శ్రీ గురు నాథేశ్వర శతకం
శ్రీ గురు నా్పాథేశ్వర శతకం ను శ్రీమదాంధ్ర విద్యా వాచస్పతి ,సాహిత్య సరస్వతి ,శతావధాని శ్రీ దోమా వెంకటస్వామి గుప్త గారు రచించారు .దీన్ని గుంటూరు వాసి శ్రీ ఉప్పుటూరి వెంకట పున్నయ్య గారి ప్రోత్సాహంతో 1925లో గుంటూరు లో ముద్రి౦చారు .కీర్తి శేషులు శ్రీ ఉప్పుటూరి గురు నాదము గారి చే గుంటూరు తిలక్ పేటలో స్థాపింపబడిన ‘’శ్రీ గురునాదేశ్వర స్వామిపై రాసిన శతకం అని కవి పేర్కొన్నారు .తన విజ్ఞాపన లో కవి గుప్తాగారు ‘’గుంటూరులోని ఉప్పుటూరి వెంకట పున్నయ్యగారు విఖ్యాత వైశ్యులు .బ్రాహ్మణ, వైశ్యులకు అన్నసత్రాలు కట్టించిన వారు .కన్యకాంబ నిత్య నైవేద్యానికి కొరత లేకుండా చేసినవారు. ఎన్నో చోట్ల చలువ పందిళ్ళు నిర్మించారు .మంగళగిరి పానకాల నరసింహ స్వామి ,నెల్లూరు శ్రీ రంగనాధ దేవాలయాలకు గోపుర ,కలశాదులు ఏర్పాటు చేశారు .తాడికొండ క్రాస్ రోడ్ లో తటాకం నిర్మించారు ..ఎన్నో బ్రాహ్మణ వైశ్య బాలురకు ఉపనయనాలు చేయించారు .శివాలయ నిర్మాణం లింగ ప్రతిష్ట సంకల్పించారు .వారు కాలధర్మం చెందారు .ఆలయ నిర్మాణ బాధ్యత అన్నకుమారుడు శ్రీ ఉప్పుటూరి పున్నయ్యగారికి అప్పగించారు ..తానుకూడా కొంత ద్రవ్యం ఖర్చు చేసి శ్రీ గురు నాదేశ్వరాలయ నిర్మాణం పూర్తీ చేశారు .ఈ శతకం రాయటానికి ప్రోత్సాహం పున్నయ్యగారే ‘’అని శతావధాని శ్రీ దోమా వెంకటస్వామి గుప్త గారు తెలియ జేశారు .
శ్రీ దోమా వెంకటస్వామి గుప్తాగారు నేను విజయవాడ లో ఎస్ ఆర్ ఆర్ సివిఆర్ కాలేజిలో ఇంటర్ చదువుతున్నప్పుడు తెలుగు ట్యూటర్ గా పని చేశారు .పొట్టిగా ,లావుగా పంచ కట్టు హాఫ్ హాండ్ చొక్కా ఉత్తరీయం తో ,ముఖాన కాణీకాసంత కుంకుమతో ,ఒక చేతి సంచీ, దాని నిండా పంచాంగాల తో క్లాసుకు వచ్చే వారు .చాలా నెమ్మదిగా మాట్లాడే వారు ఎవరూ వినేవారు కాదు . పట్టించుకొనే వారుకాదు .తనూ తన పంచాంగాలు లేదా ఏదో రాసుకోవటమే కాని పాఠం చెప్పిన దాఖలా నాకు కనిపించలేదు. ఆయన గురించి గొప్పగా చెప్పుకోవటమేకాని ,ఆయనను విద్యార్దులేవ్వరూ పట్టించుకొన్న పాపాన పోలేదు .మా క్లాసులకూ వచ్చేవారు .అక్కడా అదే తీరు .దీనికి తోడు కాళ్ళకు కాఖీ రంగురబ్బరు బూట్లు వేసేవారు. నడక చూస్తె చవితినాడు ఉండ్రాళ్ళు బోజ్జనిండా తిన్న గణపతి నడిచినంత నెమ్మది నడక. ఆయన్ను చూస్తె హాస్యమే వచ్చేదికాని గౌరవం కలిగేదికాడు. అది విద్యార్ధులుగా మేము వారిని అర్ధం చేసుకోలేక పోయిన తుంటరితనమే అని ఇప్పుడని పిస్తోంది అప్పుడు అందరితోనూ నేనూ నవ్వినవాడినే .అప్పుడు కాలేజీ లో తెలుగు శాఖలో పని చేసిన శ్రీ విశ్వనాధ సత్యనారాయణ ,శ్రీ మాధవ రామ శర్మ,అందరూ ‘’మురిగ్గుంట ‘’అని పిలిచే శ్రీ తంగిరాల సుబ్బారావు (మురిగ్గుంట అనే పేరు ఎందుకొచ్చిందో మాకు తెలీదు ),శ్రీ పొట్లపల్లి సీతారామారావు ,శ్రీ శూలిపాలశ్రీరామ మూర్తి, శ్రీ పేరాల భరత శర్మ, శ్రీ అందవోలు సత్యనారాయణ ,శ్రీ అక్కిపెద్ది సత్యనారాయణ గార్లు అందరూ గుప్తాగారినిఎంతో మర్యాదగా పలకిరించేవారు .అలాంటి మా మాస్టారు రాసిన శతకం ఇది .విశేషాలు తెలుసుకొందాం .
ప్రార్ధన శ్లోకం గా ‘’శ్రీమద్గర్తపురస్థపూర్ణ జనతానందాతిసంపత్ప్రడదు- జ్ఞానాబోనిది పారగాశ్రిత హృడబ్జాతార్క బి౦బోదయం
సూర్యేంద్రాగ్ని విలోచనం ,పశుపతిం ,కామ్యార్ధ సంసిద్ధయే –వందేహం శుభదం శివంచ గురునాధేశం జగద్వల్లభం ‘’అని గొప్ప శ్లోకం చెప్పారు .ఆతర్వాత అదే సంస్కృత ధోరణిలో మొత్తం ఇరవై శ్లోకాలు బహు సునాయాసంగా చెప్పి ,ఉప్పుటూరి వారినీ కీర్తించారు .ఆతర్వాత తెలుగు శతకం ప్రారంభించారు .
సశేషం
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -22-6-21-ఉయ్యూరు