అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -3
తండ్రి చనిపోగానే 14ఏళ్ళ మనవడు శేషాద్రిని కోడలు మరకతం ను తాతగారు కామకోటి శాస్త్రిగారు వాళూరుకు కు తీసుకు వెళ్ళారు .తాతగారి వద్ద ప్రస్థాన త్రయం పూర్తిచేశాడు .కామకోటి శాస్త్రి గారిపైఅపార కరుణ ఉండేది కామాక్షీ దేవి కి .వీరివద్ద ఎందరో మంత్రోప దేశం పొందారు .సర్ పిటి త్యాగరాజ చెట్టి గారి తండ్రి పొట్టి మహాదేవ చెట్టి శాస్త్రిగారి వద్ద మంత్రోప దేశం పొంది ,విశేష ధనం ఆర్జించారు.గురు దక్షిణగా నాలుగు వేల రూపాయలు ఇవ్వబోతే ,చిరునవ్వుతో వద్దని తీసుకోలేదు .అప్పటికి శాస్త్రిగారి వయసు 80.సర్ సిపి రామస్వామి అయ్యర్ మాతామహుడు శాస్త్రి గారిని భాగవత ప్రవచనం చేయమని కోరగా ,తన ఆరోగ్యం సరిగా లేదని మనవడు శేషాద్రిని పంపారు .తల్లితోపాటు వెళ్లి ఒక్క ఏడాది కాలం శేషాద్రి అక్కడ భాగవత ప్రవచనం చేసి అందరినీ ఆశ్చర్యం లో ముంచెత్తాడు .
శాస్త్రిగారి ఆరోగ్యం బాగా క్షీణించింది .మూడు నెలలు మంచం లోనే ఉన్నారు .తాతగారి ఆరోగ్యం కుడుబడగానే ,కంచికి వెళ్లి అక్కడ ఉపనిషద్ బ్రహ్మం అని పేరుపొందిన శ్రీ కృష్ణానంద స్వామిని ఆశ్రయించి శేషాద్రి తనకు సన్యాస దీక్ష ఇవ్వమని కోరాడు .దీక్ష ఇవ్వగా ఆయన వద్ద వేదాంత శ్రవణ౦ చేశారు శేషాద్రి స్వామి మాధుకర వృత్తి చేబట్ట లేదు తల్లే కొడుకులిద్దరికీ వండి పెట్టేది .మూడు నెలల తర్వాత దామల్ అనే గ్రామం లో అక్కడ బ్రహ్మానంద మహర్షి పేరు తో కామకోటిశాస్త్రి గారు విదేహ ముక్తి చెందారు .
మరకతం గారు చాలా ఉదాసీనంగా ఉండేవారు .ఎప్పుడూ మౌనమే ..మూడుపూటలాస్నానం ఎక్కువ కాలం ధ్యానం .ఏక భుక్తం .కొడుకు గుణాతిశయంపై అమిత ప్రేమ ఆమెకు..శేషాద్రికి 15వ ఈటా పెళ్లి చేయాలని అనుకొన్నది .రామల్ గ్రామం లో అతని మేనత్తకూతురు గుణవతి కాకిని ఉంది .ఆమెను కొడుక్కు చేసుకోవాలని తల్లి ఆరాటం వాళ్ళకూ ఇష్టమే .ఎవరినీ సంప్రదించకుండా ముహూర్తం పెట్టించమని అన్న రామ స్వామి జోష్యులతో సోదరి వెంకట లక్ష్మి చెప్పింది .ఆయన ‘’శేషాద్రి జీవితం లో పరివ్రాజక యోగం ఉంది సన్యాసి అవటం ఖాయం .ఆపై నీఇష్టం ‘’అన్నాడు .అన్నమాటలకు తెల్లబోయింది .విఫలమై ఇంటికి వచ్చింది .జపం చేస్తున్న మరకతం చెవిలో ఈమాటలు పడ్డాయి .రామస్వామి చెప్పింది తప్పకుండా జరుగుతుంది అని ఆమె విశ్వాసం ..పది రోజుల్లో కాకిని పెళ్లి జరిగిన వార్త తెలిసింది .విచారం పెరిగి ఏకభుక్తాన్ని వదిలి ఉపవాసం ఉండేది .చిక్కి శల్యమైంది .తమ్ముడు నరసింహ శాస్త్రి చనిపోయినట్లు కబురొచ్చింది .ఇవన్నీ కలిసి మరింతకు౦గి పోయి మంచమెక్కింది.నెలరోజులు సన్నిపాత జ్వరం తో బాధపడి౦ది. మందులూ మాకులు లేవు .కార్తీక శుక్ల దశమి నాడు కొడుకు శేషాద్రిని దగ్గరకు పిల్చి ‘’నాయనా ! నా పని అయిపొయింది .నన్ను వదిలి వెళ్ళకు ‘’అని హెచ్చరించి ,మర్నాడు ఏకా దశి నాడు కొడుకును పిలిచి ‘’సత్సంగత్వే నిస్సంగత్వం ‘’శ్లోకం మూడు సార్లు చదివి ‘’కాశ్యా౦తు మరణాన్ముక్తిహ్ స్మరణాదరుణాచలే’’అని మూడు సార్లు అని శేషాద్రి చాతీని మూడు సార్లు చరఛి చెప్పి ,అత డిని ‘’అంబ శివే ‘’కీర్తనపాడమని, పాడగా వింటూ తానూ పాడుతూ ‘’అరుణా చల అరుణా చలా అనుకొంటూ కొడుకుపై ఒరిగి ప్రాణాలు వదిలేసింది ..
తల్లిమరణాన్ని తట్టుకొని ధీరోదాత్తత తో తమ్ముడు నరసింహం తోకలిసి మాతృ యజ్ఞం పూర్తీ చేశాడు .రామస్వామి జోశ్యులు భార్య కల్యాణి ఈ సోదరులను జాగ్రత్తగా కనీ పెట్టుకొని ఉన్నారు .తనకున్న పిత్రార్జితం తో రామస్వామి ,స్వీయ ఆర్జనతో కుటుంబాన్ని ఏ లోటు రాకుండా పోషిస్తున్నాడు .శేషాద్రికి ఇంట్లో ఉండాలని పించలేదు. తన పూజా గృహం లో తానూ చిత్రించుకొన్న అరుణా చలేశ్వరుని చిత్రం ,కామాక్షీ దేవి శ్రీరామ పరివారం చిత్రాలు ఉంచి నిత్య పూజ చేసేవాడు .స్నానం చేసి పొద్దున్న 5గంటలకు కూర్చుంటే మధ్యాహ్నం పన్నెండుకు కానీ లేచేవాడు కాదు .వేళకు భోజనం చేసేవాడుకాడు .కొన్నిరోజులు పూర్తి ఉపవాసమే .తాతగారు ఉపదేశించిన షోడశాక్షరిని తీవ్రంగా జపించేవాడు .గట్టిగా అరుణాచలేశ్వరా ,శోణాద్రి నాధా అని పిలిచేవాడు .రాత్రిళ్ళు దుర్గాసూక్తం చదివే వాడు బ్రహ్మముహూర్తం లో నాలుగింటికే లేచి స్నానం చేసేవాడు .పినతండ్రి పినతల్లి ఆరోగ్యం కోసం సాధన తగ్గించుకోమని చెప్పినా వినే వాడు కాదు .ఇంట్లో కాక దేవాలయాలలో ఉంటూ ఉపవాసం చేసేవాడు .
పూర్వం బాగా ఇష్టంగా శాస్త్ర చర్చలు చేసే శేషాద్రి ఇప్పుడు వాటికి దూరం గా ఉన్నాడు .ఎప్పుడూ స్నానం .జపం ధ్యానం .చక్రత్తాల్వార్ సన్నిధిలోఎదురుగానో ఉత్తరముఖంగానో కూర్చుని జపం చేసేవాడు .మధ్యాహ్నం పన్నెండు దాటాక కామాక్షీ దేవి దర్శనం చేసేవాడు .అనేక సార్లు మూకపంచశతి పారాయణ చేసేవాడు.వూరి వారు అందరూ నిద్రపోయాక ఇంటికి బయల్దేరేవాడు .రాత్రి ఉపవాసమే ..కుంకుమ విభూతి నుదుట పులుముకోనేవాడు .సూర్యుని చూసి సాగిలపడే వాడు. తనలో తానూ మాట్లాడుకోనేవాడు .వీధిలో కన్యలు కనిపిస్తే సాగిలపడి నమస్కరించేవాడు .పెద్దల పాదాలకు వంగి నమస్కారం చేసేవాడు .’’ఇదేమిటి శేషాద్రీ’’?అని అడిగితె ‘’బ్రాహ్మణ పాదాలూ భగవంతుని పాదాలు ఒకటే ‘’అనేవాడు .
స్వామి ఊరేగింపుకు బయల్దేరి వస్తేదారిలో రాళ్ళు కాగితాలు ఏరి పారేసేవాడు గమ్యం లేకుండా పగలూ రాత్రీ ఒకటే తిరుగుడు .క్షురకర్మ లేదు. రాత్రి నిద్ర తక్కువ .ఎవరైనా ఏంచేస్తున్నావు శేషాద్రీ?’’అని అడిగితె ‘’కర్మనాశనం కోసం జపం చేస్తున్నాను .ఏం జపం అని అడిగితె ‘’అ౦భస్య పారే ‘’ అనే నారాయణ ఉపనిషత్ లోని దాన్ని జపం చేస్తున్నాను ‘’కామో కార్షీత్ మన్యు రకార షీత్-కామః కరోతి నాహం కరోమి ‘’ని లక్ష ఆవృతులు చేశాను ఇంకా యాభై వేలున్నాయి .కర్మ క్షయం కాకపొతే మోక్షం రాదు ‘’అనేవాడు .పిచ్చిముదిరిందని అందరూ తీర్మానించారు .
ఇంటిపోరు బయటిపోరు తీవ్రంకాగా ఏకాంత ప్రదేశాన్ని ఎన్నుకొని ,లేకపోతె శ్మశానాని కి వెళ్లి ఉపవాసం చేసేవాడు .ఉదయం సాయంత్రం ఇంట్లో జపం పూర్తిచేసి వేగవలె నదీ తీరం లోని స్మశానం చేరి ,మర్నాడు ఉదయం వరకు జపించి ఇంటికి వచ్చేవాడు .ఇలా చేస్తున్నట్లు పది రోజులదాకా ఎవరికీ తెలీదు .తెలిశాక ‘’అశుద్ధ ప్రదేశం లో జపం ఏమిటి ‘’అని అక్షేపిస్తే ‘’స్మశానం రుద్రభూమి .అక్కడ చేసే సాధనకు రుద్రుడు అనుకూలిస్తాడు .ఇతర చోట్ల వెయ్యి సార్లు చేస్తే ఎంతఫలితమో అక్కడ ఒక్క సారి చేస్తే అంతటి ఫలితం కలుగుతుంది ‘’అనేవాడు .
ఒకసారి శేషాద్రి బంధువులు అతడు ఇంట్లో ఒక గదిలో ఉండగా బయట తాళం పెట్టారు .ఇది బాగుందని తానూ లోపల గడియపెట్టి నాలుగు రోజులు ఏకాంతంగా హాయిగా ధ్యానం లో మునిగిపోయాడు .అయిదవ రోజు తలుపు తెరిచి చూస్తె అతనిలో అలౌకిక శక్తి ఏదో అందరికీ గోచరించింది .ఒక శనివారం ఇంటి వారంతా తలంటి పోసుకోగా ,శేషాద్రి ఉదయం 10గంటలకు శ్మశానం నుంచి తిరిగి వచ్చి బాబాయి తలంటి పోసుకోమంటే వద్దనగా .బాబాయి తలంటి బట్టలు ఉదకటం శేషాద్రి పని .ఆయనతో బాగా చనువుగా ఉండేవాడు .’’ఇవాళ మీ బాబాయి తలంటు కొరట’’అంది పిన్ని .కారణం ఏమిటి అని అడిగితె ‘’నువ్వు ఇలాతిరగటం ఇష్టం లేక ‘’అనగా ‘’నా మీద అలగటం ఎందుకు ?ఎవరి దారి వారిదిగా ఉ౦ టేకలహాలు ఉండవుకదా ‘’అన్నాడు .పినతంద్రిని పిలిచి తలంటి పోస్తూ తలపై నూనె పెట్టి బయటికి వెళ్లి ఆకాశం వైపు చూసి లోపలి రాగా ఆకాశం లో ఏముంది చూడటానికి అని అడిగితె దేవతలను అనగా .దేవతలేనా గంధర్వులు కూడా ఉన్నారా అనగా, ఉన్నారు .వాళ్ళు ఏరాగం ఆలపిస్తున్నారని అంటే బిలహరి అన్నాడు ‘’నీకు పిచ్చి బాగా ముదిరింది రా .వాళ్ళు నాకు కనబడరేం ‘’అంటే ‘’కర్మిష్టులకు కనిపించరు .స్వస్థలంగా ఉన్నవారికే దర్శనమిస్తారు ‘’అనగా ‘’నీ వెర్రి వేయి విధాలుగా ఉంద’’ని బాబాయి స్నానానికి లేచాడు .అతడిపిచ్చికి పెళ్లి తగినమందు అనుకొన్నారు ఇంటివారంతా .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-6-21-ఉయ్యూరు