అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -2
కా౦చీపురం లో అందరూ భవ్య జీవులే .అందులో కామకోటిశాస్త్రిగారు ముఖ్యులు .ఈయన సచ్చరిత్ర గమనించి వేలియూరివారు అప్పుడప్పుడు శాస్త్రిగారిని ఆహ్వానించేవారు .వళూరు గ్రామస్తులు ఆయనకు సకల వసతి సౌకర్యాలు కల్పించి తమ గ్రామం లోనే శాస్త్రిగారిని ఉండేట్లు చేశారు .వీరిది కౌ౦డిన్యస గోత్రం .పుత్రసంతానం లేదు .అన్నగారిపిల్లల్నే తమ సంతానంగా గారాబంగా చూసుకోనేవారు .అన్నగారు చిదంబర శాస్త్రిగారికి వెంకట రమణ శాస్త్రి ,నరసింహ శాస్త్రి కుమారులు,సుందరాంబ, మరకతం పుత్రికలు ..పెద్దాయన వేదం వేదాంగాలలో నిష్ణాతుడు .పెళ్లి అయి పెద్ద వారి బలవంతం మీద దాంపత్యం చేసి ,కాశీకి వెళ్లి సన్యసించి ,1904లో సిద్ధిపొందారు .మిగతాముగ్గురు కన్నవారి ఆధీనంలోనే ఉన్నారు .
అందం కుశాగ్రబుద్ధి ఉన్న మరకత౦ అంటే తండ్రికి మహా ప్రేమ ..కావ్యనాటకాలు ఆమెకు చెప్పించారు .యుక్తవయసురాగానే పురుకుత్స గోత్రీకుడు శ్రీ విద్యోపాసకుడు వరదరాజుకిచ్చి పెళ్లి చేశారు .వీరిద్దరూ అన్యోన్యంగా కాపురం చేశారు .సౌందర్యలహరి మూక పంచశతి ఆమెకువాచో విదేయం .వివిధగ్రామాలనుండి వేదం శాస్త్రాలు నేర్వనికి విద్యార్ధులు వీరింటికి వచ్చి గురుకులవాసంగా ఉండేవారు .కామకోటి వంశీకులు సత్యభాషణులు వారేమి చెప్పినా తప్పక జరిగేది .ఆ వంశం వారిని జోశ్యులు అనేవారు .వరదరాజు తమ్ముడు రామస్వామి అన్నకు సరి సాటైన వాడు .సోదరులకు అన్యోన్యత ఎక్కువ .
వరద రాజు దంపతులకు సంతానం కలగలేదు .దానాలు హోమాలు తీర్ధయాత్రలు అన్నీ చేశారు .కామకోటి శాస్త్రి తమ ఆరాధ్య దేవత కామాక్షీ దేవిని కుమారునికి సంతాన భాగ్యం కలుగ జేయమని ఆర్తిగా ప్రార్ధించేవారు .ఒక రాత్రికలలో ‘’నాకు వెన్న నైవేద్యం పెట్టు .నా జ్ఞానకళతో పుత్రుని అనుగ్రహిస్తా ‘’ ‘’అని చెప్పగా అలాగే చేయగా కొద్దికాలానికి మరకతం గర్భవతి అయింది .22-1-1870 శనివారం హస్తా నక్షత్రం కన్యా రాశిలో శిశువు జన్మించగా ‘’శేషాద్రి ‘’అని పేరుపెట్టారు ..
రెండేళ్ళ వయసులోనే శేషాద్రి మిట్ట,పల్లాలు చూసుకోకుండా పరిగేత్తేవాడు .తండ్రి వరదరాజుప్రక్క ధ్యానముద్రలో కూర్చునేవాడు .మూడవ ఏడు గురుస్తుతి మూక పంచశతిలో కొన్ని శ్లోకాలు నేర్పారు .తదేక ధ్యానం తో చదివేవాడు. అల్లరీ లేదు ఆగమూ ఎరుగడు .నాలుగవ ఏట తల్లి వైశాఖ ఉత్సవాలకు వరద రాస్వామి గుడికి తీసుకు వెడితే ,అక్కడ ఒక అంగడిలో రెండు అంగుళాల బాలకృష్ణుని కంచు విగ్రహాలు చూసి ముచ్చటపడి అడిగితె అమ్మ దాన్ని 12పైసలకు కొన్నది .అదే ఆవర్తకుడికి బోణీఆరోజు .ఆలయం లోదర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళారు .మర్నాడు ఉదయం తల్లీ కొడుకు ఆ వీధిలో వెడుతుంటే నిన్నటి వర్తకుడు బాల శేషాద్రిని అమాంతం ఎత్తుకొని ముద్దాడి ‘’నీది బంగారు చేయ్యిరాబాబూ .బొమ్మల్ని ఇలా ముట్టుకోన్నావో లేదో ,నిన్న బొమ్మలన్నీ అమ్ముడు పోయాయి నీ బోణీ మంచిది ‘’అని మెచ్చాడు. అ రోజునుంచి శేషాద్రిని ‘’హిరణ్య బాహువు ‘’అని పిలిచేవారు అందరూ .ఆ బాలకృష్ణ విగ్రహం ఆయన దేవతార్చనలో చాలా ఏళ్ళు ఉండి పోయింది .ఇప్పటికీ ఆ వంశీయుల చేత పూజలు అందు కొంటో౦ది.
అయిదవ ఏట మంచి ముహూర్తం లో అక్షరాభ్యాసం చేశాక ,ఆయుష్యహోమం జిరిపి శ్రీ విద్యా గురువులైన తాతగారు కామకోటి శాస్త్రిగారిచేత కుశాగ్రం తో శేషాద్రి నాలుకపై సారస్వత మహాబీజం ,సారస్వత దశ శ్లోక మంత్రం ఉల్లేఖింప జేశారు .ఆ మంత్రం తో అభిమంత్రించిన ఆవుపాలను అన్నప్రాసనగా చేయించారు .కాగితం పై పంచాక్షరి అష్టాక్షరి వ్రాసి బాలునితో మూడు సార్లు అనుశ్రావిక పద్ధతిలో ఉపదేశించారు .విద్వాంసులకు బహుమానాలిచ్చి పిల్లవానిని ఆశీర్వ ది౦చ మని కోరారు .తర్వాత బడికి పంపారు .అమరకోశం మూడుకా౦డలను ఒక్క నెలలోనే నేర్చేశాడు .మూడేళ్ళు అయ్యేసరికి కావ్యాలు చంపువు ,నాటక అల౦కా రాదులలో రాటు దేరి అసామాన్య పాండిత్యం సాధించాడు .తమిళ గ్రంథాలు,కంబ రామాయణం ,తిరుకురళ్,నాలడియార్ లలో విశేష పాండిత్యం పొంది కరతలామలకం చెసుఒన్న అసమాన ప్రజ్ఞా దురీండు బాలమేధావి శేషాద్రి .
విద్వత్ సభలలో శేషాద్రి పేరు మారు మోగింది .ఏ విషయం మీదైనా ధారాళంగా శ్రావ్యంగా ప్రసంగించేవాడు .కండగల కవిత్వమూ చెప్పేవాడు .ఉపనయనం తర్వాత తర్క వ్యాకరణాల అంతు చూశాడు.తాతగారి వద్ద .కొన్ని మంత్రం రహస్యాలు నేర్చాడు .ప్రస్థానత్రయం అభ్యసించాడు .వేద పాఠశాలలో క్రమాంత వేదాధ్యయనం పూర్తీ చేశాడు .న్యాయ శాస్త్రం నేర్చాడు .
రోజూ విద్యాలయానికి వెళ్ళే ముందు తండ్రికి నమస్కరించి వెళ్ళేవాడు .ఒకరోజు అలా చేస్తుంటే తండ్రి వరద రాజుకు భావోద్రేకం తీవ్రమై ‘’నాయనా !రోజు ఎందుకురా నమస్కారం నాకు .మీ అమ్మకు నమస్కరించు అది చాలు ‘’అన్నాడు ‘’నాకు మీరిద్దరూ సమానమే నాన్నగారూ .భక్తీ ,ప్రీతి లలో తేడా చూపలేను ‘’‘’అని వెళ్ళాడు .కొడుకు వెళ్ళగానే భార్య మరకతః౦ తో ‘’పండంటి బిడ్డను కన్నావు దా౦పత్యం లో నాకు సహధర్మ చారిణివి గా పేరుపొందావు తమ్ముడికి సంతానం లేదు మన నరసింహ ను దత్తత చేసుకోవాలని అనుకొంటున్నాడు .వాడి కోర్కె తీర్చటం మన విధి .కొద్దికాలం లో శేషాద్రి ప్రఖ్యతుడౌతాడు .నాకు ఇహలోక యాత్ర చాలించటానికి సమయమైంది అని అమ్మవారు చెప్పారు .ఇవాళో రేపో నేను వెళ్ళిపోతాను .శేషాద్రి బాగా లబ్ధ పరతిష్టుడు అయ్యాక ఆ ఆనందం చూసి నువ్వు కైవల్యం పొందుతావు ‘’అన్నాడు వరదరాజు భార్య మరకతం తో . ఆమాటలు విని ఆమె మూర్చపోయింది .తేరుకున్నాక ‘’ధైర్యం కోల్పోకు. అన్నిటికీ ఈశ్వరుడినే నమ్ము .ఆయన ఇచ్చప్రకారమే అంతా జరుగుతుంది ‘’అని చెప్పి ఊరడించాడు .
మర్నాడు యధా ప్రకారం నియమప్రకారం కార్యక్రమాలు పూర్తీ చేసి భోజనం చేసి ఉపనిషత్తులు చదువుకొని ,ప్రదోష కాలం లో ఏకామ్రనాధుని దర్శించి ,ఇంటికి వచ్చి ఏమీ తీసుకోలేదు .కాసేపటికి అతిసార విరేచనం అయి అందరూ ఆయన అనుకోన్నట్లే అవుతుందేమో నని భయపడుతూ గుడ్ల నీరు కుక్కుకొని బొమ్మల్లా నిలబడ్డారు .దుఃఖిస్తున్న శేషాద్రిని దగ్గరకు పిల్చి’’నాయనా ! అతి సారం లో కొన ఊపిరి ఉన్నంతవరకు జ్ఞాపక శక్తి పోదు ..’’అతి సారేతు మరణం యోగినా మపి దుర్లభం ‘’ అన్నారు పెద్దలు .నా అదృష్టం కొద్దీ ఆ వ్యాధి నాకు వచ్చింది .ఇక మనసు తత్త్వం పై లగ్నం చేస్తాను .ఎన్ని శాస్త్రాలు చదివినా అనుభవ జ్ఞానానికి మించింది లేదు అని గుర్తుంచుకో .అన్నిజ్ఞానాలలో అదే గొప్ప ‘’అని బోధించి ధ్యానమగ్నుడై వరదరాజు దేహ త్యాగం చేశాడు .తండ్రి మరణం తో శేషాద్రికి దుఖం తోపాటు ,వైరాగ్యమూ కలిగింది ‘.
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -25-6-21-ఉయ్యూరు