గంగాపుర మహాత్మ్యం -2(చివరి భాగం )
గోళకి మఠాలలోఅన్నసత్రం వైద్య విధానం ,విద్యా దానం జరిగేవని మందడ శాసనం వలన తెలుస్తోంది .గంగాపురపండితులు అనెక విద్యా సంస్థలు నడిపి ఉంటారు .ఇప్పుడు ఆమఠాలు దిబ్బలై కనిపిస్తున్నాయి.500ఏళ్ళక్రితం గంగాపురం ఒక శైవ విద్యాలయం గా ఉండేది .
గంగాపుర ప్రాచీనత
పండితారాధ్య చరిత్రలో పాల్కురికి సోమనాథుడు త్రయో దశ గుణ సంకీర్తనం లో గణ సహస్రనామాలలో కొన్ని చెప్పాడు –‘’సంగయ్య ,వనిపుర శంకరదేవ –డింగులి వైజవ్వ ,గంగాపురంబు –బసవయ్య ఫణిహారిబసవయ్య —-ఆదిగా గల గణ సహస్రములు –ఆదర ణీయంబులై యొప్పు నిట్లు ‘’’’అని ఉంది .ఇది అంతా యదార్ధం .స్థలపురాణం కూడా ఉండి ఉంటుంది .దాని ఆధారంగానే మల్లా రెడ్ది కవి గంగాపుర మహాత్మ్యం రాశాడు .
ఈ మహాత్మ్యం లో కవి –చాళుక్య రాజులలో వీర గంబాలుడు అనే ఒక రాజు ఉండేవాడు .ఇతదికోడుకులే జగదేకమల్ల ,త్రిభువనమల్ల , చాళుక్య మల్లులు .గంగాపుర ఆలయాన్ని ఉద్ధరి౦చారు .చారిత్రికంగా ఇందులో కొన్ని దోషాలున్నాయి .వీర హోమ్బాలుని కాలం కంటే ముందే అంటే జగదేకమల్లుని తండ్రి తైలపుడి కాలంలోనే ఇక్కడ కేశవాలయ నిర్మాణం జరిగింది .అంతకు పూర్వరాజులు శైవులుకనుక వైష్ణవాలయాలు కట్టించి ఉండరు .మూడవ తైలపుని కాలం నుంచే ఈరాజులు వైష్ణవులయ్యారు .వీర హోంబాలుని కాలం వరకు ఈరాజులు వైష్ణవులే .
మల్లారెడ్డి కవి కాలాదులు
తనకావ్యం లో మల్లారెడ్డి తన ఇంటిపేరు రెడ్డి రెడ్డి లేక రెండ్రేడ్డి అనీ ,గోత్రం –పోల్వాల ..మోటవాడ వంశం వాడు .దీన్ని ఇప్పుడు మోటాడి అంటున్నారు మోటవాడ అనే పేరు కూడా మల్లారెడ్డి వాడాడు .ఆకాలం లో మోటాడ రెడ్లు ,పాకనాటి రెడ్లు ,పంటి రెడ్లు, రేనాటి రెడ్లు ,పలనాటి రెడ్లు మొదలైన శాఖలు౦డేవి.తాత పర్వత రెడ్డి .మల్లారెడ్డి పెదతాత కుతుబ్ షాహీ కాలం వాడు .కవితాత బూర్గుల పట్టన చౌదరిగా ఉండేవాడు .చౌదరి దేశాయి దేశముఖ్ పేర్లు మహారాష్ట్రులవి .భూమి శిస్తు వసూలు చేసేవారిని ఈపెర్లతో పిలిచేవారు . చౌధరి అంటే చౌద్ ను అంటే భూమి పన్ను వసూలు చేసేవాడు అని అర్ధం .మహారాష్ట్రు రాజులు ఆదాయం లో నాలుగవ వంతు పన్ను వసూలు చేసేవారు చతుర్ధ నుంచి చౌద్ ఏర్పడింది .
మల్లా రెడ్డికవి వంశం వారు తెలంగాణా పాలమూరు జిల్లా లో చాలాగ్రామాలలో ఉన్నారు .బూర్గులగ్రామం గంగాపురానికి నాలుగు మైళ్ళ దూరం లోనే ఉంది .తండ్రి ‘’మల్లపల్లి పుర మందిర నివాసుడు ‘’అని చెప్పాడు .అదీ సమీప గ్రామమే .మల్లారెడ్డి నలుగురుకోడుకులు –గంగారెడ్డి హేమారెడ్డి లక్కరెడ్డి ,బక్క రెడ్డి.
గంగాపుర మహాత్మ్యం రాసిన రెండ్రేడ్డి మల్లారెడ్డి దేశాయి కవిత్వం దారాశుద్ధితో ,సరళ శైలిలో ఉంది .శేషాద్రి రమణ కవులలో ఒకరైన వెంకట రమణాచారి గారి వద్ద ఈ కావ్య ప్రతి దొరికింది .ఈప్రతి ఆచార్యులకు మల్లారెడ్డి తాత ఉండే మల్లేపల్లిలో దొరికింది .బారిస్టర్ ఆర్ దామోదర రెడ్డి గారు ఆ ప్రతికి నకలు రాయింఛి ముద్రిచమని కోరగా వారు కొద్ది కాలానికే చనిపోతే ,ముద్రణ ఆలస్యమైంది .దామోదర రెడ్డిగారు మల్లారెడ్డి వంశీయులే .విజ్ఞాన వర్దినీ పరిషత్తు వారు ముద్రణ చేబట్టి ఈ మహాత్మ్యాన్ని దామోదర రెడ్డి గారి స్మృతి చిహ్నంగా వారి పితృవ్యులు శ్రీ రామకృష్ణా రెడ్డిదేశముఖ్ గారి ఆర్ధిక సహకారం తో ముద్రించి లోకానికి అందించారు’’ అని ఆ పరిషత్ అధ్యక్షులు శ్రీ సురవరం ప్రతాప రెడ్డి గారు ముందుమాటలో కవి ,కాలం, గంగాపుర కావ్య సమీక్ష, చేస్తూ తెలియజేశారు .విజ్ఞాన వర్ధిని కార్యదర్శి శ్రీ చలమ చర్ల రంగాచార్యుల సహాయ సహకారాలు కూడా లభించాయి .ఈకావ్యం 15-8-1948 వ్యయ నామ సంవత్సర భాద్రపదమాసం లో సికందరాబాద్ ఓరిఎంట్ ముద్రణాలయం లో ముదిగొండ సాంబశివరావు చేత ముద్రిప బడింది .వెల కేవలం రూపాయిన్నర .ఇది నాలుగు ఆశ్వాసాల కావ్యం .410పద్య గద్యాలున్నాయి .అక్కడినుంచి కావ్యం శిధిలమైంది .
మల్లారెడ్డి వ్యాకరణ విరుద్ధ ‘’అన్నమరుచయ్యే’’వంటి ప్రయోగాలు కావాలనే చేశాడు .వర్ణనలు ‘’ప్రబంధ రీతిలో రాశాడు .మధ్యయుగ కవులపోకడ బాగా కనిపిస్తుంది.శైలికి మచ్చుకు ఒక పద్యం –‘’కాలవ్యాధుడు వెంటనంటి తరుమన్ గంజాప్త సారంగమున్ –చాలం దవ్వుగ నేగ ,తేవర శరమున్ సంధించి బిట్టే- యనట్లోలిం బశ్చిమ వార్ధి వ్రాలునటులీ యుగ్రాశుం డుగ్రు౦డే ద-త్కాలాలంబాన సాంధ్య రాగ మమరెన్ గెంపెక్కి నల్దిక్కులన్’’ . సురవరం ప్రతాపరెడ్డి గారి ముందుమాటలు ఈకావ్యానికి నిజంగా ‘’సుర వరమే’’ అయి మనకు తెలియని ఎన్నెన్నో విషయాలు తెలియజేసింది .వారికి ఆంధ్రలోకం రుణ పడి ఉంది .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -5-6-21-ఉయ్యూరు
—