అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -5
ఒక గుడ్డ మొలకు చుట్టి మరోదాన్ని ఉత్తరీయంగా వేసుకొనేవారు శేషాద్రిస్వామి .అవి మట్టికోట్టుకొని పోయి ఉండేవి .శుచి శుభ్రతలు లేవు .ఏదిదోరికితే అదే తిని చేతుల్ని బట్టలకు తుడుచుకోనేవారు .బిచ్చగాళ్ళకు తనబట్టలు ఇచ్చి వారివి తీసుకొని ధరించేవారు .దేహాభిమానమే లేని స్వామికి వస్త్రాభిమానం ఉంటుందా ?నడక జన్ఘాలునిలా అంటే అమితవేగా గామిగా ఉండేది.తేలిపోయినట్లు నడిచేవారు .నడుస్తుంటే శబ్దం రాదు .’’అనికేత శుచి ర్దక్ష’’ఆయన జీవితం .పది నిముషాలలో పది చోట్లు మారేవారు కనుక వెదికి పట్టుకోవటం చాలాకష్టం .పిర్రలు నేలపై ఆనకుండా ,మోకాళ్ళు ముడిచి ,మడమలపై ఆన్చి కూర్చునేవారు .దీన్నిస్వస్తికాసనం అంటారు .
మంద్ర మధుర భాషి స్వామి .పూర్వాపర సంబంధం ఉండదు.ఒక్కోసారి ఎన్ని అడిగినా జవాబు ఇవ్వరు ఒక్కోసారి రెండుమూడుమాటలే జవాబు.ఎవరినా పాడమంటే ‘’అంబ శివే ‘’అని మాత్రమె శ్రావ్యంగా పాడి ఆపేసేవారు ఇది తాత కామకోటి శాస్త్రి గారి పాట అని చెప్పేవారు .కూర్చున్న చోటనే మంచం మీద స్తంభం మీద తాళం వేసేవారు .ఎవరైనా వస్తే ఆపేసేవారు . అరక్షణం ఖాళీగా ఉ౦ డేవారుకాదు.తనకెదురుగా ఉన్న వస్తువు చేత్తో తీసుకొని మళ్ళీ అక్కడే పెట్టేవారు .మళ్ళీ తీసుకోవటం ,మళ్ళీ పెట్టటం .తూర్పుకు కూర్చుని ఒక్కసారిగా పడమటకు తిరిగేవారు .వెంటనే ఉత్తరానికి తిరిగి చేతులపై ముందుకు జరిగి ,అకస్మాతుగా లేచి ఆకాశం వైపు చూసేవారు .లేకపోతె స్తంభాన్నిపట్టుకొని లేచేవారు .చేతులు వెనక్కు కట్టుకొని ,ఇంకో స్తంభం దగ్గరకు వెళ్లి కిందా పైనాచూసేవారు .ఆకాశం చూస్తూ యాభై సార్లు తిరిగేవారు .అరచేతుల్ని కళ్ళకు అద్దుకోనేవారు .లేకపోతె హఠాత్తుగా పెద్ద గా అర గంట సేపు నవ్వేవారు .కారణం అడిగితె చెప్పేవారుకాదు .ఉడత వెంటా,పిల్లి వెంటా పరిగెత్తేవారు .బండీ కనిపిస్తే ఎక్కి కూర్చునేవారు .మున్సిపాలిటి చెత్తబండి వస్తే ,జట్కాబండి లోంచి దాన్లోకి మారి ‘’చూశారా కోచిబండీ ‘’అనేవారు .
హోటల్లు ,అంగళ్లు,పచారీ కొట్లలోకిదూరి సామాన్లు కిందపడేసేవారు.గల్లాపెట్టె తెరచి డబ్బు వెద జల్లెవారు .నాణాలు పేర్చి పిల్లల్లాగా ఆడేవారు .ఏమి చేసినా ఎవరూ స్వామిని ఒక్కమాట కూడా అనేవారుకాదు..స్వామికనపడితే చాలు అందరూ పాదాభి వందనం చేసేవారు .వచ్చినవారి బుద్ధులు మంచివికాకపోతే అక్కడినుంచి పారిపోయేవారు .వాళ్ళు బలవంతంగా వస్తే దుర్మార్గా పోపో అని చీదరించుకొనే వారు .మంచి వారితో మాట్లాడి ఆప్యాయంగా కౌగి లించుకోనేవారు .స్త్రీ పురుష భేదం లేదు స్వామికి .స్త్రీలమీద చేతులు వేసి తోసుకొంటూ నడిచేవారు .వారి ఒడిలో తలపెట్టుకొని పడుకొనేవారు .గబుక్కున లేచి నమస్కారం చేసి ‘’అమ్మా !నువ్వు మా అమ్మ కల్యాణిలా ఉన్నావు ‘’అనేవారు .ఆడవారందరికి స్వామి శిశువే .
మధ్యాహ్న సూర్యుని తదేకంగా రాత్రి చంద్రుని చూస్తూ మంత్రాలు చదివేవారు .వర్షం ఆయనకు బహు హర్షం .ఆగితే కానీ అరుగుమీదకు చేరేవారుకాదు.రోడ్లమీద నీళ్ళల్లో ఎగురుతూ గంతులేసేవారు .గుడ్డల్ని పిండుకోనేవారుకాడు .అలానే తడిబట్టలతో ఉండేవారు .అన్నిటికీ పరమ నిర్లిప్తులు .జరిగే ప్రతి పెళ్ళికీ హాజరై వధూవరులను తాకుతూ కూర్చుని నవ్వుతూ తెచ్చిన గంధమంతా పూసుకోనేవారు .దంపతులు పాదాలకు మొక్కితే ‘’నూరేళ్ళు నూరేళ్ళు ‘’అంటూ వెళ్ళిపోయేవారు .ఎవరింట్లో పీనుగ లేచినా అక్కడా స్వామి హాజరు .శవానికి ముందు వెళ్లి నమస్కరించేవారు.అశౌచం ఎంగిలి మైల ఏ కోశానా ఆయనకు లేనేలేవు. అదే అవధూత లక్షణం దత్తాత్రేయునిలా .
ఒక్కోసారి స్వామికి తలంటి పోసేవారు టన్నులకొద్దీ నూనె తెచ్చి రాసేవారు .మధ్యలో లేచిపోయేవారు .తైలమర్దనే తప్ప అభ్యంగనం ఉండేదికాదు .అ వేషం తో పది రోజులు తిరిగేవారు .ఊరిలోని దుమ్ము అంతా ఆయన శరీరానికి పూసిన నూనెకు అ౦టుకోనేదిదట్టంగా .రామయ్య అనే ఆయనకు స్వామిపై అమితభక్తి .పదేళ్లుగా పరిచయం .కానీ స్వామికి ఆయన నిత్యనూతనుడే .కనిపించిన ప్రతిసారీ ‘’మీరెవరు ఏవూరు ‘’అని అడిగేవారు స్వతంత్రించి పరిచయం చేసుకొంటే ‘’చీచీ ఫో ఫో’’ అని చీదరించుకోనేవారు .స్వామిని చూడకుండా క్షణం ఉండగలిగే వాడు కాదు .ఎవరిముఖమైనా ఒక సారి చూస్తె వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలన్నీ స్వామికి తెలిసిపోయేవి .ఒక్కో సారి పట్టించుకొనే వారు కాదు .కనుక ఆయన ముందుకు రావటానికి జనం భయపడేవారు .ఒక రోజు స్వామి వీధి అరుగుమీద కూర్చుంటే ,పోరుగూరిభక్తులు తిరువన్నా మలై వచ్చి స్వామిని చూడటానికి వస్తే ,అందులో ఒకడిని ‘’మహాపాపీ సొంతకోడలే నీకు భార్యా చీఫో ‘’అని ఉమ్మేశారు .వాడు గిర్రున తిరిగి వెళ్ళిపోయాడు .వాళ్లకు తర్వాత స్వామి చెప్పింది నిజమే అని తెలిసింది .
‘’యర్వత్రానభి స్నేహః ‘’అనే గీతా వాక్యం ప్రకారం అందర్నీ సమానం గా స్నేహంగా చూసేవారు .ఆకలిదప్పులకు అతీతులు స్వామి ఒక్కోసారి నెలరోజులు ఉపవాసం .మరొక్కప్పుడు నలుగురు తినే భోజనం తినేసేవారు .సదా ముఖం పై ఎ భావం లేకుండా తిరిగేవారు .ఎవరరైనా విస్తరేసి వడ్డిస్తే అంతాకలిపి ఒక ముద్దచేసి,కొన్ని పిడికిళ్ళు విస్తరికి అటూ ఇటూ చల్లి ,రెండుమూడు ముద్దలు నోట్లో వేసుకొనేవారు .లేకపోతె వడ్డన పూర్తీ అవగానే లేచిపోఎవారు .’’అన్నం అలా ఎందుకు చల్లుతారు అని అడిగితె ‘’యో భూతాఃప్రచర్తనిదివానక్తం బలిమిచ్చంతొ’’అంటే బలి వేయకపోతే రుద్రుడికి కోపం వస్తుంది అనే వారు .ఇది దేవతలకు బలి అనేవారు .ఒకసారి అరుణాచలయ్యరు ‘’దేవతలా నాకు కనిపించటం లేదే ‘’అనగా ‘’సరిగ్గా చూడు స్తంభం ప్రక్కనే నిలబడి ఉన్నారు ‘’అన్నారు .అన్నాన్ని రోగగ్రస్తుడు పధ్యం తిన్నట్లు అయిష్టంగా తినేవారు .కంబత్తి లయనారు గుడికి రోజూ రాత్రిళ్ళు వెళ్ళేవారు .అక్కడ పాలగ్లాసులతో చెంబులతో జనం సిద్ధంగా ఉండేవారు .బ్రతిమాలో బామాలో గ్లాసులు అందిస్తే కింద పోసేవారు ,లేదా పుక్కిలించి ఉమ్మేవారు పాలతోనే పళ్ళు తోముకోవటం,ముఖం కడుక్కొనే వారు .ఆయన చుట్టూ కుక్కలు మూగేవి .ఆపాలు ‘’శ్వాన’’ సంతర్పణ చేసేవారు స్వామి .పాలైనా పంచ భక్ష పరవాన్నాలైనా స్వామికి చాపల్యం లేదు .
రామనాధ పురం మాణిక్యస్వామి కి శేషాద్రి స్వామి అంటే అమితప్రేమ.రోజూ ఊర్లో భిక్షం యెత్తి స్వామికి భోజనం పెట్టేవాడు .స్వామి తిన్నాకే తినేవాడు స్వామికనపదకపోతే భిక్షాన్నాన్ని జాగ్రత్త చేసేవాడు .ఒకరోజు రాత్రి స్వామి గుడిలో కనిపిస్తే నాలుగునాల్లకిందటి భిక్షాన్నం పాత్రతో తెచ్చి ముందు పెట్టి మూత తీయగా భరించరానికంపు కొట్టింది .క్రిములు పో ర్లాడుతున్నాయి .ఎవ్వరూ దాన్ని తినరు తినలేరుకూడా .కనీస్వామి విస్తరిలో వడ్డించుకొని ,అక్కడివారు తినవద్దని ఎంత బ్రతిమాలినా వినక మాణిక్యాన్ని కూడా తినమన్నారు .మృష్టాన్నం తిన్నంత అనుభూతి చెందారు స్వాములిద్దరూ .
స్వామి నిద్ర జయించారు .అర్ధరాత్రి ఆసనం వేసి సమాధి స్థితి పొందుతారు .ఎవరైనా కునికిపాట్లు పడుతుంటే ‘’నిద్రపోకు యముడు పట్టుకు పోతాడు ‘’అనేవారు .స్వామి అనుగ్రహం తో లాభపడిన ఒకాయన కృతజ్ఞతగా పది వేలరూపాయలు సమర్పించాలని కంబట్టి లయనారు గుడిలో స్వామి ఉంటె వెళ్లి దూదిపరుపుకొని తెచ్చి ఇవ్వగా దాన్ని పడకకు కూర్చోటానికి భోజనానికీ వాడే వారు .అదీమురికి పట్టింది భక్తులు దానికీ నమస్కరించేవారు .ఈ శయ్యాగాధ1921నుంచి నాలుగేళ్ళు కొనసాగింది .
మధ్యాహ్నం సాదు సత్రం పెరటిలో స్వామి విశ్రాంతి .తట్టాబుట్టా చీపురు వగైరాలమధ్యే సేద తీరేవారు .చీమలుకుట్టినా శేషశయనస్వామిలాగా పడుకొనేవారు .ఎప్పుడూ కిటకిటలాడుతూ జనమే ఆయన చుట్టూ .విచిత్ర సంభాషణ చేస్తూ అడ్డ దిడ్డంగా పొంతన లేకుండా మాట్లాడి తప్పించుకొని వెళ్లి వెళ్లిపోయేవారు స్వామి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-6-21-ఉయ్యూరు