నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి వేంకట నరసదాసు గారు -6
బుద్దాం లో శ్రీరమా చ్యుత మందిర నిర్మాణం
ఒకప్పటి బౌద్ధుల ఆవాస భూమికనుక బుద్దాం అనే పేరు వచ్చి ఉంటుంది ఇప్పటికి అక్కడ బౌద్ధ నిర్మాణ అవశేషాలు కనిపిస్తాయి .గుంటూరు సీతారామ నామ సంకీర్తన సంఘానికి ఒక ఏడాది మేనేజర్ గా పని చేసి నరసయ్యగారు బుద్దాం వచ్చి అక్కడ మేనేజి మెంట్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తూ కాపురం పెట్టారు .అక్కడకు వచ్చిన కొద్ది రోజుల్లోనే అక్కడ కలరా తీవ్రంగా వ్యాపించి ,ఒకే వారం లో సుమారు 80మంది చనిపోయారు .జనం భయభ్రాంతులయ్యారు అక్కడ కనీసం ఒక్క దేవాలయం కూడా లేదు .కలరా వ్యాధి బారి పడకుండా జనాలకుధైర్యం చెప్పటానికి నరసయ్యగారు మాధవ కీర్తన సప్తాహం నిర్వహించారు .మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే వ్యాధి తగ్గటం మొదలైంది .ఇది సంకీర్తన ప్రభావం అని జనం విశ్వ సించారు .శ్రద్ధగా అందరూ పాల్గొనేవారు .నరసయ్య గారిని ‘’నరసదాసు ‘’గారని గౌరవంగా సంబోధిం చేవారు .అరిష్టాలను అరికట్టటానికి ఆ౦జనేయ విగ్రహం స్థాపించి పూజ కూడా జరిపించారు .మంగళ శనివారాలలో తమలపాకు పూజలు అప్పాల నైవేద్యం చేయించేవారు .దేవాలయం ,అర్చన లేని గ్రామం లో ఒక్కపూట కూడా ఉండరాదనే ఆర్యోక్తి ని అక్కడిజనాలకు నిత్యం చెప్పేవారు .
మందిర నిర్మాణానికి ఆయనకు తగిన ఆర్ధిక స్థోమత లేదు. తల్లి చనిపోయింది .కొడుకు ,కూతురు భార్యాభర్తల పోషణ జరగాలి .శేషమ్మగారు ఎక్కడెక్కడో అప్పు చెసి కొంపగాడుపుతూ , జీతం రాగానే తీర్చేవారు .ఒక సారి ఆమె పిల్లలతో పుట్టింటికి వెళ్ళారు .దాసు గారొక్కరే ఇంట్లో ఉన్నారు .రోజూ నియమమ తప్పకుండా గాయత్రీజపం , ఏమీ తినకుండా బడికి వెళ్లి ,సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చాక అన్నం వండి తినేవారు .ఒకరోజు భోజన సామగ్రి లేక అసంపూర్తిగా భోజనం కానిచ్చేవారు .తన బాధ ఎవరికీ చెప్పేవారు కాదు .అలాగే ఒక సారి రాత్రి సంకీర్తన చేసి నిద్రకు ఉపక్రమించారు .ఆకలి గా ఉండటం తో నిద్ర పట్ట లేదు .చిన్న కునుకు తీశారు .అందులోనే ఒక కల వచ్చింది .శ్రీరాముడు కనిపించాడు ఆయన అలసిపోయినట్లు ఒళ్ళంతా చెమట కారుతున్నట్లు దాసుగారు చూశారు .పైన ఒక ఉత్తరీయం మాత్రమె ఉంది .బరువైన ధావళి కొంత ఊడింది .పాదాలు దుమ్మూ ధూళితో ఉన్నాయి .శ్వాస మహా వేగం గా ఉండటం తో పరిగెత్తుకొని వచ్చినట్లు అనిపించారు .మొహం తెల్లబడి కళ్ళ వెంట నీరు కారుతోంది .ఏదో చెప్పాలన్న తపన తో ‘’వత్సా !ఆకలితో ఎంత బాధ పడుతున్నావోకదా.వెంటనే రాలేకపోయాను ..నా భక్తుల ఆర్తి పోగొట్టటం నా ధర్మం .నీకోసం ఆహారం తెచ్చాను త్వరగా లేచి తిని కడుపు నింపుకో ‘’అని కుడి చేయిని దాసు గారి ఛాతీపై ఉంచాడు రామయ్య .ఆస్పర్షకు దాసుగారికి మెలకువ వచ్చి లేచారు .ఇంటిగుమ్మం తెరిచి ఉంది .దీపం వెలుగుతూనే ఉంది .ఆశ్చర్యం తో లోపలి వెళ్ళారు .అక్కడ ఒక పళ్ళెం లో నాలుగు గోధుమ రొట్టెలు ,వాటిపై పెద్ద వెన్నముద్ద కనిపించాయి .దాసుగారి హృదయం ఉప్పొంగి పోయింది .మనసులో దైవ ధ్యానం చేసి వాటిని తినటానికి కూర్చున్నారు .అవి అప్పటికప్పుడే తయారు చేసినట్లు వేడిగా వెన్నతో ఉండటం తో రాముడే తాను తినే ఆహారాన్ని తెచ్చి పెట్టాడని నిశ్చయించారు .రామమంత్ర పునశ్చరణ చేయాలనే తలంపు వచ్చి ,మంత్రానికి ఎన్ని అక్షరాలు ఉంటె అన్ని లక్షల సార్లు నియమం తో జపి౦చాలని నిర్ణయించుకొన్నారు .దీక్షగా ఒక్క నెలరోజుల్లో అనుకున్నది పూర్తీ చేశారు .అహర్నిశలు రామనామ జపమే ,మనసంతా రామమందిరమే చేసుకొన్నారు .దీనితో అంతా రామమయం గా కనిపించింది .వారి భక్తి పరాకాష్టకు చేరింది .రాముడిని చూడటానికి తహతహ లాడారు .
మళ్ళీ ఒకరోజు రాముడు స్వప్న సాక్షాత్కార భాగ్యం కలిగించి ‘’భక్తావతంసా !నీ సాధన తీవ్ర సిద్ధి పొందింది .నీ ప్రేమ హృదయం పరమ మధురం .నీ భావాలు నన్ను ఆకర్షించాయి .నీతో చాలా సన్నిహితంగా ఉండాలనే తీవ్ర మైన కోరిక నాకు కలిగింది .నువ్వు సిద్ధి సాధించిన ఈ స్థలం లోనే నీతో ఉండి పోవాలని పిస్తోంది .నీ నామ ప్రచారానికి నువ్వు నిర్మించాలనుకొన్న మందిరం గొప్ప ప్రచార సాధనమౌతుంది ‘’అని చెప్పి అదృశ్యమయ్యాడు .
ఐడియా బాగానే ఉంది.చేతిలో దమ్మిడీ కూడా లేదు .శేషమ్మగారి నగలు అమ్మితే వచ్చిన రెండు వేల రూపాయలోతో మందిర స్థాపనమొదలు పెట్టాలనుకొని ప్రారంభించి చిన్న మందిరం కట్టారు .దానిలో సీతారామ ఆంజనేయ మట్టి విగ్రహాలు పెట్టి పూజించేవారు .శ్రీ 108ప్రభుదత్త బ్రహ్మ చారి గారు ,శ్రీ శియా రఘువర దాసు గార్లు మనదాసు గారి మందిరం చూడాలనే ఉత్సాహం తో వచ్చారు .పవిత్రమైన ఆమందిరం లో పాలరాతి విగ్రహాలు పెడితే దివ్య తెజోమయంగా ఉంటుంది అని అన్నారు దాసు గారితో .వారిద్దరితో తమ స్థితి గతులు పూస గుచ్చినట్లు దాసు గారు విన్నవించారు .వెంటనే వారు చంద్రకాంత శిలా నిర్మిత శ్రీ రమాచ్యుత’’ విగ్రహాలు అందజేస్తామని హామీ ఇచ్చారు .అది రాజస్థాన్ లో మాత్రమె దొరికే జైపూర్ శిల్పం .నరసదాసుగారు అక్కడికి వెళ్లి శ్రీ సీతారామ ,శ్రీ రాధా కృష్ణుల విగ్రహాలను ఎంపిక చేసి తీసుకొని వచ్చి మందిరం లో ప్రతిష్టించారు .సగుణ నిర్గుణ నామాలు అయిన ఓంకారం, హరేరాం ఫలకాలను కూడా ప్రతిష్టించారు .ఈ మందిరానికి ‘’నామ ప్రయాగ ‘’అని పవిత్ర నామం పెట్టారు .భగవదవతార జ్యోతకమైన సంపూర్ణ ప్రభావమే ఆ మందిరం యొక్క ప్రత్యేకత .దీనితో బుద్ధాం లో దేవాలయం లేని కొరత తీరింది .రోజూ రాత్రి భజన చేసేవారు .ప్రతి ఏకాదశినాడు అక్షండ నామ సంకీర్తన నిర్వహించారు .స్త్రీ భక్తులు కమ్మగా గానం భజన లతో అలరించేవారు .త్యాగరాజకీర్తనామృతం జాలు వారి౦ చేవారు .శ్రీ ప్రభు దత్త బ్రహ్మ చారి శ్రీ సీతారామ దాసుగారు ,శ్రీ ఓంకార దాసుగారు ,శ్రీ అవదూతేంద్ర సరస్వతి గారు గొప్ప ప్రేరణ కలిగించేవారు .
నాలుగేళ్ళు వరుసగా గ్రామస్తుల సహకారం తో ఇక్కడ మూడు రోజులు ఉత్సవాలు జరిపారు .దాతలు ముందుకు వచ్చి మందిర విస్తరణకు ఆర్ధికసాయం చేశారు .మందిరం విద్యుత్ కాంతులతో మిలమిల మెరిసిపోయేది నరసయ్యగారి ఆర్ధిక బాధలు తగ్గాయి .కుమారునికి , కూతురికి మంచి సంబంధాలు తెచ్చి వివాహాలు చేశారు.భార్య శేషమ్మగారు భర్త నరస దాసుగారికి అన్ని రకాల తోడ్పాటు అందిస్తూ అతిధి , అభ్యాగ్తులను ఆదరిస్తూ తలలో నాలుకగా వ్యవహరించి అందరి మన్ననలు ఆదంపతులు పొందారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-6-21-ఉయ్యూరు