అవధూత శ్రీ వెంకటాద్రి స్వామి చరిత్ర-1
శ్రీ వెంకటాద్రి స్వామి చరిత్ర ను తమిళం లో శ్రీ కులుమణి నారాయణ శాస్త్రి గారు రచించగా ,శ్రీ కంచి పరమాచార్యుల వారి అంతరంగికులు ‘’శ్రీ విశాఖ ‘’గారు భావాను వాదం తెలుగులో చేస్తే ,తెనాలిలోని శ్రీ బులుసు సూర్యప్ర కాశశాస్త్రి గారి సాధన గ్రంధ మండలి తెనాలి శ్రీ వెంకట రమణ ప్రెస్ లో శ్రీ నల సంవత్సరం జ్యేష్టమాసం లో 1976 జూన్ లో ముద్రించారు .వెల అయిదు రూపాయలు .
ఎవరీ వెంకటాద్రి స్వామి ? తిరువన్నామలై లోని అరుణా చల క్షేత్రం లో ని జనులకు భగవాన్ రమణ మహర్షి సూర్యుడు అయితే, శ్రీ వెంకటాద్రి స్వామి చంద్రుడు .స్వామి ఉపదేశాలను కావ్యకంఠ గణపతి ముని చందోబద్ధం చేశారు .అనేక సిద్ధులు పొందిన మహనీయులు స్వామి .తెలుగులో రమణ లీలలు ,గణపతి ముని చరిత్ర ఉన్నాయి కాని స్వామి చరిత్ర తెలుగులో లేకపోవటం లోటుగా భావించి తాను నారాయణ శాస్త్రి గారు తమిళం లో రాసిన స్వామి చరిత్రను అనువాదం చేయాలనుకొని కంచి శ్రీ పరమాచార్యు ల వారికి విన్నవించగా ‘’రామకృష్ణ పరమ హంస ,వివేకానందులు రాగ భక్తిలో భగవారాధన చేశారు .శ్రీ రమణులు చిన్నతనం లోనే అద్వైతానుభూతి పొండి ఒక విశిష్టమార్గం త్రోక్కారు .అరవిందుల విధానం వేరు .సదా శివ బ్రహ్మేన్ద్రులు వేంకటాద్రి స్వామి మొదట వైదికం గా ఉంటూ ,తర్వాత దాన్ని అధిగమించి అవదూతలైనారు .వైదిక నిష్టలో ఉండేవారికి ఆదారి వదలటం మహా కష్టమే .ఒక్కొక్కరిది ఒక్కో త్రోవ .అనువాద రూపంగా శేషాద్రి స్వామి వారి కైంకర్యం చేయతగినదే ‘’అని ప్రోత్సహించి దీవించారు .తమిళం లో ఉన్న స్వామి చరిత్రను ‘’శ్రీ శేషాద్రి స్వామి అధిష్టాన సభ –ఊన్జలూరు ప్రచురించారు .శ్రీ కులు౦దై ఆనందస్వామి ఆ చరితలోని కొన్ని విశేషాలను వ్యాసాలుగా తమిళ పత్రికలలో రాశారు .స్వామి చరిత్రను ఆమూలాగ్రం తెలుగులో అనువాదం చేసి ప్రచురించటానికి ఆ ఆదిష్టాన సభ వారు అంగీకరించారు .అలా తెలుగులోకి వెలుగు చూసింది స్వామి చరిత్ర .
పరమ భాగవతోత్తములు ,అద్వైతామృత ప్రసారకులు మచిలీపట్నం కాలేజి ప్రిన్సిపాల్ ఎందరికో మార్గదర్శి బహు గ్రంధకర్త లలితా పరాభాట్టారిక అమ్మావరి ఉపాసకులు శ్రీ భాగవుల కుటుంబ రావు గారు ఆంగ్లం లో సవివరమైన ఉపోద్ఘాతం రాశారు .దాని సారాంశం క్లుప్తంగా తెలుగులో తెలుసు కొందాం .’’స్వామి కల్పిత వ్యక్తికాదు 1870లో పుట్టి 20వ శతాబ్దం లో సిద్ధిపొందారు .వారి అనుగ్రహ పాత్రులు కూడా ఆకాలన వారే .ఆధ్యాత్మిక చింతన కల ముముక్షువులకు ఈ గ్రంథ౦ అమూల్యమైనది .స్వామివారు బాల్యం లోనే వేదం శాస్త్రాలు సాధించారు .జ్ఞాన సిద్ధి కలిగే దాకా జపం అనుష్టానం కొన సాగించారు .చనిపోయిన తన తల్లికి కర్మకాడ చేశారు .శంకర భగవత్పాదులు లాగానే .తర్వాత జ్ఞానియై ‘’రమతే బాలోన్మత్తవ దేవ’’అన్నసూక్తి స్వామివారికి సరిగ్గా సరిపోయింది .వ్యాసకుమారుడు శ్రీ శుకమహర్షిని చూసి స్త్రీలు సిగ్గుపడకపోవటం భాగవతం లోని కథా విశేషం..శ్రీ శేషాద్రి స్వామి స్పృశించినా స్త్రీలు మనో వికారం పొందక పోవటం 19-20 శతాబ్దులలో అపూర్వ విషయం యదార్ధం .ఈ రోజుల్లో సామాన్య సిద్దులున్నవారే దూర దర్శన దూర శ్రవణాలు కలిగిఉంటే అపూర్వ సిద్ధులు పొందిన మన స్వామి వారికి అవి పుష్కలంగా ఉన్నాయి అనటానికి సందేహమే లేదు .
స్వామి అనేక శక్తులు కలిగి ఉండచ్చు అనేకులకు మార్గ దర్శనం చేసి ఉండచ్చు మహా తపస్సంపన్నులు అయి ఉండవచ్చు .అంతమాత్రాన ఆయన చరిత్ర చదవాలా అని పిస్తుంది .ఒక భక్తుడు ప్రార్ధిస్తే ,స్వామి అనుగ్రహిస్తే వర్షం కురిసింది ..క్షణ కాలం లో ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా నేటి సైన్స్ కు అలా కురిపించే సత్తా ఉందా ?.అది దేశ క్షేమానికేగా జరిగింది .ఇంతకుముందున్న శ్రీ శృంగేరి శంకరాచార్యుల చరిత్రలో ఇలాంటి మహిమలున్నాయి .వారు శృంగేరిలో వరదలు నివారించారు .ప్రధమ రాష్ట్ర పతి శ్రీ బాబూ రాజేంద్ర ప్రసాద్ గారు శృంగేరిని సందర్శించినపుడు విపరీతం గా కురిసే వర్షాలను ఆపివేశారు .అందుకే దేశ క్షేమానికి భౌతికశక్తి చాలదు ఆధ్యాత్మిక శక్తికూడా కావాలని మన శాస్త్రాలు ద్ఘోషించాయి .పరాతి సంధానం,అభ్యాసం చేసే రాజకీయ నాయకులు ఒకరే చాలరు .శ్రీ శేషాద్రి స్వామి శ్రీ రమణులు ,శ్రీ శృంగేరి విద్యా శంకర భారతి ,శ్రీ కంచి చంద్ర శేఖరేంద్ర సరస్వతి వంటి మహనీయులు కూదాదేశానికి అవసరం .రాజేంద్ర ప్రసాద్ గారిలాంటి రాజర్షులు కావాలి .ఈ విషయాలను స్వామి చరిత్ర మనకు బోధిస్తుంది .
జీవన్ముక్తి ఉందా లేదా స్థిత ప్రజ్ఞులు ఎలా ఉంటారు అన్న ప్రశ్నలకు స్వామి చరిత్ర సజీవ సమాధానం చెబుతుంది .అటు రమణ మహర్షి ఇటు వెంకటాద్రి స్వామి ఇద్దరూ జీవన్ముక్తులే .కాని విభిన్న రీతులలో కనిపించారు అంతే..స్వామివారి బోధలు ఉపవాసం నిరాహారం అంటే ఏమిటి వివరాలున్నాయి .మనకు జీవితం లో వచ్చే సమస్యలు వాటికి పరిష్కారాలు మార్గ దర్శక సూత్రాలు అన్నీ ఉన్నాయి .స్వామి భగవదంశగా జన్మించారు .అంటే వారి చరిత్ర భగవంతుని చరిత్రే .భక్తులకు సర్వ దేవతా రూపంగా కనిపించారు .ఆయన కీర్తనం భగవద్గుణ కీర్తనమే .దయా సింధువు అయిన స్వామి ఇప్పటికీ భక్తులను ఆవేశించి హితబోధ చేస్తున్నారు .శ్రీ విశాఖ గారి అనువాదం వలన ఆంధ్రులకు శ్రీ వెంకటాద్రి స్వామి మరింత సన్నిహితులౌతారు –‘’శాంతా మహంతోనివసంతి సంతః –వసంత వల్లోక హితం చర౦తి’’ ‘’అన్నారు శ్రీ త్రిపురారహస్యం వంటి ఉత్తమోత్తమ గ్రంథాలు రాసిన డా భాగవతుల కుటుంబ రావు గారు .
తిరు వన్నామలై లో శ్రీ శేషాద్రి స్వామి –జీవుడు –ఉపాధి అను సందానకర్తలు 25పేజీల భాగవతుల వారి ఇంగ్లీష్ రచనకు శ్రీ విశాఖ గారు చేసిన తెలుగు అనువాదం లో మరి కొన్ని విశేషాలు .’’ప్రముఖ ఆంగ్లకవి లాంగ్ ఫెలో తన కవితలో ‘’మనం మనజీవితాలను మహోన్నతంగా చేసుకో గలం.మరణకాలం లో కాలం అనే ఇసుకమీద మన పాదముద్రలను మనవెనక వదలగలం .’’అని మహాపురుషుల ఈవితాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి అన్నాడు .సిద్ధపురుషులు శ్రీ శేషాద్రి స్వామి స్థిత ప్రజ్ఞులు . జీవితమంతా తిరువన్నామలై లోనే గడిపి అక్కడే తుది శ్వాస వదిలిన మహాత్ములు .చిన్నతనం లో ఆయనను తల్లి ఒక దేవాలయానికి తీసుకు వెడితే .అక్కడ కంచు కృష్ణుని విగ్రహాలు 12పైసలకు అమ్ముతుంటే ఒక విగ్రహం కొన్నారు .ఆరోజు ఆవర్తకుని దగ్గరున్న విగ్రహాలన్నీ అమ్ముడు పోయాయి .అతడు ఆశ్చర్యంతో బాల వెంకటాద్రి దగ్గరకొచ్చి అతనిని అభినదించాడు 14వ ఏట తండ్రి చనిపోతే తల్లి మరకతాంబ ఆయన్ను తమ్ముడు నరసింహ ను పెంచింది .శేషాద్రికి గొప్ప భవిష్యత్తు ఉందని తాతగారు చెప్పారు .పుట్టుజ్ఞాని అయిన శేషాద్రి అన్నీ అతి త్వరలోనే నేర్చుకొని సర్వ శాస్త్ర పారంగతుడైనాడు .దేవాలయానికి లేక స్మశానానికి వెళ్లి జపం చేసేవాడు .తల్లి వివాహ విషయం తెస్తే వద్దనే వాడు .ప్రపంచ విషయాలన్నీ అవగతం చేసుకొన్నాడు .గదిలో ఉంచి తాళం వేస్తె గదిలో లేడు.అన్నంమీద శ్రద్ధ లేదు.నేలమీదా రాళ్ళపైనా పడుకొనే వాడు .పిలిచిన వారింటికి కాకుండా పిలవని వారింటికి వెళ్ళేవాడు ఇదే అదును అనుకొని తల్లి ఒకరోజు ‘’సత్సంగత్వే నిస్సంగత్వం ‘’అనే శంకరాచార్య భజగోవింద శ్లోకం చదివి,అరుణా చల అని మూడు సార్లు పలికి,కళ్ళు మూసింది .అదే ఆమె చివరి ఉపదేశం అనిపిస్తుంది .
తర్వాత అరుణాచలం వెళ్లి 40 ఏళ్ళ శేష జీవితాన్ని అక్కడే గడిపారు వెంకటాద్రిస్వామి 1929లో అక్కడే సిద్ధిపొందారు .అక్కడ ఏ దేవాలయానికీ వెళ్ళేవారు కాదు వీధుల్లో తిరిగేవారు .సిద్ధిపొందాకకూడా ప్రజలతో సంబంధం కలిగి ఉన్నారు .ఈరోడ్ రైలు స్టేషన్ కు రెండుమైళ్ళ దూరం లో ఉన్న వీరప్పన్ సత్రం లో ఉంటున్న శ్రీ శివరామ కృష్ణయ్యర్ లో ఆవేశించారు .ఈయన తల్లికావేరి అమ్మాళ్ .పవిత్ర చరిత్రురాలు .భర్త రెవెన్యు ఉద్యోగి .వీరికి నలుగురు కుమార్తెలు ఇద్దరుకుమారులు .చివరివాడే శివరామ కృష్ణ .కావేరి అమ్మాళ్ 40 ఏళ్ళు అన్నం తిననే లేదు .సుబ్రహ్మణ్య స్వామి భక్తురాలు .పళ్ళు పాలు మంచిగంధం కలిపిన నీళ్ళు ఆమె ఆహారం .తిరువాస నల్లూరు లోని శ్రీ అయ్యవల్ లాగా దివ్య శక్తుల్ని సాధించింది .ఆమె ఇంటికి కావేరినది ఒక మైలు దూరం .వెళ్ళలేక పొతే కావేరి ఆమె పూజాగృహం పైనుంచి ప్రవహింప జేసి స్నానం చేసేది .ఆమె బ్రతికి ఉండగా ఆశక్తులు ఎవరికీ తెలియదు .
ఒకసారి తిరువన్నామలై వెళ్లి ఒక సత్రం లో ఉదయం పూజలో ఉండగా శ్రీ శేషాద్రి స్వామి అకస్మాత్తుగా వచ్చి ఆకలిగా ఉంది ఆహారం కావాలి అంటే నైవేద్యపు అరటిపండు ఇస్తే సగం తినగా ఏడేళ్ళ శివరామ కృష్ణయ్యర్ అక్కడికి రాగా స్వామి మిగిలిన సగం ప౦డు ఆతని నోట్లో కుక్కారు .అది ఆబాలుడికి ఇచ్చిన దీక్ష ఏమో అప్పటినుంచి అయ్యర్ గారే వెంకటాద్రిస్వామి స్పిరిట్ గా ఆవేశించారు .ఇదే స్పిరిట్ మీడియం ..20ఏళ్ళు గడిచాయి. కావేరి అమ్మాళ్ కోరగానే స్వామి కలలో కనిపి౦చి ,తాను భూతమై అంటే స్పిరిట్ గా అయ్యర్ దేహం లో ఉన్నానని చెప్పారు .ఆస్పిరిట్ స్వామి మాట్లాడినట్లే మాట్లాడేది .అవే హావభావాలు కూడా .ఒక గేము లాఆడేవారు .ఒకపల్చని కొయ్యపలక ,దాని వెనక అడుగున ఉన్న రెండు లంకేలపై ఉంటుంది దానిముందు ఒకభాగం పై ఒక రంధ్రం అందులో పెట్టటానికి ఒక పెన్సిల్ ఉంటాయి .పలక కింద తెల్ల కాగితం పెడతారు .మొదట అయ్యర్ ఆ పలక తాకే వాడు .ఆయనలో ఆవేశించిన స్వామి పలకను నడిపేది అప్పుడు కాగితం పై పెన్సిల్ రాసిన అక్షరాలూ కనిపించేవి .అ౦దులోస్వామి సందేశం ఉండేది .కొంతకాలం తర్వాత కాగితం తీసేశారు .అయ్యార కే ఏమి రాయాలలో స్పురిం చేది.దాన్ని చెప్పేవాడు.అయ్యర్ ముఖతా శ్రోతలు స్వామి వారి రెండుమూడు గంటల ఉపన్యాసం వినగలిగేవారు. అవి ప్రామాణిక ఉపదేశాలు .సామాన్యంగా అయ్యర్ మామూలుగా నే ఉండేవారు సమాదిలోనే స్వామి ఆవేశించేవారు .ఆ కొయ్య పలక సహాయంతోనే స్వామి వారి ఉప దేశాను ఒక పెద్ద పుస్తకం లో ఒక చిన్న పుస్తకం లో అయ్యర్ రాశారు .వీటిని’’ జీవ్య ప్రదర్శిని’’,అనేపేరుతో మొదట ఆతర్వాత ‘’మోక్ష ప్రదర్శిని ‘’అనే పేరుతొ తమిళ మాసపత్రియాలో ప్రచురించారు .ఆతర్వాత స్వామి వారి శిష్యులు శ్రీ శేషాద్రి స్వామిగళ్ అధిష్టానం అసోసియేషన్-ఉంజులూరు ‘’ గా ఏర్పడి వీటిని ప్రచురించి ,స్వామివారి సమాధి కూడా నిర్మించారు .ఇక్కడ శాస్త్రోక్తంగా పూజాదికాలు జరుగుతాయి .మధురలో ఉంటున్న సిద్ధపురుషులు శ్రీ కులం కుడై ఆనంద స్వామి 1932లో శరేరం చాలించి ,ఆయనకూడా అయ్యర్ర్ శరీర౦ లో లో ఆవేశిచేవారు .మధురలోని అరసవాది లో వీరి సమాధి నిర్మించారు .
శివరామ క్రిష్ణయర్ గారు 61వ ఏట 3-3-1974 న మరణించారు .తనకుమారునిలో ఆయన శేషాద్రి స్వామి స్పిరిట్ గా ఉన్నారు.ఇప్పుడుకూడా ఆస్పిరిట్ రూపం లో వారి బోధలు వినగలం .శ్రీ కుజుమణి నారాయణ శాస్త్రిగారు శేషాద్రి స్వామివారితో సన్నిహితంగా మెలగినవారు .వీరు తమిళం లో స్వామి వారి జీవిత చరిత్ర రాయకపోతే ఎవరికీ తెలిసేదికాదు ..దీన్ని తెలుగులోకి సరళభాషలో అనువదించిన శ్రీ విశాఖ మహోపకారం చేశారు ‘’అని భాగవతుల కుటుంబరావు గారు గొప్ప సందేశాన్ని ముందు మాటలుగా రాసి మహోపకారం చేశారు .
సశేషం
మీ-గబ్బిటదుర్గాప్రసాద్ -24-6-21-ఉయ్యూరు