నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి వేంకట నరసదాసు గారు -7
ఆచార్య పీఠం
దాసుగారిని అందరూ అయ్యవారు అని పిలిచేవారు .శిష్యులుగా చేర్చుకొని మార్గదర్శనం చేయమని చాలా గ్రామాల వారు కోరారు .ఒక రోజు ఒక మహా తెజస్వంతుడు వచ్చి సమాజం లోని అందర్నీ పలకరిస్తూ ,ఆలింగనం చేసుకొంటూ దాసు గారిని ‘’నువ్వు ఎవరు ‘’అని అడిగితె శ్రీరామ చంద్ర మూర్తి పటంవైపు చెయ్యి చూపారు .ఆయన సంతోషించి మళ్ళీ కనపడ లేదు .కమ్మనమోలు భజన సమాజం వారు దాసుగారిని ఆహ్వానించ గా దాని నాయకుడు సభ్యులకు దాసుగారిని సాక్షాత్తు శ్రీ రామ చంద్ర మూర్తి అని పరిచయం చేశారు .వారంతా దాసుగారి నవవిధ భక్తులు పుస్తకం చదివి ప్రేరణ పొందినవారే .వారూ తమల్ని శిష్యులుగా స్వీకరించమని బలంగా కోరారు .శిష్యులు పెరిగితే సాధనకు ఇబ్బంది కలిగి వాళ్ళు గుది బండలు అవుతారని ఒప్పుకోలేదు .
బుద్దాం లో ఉండగా దాసుకి ఒక రోజు రాత్రి కలలో వాసుదాసు గారు కనిపించి ‘’నాయనా !ఎందరో నీ మార్గదర్శనం కోసం పలవరిస్తున్నారు శిష్యులుగా చేర్చుకొని వారికి ఊరడింపు కల్గించు .ఆచార్త్య పీఠం ఎక్కి వారి కోర్కె తీర్చి మార్గ దర్శనం చేయి .నీ సాధనకు భజనలకు పుస్తక రచనలకు వీరు తోడ్పడతారు .ఇది నా ఆజ్ఞ‘’అని దిశా నిర్దేశం చేశారు దాసుగారి మనసు కుదుట బడింది .
పునశ్చరణ ,మంత్రం సిద్ధి
వాసుదాసు గారి ఆజ్ఞను శిరసా వహించి నరసదాసు గారు నెలరోజులు స్కూలుకు సెలవు పెట్టి ప్రయాగ వెళ్ళారు .అదిమాఘ మాసం .చలి విపరీతం .అందరిలాగానే ఒక పందిరికింద పునశ్చరణ ప్రారంభించారు .పల్లి ఆంజనేయులుగారు కూడా ఆయన వెంట ఉన్నారు .దాసుగారు అప్పుడు కనిపించి అంతర్ధానమైన మహర్షితో మాట్లాడాలని కోరికగా ఉన్నారు .పగటిపూట పూజా జపం చేస్తూ ,రాత్రి పదిగంటలకు ఇంతచప్పిడి కూడు తింటూ ,తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి స్నానాదులు చేసి గడగడ వనకుతూ జపం చేసేవారు .ఆంజనేయులుగారు రాత్రి వినోదాలు చూస్తూ ఉదయం 7కు లేచి 10 గంటలకు స్నానం చేసేవారు .
దాసుగారు దీక్షగా రోజుకు కనీసం 90 వేల సార్లు మంత్ర జపం క్రమం తప్పకుండా చేసేవారు .సాయంకాలం ఆ మహర్షికోసం ఎదురు చూసేవారు .ఒక వారం తర్వాత ఒకసాయంత్ర అంతర్ధానమైన మహర్షి రావటం ఆంజనేయులు గారు చూసి చెప్పగానే పద్మాసనం వేసి పద్మనాభుని మనసునిండా నింపుకొని ధ్యానిస్తున్న దాసు గారి దగ్గరకు వచ్చి ‘’స్నేహితుడా !నువ్వు చెప్పిన చిహ్నాలున్నాయన వస్తున్నాడు ‘’అని చెప్పగా ,కళ్ళు తెరిచి చూడగా మందగమనం గా వస్తున్న ఆయన్ను చూడగా ఆయన చేయిపట్టుకొని దాసుగారిని లెవ నెత్తి ‘’నాయనా !నీ సాధన అమోఘం .నీకు అలవాటుకాని వాతావరణం లో ఇంతచలిలో నువ్వు దీక్షగా అనుకొన్నది చేస్తున్నావు .నీ హృదయం ధర్మ మార్గాన్ని కోరుతోంది .నువ్వు ధన్యుడవు ‘’అని పలికి తన చేతులతో దాసుగారి శరీరాన్ని నిమిరారు .నరసయ్య గారు ఆనంద పరవశమయ్యారు .సాక్షాత్తు భగవంతుడే ఆ రూపం లో వచ్చి తనకు మార్గ దర్శనం చేశాడని దాసుగారు భావించారు
ఆ మహాత్ముని తమ కుటీరానికి తీసుకువెళ్ళి త్రివేణీ జలం తో కాళ్ళు కడిగి పవిత్రజలం శిరసున చల్లుకొన్నారు . తాను తయారు చేసిన మధురపదార్ధాలు పెట్టగా కమ్మగా భుజించాడాయన .ఆయన నోటికి అందించినవే తిన్నాడు. చేతితో తీసుకొని తినలేదు .ఎప్పుడూ మౌనంగా ఉండే ఆయన దాసుగారి వినయ విదేయతలకు మెచ్చి ,సరస సల్లాపాలు చేసి దాసుగారి సందేహాలన్నీ తీర్చి ,తమ పవిత్ర హస్తాన్ని నరసదాసుగారి మస్తకం పై ప్రేమగా ఉంచగా దాసుగారు వెంటనే నిర్వికల్పసమాధిలోకి వెళ్ళిపోయారు .ఆ అనుభూతి వర్ణనా తీతం .కొంత సేపటికి సమాధినుంచి బయటకు వచ్చి దాసుగారు పరమానందం పొందారు .దాసుగారికి ఆమహర్షి’’ శ్రీరామ త్రయోదశాక్షర మంత్రం ‘’ఉపదేశించి ‘’నీ ఉగ్ర సాధన ఫలించింది .సంపూర్ణ సిద్ధిపొందావు .సందేహాలు తీర్చే సామర్ధ్యం అలిగింది .ఆచార్య పీఠం అది రోహించి ఆశ్రితులకు ఆశ్రయం ఇవ్వు .నిన్ను ఆశ్రయించిన వారు కష్టాల పాలుకాకుండా ,ఆముష్మిక సుఖాలు పొందుతారు .హరిని కీర్తించే సులభోపాయం బోధి౦చటమే నీ ఆధునిక సాధన .నామ ప్రచారం లో నువ్వు ధన్యుడవు అవుతావు ‘’అని చెబుతూ ఒక్కసారిగా అంతర్ధానమయ్యారు .
దాసుగారు ప్రయాగలో పునశ్చరణ దీక్ష ఫలప్రదంగా పూర్తీ చేసుకొని మనసంతా రామమయం చేసుకొని ,జపం చేస్తుంటే సరయూనది నుంచి శ్రీరాముడు బయటికి వచ్చి చేతిని దాసుగారి శిరసుపై ఉంచిన భావన కలిగి కళ్ళు తెరిచి చూస్తె ఎవరూ కనిపించలేదు .రామ సాక్షాత్కారం కలగ లేదని బాధ పడగా ఒక మహాత్ముడు దర్శనమిచ్చారు లేచి పాద పద్మాలకు సాష్టాంగ దండ ప్రమాణాలు చేశారు .ఆయనే రామతత్వాన్ని ఔపోసనపట్టిన శియారఘునాధ శరణ మహారాజ్ .వారినోటి నుండి నిరంతరం సీతారాం సీతారం నామం వెలువడుతుంది .వారు ‘’భక్త శిరోమణీ !నీ జపం ఫలించింది .నీ నిష్టా నియమాలు నన్ను ముగ్దుడిని చేశాయి నీతోమాట్లాదాలని చాలాకాలంగా నాకు కోరిక .’’అని చెప్పి తన ఆశ్రమానికి తీసుకు వెళ్లి ,రామ పంచాయత మంత్రోప దేశం చేసి ,అనుష్టానక్రమం బోధించి ‘’శ్రీరామ శరణ్’’ అనే దీక్షానామం ఇచ్చారు .ఆమంత్ర జపమూ చేసి నరసదాసుగారు కాశీ వెళ్ళారు .
కాశీలో మంత్రం సిద్ధిపొందాలనుకొని గంగ ఒడ్డున శృంగేరిమఠం మెడ ఏడవ అంతస్తులో గది తీసుకొని ,శివ పంచాక్షరి మహామంత్ర జపం చేశారు .తెల్లవారుజామున గంగాస్నానం ,విశ్వేశ్వరాభిషేకం చేసి ,జపానికి కూర్చునేవారు .మూడు రోజులతర్వాత ఒకరాత్రి విశ్వేశ్వరుడు కలలో కనిపించి ‘’రామ భక్త రత్నమా !నీ సాధన సంతోషం కలిగించింది .రామనామం నిండిన నా హృదయమే నీకు దగ్గరైంది .నువ్వు రామునికి ప్రేమపాత్రుడవు నాకు మిక్కిలి సన్నిహితుడవు .నీ రామ నామ ప్రచారం లో నా శక్తి కూడా నిన్ను ఆవహించి ఫలితమిస్తుంది .రామనామ ప్రచార రత్నంగా కీర్తి పొందుతావు ‘’అని ఆశీర్వ దించాడు .అక్కడ పని పూర్తీ చేసుకొని శ్రీరామ శరణ గారు బృందావనం చేరారు .
బృందావనం లో అడుగడుగునా రాధేశ్యాం భజన అపూర్వమని పించింది దాసుగారికి .అక్కడ శ్రీ ఉడియా బాబా ఆశ్రమం గుహ లో ఉంటూ పునశ్చరణ ప్రారంభింఛి పూర్తీ చేసేలోపు వారికి శ్రీరాధా కృష్ణుల దివ్య దర్శనమైంది .ఎందరో మహాత్ములతో పరిచయభాగ్యం కలిగింది .అక్కడినుంచి గోవర్ధన క్షేత్రం వెళ్లి ,రాధాకృష్ణుల విహార స్థలాలను చూసి పులకి౦చారు .కుసుమ సరోవరం వద్ద ఉంటూ పునశ్చరణ పూర్తీ చేశారు .ఇక్కడా రాధాకృష్ణ సాక్షాత్కారం పొంది,హరిద్వారం చేరారు .భగీరధుని తపస్సు ఫలించి ఆకాశ గంగ భూమిపై కాలుపెట్టిన పవిత్ర క్షేత్రం అది .ఇది నిజంగా వైకుంఠ ద్వారమే .చలి ఎక్కువ .అక్కడ గంగాస్నానం చేస్తూ పునశ్చరణ పూర్తీ చేశారు .అక్కడ శ్రీ కరపత్ర స్వామి దర్శనం లభించి అయన భాషణలు భూషణాలు అనిపించాయి .కొద్దిగా అనారోగ్యమేర్పడగా బుద్దాం వచ్చేశారు .
శ్రీ రామ శరణ్ గారి దర్శనం తో ప్రజల ఆనందానికి అవధిలేదు .అందరూ ఆయన పదపద్మాలను ఆశ్రయించాలని భావించారు .శ్రద్ధ ఉన్నవారికి మంత్ర దీక్ష ఇచ్చారు .గుంటూరు ,కృష్ణా జిల్లాలో ఆయన శిష్యబృందం విశేషంగా ఉన్నారు .ఉభయ గోదావరి, కర్నూలు జిల్లాలో బెంగుళూరులో కూడా శిష్య బృందం ఏర్పడింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-6-21-ఉయ్యూరు