తొలి తెలుగు ప్రధాని దివాన్ బహదూర్ బోల్లిని మునుస్వామి నాయుడు గారు
రైతు కుటుంబం లో పుట్టి మద్రాస్ రాష్ట్ర ప్రధాని అయిన దివాన్ బహదూర్ బోల్లిని మునుస్వామి నాయుడు తిరుత్తణి తాలూకా వేలంజేరి గ్రామం లో తారణ నామ సంవత్సరం లో పుట్టారు .కమ్మవారు. తండ్రి బుజ్జి నాయుడు .పుట్టిన ఊర్లోనే వీధి బడిలో ప్రాధమిక విద్య పూర్తి చేసి ,తిరుత్తణి లో మూడవ ఫారం వరకు ఇంగ్లీష్ చదివారు .హైస్కూలు చదువుకోసం తండ్రి మద్రాసులో కాపురం పెట్టి చదివించారు .మొదటినుంచి చదువు పై ఆసక్తి ఉండటం వలన ,దేహారోగ్యం కాపాడుకొంటూ వ్యసనాలకు బానిస కాకుండా బుద్ధిగా చదివి మెట్రిక్ పాసై ,క్రిస్టియన్ కాలేజి లో బి . ఎల్ .చదివి లాయర్ పట్టాపొంది హై కోర్ట్ జడ్జిశ్రీ పిఆర్ సుందరయ్యగారి ఆఫీస్ లో అప్రెంటిస్ గా చేరి న్యాయవాదిగా మారారు .
1909 నుంచి తమ స్వంత జిల్లా చిత్తూరు లో ప్రాక్టీస్ ప్రారంభింఛి ,క్రమాభి వృద్ధి చెంది రైతుల కష్టాలు స్వయంగా గ్రహించారు .ఉభయ పార్టీల వాదనలు సాకల్యం గా వినిరాజీ కుదర్చటానికే ఎక్కువగా ప్రయత్నించేవారు .రాజీ పత్రం లో ఉభయుల ఎదుటా ఎవరికీ అనుమానం రాకుండా తాను కూడా సంతకం పెట్టేవారు.అప్పటి జిల్లా బోర్డ్ ప్రెసిడెంట్ రావు బహదూర్ టి.వి .రంగాచార్యులు మన నాయుడుగారిని డిస్ట్రిక్ట్ బోర్డ్ మెంబర్ గా నామినేట్ చేసి ,వైస్ ప్రెసిడెంట్ ను చేశారు .లోకల్ బోర్డ్ చట్టాన్ని పూర్తిగా అవగాహన చేసుకొన్నారు .
1920లో శ్రీ మునుస్వామి నాయుడు మద్రాస్ శాసన సభకు ఎన్నికయ్యారు .తర్వాత డిస్ట్రిక్ట్ బోర్డ్ ప్రెసిడెంట్ అయ్యారు .స్వలాభానికి కాక ,రైతుల కష్ట నష్టాలు తీర్చటానికి పూనుకొన్నారు .పండించిన ధాన్యం మార్కెట్ కు తోలటానికి ,గిట్టుబాటు ధర పొందటానికి నానా అగచాట్లు పడేవారు రైతులు .పిల్లల చదువులకు దగ్గరలో బడులు లేవు .అందుకోసం రాకపోకల సౌకర్యానికి ముందుగా నాయుడుగారు రోడ్లు వేయించారు .గ్రామాలలో చక్కని రోడ్డు సౌకర్యం కలగటం వలన గ్రామీణులకు ఎంతో వెసులు బాటుగా ఉండేది .
గవర్నమెంట్ నియమించిన అగ్రి కల్చర్ కమీషన్ లో బాంకింగ్ ఎంక్వైరీ కమిటీలో మెంబర్ అయ్యారు .సరళ స్వభావి శాంతమూర్తి అవటం రో అన్ని జాతుల మతాల వయసు వారు ఆబాల వృద్ధులు ,అధికార అనధికార ప్రజలంతా ఆయనకు సమానులే .కోపం ఉండేది కాదు .సర్వజన మాన్యుడు అయ్యారు నాయుడుగారు .
1930లో జస్టిస్ పార్టీ కి నాయకత్వం వహించారు.అప్పట్లో ఆ కక్షి వారికి బ్రాహ్మణులంటే ద్వేషం ఉండేది .ద్వేషం ప్రగతికి నిరోధం అని చెప్పి ఒప్పించి బ్రాహ్మణులను కూడా సభ్యులుగా చేర్చు కోవటానికి తీర్మానం చేసి పాస్ చేయటానికి నెల్లూరులో జరిగిన బ్రాహ్మణేతర సదస్సులో పాల్గొన్నారు .అప్పట్లో ఆంధ్రనుంచి వచ్చినవారు ఆక్షేపించారు .నాయుడుగారి మాట వేదవాక్కుగా అందరూ భావించి తీర్మానం నెగ్గించారు .అందరికి అందుబాటులో ఉంటూ గాంధీగారి ఆదర్శాలను సాధ్యమైనత వరకు పాటించే వారు .
27-10-1930న శ్రీ మునుస్వామి నాయుడుగారు మద్రాస్ ప్రభుత్వ ప్రధానమంత్రిగా నియమింప బడ్డారు .పదవి చేబట్ట గానే రైతులు డిస్ట్రిక్ట్ బోర్డ్ టోల్ గేట్లకు చెల్లించే పన్నులు తీసివేసే చట్టాన్ని పాస్ చేయించి రైతులకు మహోపకారం చేశారు .యూరోపియనలను మాత్రమె నియమించే ఎలెక్ట్రిక్ కార్పోరేషన్ వగైరా సంస్థలలో ,అలాంటి పనులు భారతీయలు కూడా సమర్ధవంతంగా చేయగలరు అని రాజధానిలో ,కోయంబత్తూరు నీలగిరి ,చిత్తూరు మొదలగు చోట్ల ఎలెక్ట్రిక్ కార్పో రేషన్ లు స్థాపించటానికి శక్తి వంచన లేకుండా కృషి చేసి విజయం సాధించారు .నాయుడుగారు ఈ పదవి అలంకరించటం చిత్తూరు జిల్లాకే గౌరవం కాకుండా కమ్మవారికి గర్వ కారణమైంది .జస్టిస్ పార్టీ లో అభి ప్రాయ భేదాలు రావటం వలన ,తన మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తించటం ఇష్టం లేక మంత్రి పదవికి రాజీనామా చేసి ,జస్టిస్ డెమోక్రాటిక్ పార్టీ స్థాపించి అధ్యక్షులయ్యారు . జస్టిస్ పార్టీ వీరి నాయకత్వం లేకపోవటం వలన బాగా బలహీనమై నామ రూపాలు కోల్పోయే స్థితిలో ఉంటే ,,ఆపార్టీ వారొచ్చి నాయుడుగారిని కాళ్ళా వేళ్ళా పడి బ్రతిమాలి మళ్ళీ నాయకులై నడిపించమని ప్రాధేయపడ్డారు .కొన్ని కండిషన్స్ పెట్టి వాటిని ఒప్పుకొంటే తనకు అభ్యంతరం లేదన్నారు .
పార్టీ ఐక్యతకు ప్రయత్నాలు ముమ్మరమైన తరుణం లో నాయుడుగారికి జబ్బు చేసి ఆరు రోజుల తర్వాత 13-1-1935న 51ఏళ్ళ వయసులో రాత్రి రామనామ స్మరణ చేస్తూ ,ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే విష్ణు సాయుజ్యం పొందారు . ,జమీందారులంతా కలిసి నాయుడుకు వ్యతిరేకులై గవర్నర్ పై ఒత్తిడి తెచ్చారు. అదే సమయములో తన వద్ద పనిచేసే బంట్రోతు పావలా లంచం తీసుకున్న విషయం తెలియడంతో నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేసి ప్రభుత్వ వాహనాన్ని వదలి గుర్రపు బగ్గీలో ఇంటికెళ్ళిన నిజాయితీపరుడు.
మద్రాస్ రాష్ట్ర తోలి తెలుగు ప్రధాని శ్రీ బలినేని మునుస్వామి నాయుడు గారు పదవిలో ఉండగా సాధించిన ఘన విజయాలు ఒక్క సారి చూద్దాం-
1-పట్టాభూమికి ఒక మైలు దూరం వరకు రిజర్వ్ ఫారెస్ట్ ఉండకూడదని తీర్మానం చేసి పాస్ చేయించారు
2-అడవి పంచాయితీలు ఏర్పాటు చేసి ,పశువులు మేపుకోవటానికి పంచాయితీలకు స్వాధీనం చేశారు .
3-చిత్తూరు జిల్లాలో పశువుల ఆస్పత్రి ఏర్పాటు చేశారు
4-డిస్ట్రిక్ట్ బోర్డ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అనాదరణకు గురైన గ్రామాలకు రోడ్లు వేయించారు
5-చంద్ర గిరి రెంట్ కోర్ట్ కాంప్ పోవటం వలన జమీందారీ రైతులు అనేక కష్టనష్టాలు పడాల్సి వచ్చిన తరుణం లోచంద్రగిరిలోనే స్థిరంగా ఉండే ఏర్పాటు చేశారు
6-టోల్ గెట్ పన్నులు తీసేసిరైతులకు , ఎలెక్ట్రిక్ కార్పోరేషన్లు ఏర్పాటు చేసి స్వదేశీయులకు ఉద్యోగాలు కల్పించారు
సర్వ మానవ సౌభ్రాతృత్వం , అందరిపై ఆదరణ,ప్రేమ వల్లనే కార్యాలు సాధించవచ్చుననీ నాయుడు గారు రుజువు చేశారు .
‘’శాంతమే జనులకు జయము నంది౦చును –శాంతమున నెరుగని జాడ తెలియు
శాంతభావ మహిమ –జర్చింప లేమయా –విశ్వదాభి రామ వినుర వేమ’’.
ఈ రచనకు ఆధారం – చిత్తూరుకు చెందిన జర్నలిస్ట్, సోషల్ వర్కర్,పెర్సనల్ క్లార్క్ టు ది లేట్ దివాన్ బి.మునుస్వామి నాయుడు అయిన శ్రీ టి .ఎన్ .ఉమాపతి అయ్య గారు రాసిన ‘’శ్రీయుత దివాన్ బహద్దూర్ శ్రీ మునుస్వామి నాయుడుగారి జీవిత చరిత్రము.
ఈ పుస్తకం 1935లో చిత్తూరులో రచయిత చేత ప్రచురింపబడింది .వెల కేవలం ఒక్క అణా మాత్రమే .‘’
ఇంతటి మహనీయుని గురించి మనకు దాదాపుగా తెలియదు .వారిజీవితాన్ని వెలుగులోకితెచ్చిన శ్రీ ఉమాపతి అయ్యా గారు ధన్యులు . దానినాదారంగా నాయుడు గారిని గురించే రాసే అదృష్టం నాకు కలిగింది .
‘’నాయుడు గారి జీవిత చరిత్ర బాలురు అందరూ తప్పక చదివి ,ఆయనలాగా దేశానికి కీర్తి తేవలయు నని కోరు చున్నాను ‘’అని మనస్పూర్తిగా కోరుకొన్న ఉమాపతి అయ్యగారి ఆకాంక్ష నెరవేరాలని కోరుకొందాం మనస్పూర్తిగా .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-6-21-ఉయ్యూరు