వరిష్ట కర్మిష్టి వర్మగారు
వర్మగారు అని అందరికీ పరిచయమైన శ్రీ తోటకూర అప్పారాయ వర్మగారు జూన్ 6వ తేదీ ఆదివారం గన్నవరం లో స్వగృహం లో 94వ ఏట మరణించారు .వారితో సుదీర్ఘకాలం పరిచయమున్న ఉపాధ్యాయులు ,కృష్ణా జిల్లా టీచర్స్ గిల్డ్ తో అనుబంధం ఉన్నవారెవరైనా వర్మగారి గురించి స్పూర్తి నిచ్చే వ్యాసం రాస్తారేమో నని ఎదురు చూసి ఆశాభంగమై ,నాకు
వారితో ఉన్న అనుబంధాన్ని విద్యారంగానికి వారు చేసిన సేవలను నాకు జ్ఞాపకం ఉన్న మేరకు అందరికి తెలియజేయాలని ఈ రచన మొ దలుపెట్టాను. వారి విశేషాలపై నాకు పూర్తి అవగాహనా, లేదు అధారిటీ కూడా నాకు లేదు . ఒక సారి ఫ్లాష్ బాక్ లోకి వెళ్లి విషయాలను ఏకరువు పెడతాను .ఇందులో క్రానలాజికల్ ఆర్డర్ ఏమీ లేదు .
నేను సైన్స్ టీచర్ గా కృష్ణాజిల్లా మోపిదేవి హైస్కూల్ లో 1963 ఆగస్ట్ లో చేరాను .హెడ్ మాస్టర్ శ్రీ తూమాటి కోటేశ్వరరావు గారు .అప్పుడు కృష్ణా జిల్లా టీచర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ గా సీనియర్ మోస్ట్ హెడ్ మాస్టర్ పటమట హై స్కూల్ లో పని చేస్తున్న శ్రీ ఆరిగపూడి పూర్ణ చంద్రరావు గారు .నాకు అప్పటికి గిల్డ్ అంటేఏమిటో తెలీదు .కాని ఆయనపై అభియోగాలు చాలావినిపించేవి .ఆయన్ను తీసేసి వేరే వారిని నియమించాలని గిల్డ్ సభ్యులకు నాయకులకు కలిగింది .కానీ ఆయన అన్ని విధాలా పలుకు బడి ఉన్నవారట .దీనిపై వ్యూహానికి పామర్రు హై స్కూల్ లో ఒక ఆదివారం టీచర్స్ సమావేశం నిర్వహించారు తూమాటి వారి ఆధ్వర్యం లో .అప్పటి వారిలో వర్మగారు శ్రీ పాలేటి లక్ష్మణ స్వామి శ్రీ కాకరాల రాధాకృష్ణ మూర్తి ,శ్రీ వల్లభనేని ప్రభాకరరావు శ్రీ ఏం వి కృష్ణారావు(మొవ్వ కృష్ణారావు ) గార్లు అధ్క్షా మార్పు అవసరం గురించి వివరించారు .
తర్వాత ఒక సారి పడమట హై స్కూల్ లోనో ఎక్కడో మళ్ళీ సమావేశం జరిగింది .ఈలోగా రావు గారిని మర్యాదగా దిగిపొమ్మని చాలా రాయబారాలు జరిగాయి .ఆయన ససేమిరా అన్నారు .వీళ్ళకీ పట్టు దల పెరిగి ఎలా అయినా దించాలని నిర్ణయించారు .మీటింగ్ జరుగుతుండగా మినిట్స్ బుక్ ను ఎవరో ఎత్తుకు పోయారనే గొడతొ వాయిదా పడుతూ చివరికి కొత్త పుస్తకం తో ఉన్న వారి హాజరీతో పూర్ణ చంద్ర రావు గారిని తొలగించి ,మా హెడ్మాస్టర్ శ్రీ తూమాటి కోటేశ్వర రావు గారిని గిల్డ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోన్నట్లు జ్ఞాపకం అప్పటి నుంచి నేను గిల్డ్ లో మెంబర్ గా ఉన్నాను .
ఆతర్వాత గిల్డ్ బాగా పని చేస్తూ అందరి కి దగ్గరైంది .కార్యవర్గ సమావేశాలు సర్వ సభ్య సామావేశాలు రెగ్యులర్ గా జరిగేవి .ఉయ్యూరునుంచి నేనూ లేక్కలమేస్తారు ఆంజనేయ శాస్త్రి సైన్స్ మాస్టారు కాంతారావు, హిందీ మాస్టారు రామారావు నతెలుగుపందిట్ శ్రీ అన్నే పిచ్చిబాబు వగైరాలం వెళ్లి వస్తూ ఉండేవాళ్ళం ఆసమావేశ లలో నన్ను మాట్లాడమంటే మాట్లాడే వాడిని. అంతా నన్ను అభి నంది౦చేవారు .తర్వాత ప్రభాకరరావు గారు ప్రెసిడెంట్ అయినట్లు గుర్తు .ఆయన చాలాకాలం కార్యదర్శిగా ఉన్నారు సీనియర్ మోస్ట్ సేకండరి టీచర్ . రూల్స్ అన్నీ బాగా తెలిసినవారు ఆయనకొక గ్రూప్ ప్రత్యేకంగా ఉండేది
తర్వాత నేను మోపిదేవిలో పని చేసినప్పుడు సోషల్ మాస్టర్ గా ఉంటూ నాకూ లెక్కల మేష్టారు శ్రీ రమణా రావు గారికి ఆప్యాయం గా ఉన్న శ్రీ పసుమర్తి సీతారామ శర్మగారు అప్పుడే హెడ్ మాస్టర్ గా ప్రమోషన్ వచ్చి వెళ్లి పొయీరు ,ఆతర్వాత పటమట హై స్కూల్ హెడ్ అయి ఆయన వివాదరహితుడు పెద్దమనిషి అని అందరూ గుర్తించి శర్మగారిని గిల్డ్ ప్రెసిడెంట్ ను చేశారు .అప్పుడు వర్మగారు సెక్రెటరి అయారు తనకున్న అనుభవం .తో . ఆసమావేశం లో నన్ను మాట్లాడ మంటే ‘’శర్మ ,వర్మా కలిసి గిల్డ్ కు బర్మా వేయకండి ‘’అన్నాను వాళ్ళిద్దరితో పాటు అందరూ పగలబడి నవ్వారు నేను ఎప్పుడు కనబడినా ఈమాటే చెప్పేవారు .ఆతర్వాత తాడంకి హెడ్ మాస్టర్ శ్రీ కే మంగళగిరి శాస్త్రి గారు ప్రెసిడెంట్ చేశారు తాడంకి హిందీమాస్టారు శ్రీ లక్ష్మణ స్వామి సెక్రెటరి .ఆతర్వాత వర్మగారిని మేమంతా బలపరచి ప్రెసిడెంట్ ను చేశాం .ఆతర్వాత చాలామంది మారారు .
కృష్ణా జిల్లా గిల్డ్ అభ్యర్ధిగా శాసనమండలికి శ్రీ కొల్లూరి కోటేశ్వరావు గారిని ప్రతిపాది౦చటం ఆయనకోసం అహరహం ప్రచారం నిర్వహించి అందర్నీ ఒప్పించి మూడు సార్లు ఆయనను గెలిపించటం లో వర్మ గారి పాత్ర చిరస్మరణీయం .గిల్డ్ నిర్వహించే టీచర్స్ ఓరిఎంటేష న్ క్లాసులు విజయవంతం అయెట్లు చేయటం లో వర్మగారి కృషి అభినందనీయం .సిలబస్ మార్పులు ,ప్రశ్నపత్రాలలో మార్పులు వగైరాలకు ప్రత్యెక సమావేశాలు నిర్వహించటం లో ఆరి తేరిన చెయ్యి .మంగినపూడి సెమినార్ గొల్వే పల్లి సెమినార్ ఉయ్యూరు సెమినార్ వంటివి లెక్కలేనన్ని .
కృష్ణా జిల్లా పరిషత్ అధ్యక్షులైన శ్రీ మాగంటి అంకినీడు శ్రీ పిన్నమనేని కోటేశ్వరావు ,శ్రీ సుంకర సత్యనారాయణ శ్రీ రాఘవ రావు గార్లతో అత్యంత సాన్నిహిత్యంగా మెలిగే చాతుర్యమున్నవారు వర్మగారు .టీచర్స్ బదిలీలలో సమర్ధమైన టీచర్లను సమర్ధమైన స్కూళ్ళలో నియమించటం లో ఆయన చైర్మన్ లకు మంచి సలహా ఇచ్చేవారు .ఉపాధ్యాయ సంక్షేమం పట్ల మక్కువ ఎక్కువ .విజయవాడ శ్రీ కాకాని వెంకటరత్నం టీచర్స్ గిల్డ్, బందరులో శ్రీ పిన్నమనేని కోటేశ్వరావు టీచర్స్ గిల్డ్ నిర్మాణం లో వర్మగారు నిర్వహించిన పాత్ర ప్రశస్తమైనది .గిల్డ్ హో౦ లలో అన్ని రకాల సదుపాయాలూ కలిపించటానికి టీచర్లను ప్రోత్సహించిన వైనం ,గిల్డ్ నిర్వహణలో ఎలోపం జరుగకుండా చేయటం లో ఆయన చూపిన విజ్ఞత మరువలేనివి .పదవిలో ఉన్నా లేకున్నా ఆయన ఎప్పుడూ టీచర్లకు అందుబాటులోనే ఉండేవారు వారి సమస్యల పరిష్కారినికి చొరవ చూపి ఫలితం సాధించేవారు .జిల్లాపరిషత్ చైర్మన్ నిర్వహించే హెడ్ మాస్టర్లసమావేశం జిల్లా విద్యాధికారి నిర్వహించే సమావేశాలలో ఆయనతో వారు సంప్రదించి విజయం కావటానికి కృషి చేయమని కోరేవారు .
నేనంటే వర్మగారికి అమితమైన అభిమానం .నాకూ ఆయన౦టే యెనలేని గౌరవం .మా పెద్దబ్బాయి శాస్త్రి రెండోవాడు శర్మవివాహాలు విజయవాడలో జరిగితే హాజరై ఆశీర్వదించారు ఉయ్యూరులో జరిగిన మా అమ్మాయి ఛి సౌ విజయలక్ష్మీ అవధాని వివాహానికి విచ్చేసి ఆశీర్వదించిన డొడ్డమనసు వర్మగారిది .
నా సర్వీసులో ఎప్పుడూ నాకు బదిలీల గండమే .జరిగినప్పుడల్లా ఆయన కు తెలియ ఎసేవాడిని. వీలున్నమేరకు సాయపడేవారు .ఒక్కోసారి ఉయ్యూరు వచ్చి విషయం ఏదైనా ఉంటె నాకు నేను ఇంట్లో లేకపోతే,మాశ్రీమటికీ చెప్పి వెళ్ళే సంస్కారం ఆయనది .నన్ను ఒకసారి ఉయ్యూరు హై స్కూల్ నుంచి గన్నవరం హై స్కూల్ కు దసరా సెలవులలో ట్రాన్స్ ఫర్ చేశారు .విపరీతమైన వర్షాలు వరదలు . సెలవాల్లోనే జాయిన్ అయాను అప్పుడు హెడ్మాస్టర్ ఎల్వి .రామ గోపాలం గారు .ఆయన మేనమామ ,మామగారు శ్రీ ఉమా రామలిన్గామూర్తిగారు జిల్లాలో పేరెన్నికగన్న హెడ్ మాస్టర్ .సెలవల తర్వాత స్కూల్ లో నేను సుమారు పది రోజులు పని చేశాను .అక్కడే వర్మగారితో పని చేసే అదృష్టం కలిగింది నాకు .రోజూ ఉయ్యూరునుంచే వెళ్ళేవాడిని .ఆతర్వాత అక్కడ పని చేసి పామర్రు ట్రాన్స ఫర్ అయిన సైన్స్ మాస్టారు వచ్చి మేమిద్దరం మ్యూచువల్ ట్రాన్స్ ఫర్ పెట్టుకుందామని కోరాడు సరే అని వర్మగారికి చెప్పాను ఆయనా ఒప్పుకున్నారు .వెంటనే మళ్ళీ పామర్రు కు మారాను .వీడ్కోలు మీటింగ్ లో వర్మగారు నాగురించి చాలామంచి మాటలుచేప్పారు .
ఆయనా నేనూ కూడా రిటైరైనా ఆయనకు ఉత్తరాలు రాయటం ఫోన్ తో మాట్లాడటం జరిగేది .ఒకసారి ఆయన భార్యగారి మరణ వార్త పేపర్లో చదివి పలకరించటానికి వెళ్లి వచ్చాను .మరో సారి నేనూ ఆంజనేయ శాస్త్రి గారు కలిసి వెళ్లి పరామర్శించి వచ్చాం .సరసభారతి పుస్తకాలుకూడా వర్మగారికి పంపేవాడిని .అందినట్లు ఫోన్ చేసి చెప్పేవారు .వర్మగారిపెద్దబ్బాయి శ్రీ ప్రసాద్ ఉత్సావంతుడైన డ్రిల్ మాస్టర్ .గ్రిగ్ స్పోర్ట్స్ లో ప్రాతిఏడూ కలిసేవాళ్ళం .వర్మ గారి విషయాలు అడిగి తెలుసుకొనే వాడిని .రెండో అబ్బాయి శ్రీ రాజేంద్ర ప్రసాద్ తానా అధ్యక్షుడయ్యారు .తానా వారు, కృష్ణా జిల్లా రచయితల సంఘం ఒక ఏడాది జనవరిలో విజయవాడ సిద్ధార్ధ కాలేజిలో కృష్ణా ఉత్సవాలు జరిపితే ఆయన తో పరిచయమైంది .ఆతర్వాత కూడా రెండు మూడు సార్లు కలుసుకొన్నా౦.
ఖద్దరు పంచె ఖద్దరు చొక్కా ఖద్దరువుత్తరీయం తో చిరునవ్వుతో కొంచెం భారీ పర్సనాలిటీ తో వర్మగారు ఎప్పుడూ ఉండేవారు .మంచి హాస్యప్రియత్వం ఉండేది .నవ్వుతూ పలకరించేవారు .కొంచెం కీచు గొంతు.విషయాన్ని విస్పష్టంగా మొహమాటం లేకుండా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే వారు .అందుకే మా ఇద్దరి మధ్య కెమిష్ట్రి బాగా కుదిరిందేమో .నిరంతర ఆలోచనాపరులు వరిష్ట కర్మిష్టి శ్రీ అప్పారాయ వర్మ గారి మరణం బాధాకరం .వారికి ఉత్తమగతులు కలగాలని కోరుతున్నాను .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-6-21-ఉయ్యూరు