నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి వేంకట నరసదాసు గారు -11(చివరిభాగం )
రామ నామ మయ రూపం
వాసుదాసు గారు రామమంత్ర మహిమ బోధించిన నాటి నుంచి నరస దాసుగారి మనసంతా రామనామం తో నిండిపోయింది .రోజుకు 21వేలకు పైగా జపం చేస్తూ ,10 వేలకు పైగా రామకోటి రాస్తూ ,రాత్రిళ్ళు రామభజన చేస్తూ ,అర్ధరాత్రి ధ్యాననిమగ్నమౌతూ మంత్ర సిద్ధిపొందారు .మనో నిశ్చయానికి జపం ముఖ్య సాధన .పద్మాసనం లో నిటారుగాకూర్చుని ,మనసులో రామ చంద్రుని మూర్తి ని నిలిపి ,పాదాలలో ఒక వంద ,మోకాళ్ళపై ఒక వంద ప్రక్కల ఒక వంద ,ముఖం లో ఒక వంద ముఖం నుంచి పాదాలవరకూ అక్షరమాలతో జపం చేస్తూ ఉండటం తో దాసుగారి మనసులో రాముడు పూర్తిగా కొలువై ఉన్నాడు .ఆయనలో దాసుగారు లీనమయ్యారు .వారి వాక్కులు రోజుకు ఎన్ని నామ స్మరణాలు చేశాయో లెక్క లేదు .భజనలో నామ సంకీర్తనం లో ఉపన్యాసాలలో హార్మోనియం పైనా ,వార్షికోత్సవాలలో ,ఎన్ని గంటలు రామనామం స్మరించారో చెప్పలేము .
తులసీ రామాయణం శ్రీ రామ శరణ్ గారి వాలకు మరింత మాధుర్యం కలిగించింది .రామ చరితమానస ను ఎన్నిచోట్ల ఎన్ని సార్లు ప్రవచనం చేశారో లెక్క లేదు .అన్ని వేళలో రామనామమే. ఉపవాసం నాడు మరీను .2కోట్ల రామనామం రాసి అరుదైన రికార్డ్ నెలకొల్పారు ,రాసేటప్పుడుకూడా శ్రీరామ శ్రీరామ అనాల్సిందే .రామాయణాన్ని అంతటినీ బొమ్మలుగా చిత్రించారు వాటిని గుంటూరు రామకోటి మందిరం లో చూడవచ్చు .రామనామం తో బియ్యపు గింజలు ఏరి వాటితో అన్న౦ వండుకొని రాముడికి నైవేద్యం పెట్టి భోజనం చేసేవారు .ఆనంద రామాయణం లో రామ భక్తులు రామనామ వస్త్రాలు ధరించాలి అని ఉన్నదాన్ని ఆచరణలో పెట్టి నిత్యం ధరించేవారు .
స్వభావం
మనిషి స్వభావమే సుందరమైన ఆభరణం ..స్వార్ధ రహితమై నిష్కల్మష మై ,ప్రజాహితమైనది శ్రీ రాం శరణ్ గారి స్వభావం .కోమల హృదయులు .ఉన్నత విశాల భావాలు వారిలో ఉన్నాయి .ఆదరాభిమానాలు చూపటం లో ఎవరూ ఆయనకు సాటిరారు .చిరునవ్వుతో ఆహ్వానించి ఆప్యాయంగా ఆత్మీయంగా ఆతిధ్యమిస్తారు .బాధా సర్ప దష్టులకు వారి ఉపదేశాలు అమృతపు ఊటలుగా ఉంటాయి ,అందరూ వారికి సమానులే .అందరూ శ్రీరామ సంతానమే వారికి. వారి ఆదరణ ఆనంద మయం చేస్తుంది .
నిరాడంబర సద్గురు శిరోమణి మన దాసుగారు .కామినీ కా౦చనాలకు దూరం కీర్తి కాంక్ష లేదు .వినయ విధేయతలు,సదా చారం వారి సహజ ఆభరణాలు .ప్రేమ పూర్వకంగా ఎవరైనా వస్త్రాలు ఇస్తే ధరిస్తారు కానీ విలాసవంతమైన దుస్తులు ధరించరు .శుద్ధ సాత్విక భోజనమే ఆహారం .ప్రతి దానినీ సద్వినియోగం చేస్తారు .ఆయనలో భక్తిజ్ఞాన కర్మలు త్రివేణీ సంగమం లాఉంతాయి .అంతులేని శిష్యవాత్సలయం ఉన్నవారాయన. పుట్టపర్తి సాయి బాబాగారితో తమ శిష్యులకు మోక్షాన్ని ప్రదానం చేయమని కోరారంటే వారు మెచ్చారంటే వారికి ఎంతటి శిష్యవాత్సల్యమున్నదో అర్ధమౌతుంది .ఎందరెందరో సాదు పురుషులతో దివ్యపురుషులతో మహాత్ములతో వారికి అత్యంత సాన్నిహిత్యమేర్పడింది .
షష్టిపూర్తి ఉత్సవం
నరసదాసు గారికి అరవై ఏళ్ళు నిండగానే శిష్యులు అభిమానులు మిత్రులు పెద్దలు 27-4-65 నుండి మూడు రోజులు త్రయాహ్నికంగా ప్రయాగ లోషష్టి పూర్తీ మహోత్సవం నిర్వహించారు .శ్రీ మహా మండలేశ్వర ,శ్రీ భాగవత చరిత వ్యాస,శ్రీరామ శరణ్ శ్రీ కుందుర్తి వెంకట నరసయ్య దాసు పాకయాజి గారి షష్టి పూర్తీ మహోత్సవం లో వారి అభిమానులు శిష్యులు అ౦దరితోపాటు శ్రీగాయత్రీ పీతులు శ్రీవిద్యా శంకర భారతీ స్వామి పాల్గొని ఆధ్వర్యాన్ని వహించారు .సంకీర్తన హరికధ ,ఉపన్యాసాదులు నిర్విరామంగా మూడురోజులు మహా వైభవంగా జరిగాయి .
26-4-65 న బుద్దాం దగ్గర తుంగభద్ర వద్ద దాసుగారికి క్షుర కర్మాదులు,ప్రాయశ్చిత్త మృత్తికా స్నానాలు జరిగి ,అర్నాడు హరేర్నామ ఏకాహం నిర్వహించారు చైత్ర బహుళ ద్వాదశి 28-4-65 శ్రేఆమ శరణ్ దంపతులు శ్రీ విద్యా శంకర భారతీ స్వామి వారికి పాద పూజ,చేశారు తర్వాత దాసుగారి దంపతులకు శిష్యబృంద౦ గురుపూజ చేశారు .శ్రీ నేటి వెంకట నారాయణ మూర్తి దంపతులు ,విస్సం శెట్టి నాగభూషణం దంపతులు గంగాజలం తో దాసుగారికి అభిషేకం ,పాద పూజ జరిపారు .సాయంత్రం వంగీత సుబ్బరాయ శాస్త్రులవారి ఉపన్యాసం ,శ్రీ పద్యాల వేంకటేశ్వర భాగవతార్ ,అమ్ముల రంగనాధ దాసు భాగవతార్ లు హరికదాగానం చేశారు .శ్రీ రాగం ఆంజనేయులు ,శ్రీ కంభం మెట్టు మధుసూదన రావు లు కదా సంకీర్తనం చేశారు .
29-4-65చైత్రబహుల త్రయోదశినాడు ఉదయం విఘ్నేశ్వరపూజ ,పున్యాహవాచనం ,మంటపారాధన చేసి ,శ్రీ అర్వపల్లి వెంకటేశ్వర్లుగారు ,శ్రీ పీసపాటి మృత్యుంజయావదానులుగారు హోమాలు ,పూర్ణాహుతి నిర్వహించారు సాయంత్రం షష్టి పూర్తీ అభినందన సభ జరిగింది .శ్రీ గాయత్రీ పీథాదిపతులు అధ్యక్షత వహింఛి దాసుగారి ప్రతిభావిశేశాలు సేవా విశేషాలు సవివరంగా తెలిపారు పెద్దాలందరూ దాసుగారి విశిష్ట వ్యక్తిత్వాన్ని గూర్చి ప్రసంగించారు .ఈ సందర్బహంగా శిష్యులు గురువుగారికి ఒక యకరం పోలంకొని అండ జేస్తే వారికిక ఏ లోటు రాదనీ భావించారు శ్రీ పోలిశెట్టి ఆంజనేయ గుప్త పట్టువస్త్రాలతో పాటు అయిదు వందలరూపాయలు శ్రీ బోలిశెట్టి సీతారామయ్యగారు కూడా అలానే సమర్పించారు .అభిమానులు భక్తులు శక్తికొలది విరాళాలు ప్రకటించారు .అవేమీ తమకు అవసరం లేదనీ అదంతా శ్రీ నామప్రయాగ స్వామికే సమర్పిస్తున్నాననీ ప్రకటించారు .దేశం నలుమూలలనుండీ ఎందరో పెద్దలు కవులు భక్త శిఖామణులు అభిమానులు సందేశాలు ఆశీర్వచనాలు పంపగా అన్నీ వేదికపై చదివి అందరికి తెలియ జేశారు .
శ్రీ కాశీ కృష్ణా చార్య వారు సంస్కృతం లో అభినందన సందేశం పంపారు .శ్రీ విద్యారణ్య స్వామి ,శ్రీ సన్నిధానం లక్ష్మీ నారాయణ మూర్తి అవధానిగారు సంస్కృతం లో అభినందన ఆశీస్సులు అందించారు శ్రీ చిరంతనానందస్వామి ,శ్రీ జటావల్లభుల పురుషోత్తం ,శ్రీ రామ కృష్ణా నంద స్వామి సందేశాలు వచనం లో శ్రీ చావాలి వామన మూర్తి పద్యాలలోరాసిపంపారు .శ్రీ భాగవతుల కుటుంబరావు , శ్రీ కప్పగంతుల సుబ్రహ్మణ్యశాస్త్రి ,శ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి ,ప్రశంస పేరుతొ పద్యాలను శ్రీ తుమ్మల సీతారామ మూర్తి గారు ,శ్రీ మాధవపెద్ది నాగేశ్వరరావు వచనం లో ,పంచరత్నాలలో శ్రీజాస్తి వెంకట నరసయ్య ,శ్రీ రామ శరణ ప్రశంసగా పద్యాలలో శ్రీ శి స రాజశేఖరం ,పండిత శ్రీ పెమ్మరాజు రాజారావు గారు పుష్పాంజలి పేరిట పద్యాలు ,శ్రీ చిర్రావూరి అనంత పద్మ నాభ శాస్త్రిగారు సంస్కృత ఆశీర్వచనం ,శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తిగారు ‘’వీరు భుజించు ఓదనము రామనామ సందీపితమై ,వీరి జీవన లహరి గంగా శైవలినికి సహపాఠి’’అని మెచ్చుకొన్నారు .వీరుగాక శ్రీ చిలుకూరి వీరభద్ర శాస్త్రి ,శ్రీ బాపట్ల హనుమంతరావు ,శ్రీ వెంపటి సూర్యనారాయణ శ్రీ ధనకుధరం వరదాచార్యులు శ్రీ కల్లూరి చంద్రమౌళి ,శ్రీ ధూళిపాళ వెంకట సుబ్రహ్మణ్యంగారు పద్య నీరాజనం ,శ్రీ మల్లాప్రగడ శ్రీరంగారావు పద్య నమోవాక భక్తీ కుసుమాలు సమర్పించారు .శ్రీ ఆర్ వెంకటేశ్వర్లు ,శ్రీ పద్యాల సోదరులు పద్యాలలో దాసుగారి నిరాడంబరత ఆదరణ శిష్యవాత్సల్యం సర్వ సమానత్వం ,సభా పాండిత్యం ,సుబోధకత్వం కదా సంకీర్తన,సద్గురు ప్రాప్తి అదృష్టం ,రామనామ ప్రచారం మొదలైన విషయాలపై తమ గురువుగారు శ్రీ శ్రీరామ శరణ్ గారిపై భక్తిభావబందుర సుమధుర పద్య హారతి సమర్పించారు .వారి పద్యం తోనే సమాప్తి పలుకుతున్నాను –
‘’హరినామ బోధకు ,నాశ్రిత వత్సలు –మందస్మితానను ,మధుర భాషు
కమనీయ కళ్యాణ ఘన గుణ శోభితు –వైరాగ్యయుటు వేణు పత్రపాలు
నామ సంభాషు,శ్రీరామ లేఖన లోలు –నిన్డునిభాస్యు నానంద దాయు
సంచిత రామనారాయణహృదయస్ధు-శ్రీరామనామ సుచేల ధారు
నఖిల తీర్ధ సంచరణు,శేషంబ రమణు –షమ దమాభరణు,పవిత్ర చారు శరణు
లోక మంగళ కరణు భక్తైక శరణు-గురు శిరోమణి శ్రీరమ శరణుదలతు ‘’.
ఈ 11 ఎపిసోడ్ ల వ్యాసానికి శ్రీ పద్యాల సోదరులు రాసిన’’శ్రీ కుందుర్తి వెంకట నరసయ్యగారి జీవితము ‘’ పుస్తకమే ఆధారం .
సమాప్తం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-6-21-ఉయ్యూరు