శ్రీ గురు నాథేశ్వర శతకం -2(చివరిభాగం )
గర్త పురి అనే గుంటూరులో వెలసిన శ్రీ గురునాదేశ్వరస్వామిని అర్చించి మృకండ సూతి మృత్యువును జయించాడు ,భస్మాసురిని కోరిక తీర్చాడు స్వామి .యోగి హృదయ నివాసి .నమ్మినవారికి కస్టాలు రావు .ఆయన ‘’జగతీ బంధుడు హీళీ కన్నోకటియై ,చంద్రుండు వేరొక్క క –న్నుగబోల్పారి ,హుతాశానుండు ను నొక కన్నుంగా జెలగంగ లో –క గురుత్వంబును గన్న నీవన ,నరోగత్వోరుధీ సత్ప్రభా-వాది గుణ౦బుల్ దయ సేసినట్టి వాడు ‘’.ఆయన లులాయాసుర హారిణీపుడు..మొక్కగానే దనం యశం ,సౌఖ్యం ఇచ్చే వేలుపు .కామారి అయినా ‘’మేనసగంబు భార్యకు ఇచ్చినవాడు .
‘’జ్వాలాజ్వాల జటాలమై యటు జగజ్జాలంబు గాల్పంగ-నా –క్ష్వేళ౦ బెంతో విజ్రు౦ భిలన్ ‘’సురపతులు వచ్చి కావుమని ప్రార్ధిస్తే ‘’కడు వేవే నుంచి నావయ్య సల్లీలం గొంతున నీల కంఠ’’అని స్తుతించారు గుప్తా గారు .నత్కీరుని కాచిన పరమ దయాశాలి శూలి ..’’నీవే హరి నీవే బ్రహ్మ ,మాద్యత్సకలాబ్జ జా౦డములు నీవే ‘అంటారు కవి .’’వందేర్ధే౦దు కళాపరి ష్క్కృత జతాభారాయ భావాయ , వా-తాన్ధఃపాలక కంకణాయ భవతే ధర్మాస్థిరాయేతి’’అనే శోకం లో సగ భాగాన్ని శార్దూలపద్యం లో ప్రారంభించి మంచి ముగింపు ఇచ్చారు .
తర్వాత గుడి కట్టించిన ఉప్పుటూరి పున్నయ్య గారి గురించి వారి వంశాన్ని గురించి వారు చేసిన దాత్మిక కార్యక్రమాల గురించి కమ్మని పద్యాలలో వివరించారు కవి .ఫలశ్రుతి కూడా చెప్పారు .చివరగా ‘’ఇది శ్రీతు౦గ భద్రాతీరవిరాజమాన కందనవోల్మందిర శ్రీ రామ చంద్ర పరమాత్మ పాదార వింద మరందపా నెంది౦దిరాయమానస దోమ గోవి౦దాఖ్యార్య వైశ్య శ్రేష్ఠ జ్యేష్టాత్మజాంధ్ర విద్యా వాచస్పతి సాహిత్య సరస్వతి ,శాతావదానీ దోమా వెంకట స్వామి గుప్త ప్రణీత గురు నాథశతకం’’అని మా మాస్టారు గుప్తా గారు శతకాన్ని ముగించారు .శతకం లో 125పద్యాలను వివిధ ఛందస్సులలో రాశారు ..పద్యం పరిగెత్తటమే కానీ ఎక్కడా కుంటి నడక లేదు .శాతావదానికదా .ఆశువు లో దిట్టతనం బాగానే ఉండి ఉంటుంది .లోకరీతిని కాచి వడబోసిన అనుభవం పద్యాలలో ప్రవహించింది .వారి శివభక్తికి తార్కాణగా నిలిచింది ఈ శతకం . .’కందంలో అందంగా రాసిన 124 వపద్యం –‘’శ్రీ గర్తపురి నిలయా –భోగి వలయ ,కువలయహిత పుష్పా ,విజయా
భోగ శ్రీకర సదయా –త్మా,గిరిజా౦బా సనాధ,హర గురు నాధా’’
మా మాస్టారు గుప్తా గారి గురించి నిన్న రాసిన దానికి అనుబంధంగా మరికోన్నిమాటలు .ఆయన హాఫ్ స్లీవ్ కోటు వేసేవారు .తెల్లగోడుగు ఎప్పుడూ చేతిలో ఉండేది .నడక మహా నిమ్మది.ఆయన గొప్ప పంచాంగ కర్తగా లోకం లో సుప్రసిద్ధులు .గుప్తా గారి పంచాంగం అంటే హాట్ కేకుల్లా ఆకాలం లో అమ్ముడు పోయేవి అంటే వారి పంచాంగ గణనం యెంత నిర్దుష్టం గా ఉండేదో తెలుస్తుంది .65 సంవత్సరాలక్రితం మాకు విద్యాబోధన చేసిన మాస్టారు గుప్తా గారి శతకాన్ని పరిచయం చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను .
మీ -గబ్బిటదుర్గాప్రసాద్ -23-6-21-ఉయ్యూరు