నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి వేంకట నరసదాసు గారు -3
ఆధ్యాత్మిక సాధన వైరాగ్య ప్రాప్తి
నరసయ్యగారి మనసు బుద్ధి ఆధ్యాత్మిక లగ్నంయ్యాయి .ఆయనకు సరైన సమయం లో ఉపనయన సంస్కారం చేశారు తలిదండ్రులు .నిత్య సంధ్యావందన గాయత్రీ జపానికి అవకాశ ఎక్కువ కల్పించారు .ఒక రోజు రాత్రి ఆయనకు ముక్తావిద్రుమ హేమ నీల ధవళ దేహం తో శ్రీసరస్వతీమాత సాక్షాత్కారం జరిగి ‘’నీ నిష్టాగరిష్టాలు నాకు నచ్చాయి .నీజపదీక్ష నన్ను ఆకర్షించింది .’’మంత్రాధీనం తు దైవం ‘’అని మర్చిపోకు ‘’అని చెప్పి అంతర్ధానమయింది .మేలుకొని తన జన్మం ,మంత్రజపం సఫలమైందని ఆమెకు కృతజ్ఞతలు చెప్పి ఆమెతో మాట్లాడే అవకాశం కలిగించనందుకు బాధపడ్డారు .భక్తీ పెరిగింది కానీ ఆదాయం లేదు. భుక్తి గడవటం కష్టమైంది .స్థిర చరాస్తులు హారతి కర్పూరమయ్యాయి .ఇల్లులేదు తినటానికి తిండికూడా లేదు .ఊరిలో మర్యాదా మన్ననా తగ్గి పోయాయి .చిత్తం శ్రీకాంతు స్వా౦తమైంది .భవబంధాలు తెంచుకొని వైరాగ్యం ద్వారా ఆనంద సామ్రాజ్యం అందుకోవాలని కోరిక గట్టి పడింది .
వివాహం, ఉదర పోషణ
తండ్రిగారు తన కొడుకును ఆదర్శ కుటుంబిగా తీర్చి దిద్దాలనుకొని ,నరసయ్య గారి మేనమామ కూతురుశేషా౦బతో తన కొడుకుకు వివాహం జరిపించారు .ఆమె సద్గుణ గరిష్ట ..ఆదాంపత్యాన్ని లోకం బాగా మెచ్చింది .ముసలి తలిదండ్రులు పైగా కొత్త సంసారం .భారమంతా ఈ దంపతులపై పడగా ,నరసయ్యగారు మద్రాస్ దగ్గర కమీషన్ వ్యాపారం చేసే షావుకారు దగ్గర గుమస్తాగా చేరారు .ఒకరోజు మరో కమీషన్ వ్యాపారి దాసుగారి దగ్గరకు వచ్చి అయిదువందల రూపాయలు ఇమ్మన్నాడు .డబ్బు ఉందికాని ఇచ్చె అధికారం తనకు లేదనీ యజమానినే అడిగి తీసుకోమని చెప్పారు .ఆయన యజమాని దగ్గరకు వెళ్లిజరిగింది చెప్పారు .అలా చెప్పటం తప్పు అన్నాడు యజమాని .లౌక్యం తెలీని దాసుగారు బాధ పడి,అక్కడ పని చేయలేక గుంటూరు తిరిగి వచ్చేశారు .
గుంటూరులో ప్లీడరు గుమాస్తాగా చేరి ,ఇక్కడా అంతా అబద్ధం మీదే నడుస్తోందని గ్రహించారు ఇంతలో తెనాలిలో చతుర్భుజ దాసు అనే ఆయన జ్యోతిషాలయం స్థాపించి ముఖం చూసి జ్యోతిషం చెప్పి డబ్బు బాగా గడించాడు . ఆయనదగ్గర గుమాస్తాగా చేరారు .కావలి నెల్లూరులలో కూడా బ్రాంచులు పెట్టాడు .డబ్బు వ్యవహారం దాసుగారికే అప్పగించాడు .క్రమంగా అతడి శీలం మంచిదికాదనీ ‘’పంచమకారాలపై ‘’ఆయనకు వ్యామోహం ఎక్కువని గ్రహించి ,శీలవంతుడు కాని వాడి వద్ద ఉద్యోగం చేయరాదని మానేశారు నరసయ్యగారు .
జమ్ములపాలెం లో పిల్లలకు ట్యూషన్ చెప్పారు .ట్రెయినింగ్ లేదుకనుక ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత లేదు .వచ్చిన డబ్బు తోనే కుటుంబ పోషణ చేసేవారు .ఈ పాలెం లో మంచి భక్తులను చేరదీసి భజన సంఘం స్థాపించి ,నామ సంకీర్తన బోధించి ఆస్తికత వ్యాప్తికి బాగా తోడ్పడ్డారు ప్రతిరాత్రీ 10గంటలనుంచి 12 వరకు సామూహిక భజన చేయించేవారు .అందరి సహకారం తో గ్రంధాలయం స్థాపించి ,అక్కడా నిత్య సంకీర్తన జరిగేట్లు చేశారు .పెదకొత్తపల్లి వాసి చదలవాడ వెంకట సుబ్బయ్య గారి దగ్గర తరంగాలు నేర్చారు .
ఆచార్యానుగ్రహం
1926లో భగవదతారమూర్తి అయిన ఆంద్ర వాల్మీకి వాసు దాసు గారు అనేక ప్రాంతాలలో పర్యటించి భక్తిజ్ఞాన వైరాగ్యాలు బోధిస్తూ జమ్ములపాలెం వచ్చారు .రామాలయం లో రామతత్వాన్ని బోధిస్తూ రామతత్వానికి మించింది ,రామనామానికి,రామ మంత్రానికీ మించిందీ ,రాముడికి మించిన పరదైవం లేదని నాలుగు గంటలు ప్రసంగం చేశారు .ఆ ఉపన్యాసానికి దాసుగారిలో ఆర్తి ఆవేశం ఆనందం ఆకర్షణ కలిగి ఆయన మార్గం లో జీవితం గడపాలనుకొన్నారు .రామకోటి రాముని చేరే సూటి మార్గం అని వారు చెప్పింది మనసులో నాటింది .తాము చెప్పిన నియమాలను పాటిస్తాం అనే వారు చేతులుఎత్తమని కోరితే నరసయ్యగారు ఆయన స్నేహితుడు బాపట్ల హనుమంతరాయ కవి మాత్రమె ఎత్తారు .వాల్మీకి వారి దృష్టి నరసయ్య గారిపై పడింది .ఆయనవచ్చి పాద నమస్కారం చేయగా ,లేపి కౌగిలించుకొని ‘’కుమారా !నీ చిరునవ్వు ముఖం చూసి నాకు ఆనందం కలిగింది .నీ మనసు తెలుసుకోవాలనే కోరిక కలిగింది .నీ భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంటుంది .నీకీర్తి ప్రతిష్టలు దిగంతాలకు వ్యాపిస్తాయి .లోకాన్ని ఉద్ధరించటానికే నువ్వు పుట్టావ్ .రామ తారక మంత్రం ఉపదేశానికి సర్వ విధాలా అర్హుడవు ‘’అని చెప్పి తారకమంత్రం ఉపదేశించి నిశ్చలభక్తితో జపించమని ఆజ్ఞాపించారు .తన జన్మ ధన్యమైనదని దాసుగారు భావించి వినయంతో వాసుదాసుగారితో ‘’స్వామీ !మీరు చెప్పినట్లు త్రికరణ శుద్ధిగా రామమంత్రాన్ని జపిస్తాను ‘’అనగా ఆశీర్వదించి వాసుదాసుగారు వెళ్ళిపోయారు .
మంత్రం సిద్ధి పొందాలనే కాంక్ష తీవ్రమై నరసదాసుగారు రోజుకు 21,600నామ జపం చేశారు .రోజుకు పదివేల రామకోటి రాశారు .రాత్రీ పగలూ రామధ్యానంతోనే గడిపారు .ఒకరోజు చిన్ని కృష్ణుడు కలలో కన్పించి కన్నీరు కారుస్తూ ‘’ఎన్నో రోజులనుంచి నీ సున్నిత హృదయం లో నన్ను ప్రతిష్ట చేసుకొని ,ఇప్పుడు మరొకరిపై మనసుపడ్డావు. ఇది అన్యాయం ‘’అనగా నరసదాసుగారు ‘’స్వామీ !మీరేగా ఆచార్యరూపం లో వచ్చి నాకు దీక్షనిచ్చి రామతారక మంత్రోపదేశం చేసింది .ఇప్పుడు తప్పు నాది అయినట్లు నెపం వేస్తున్నారు ఇదేమైనా బాగుందా ?’’అని అడిగారు .బాలకృష్ణమూర్తి చిరునవ్వు చిందిస్తూ ‘’నీ సాధన గొప్పది నీజపం సఫలమైంది .నువ్వు సిద్ధిపొందుతావు ‘’అని అభయమిచ్చి ఆ వేణుగానలోలుడు కోదండ రామ మూర్తిగా బహువిదాలంకారాలతో పట్టు పీతాంబరాలతో దర్శనమిచ్చి దాసుగారికి పరమాన౦ద౦ , పరవశం కలిగించారు .ఇలా నిరంతర రామ ధ్యానం తో ఒకకోటి పది లక్షల రామకోటి రాసి తాను నేర్చిన చిత్రలేఖనం తో రామాయణమంతా రామనామాలతో చిత్రించారు నరసదాసుగారు .ఇదొకకోటి అయింది .ఈ మొత్తాన్నిన శ్రీరామ చంద్రునికి అంకితమిచ్చారు .ఆంద్ర వాల్మీకి ఆశీస్సులతో దాసుగారు సంస్కృతం లో ‘’గురు పూజా విధానం ‘’రాశారు .ఇలా నిత్యనిరంతర రామనామ కాలక్షేపం తో నరసదాసుగారుకొంతకాలం జమ్ము పాలెం లోనే ఉన్నారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-6-21-ఉయ్యూరు