నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి వేంకట నరసదాసు గారు -9
మహాత్ముల సాంగత్యం ,పరిచయాలు
అపర వ్యాసులుగా ప్రసిద్ధులైన శ్రీ ప్రభుదత్త బ్రహ్మ చారి ప్రయాగ వాసి .బ్రహ్మ చర్యం లో శుక మహర్షి .పరమ తపో నిష్టా గరిష్టులు ‘’శ్రీ కృష్ణ గోవింద హరే మురారే ,హి నాథ నారాయణ వాసుదేవ ‘’మాత్రమె ఉచ్చరిస్తారే కానీ ఇతర మాటలేవీ మాట్లాడారు .ఉదయం త్రివేణీ స్నానం ఆతర్వాత ఉదయం 8గంటలనుంచి సాయంత్రం 4 వరకు జపధ్యాన పూజ,పురాణ ప్రవచానాదులు ,రాత్రి భజన వారి దిన చర్య .గంగ ఒడ్డున ప్రతిష్టానపురం అనే ఝూసీ లో ఆశ్రమం లో ఉంటారు .అనుష్టానం భజన ఒక చోట ,ప్రవచనం వేరొక చోట జరుగుతుంది .ఆశ్రమవాసులు యాభై మంది దాక ఉంటారు. భోజన శాల వేరు .ఇవికాక సంకీర్తన మందిరం వేరుగా ఉంది .ఇందులో పగలు అఖండ నామం జరుగుతుంది .సంస్కృతం నేర్చుకొనే విద్యార్ధులు పాళీలు గా నామం చేస్తారు .గొప్ప పండితులు ఉంటారు .వీరు బ్రహ్మ చారిగారు రాసిన ..భగవత్ చరిత ‘’ను నిత్యం పురాణంగా ప్రవచనం చేస్తారు .
బ్రహ్మ చారి గారు గొప్ప హిందీ కవి .భాగవతాన్ని హిందీలోవ్రజభాషలో రాశారు .అవి’’ చప్పలు ‘’(చౌపాయి)అంటే హిందీ పద్యాలుగా ఉండి,గానానికి అనుకూలంగా మహా రసోపేతంగా ఉంటాయి .ఇదికాక బడరీనాద్ దర్శన్ ,మహాకర్ణ ,భక్త మీరాబాయి వంటి గద్య రచనలు కూడా రాశారు .వీరు రాసిన చైతన్య చారితావళి5సంపుటాల బృహద్గ్రంధం .1941లో నిరాట౦క సంకీర్తన మహాయజ్ఞం జరిగినపుడు మన శ్రీ రామ శరణ గారికి బ్రహ్మ చారి గారితో పరిచయమేర్పడింది .వారి సమక్షం లో హిందీలో చక్కని ప్రసంగం చేశారు మన దాసుగారు .అది తెలిసి మహదానందం తో దగ్గరకు పిలిచి ,దాసు గారి గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకొన్నారు .తమ చైతన్య చరితావళి ని తెలుగులోకి అనువది౦చమని దాసుగారిని కోరారు .సుందర మధుర తెలుగులో దాసుగారు అనువాదం చేశారు .అది స్వయంగా ఆయనే తెలుగులో రాసిన గ్రంథం గా ఉంది .చైతన్యప్రభు బాల్య యవ్వన కౌమారాది దశలు అందులో వారు చిందించిన హాస్యలహరి రమణీయంగా రాశారు .
మొదటి సారిగా శ్రీ ప్రభు దత్త బ్రహ్మ చారిగారిని గుంటూరుకు ఆహ్వానించి ఆంధ్రులకు పరిచయం చేశారు దాసుగారు .బుద్దాం లో దాసు గారింటికి ఆయన వెళ్ళారు .అక్కడి రమచ్యుత మందిరానికి పాలరాతి విగ్రహాలు ఆయనే అందించారు .ఆతర్వాత చాలా సార్లు వచ్చారు .బ్రహ్మ చారిగారు భాగవత చరితలోని చౌపాయీలను ‘’ భాగవతీ కథా’’ అంటే భాగవత దర్శనం అనే పేరుతొ108 గ్రంథాలు రాయటం ప్రారంభించి ,60పూర్తి చేశారు .ఇదేకాక భారత భాగవత పురాణ ఉననిషత్తు లు సంహితలలోని విశేషాలను క్రోడీకరించి సందర్భాన్ని బట్టి భాగవత దర్శనం లో నిక్షిప్తం చేశారు .18పురాణాలను స్వయంగా చదివి ,పండితులద్వారాకూడా విని దానిలోని సారాన్ని అందించారు .ఏ ఆధ్యాత్మిక సంస్థ కూడా అంతటి గొప్ప రచనను వెలు వ రించి ఉండలేదు .ఒంటిచేతితో బ్రహ్మ చారి గారొక్కరే అంతటి బృహత్ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశారు .ఈ ఉత్తమ గ్రంథ ప్రచారానికి సమర్ధులు నరస దాసుగారే అని విశ్వసించి దాన్ని తెలుగులో అనువదించమని ఆదేశించగా 48భాగాలు అత్యంత సు౦దరమైన ఆంధ్రం లో అనువాదం చేశారు .అన్నిటినీ ఒకే సారి ముద్రించే శక్తి లేక ఒక్కొక్కటిగా ముద్రించారు .’’భాగవత గ్రంధమాల ‘’అనే సంస్థ స్థాపించి మహారాజపోషకులు ,రాజపోషకులు ,సభ్యులు అని వేర్వేరుగా విభజించి 14భాగాలు ముద్రించారు .ఒక వందరూపాయలు చందా కట్టిన సభ్యులకు ప్రతి పుస్తకం ఉచితంగా అందించారు .నెలకు రెండు రూపాయలు పంపిస్తే చాలు పుస్తకం పంపేవారు . ఇంటింటికీ ఆపుస్తక మహాప్రసాదం అందేట్లు చేశారు దాసుగారు .
మర్రిపూడిలో హరేర్నామ సప్త సప్తాహం మహా వైభవంగా జరిగింది .దాని కి వీరయ్యగారు ప్రధాన కార్యకర్త .ఎన్నో భక్త బృందాలు వివిధ ప్రాంతాలనుంచి వచ్చి పాల్గొని వీనుల విందు చేశాయి .శ్రీ అవదూతేంద్ర సరస్వతి శ్రీ రామ శరణ గారు యాజమాన్యం వహించి తమ తమ అనుయాయులతో మహావైభవంగా దిగ్విజయం చేశారు .ప్రభుదత్త బ్రహ్మ చారిగారిని ఆహ్వాని౦చ గా విచ్చేసి పాల్గొని ఆతర్వాత చాలా గ్రామాలలో పర్యటించారు .ప్రతి చోటా నరసదాసుగారి కథాసంకీర్తన ఉండాల్సిందే .ఆమహోత్సవ సందర్భంగా మన దాసుగారికి ‘’మహా మండలేశ్వర ‘’బిరుదునిచ్చి సత్కరించారు .
బ్రహ్మ చారిగారు బృందావనం లో ఉన్నారు .యమున ఒడ్డున సుందరభవనాన్ని ఆశ్రమ౦గా నిర్మించుకొని నిత్యకార్యక్రమాలు చేస్తున్నారు . యమున అవతలి ఒడ్డున యాభై ఎకరాలలో గోవులను మేపుతూ గోసేవ చేస్తూ ఆరునెలలు ఉన్నారు .దీనికి ‘’గోలోకం ‘’అనిపేరు .అది పూర్తికాగానే 50రోజులు అఖిలభారత ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని నిర్వహించారు .దేశం నలుమూలలనుండి మహా పండితులు ,కవులు గాయకులూ పాల్గొని విజయవంతం చేశారు. విజేతలకు బహుమతులు అందజేశారు .అఖండ నామ సంకీర్తనలు కూడా జరిగాయి .శ్రీ రామ శరణ దాసుగారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ‘’భాగవత చరిత వ్యాస్ ‘’బిరుదు ప్రదానం చేసి ఆత్మీయంగా సన్మానించి గౌరవించారు .దాసుగారి నామ ప్రచారాన్ని సభలో గొప్పగా కీర్తించారు .
నిరంతర బ్రహ్మ నిష్ఠ లో ఉండే శ్రీ ఉడీరాం బాబాజీ దాసుగారిని ప్రేమ ఆప్యాయతలలతో వీక్షించారు .శ్రీ శివానంద బ్రహ్మ చారిద్వారా శ్రీ కృష్ణ దర్శన భాగ్యం పొందిన హరిబాబా గారు పరిచయమయ్యారు .జగన్మాతగా ప్రసిద్ధి చెందిన మాతా ఆన౦ద మయీ గారు కూడా పరిచయాయ్యారు .బృందావన్ లో సరోజినీ మాతా ,బిదుబ్రహ్మచారి ,ఆచార్య రాఘవా చారి ,చక్రపాణి జీ మహారాజ్ ,మాతా మీరాబాయి జీ ,బంకే బిహార్ లాల్ జీ మొదలైన మహానుభావులతో దాసుగారికి పరిచయభాగ్యం లభించింది .నైమిశారణ్య నరనారాయణ సోదరులు ప్రయాగలో దాసుగారికి దర్శనమిచ్చారు .ఆజానుబాహులు అద్వితీయ బలసంపన్నులు అయిన ఆసోదరులలో తేడా ఏమీ కనిపించకపోవటం ఆశ్చర్యమేసింది .ఇద్దరూ పద్మాసనం లో కూర్చుంటే ఆ సోదరులకు రోజులు కొన్ని క్షణాలుగా గడిచిపోతాయి.బీహార్ లో బరైలీ రాజు శ్యామానంద జీ ప్రయాగలో విరాట్ సంకీర్తన సభలో మన దాసుగారి ఉపన్యాసం విని పరవశించారు . .ఆయన బరైలీ ప్రాంతమంతతా వాయిద్యాలు సప్ప్లై చేసి సంకీర్తన సంఘాలు స్థాపించాడు .శ్రీ పండిత సుదర్శన్ శ్రీ శరణానంద జీ , శ్రీ హరేరాం బాబా ,మున్షీ కన్హయలాల్ జీ మొదలైన సాదుపు౦గవులతో పరిచయమేర్పడింది .కాశీలో 150 ఏళ్ల శ్రీ హరిహరబాబా దర్శనం లభించింది .అక్కడే రామరాజ్య పరిషత్ అధ్యక్షులు శ్రీ కరపత్ర స్వామి తో మాట్లాడే అవకాశం కలిలిగింది .రుషీ కేశ్ లో స్వర్గాశ్రమం లో గీతాభవన్ ప్రతిష్టాపకులు ,మహాదాత శ్రీ జయదయాల్ గోయంకా గారితో ఘనిష్ట పరిచయం కలిగింది .స్వామి శివానంద అనుగ్రహమూ లభించింది .
పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబాతో దాసుగారి పరిచయం కలిగి ఆయన నిర్వహించిన సనాతన భాగవత సప్తాహం లోతామూ సభ్యులుకనుక 104 డిగ్రీలజ్వరం తో తుగలపాలెం నుంచి వెళ్లి పాల్గొనగా ,అక్కడికి చేరగానే జ్వరం మాయమైంది .బాబాగారికి నమస్కరించగానే బాగా పరిచయం ఉన్నట్లు మాట్లాడారు .మంత్ర శాస్త్ర ప్రవీణులు హనుమదుపాసకులు శ్రీ శిష్ట్లా చంద్ర మౌళిగారు అధ్యక్షత వహించిన సభలో బాబా గారు మన దాస్సుగారి దగ్గరకు వచ్చి చెవిలో సంకీర్తన ప్రాధాన్యతపై ఉపన్యాసం చేయమని చెప్పారు .నరసయ్య గారి ఉపన్యాసం మహా రసవత్తరంగా శ్రోతలమనసులను రంజిల్ల జేసింది ..బాబా బాగా సంతోషించి సంఘ సభ్యులందరికీ తలొక వంద రూపాయలు అందజేసి సన్మానించారు .వారి అనుచరులకు కూడా చార్జీలు ఇచ్చారు .నరస దాసుగారిని ప్రత్యేకంగా వేదికపైకి పిలిచి ఆప్యాయంగా భుజాలపై చేయి వేసి ,ఆప్యాయంగా మాట్లాడి ఒక బంగారు రూపాయను మెడలో ధరించటానికి ఇచ్చారు .పట్టు వస్తారాలతో పాటు రెండువందల రోపాయలు కూడా అందించి సత్కరించారు .శివరాత్రి నాడు 500మంది బ్రాహ్మణ బాలకులకు ఉపనయనం చేసి వారికి అయిదువందల పళ్ళాలులు ఉద్ధరిణలు అయిదు వందల రూపాయలు అందించారు .అప్పుడు శ్రీ రామ శరణ గారు గాయత్రీ మంత్రాన్ని గురించి రామనామాన్ని గురించి రెండిటిని సమన్వయము చేస్తూ అద్భితమైన ప్రసంగం చేశారు .’’బాగు బాగు ‘’అని బాబా బహు మెచ్చారు .
తర్వాత మహా వైభవంగా జరిగిన బాబా గారి జన్మ దినోత్సవానికి కూడా దాసుగారు వెళ్లి పాల్గొన్నారు .వేలకొలది యాత్రికులకు బాబా ప్రసాదం లభించింది ,హడావిడి తగ్గాక బాబా దాసుగారి వద్దకు వచ్చి మహా ఆప్యాయంగా సంభాషించారు .ఇంటి విషయాలన్నీ పూస గుచ్చినట్లు చెప్పారు .’’మీ ముఖ్యమైన కోరిక చెప్పండి ‘’అని అడిగితె దాసుగారు ‘’స్వామీ !మీ స్మరణ చాలునాకు .నన్ను నమ్ముకొన్న నాశిష్యులకు మోక్షం ఇవ్వటానికి అనుగ్రహించండి .ఇదే నాకోరిక ఇంకే కోరికా నాకు లేదు ‘’అనగా బాబా సంతోషించి ‘’ఇలాంటి కోరిక ఉన్నవారినినేనేక్కడా చూడలేదు .మీది చాలా దయార్ద్ర హృదయం .శిష్యవాత్సల్యం నిజంగా మీదగ్గరే ఉంది ‘’అని మృదుహస్తం తో దాసుగారి శరీరాన్ని నిమిరారు .దాసుగారికి బాబా గారి పరిచయం వల్లనే గుంటూరు భక్త సమాజం వారికి బాబా గారి దర్శన భాగ్యం కలిగింది.అప్పుడు ఆధ్యాత్మిక సాధన గురించి బాబా అమృతోపమానమైన ప్రసంగం చేసి సభ్యులను ఆన౦ద డోలికలలో ఉర్రూత లూగించారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -18-6-21-ఉయ్యూరు