నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి వేంకట నరసదాసు గారు -2
నరస దాసుగారు మూడవ తరగతి పూర్తి చేసి ,ప్రైవేట్ గా ఇంగ్లీష్ చదివి ,పొన్నూరు హైస్కూల్ లో 7వ తరగతిలో చేరి ,రోజూ ఇంటినుంచి పొన్నూరు వెళ్ళిరావటం కొడుకు కు కష్టం అవుతుందని తండ్రి గారు కాపురం పొన్నూరులోనే పెట్టారు .ఆడుతూ పాడుతో తోటిపిల్లలతో బడికి వెళ్ళేవారు .తెలుగులో తప్ప అన్ని విషయాలలో మెరిక లాగా ఉండేవారు.అందుకని మిగిలిన విద్యార్ధులు ఆయనతో స్నేహం బాగా చేసేవారు .వారిలో బీడీ సిగరెట్ త్రాగే వారు కూడా ఉండేవారు .ఆ చెడు సావాసం వలన ఒక రోజు సాయంత్రం బీడీ తాగుతూ గుప్పు గుప్పున పొగ బయటికి వదుల్తుంటే దీక్షితులు పంతులు గారు చూశారు .ఈయనకు ఆ సంగతి తెలియదు . మర్నాడు ఆయన నరసయ్యను తనగదిలోకి పిల్చి బీడీలు తాగుతున్నావా అని అడిగితె లేదని బొ౦క గా ,నిన్న సాయంత్రం నువ్వు తాగుతుంటే చూశాను పైగా అబద్ధమూ ఆడావు అని రెండు పేముబెట్టాలతో ఒళ్ళంతా వాతలు తేలేట్లు,రక్తం కారేట్లు బెత్తాలు విరిగేట్లు కొట్టారు. .ఇంటికి వచ్చి ఎవరికీ చెప్పలేదు .నిద్రరాలేదు. ఆ రాత్రి దీక్షితులగారికీ నిద్రపట్టక మంచి కుర్రాడిని విచక్షణా రహితంగా కొట్టానే అని బాధ ,మధన పడ్డారు .మర్నాడు స్కూలుకు వెళ్ళగానే నరసయ్యను పిలివగానే వెళ్లి తాను తప్పు చేశానని ఇక పొగ తాగనని ,అబద్ధం ఆడనని ఒట్టు పెట్టారు .’’మంచిది బాగా వృద్ధి లోకి వస్తావు ‘’అని దీవించారు .పంతులుగారు దీక్షితులుగారు .
అప్పుడప్పుడు కాఫీ హోటలుకు వెళ్ళే అలవాటు కూడా ఉండేది .ఆయన బంధువే ఒక హోటల్ ను మడీ ,ఆచారాలతో నడిపేవాడు .బ్రాహ్మణులే అన్నీ తయారు చేసేవారు ,సర్వర్లు కూడా బ్రాహ్మణులే .బ్రాహ్మణులే మడితో వచ్చి తినేవారు .నరసయ్యగారూ అప్పుడప్పుడు వెళ్లి తినేవారు .ఒకరోజు మధ్యాహ్నం నరసయ్యగారు ఆ హోటల్ వంటగదిలోకి వెళ్లి చూడగా ,ఒక బ్రాహ్మణేతర స్త్రీ ఇడ్లీ పిండిరుబ్బట౦ కనబడి అవాక్కయ్యారు .ఆమె ఎవరని అక్కడి కుర్రాడిని అడిగితే ‘’మా మేనేజరు గారి ఇలాకా .ఆమె రుబ్బిస్తే మేము మడితో ఇడ్లీ వేస్తాం ‘’అని నిజం చెప్పాడు .పైన ఆచారం లోన దురాచారం ఉన్న ఆ హోటల్ ను చూసి అసహ్యమేసి ,ఆ రోజునుంచి కాఫీ హోటల్ కు వెళ్ళటం కానీ అక్కడి పదార్ధాలు తినటం కానీ చేయనని భీష్మ ప్రతిజ్ఞ చేశారు .పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదుకదా .
పొన్నూరులో లక్ష్మీ నరసయ్య గారు చావలి సుబ్బారాయుడు గారింట్లో అద్దెకు ఉండేవారు .రాయుడుగారింట్లో రాత్రి నిత్యభజన జరిగేది .భజనతర్వాత ప్రసాదం పంచేవారు .నరసయ్యగారుప్రసాడం సమయానికి వెళ్ళేవారు .ప్రసాదం మీద భక్తీ కాని అసలు భక్తి ఉండేదికాదు .క్రమంగా భజన పై ఆసక్తికలిగి సంకీర్తనలలో తాళం వేస్తూ పాల్గొనేవారు .ఆతర్వాత భక్తీ పెరిగింది .ఆ భజనల్లో పాతూరి రామయ్య శాస్త్రిగారు ప్రవచనం చేసేవారు సత్కాలక్షేపం మోక్షానికి దారి అని రోజూ చెప్పేవారు అది నరసయ్యగారి మనసుపై గాఢ ముద్ర వేసింది .అప్పుడు కొల్లూరులో శ్రీ కృష్ణ జయంతి ప్రతిఏడాది జరిపేవారు .ఒకసారి తండ్రితో తానూ వెళ్ళారు .అక్కడ ములుకుట్ల లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు శ్రీ కృష్ణ చరిత్ర అద్భుతంగా వివరించేవారు .బాలకృష్ణుని చిలిపి చేష్టలు నరసయ్యగారి మనసంతా ఆక్రమించాయి .ఆ తన్మయ స్థితో నరసయ్యగారు ‘’లాలకు రారా గోపాల కృష్ణా –నీ వేలా చిక్కవునాకు ‘’అనే కీర్తన శ్రీరాగం ఆదితాళం లో రాశారు .బాలకృష్ణునిపై తల్లి యశోదకున్న వాత్సల్యమంతా కళ్ళకు కట్టించారు .ఆ కీర్తనను ఇప్పటికీ అక్కడ గానం చేస్తూనే ఉన్నారు .ఆయన బంధువు గుంటూరు వెంకటప్పయ్య గారు ‘’ఆంధ్రుడై పుట్టి ఆంధ్రాన్ని అర్ధం చేసుకోకపోతే అంధుడౌతాడు ‘’అని నిత్యం చెప్పేమాటలు మనసుకు పట్టి ,పొన్నూరు లైబ్రరీ లో వెంకట పార్వతీశ కవుల నవలలు చదివి ,ఒక్క ఏడాదిలో తెలుగులో నిష్ణాతులై ,అనేక వృత్తాలలో పద్యాలు రాశారు .అందులో వారు రాసిన ‘’గోపాల కృష్ణ శతకం ‘’ప్రసిద్ధి చెందింది .అందులోని రెండుపద్యాలు-
1-తే.గీ.‘’శ్రీ రమామణి చిత్త చోర –భక్తజన మానసోద్యాన పారిజాత –రాధికాకుచ సరసిజ రాజహంస –వందనమిదే వేణు గోపాలకృష్ణ ‘’’’
2-ముక్తపద గ్రస్తం-‘’సరసతర వేష రత్న భూషా విశేష –శేష భూషణ హృత్సరసిజ నివాస –వాసవాది సురవినుత పాద పద్మ –పద్మ దళ నేత్ర వేణు గోపాల కృష్ణ ‘’
ఈ శతకమే కాక ‘’నరసదాస కీర్తనలు ‘’అనే మూడు భాగాలు కూడా రాశారు .భక్తీ మధురభావ విలసితాలు దాసుగారి రచనలు .
సహాయ నిరాకరణ ఉద్యమం లోపాల్గొనటం
23-8-1920లో మహాత్మా గాంధీ విజయవాడకు షౌకతాలీహో కలిసి వచ్చాడు .గాంధీని చూడాలని నరసయ్యగారు బెజవాడ వచ్చారు .గాంధీ ఉపన్యాసం ఆయన చెవులలో తేనే ఊటలు అనిపించాయి .గాంధీ పిలుపు అందుకొని సహాయ నిరాకరణ ఉద్యమం లో పాల్గొనగా నరసయ్యగారిని బడినుంచి వెళ్ళగొట్టారు .తర్వాత బందరులో ఆంధ్రజాతీయ కళాశాలలో చేరి ,అక్కడ చిల్లరిగి శ్రీనివాసరావు ,కోపల్లె హనుమంతరావు గార్లవద్ద సంస్కృతం ,హిందీ కొద్దిగా నేర్చారు .దీనివలననే వారికి నామ ప్రచార దక్షత బాగా అలవడింది .అక్కడే పురాణ శాస్త్రాల ఉపన్యాసాలు,తులసీ దాసు రామ చరిత మానసం విని భక్తీ పులకా౦కి తులయ్యారు .శ్రీ వెంకట శాస్త్రి గారి వద్ద కొద్దికాలం లో చిత్రలేఖనం కూడా నేర్చారు .రామనామంతో రామాయణం అంతాచిత్రాలుగా చిత్రించి కొత్త వరవడికి నాంది పలికారు .గుంటూరు రామనామ క్షేత్రం లో వీటిని ఇప్పుడూ చూడచ్చు .బందరులో ఉండగానే సంగీతం ,వడ్రంగం ,తివాచీ నేత ,రాట్నం వడకటం అబ్బాయి .గాంధీ పద్ధతులు మహా ఇష్టంగా అలవాటు చేసుకొన్నారు .
దేశమంతా స్వాతంత్ర్య ఉద్యమం చాలా వేగంగా పాకిపోయింది. బందరులో పట్టాభి పద్యాలు గద్యాలతో దేశభక్తిని ప్రబోధించేవాడు .ఆప్రభావంతో నరసయ్యగారు ప్రతిపేట లో ఊరిలో స్వాతంత్రోద్యమ స్పూర్తి రగిలి౦చేవారు .వారి ఉపన్యాసాలు వీనుల విందుగా మనసులకు హత్తుకొనేవి .పద్యాలతో పాటలతో జన్నాన్ని ఉర్రూత లూగించేవారు దాసు గారు .ఆ సమయంలో బాపట్ల తాలూకా పెదనందిపాడు లోపర్వత నేని వీరయ్య చౌదరి గారి నాయకత్వం లో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది .ప్రజలు పన్నులు కట్టలేదు .రాత్రిళ్ళు నరసయ్యగారు పొన్నూరు నుంచి 10మైళ్ళ దూరం లో ఉన్న పెదనందిపాడుకు నడిచి వచ్చి ,ప్రజలకు ప్రభుత్వ దమననీతి వివరించి మళ్ళీ తెల్లవారు జామున బయల్దేరి పొన్నూరు చేరేవారు .వాలంటీర్ పని చేసేవారు .ఉద్యమాన్ని అణచటానికి తెల్ల వారు మరఫిరంగులతో పొన్నూరుకు రాగా ,కొందరు కాంగ్రెస్ వాలంటీర్లు భయపడి తమల్ని నాయకులు తప్పుదోవ తొక్కి౦చారని, తమకు ఉద్యమంతో సంబంధం లేదని చెప్పి తప్పుకొన్నారు నరసయ్యగారు ,ఆయన అనుచరుడు తూములూరి శివరామయ్య గార్లు చిన్నవారైనా ధైర్యంగా ,ప్రాణత్యాగానికైనా సిద్ధపడి ,ఖద్దరు టోపీలు పెట్టుకొని ,చొక్కాలు విప్పేసి ,ఆతెల్లదొరలకు ఆశ్చర్యం కలిగించారు ,తెల్ల సైనికులతో నరసయ్యగారు ‘’పవిత్ర భారత మాతను మీ లాంటి కుటిల దుర్మార్గ పాలకులను౦డి కాపాడటానికి ధర్మాన్ని కాపాడటానికి మేము వచ్చాం .మీ ఫిరంగులతో మా చాతీలపై కాల్చండి .మా తలలు తీసి మమ్మల్ని చంపండి .మా నియమానికి మీకు భయం దేనికి ‘’?అని గట్టిగా చెప్పారు .తెల్లవారు తెల్లమొహాలు వేసి ఏమీ చేయలేక ‘’మీ నిబ్బరానికి ముచ్చటపడి మిమ్మల్ని వదిలేస్తున్నాం .మీరు వెళ్లి పోవచ్చు ‘’అన్నారు .అక్కడ చేరిన వారంతా ‘’స్వతంత్ర భారత మాతకూ జై ‘’ అనే నినాదాలు మిన్ను ముత్తెట్లు పలికి వెళ్ళిపోయారు .అదీ నరసయ్యగారి దేశ భక్తీ, తెగువ ,సాహసం, పట్టుదల ,దీక్ష ..
ఆతర్వాత టంగుటూరి ప్రకాశం పంతులు గారి ఆధ్వర్యం లో గుంటూరులో శాసనోల్లంఘన జరిగింది .నరసయ్యగారు కూడా పాల్గొని సత్యాగ్రహం చేశారు .అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్ళారు నరసయ్యగారు జైలు జీవితం ఆనందాన్ని కలిగించలేదు .మనసు భౌతికం నుంచి పారమార్దికానికి చేరి ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభించారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-6-21-ఉయ్యూరు .
‘’