నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి వేంకట నరసదాసు గారు -5
నరసయ్యగారికి రోజూ దేవుడికి మృదు మధుర పదార్ధాలు నైవేద్యం పెట్టాలని ఉండేది .కాని ఆర్ధిక పరిస్థితికి అది గొంతెమ్మ కోరికే .ఒకరోజు ఇదే ధ్యాసతో ఆలోచిస్తూ నిద్రపోయారు .మర్నాడు ఉదయం పూజా సామాగ్రి పెట్టెలో నాలుగు పంచదార లడ్డూలు ఒక కాగితం పోట్లంలో కనిపించాయి.కాగితం మీద ‘’శ్రీరామ నిలయం –అయోధ్య ‘’అని హిందీలో రాయబడి ఉండటం చూసి అమితాశ్చర్యపడ్డారు .వాటిని అందరికి ప్రసాదంగా పంచిపెట్టారు .ఇలా రోజూ ఏదో ఒక మహిమ కనిపించేది .శేషమ్మగారి డబ్బు పోతూ, మళ్ళీ కనిపిస్తూ ఆమెకు నమ్మకం కలిగేది .ఒకసారి నరసయ్యగారు గురువు వాసుదాసు గారి కి అలాంటి మహిమలు ఇక తనకు వద్దు అని కోరారు .తన శిష్యుని యోగ సిద్ధి ఎంతవరకు వచ్చిందో తెలుసుకోటానికి ఆయన జమ్ముల పాలెం వచ్చారు .గురువుగారికి అత్యంత భక్తితో శిష్యుడు స్వాగతం పలికారు ఆయన అమిత శిష్య వాత్సలయం తో దగ్గరకు తీసుకొని కౌగలించుకొని ‘’’’నాయనా ! నీ యోగసిద్ధి వినయ విధేయతలు ఆధ్యాత్మిక వివేకం మృదుమధుర భాషణం ,నిర్మల మనసు ,నీ మనసులోని ధర్మమూ నాకు తెలిశాయి .మహిమలు అధోగతికి సోపానాలు .జాగ్రత్తగా మసలు కో ‘’అని హితవు చెప్పి వెళ్ళారు .ఇక తనకు ఏరకమైన మహిమలు చూపవద్దని ఆర్తిగా దేవుని నరసయ్యగారు ప్రార్ధించారు .
యోగం చేశాక తన శరీరం శవాకారంగా కనపడేది .ఒకరోజు రాత్రి అన్ని శరీర భాగాలనుంచి ప్రాణం పైకి వెడుతూ శిరసు దగ్గరకు వచ్చాయి .వెంటనే ఎవరో నెత్తిన చెయ్యి వేయటం అవి మళ్ళీ యధాస్థానలకు వెళ్ళిపోవటం కనిపించి ఆశ్చర్యపోయారు లేచి చూస్తె ఎవ్వరూ కనపడలేదు .
గుంటూరుశ్రీ రామ నామ క్షేత్ర సందర్శనం
వంగిపురం లో వాసుదాసుగారు శ్రీ కోదండరామ సేవక సమాజం వార్షికోత్సవాలలో నరసయ్యగారు కూడా పాల్గొన్నారు .జనం తండోప తండాలుగా వచ్చారు .రాగం ఆంజనేయులు,పెండ్యాల రామ సుబ్బయ్య ,పన్నాల లక్ష్మీ నరసింహం ,పన్నాల రామ కృష్ణయ్య గార్లుకూడాగుంటూరు నుంచి వచ్చి పాల్గొన్నారు .సాయంత్రం 4నుంచి నరసయ్య గారు భక్తీ ఉపన్యాసాలు చేశారు .ముందు సంకీర్తన చేసి తర్వాత ప్రసంగం చేసేవారు .పరమాద్భుతమైన తేజస్సుతో విరాజిల్లుతూ ప్రతిపలుకు కలకండ మాధుర్య౦గా ఉండేది ..శ్రీరాముని లీల విలాసాలను శ్రోతల మనస్సులోచొచ్చుకుపోయేట్లు మాట్లాడేవారు .ఉపన్యాసం పూర్తీ అవగానే శ్రోతలు అందరూ వచ్చి ఆయనకు పాదాభి వందనం చేసేవారు అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ ఆలింగం చేసేవారు .గుంటూరు వారు ‘’స్వామీ !మీ దర్శనం మాకు శ్రేయోదాయకం .గుంటూరులో శ్రీ సీతారామ నామ సంకీర్తన సంఘం ఉన్నది మేము దాని సభ్యులం .అది చిన్న సంఘమే కాని మీరు విచ్చేసి అక్కడ నామ సంకీర్తన ఉపన్యాసాలు చేయవలయునని మాకోరిక .మీరు సందర్శిస్తే దాని అభివృద్ధి దిగ్విజయంగా జరుగుతుందని మా విశ్వాసం ‘’అని రాగం ఆంజనేయులు బృందం వారు విన్నవించారు .
నరసయ్యగారు చాలా సంతోషంగా వారి వెంట గుంటూరు వెళ్ళారు .అప్పటినుంచి నరసయ్యగారిని ఆ సంఘ సభ్యులుగా చేర్చుకొని ,ప్రచారం చేసే ప్రతి చోటుకూ తమ వెంట తీసుకు వెళ్ళేవారు .దీనితో ఆ సంఘం విలువ నాలుగు మూలాలకు ప్రాకింది .నరసయ్యగారు జమ్ముపాలెం నుంచి బుద్ధాం వచ్చి ఎలిమెంటరి స్కూల్ టీచర్ గా పని చేశారు .బుద్ధాం నుంచి 8మైళ్ళ దూరం లో ఉన్న బాపట్లకు వారం లో నాలుగైదు రోజులు భజనకు వెళ్ళేవారు సాయంత్రం 5గంటలకు బయల్దేరి నడిచి వెళ్ళటం ,రాత్రి 11,12వరకు భజన చేసి తిరిగి నడిచి ఇంటికి రావటం చేసేవారు .తెల్లవారుజామున నాలుగుకే లేచి పనులన్నీ చూసుకొని బుద్దాం స్కూల్ లో బోధనా చేసేవారు .
గురువు లేకుండాయోగాభ్యాసం చేయటం అధిక శ్రమ యోగం లో పనికి రాని భోజనాలు తినటం నిద్ర చాలక పోవటం వలన అనారోగ్యం పాలయ్యారు .ఉప్పు కారం ఉన్న తిండి తినటం తో కలిగిన బాధ ఇది .కీళ్ళ వాతం వచ్చి కదలలేక మెదల లేక ఒక’’ మూట గా’ ఉండిపోయారు .పల్లెటూరుకనుక వైద్య సదుపాయం లేదు .యాచన గిట్టని మనస్తత్వం వారిది .క్రమంగా మనసును స్వాధీనం చేసుకొని చివరికి దాన్నికూడా త్యాజ్యం చేసి శ్వాసకార్యాన్ని బంధించటం చేత ఆయన చనిపోయారని అందరూ గుసగుసలాడు తుంటు౦టే కొంతసేపటికి బాహ్య స్మృతి కలిగి .ఆపదలో ఆదుకొనే వారే కనిపించలేదు .వాత౦ హరి౦చ టానికి పూసిన పూతలవల్ల కొంత గుణం కనిపించింది .ఈ అనుభవంతో గురువు లేకుండా యోగాభ్యాసం చెయవద్దుఅని అందరికీ బోధించేవారు .వాసు దాసు గారు రాసిన ‘’మందరం ‘’ను నరసయ్య గారి చేతితోఅందంగా రాయించాలని ఆయనకు అప్పగించారు గురువుగారు .ఆరోగ్యం కొంచెం కుదుట బడింది కనుక ఇక వృధా కాలక్షేపం పనికి రాదనుకొని వాలుకుర్చీలో కూర్చుని నెమ్మదిగా మందరం ను ముత్యాల వంటి అక్షరాలో రాసి గురువుగారికి అందించారు నరసయ్యగారు .
నరసయ్యగారు చాలా కాలం గా బాపట్లకు రాకపోవటం తో స్నేహితుడు పుల్లె శేషగిరిరావు బుద్దాం వచ్చారు . ఈ బాల్య స్నేహితుడు ,సహాధ్యాయి దుర్వ్యసనాలకు బానిసై పతనం చెందుతు ఉంటే సరైన మార్గం లో పెట్టారు నరసయ్యగారు .నరసయ్యగారి దీన స్థితి చూసి ఆయన హృదయం ద్రవించి,వెంటనే సరైన వైద్యం కోసం బాపట్లకు తీసుకు వెళ్ళారు .స్వంతడబ్బు చాలా ఖర్చు చేసి నరసయ్యగారిని మళ్ళీ ఆరొగ్యవంతుల్ని చేసి స్నేహఋణం తీర్చుకున్నారు శేషగిరి రావు .
ఆతర్వాత గుంటూరు రామనామ క్షేత్రం వారు వచ్చి నరసయ్యగారిని గుంటూరు తీసుకువెళ్ళి తమ సంఘానికి మేనేజర్ ను చేశారు .గుంటూరులో కాపురం పెట్టి ఆసమాజనికి సేవ చేశారు .కంతేరులో జరిగిన వార్షికోత్సవానికి గుంటూరు సంఘాన్ని ఆహ్వానించగా ,నరసయ్యగారు వెళ్లి భక్తీ ఉపన్యాసంతో వారి మనసులను జ్ఞానం నుంచి భక్తికి మరల్చారు .మూడురోజులు నవవిధ భక్తిగురించి ప్రసంగించారు .ఆ ఉపన్యాసాల సారాంశం ‘’నవవిధ భక్తులు ‘’పుస్తకంగా ముద్రణ పొందింది .
రాగం ఆంజనేయులుగారి తండ్రి పిచ్చయ్యగారు గొప్ప భక్తులు .రామకోటి రాసేవారు అప్పటికి ఆ సంఘ సభ్యులలో నరసయ్యగారు ఒక్కరే రామ కోటి రాసిన వారు .అందుకని ఇద్దరికీ స్నేహం బాగా కుదిరింది .పిచ్చయ్యగారు రామకోటి పేరుతొ ఉత్సవాలు నిర్వహి౦చాలనుకొన్నారు. పిచ్చయ్యగారు తమ రామకోటికి భద్రాచలం తీసుకువెళ్ళి సీతారామ స్వామికి సమర్పించి అక్కడే పరమపదించారు .
నరసదసుగారు నిర్ణయించిన ముహూర్తానికి రామకోటి పూజలు చేసి ,రామకోటి ఉత్సవాలను ప్రారంభించారుగుంటూరులో .ఆతర్వాత ‘’భానువార సంకీర్తనం ‘’పేరుతొ ప్రతి ఆదివారం భజన,ఉపన్యాసాలు జరిపించారు.నరసదాసుగారు ‘’భక్త రామ దాసు ‘’కథా సంకీర్తనం చేశారు ఇదే కథా సంకీర్తనకు పునాది అయింది .కథా సంకీర్తనలో భక్తి ప్రవహించి ఉర్రూత లూగిస్తుంది .
ఒకసారి ఈసభవారు సేకూరు సభలకు వెళ్ళారు .అక్కడ క్రమ శిక్షణ లేకపోవటం చూసి ఏవగించుకొని భక్తీ సమాజ౦ అందరికీ ఆదర్శంగా ఉండాలిఅని నిశ్చయించారు .పెండ్యాల రామ సుబ్బయ్య గారితో చర్చించి నియమాలు ఏర్పాటు చేశారు .అప్పటికే నరసదాసుగారు వాసు దాసుగారి వద్ద దిన చర్య రాసి మూడు సోపానాలలో అగ్రస్థానం పొందారు .ఒక రోజు గురువుగారు దిన చార్య రాయాల్సిన అవసరం లేదని చెప్పారు .నరసయ్య గారు సభ్యులను సమావేశ పరచి దిన చర్యరాయటం లో ఉన్న నియమాలు అందరూ పాటించాలని ‘’నియమమే ఊర్ధ్వ అయనం.దాన్ని పాటించే వాడే సాటిలేనిమేటి .దానిలోనే మనుష్యత్వం ఇమిడి ఉంది .మనం చేసేపనులన్నీ దిన చర్యరాసేటప్పుడుగుర్తుకు వస్తాయి .మన తప్పు ఇతరులకు చెప్పాలి .నిర్బంధం లోనే బంధ విముక్తి ఉంది ‘’అనిసాకల్యంగా వివరించారు .అందరూ నియమాలను పాటిస్తామని వాగ్దానం చేసి అమలు పరచారు .నెలకోసారి సమావేశం జరిగి సమీక్ష చేసుకొనేవారు .సాధన శాఖకు నరసయ్యగారిని అధ్యక్షులను చేశారు .మొదటి సమావేశం సంగం జాగర్ల మూడి దేవాలయం లో 25 మంది సభ్యులతోజరిగింది .క్రమ౦గా సంఖ్య 200 దాటింది .తర్వాత గుంటూరి క్షేత్రం లోనే సమావేశాలు నిర్వహించారు .1938 నుండి శ్రీ ప్రభుదత్త బ్రహ్మ చారి గారి ప్రోత్సాహంతో ‘’అవిరామంగా హరేరామ నామ సంకీర్తన’’ జరుగుతోంది .నరసయ్య, ఆంజనేయులు గారి నేతృత్వం తో సమాజం ఆదర్శప్రాయంగా వర్ధిల్లుతోంది .నామారాధన ,,అధః పతనాను రోదధిని ,విషయ వాంఛా నిరోధిని ,సన్మార్గ సులభోపాయ బోధినీ ,సంశయ విచ్చేదినీ ,వైరాగ్యబోధినీ అయిన ‘’మోక్ష సాధన ‘’అనే మాసపత్రికనరసదాసు గారి సంపాదకత్వం లో వెలువడి ఆస్తికాభ్యుదయానికి విశేషంగా తోడ్పడింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-6-21-ఉయ్యూరు