్యం స్వర్ణకుమారీ దేవి 76వ ఏట 3-7-1932 న మరణించింది .

-గబ్బిట దుర్గాప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.