నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి వేంకట నరసదాసు గారు -10
శ్రీ రామ శరణ్ గారి రచనలు
శ్రీ రామ శరణ్ గారు ‘’రామ మంత్రానుష్టాన క్రమం’’రాశారు అందులో సర్వమత సమ్మతం కనిపిస్తుంది .రామ తత్వాన్ని బహు సుందరంగా దానిలో నిక్షిప్తం చేశారు .శ్రీరాముడు సకల శక్తి స్వరూపుడు .ఆయనే శివుడు ,సూర్యుడు విష్ణువు ,వినాయకుడు అని చెప్పారు .శివ ,నారాయణ ,గాయత్రి మంత్రాలలోని బీజాక్షరాలు రామ మంత్రం లోనివే అనీ , మంత్రానునుష్టానికి మడిగా కట్టుకోవాల్సిన దవళీ వగైరా విశేషాలనూ వివరించారు . వేద సంహిత ,ఉపనిషత్ ,పురాణాలనుంచి ఎన్నో ఉదాహరించారు .
వీరి ‘’నవవిధ భక్తులు ‘’లో వాటిని పూర్తిగా అనుభవించి రాసినదే .భగవంతుని అవ్యాజ కరుణా విశేషాలు ,భగవంతుడు భక్తుల యెడ ప్రవర్తించే విధానం సంపూర్ణంగా వివరించారు .’’కలిసంతనోప నిషత్ ‘’ లో కలియుగం లో అందరూ సులభ సాధ్యంగా ఆచరించాల్సిన విధానాలు ,శ్రీరామనామ ప్రభావం ,సంకీర్తన పధ్ధతి మొదలైనవి రాశారు .
శ్రీ ప్రభు దత్త బ్రహ్మ చారి గారి అయిదు భాగాల ‘’చరితా వళి’’ ని చక్కని తెలుగులో అనువదించారు .శ్రీ బల దేవ ఉపాధ్యాయ్ గారి ‘’భారతీయం ‘’అనే ఉత్తమ వేదాంత గ్రంథాన్ని సరళ తెలుగులో అనువదించారు .శ్రీ హనుమాన్ పొద్దార్ గారు హిందీ లో రాసిన ‘’బ్రహ్మ ‘’అనే గ్రంథాన్ని తెలుగు చేశారు .
మందిర స్థాపనలు
శ్రీరాం శరణ్ గారు బుద్దాం లో శ్రీ రమాచ్యుత మందిరాన్ని నిర్మించటమేకాక వారి శిష్య బృందం ఉన్న చోట్లకూడా మందిరాలు స్థాపించారు .నెల్లూరుజిల్లా రామ గోవిందాపురం అనేచిన్నగ్రామం లో సూర్పరాజు సూర్యనారాయణ అనే ఉపాధ్యాయుడు దాసుగారిశిష్యుడు .తనడబ్బును ఊరిజనులు సంతోషంగా ఇచ్చిన విరాళాలతో సీతారామ లక్ష్మణుల చలువరాతి విగ్రహాలను గురువుగారి ద్వారా తెప్పించి ,తన ఇంటి ప్రక్కనే అందమైన మందిరం లో ప్రతిష్టింప జేశారు .కొన్నేళ్ళు గురువుగారి ఆధ్వర్యం లో వార్షికోత్సవాలు జరిపారు .ఆర్దికభారం పెరిగిపోవటం తో ఆ తర్వాత మానేశారు .
కృష్ణా జిల్లా దివి తాలూకాలోరాం శరణ్ గారి ఆధ్వర్యం లో చాలామందిరాలు వెలిశాయి .కమ్మనా మోలులో స్త్రీ పురుషులు అందరూ కమ్మగా సంకీర్తన చేస్తారు .శిష్యుడు మద్ది ఆంజనేయులు గురువు ఆశీర్వాద బలం తో చందాలు వసూలు చేసి చాలా గ్రామాలలో చలువరాతి సీతారామంజేయ విగ్రహాలు స్థాపించారు .చిన్న గ్రామాలైనా ప్రతిష్టలు మహా గొప్పగా జరిగేవి .గుంటూరు క్షేత్ర సభ్యులు ప్రతి ఏడాదీ వచ్చి స౦కీర్తన చేసేవారు .శ్రీ రఘువర దాసుగారు ఒక నెలరోజులు అక్కడే ఉండి వైభవోపేతంగా సంకీర్తన నిర్వహించారు .వీటన్నిటికి ముఖ్యకారకులు మన దాసు గారే .
తమ తర్వాత అర్చకులుగా ఒక సద్బ్రాహ్మణుడు శ్రీ శాస్త్రిగారిని దాసుగారు నియమించారు .మందిర నిర్మాణం దగ్గర్నుంచి పదేళ్ళు ఉత్సవాలు ఘనంగా జరిగేవి .నిత్యం ఉదయం సాయంత్రం సహస్రనామ పూజ ,రాత్రి భజన ,పవళింపు సేవ ఉదయం సుప్రభాతం జరిపేవారు .దీనికి దగ్గరే ఉన్న తుంగలవారి పాలెం లో గురువుగారి శిష్యులు సంకీర్తన చేశారు .ఇక్కడ గురువుగారు ‘’అష్టోత్తర శత ఏకాహ అఖండ హరేర్నామ సంఘం ‘’స్థాపించారు .ఈ సంఘం పరిసరగ్రామాలలో ప్రతి ఏకాదశికి ఏకాహం చేసేవారు .ఆహ్వానం రాకున్నా వెళ్లి పాల్గొనేవారు .ఎనిమిది ఏకాహ దశు లలో 108 ఏకాహాలు చేశారు .వీరి నామ ప్రచారం పెద్ద ఎత్తున జరిగేది .గురువుగారుపాల్గొని మందిర నిర్మాణం నామ ప్రాశస్త్యం లపై ఉపన్యాసాలిచ్చేవారు పాలరాతి విగ్రహ స్థాపన చేయించేవారు .తుంగల నాగభూషణం సంకీర్తన ప్రియులు .వీరి ఆధ్వర్యం లో ఆనందంగా ఆకర్షణ గా భజనలు జరిగేవి .దీనికొక మైలు దూరం లో కృష్ణానది ఒడ్డునే(నాగాయలంక ) శ్రీ రామపాద క్షేత్ర దేవాలయం ఉంది .ముందు రామపటం పెట్టి మందిరం కట్టి తర్వాత విగ్రహాలు పెట్టారు. ఇక్కడి రేవు నుంచి పెనుమూడికి లాంచీలు నడుస్తాయి .శ్రీరామ శరణ్ గారు ఈమందిరం దర్శించి ప్రసంగం చేశారు .దీనికి దగ్గరున్న మర్రిపాలెం లోనూ మందిర నిర్మాణం చేశారు .ఇక్కడ గొప్ప సంకీర్తన సంఘం ఉన్నది .ఇక్కడి వారంతా దాసుగారి శిష్యులే .అత్య౦త ఉత్సాహం తో ఏకాదశినాడు అఖండనామం చేస్తారు .కార్యదర్శి సనకా వెంకటేశ్వరరావు చాలా శ్రద్ధగా అన్నీ జరిపిస్తారు .దీనికి 5మైళ్ళ దూరం లో అవనిగడ్డ పోలీసు స్టేషన్ లో ఒక మందిరం కట్టి శ్రీమా శరణ్ గారి ద్వారా శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహం ప్రతిష్టించారు .దీని ముఖ్యకార్య కర్త జి వె౦క టప్పయ్య నాయుడు గారు .
అవని గద్దకు దగ్గరలో ఉన్న బందలాయ చెరువు గ్రామ వాసులు భౌతిక వాదులే అయినా నైతికానికి ప్రాధాన్యమిస్తారు .ఈగ్రామం లో దాసుగారి శిష్యులు 20 మంది ఉన్నారు అందులో పర్చూరు పోతురాజుగారు అద్వితీయ భక్తులు .ఆయన ప్రోద్బలం లో అక్కడ రామమందిర నిర్మాణం జరిగింది .దాసుగారి ద్వారా శ్రీ సీతా రామ ఆంజనేయ పాలరాతి విగ్రహాలు తెప్పించి శ్రీరామజయరామ జయజయరామ అనే అఖండ నామం మారుమోగుతుండగా ప్రతిష్టించారు .అఖండ నామ సంకీర్తనలు వార్షికోత్సవాలు గొప్పగా జరిపేవారు .
బాపట్లలోని శంకర విద్యాలయం లో వేదం సంస్కృతం స్మార్తం బోధిస్తున్నారు .శ్రీరమ శరణ్ గారు దీనికి నాలుగు వందల రూపాయలు అందించి ఒక శ్రీరామ శరణ మ౦ డపాన్ని కట్టించారు .దీన్నిశ్రీ శృంగేరీ పీఠాదిపతులు ఉద్ఘాటనం చేశారు .దాసుగారు అనేక చోట్ల దేవాలయాల అవసరం ,అవి భక్తీ శ్రద్ధలకు ఎలా తోడ్పడుతాయో ,దేవాలయ ఉత్సవాల ప్రాశస్త్యం మొదలైన ఆధ్యాత్మిక విషయాలపై ప్రసంగాలు చేసేవారు .సంకీర్తన ఉపన్యాసం భజన ,పురాణ ప్రవచనాల అవసరాలను వివరించేవారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-6-21-ఉయ్యూరు
‘’