అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -6
భగవాన్ రమణ మహర్షి ,శేషాద్రిస్వామి సమకాలికులు .స్వామియే వీరిద్దరిలో పెద్ద .అపరోక్షానుభూతిలో ఇద్దరూ సమానులే .పరస్పర గౌరవభావాలున్నవారు .రమణులకు భక్తులు కొత్త సోఫా తెచ్చి సమర్పి౦చి కూర్చోమనికోరితే ‘’ఎదురుగా ఉన్నది సోఫా అనీ, అందులో కూచోవాలని నాకు తెలియదా దేహాన్ని మర్చిపోవటానికి నేను శేషాద్రి స్వామిని కాను’’ అన్నారట .రమణ భక్తురాలు లక్ష్మీ అమ్మాళ్ ,ఏపని చేసినా భగవాన్ పైనే ధ్యానం గా ఉండేది .శేషాద్రిస్వామిని చూడనే లేదు .ఒకరోజు స్వామి దర్శనానికి బయల్దేరితే ఆయన కనిపించలేదు .ఏడు రోజులకు కనిపించారు .ఆయనముందు నిలబడి రమణులనే ధ్యానించేది .అప్పుడుస్వామి ‘’అక్కడైనా ,ఇక్కడైనా రెండూ ఒక్కటేగా “”అన్నారట .ఆస్తికులైన సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ధ్యానం చేయాలనిపించి రమణులతో’’పూర్ణాది లేహ్యం సేవిస్తే ధ్యానసిద్ధి కలుగుతు౦దంటారు నిజమేనా ?’’అని అడిగితె ‘’అలాంటి ఆలోచన వద్దు ‘’అన్నారు .కానీ శాస్త్రి ఆ లేహ్యం తిన్నారు .విపరీత ఆలోచనలు బయల్దేరి తలతిరిగి తట్టుకోలేక రాత్రి తొమ్మిదింటికి గుడిలో ఉన్న శేషాద్రి స్వామి దగ్గరకు వెళ్లగా ‘’ఆ లేహ్యం తినవద్దని చెప్పానుగా .ఎందుకు తిన్నావ్ ‘’అనగా బొల్దుఆశ్చర్య పోయి స్వామి రమణులు అభేద్యులు అని గ్రహించారు .
‘’నాయనగారు’’ అంటూ రమణ మహర్షి గౌరవించేసుబ్రహ్మణ్య స్వామి అంశ అయిన కావ్య కంఠ గణపతి మహా కవి భగవాన్ శిష్యులు .బాల్యం లోనే పంచాక్షరి తారా మంత్రం ఉపదేశం పొందినవారు. నవ ద్వీప పండిత సభలో ‘’కావ్య క౦ఠ ‘’బిరుదు పొందిన విద్వత్ వరేణ్యు లాయన .ఆయన ఆసభలో ‘’గణపతిరితి కవికులపతి రతి దక్షో దాక్షిణాత్యోహం ‘’ అని సగర్వంగా తన్ను ప్రకటించుకొన్నారు .లక్షలకొద్దీ జపం చేసినవారు .1903లో తిరువన్నామలై వచ్చి రమణుల శిష్యులై,ఆయన ఉపదేశాలను ఛందో బద్ధం చేసి ‘’రమణ గీత ‘’అనే 18అధ్యాయాల పుస్తకంగా వ్రాశారు .గణపతిమునికి భగవాన్ కులదైవం,శేషాద్రి స్వామి ఇష్టదైవం .తరచుగాస్వామిని గూర్చి మాట్లాడేవారు .పోరుగూరివారొచ్చి స్వామిని చూడాలంటే ‘’ఆపిచ్చి వాడిని చూడాలా ‘’అనేవారు .వాళ్ళు స్వామిని సమర్ధిస్తూ మాట్లాడితే వారి భక్తికి మెచ్చి సమాధానమిచ్చేవారు .’’కుండలినీప్రసాద లబ్ధ దివ్య శక్తి ‘’స్వామికి ఉంది అని చెప్పేవారాయన .
ఒకసారి శాస్త్రిగారు శక్తి తత్త్వం పై పది రోజులు ప్రసంగిస్తే ,విన్నవారు చివరి రోజున ఆయన కుమారుడు మహాదేవుని పెళ్ళికి యాభై రూపాయలు వసూలుచేశారు . .అకస్మాత్తుగా స్వామి అక్కడికి రాగా దాన్ని స్వామి చేతిలో పెట్టిమీకు నచ్చినవారికిమ్మన్నారు .వెంటనే గణపతి ముని చేతిలోఆపైకం పెట్టి కాళిదాస శ్లోకం ‘’వాగర్ధా వివ సంపృక్తౌ ‘’చదివి స్వామి మహాదేవుని కల్యాణం సూచ్యార్ధ సూచకంగా తెలియజేశారు .
గణపతి ముని ,రామ శాస్త్రులు కలిసి ‘’రమణ సమితి ‘’స్థాపించి భగవాన్ కు చెప్పాలని వెళ్ళారు. దారిలో స్వామి కనిపించి ‘’సంఘం స్థాపిస్తున్నారా ?మంచిపనే ‘’అన్నారట ,అవాక్కయ్యారు ఈ ఇద్దరూ ..కొట్లన్నీ స్వామి రాకకోసం తెరిచే ఉంచుతారు .కాలు పెడితే ఆ రోజు వారికి కనక వర్షమే .ప్రతి దుకాణం లోనూ స్వామి ఫోటో ఉంటుంది .దానికి హారతి ఇవ్వనిది వ్యాపారం మొదలు పెట్టేవారుకాదు దుకాణ దారులు .పిలవక పోయినా ముత్యాల చెట్టి అంగడికి స్వామి వెళ్ళేవారు .కాలణా(అణాలో నాలుగో వంతు ) కర్పూరం అడిగితె కాలురూపాయి(పావు రూపాయ ) కర్పూరం పెట్టేవాడు చెట్టి .అదతా అరుణాచల సన్నిధికే చేరేది .అంత ఉదారుడు .చెట్టికోట్టుకొచ్చి స్వామి గల్లాపెట్టె తీసి నాణాలు కింద కుమ్మరించినా అతడు కిమిన్నాస్తిగా ఉండేవాడు .స్వామి అనుగ్రహం తో కొన్ని లక్షలకు అధిపతి అయ్యాడు .ఒకసారిస్వామి ఈ కొట్లోకి వచ్చినిండు నేతిడబ్బాను బయటికి తీసుకొని వెళ్లి కుమ్మరించేశారు .అనుకోకుండా ఆశలు వదులుకొన్న బండబాకీ డబ్బు 7 వందలు వచ్చాయి ఆనాడు .మరోసారి చెట్టి బట్టల దుకాణం నుంచి ఖరీదైన పట్టుబట్ట తీసుకొని వెళ్లి ,ముక్కలుముక్కలుగా చించి ఎచ్చమ్మగారి గేదె కొమ్ములకూ, కాళ్ళకూ కట్టారు .ఆరోజు చేట్టిగారికి రెండువేలరూపాయలు లాభం వచ్చింది .
ఒక మామిడి పళ్ళవ్యాపారి అమ్మకానికి మామిడిపళ్ళు నాలుగు పెడితే స్వామి అటుగా వచ్చి ఒకదాన్ని తీసుకోగా యజమానిలేడు.నౌకరు స్వామిచేతిలోపండులాగేసి బుట్టలో పడేశాడు .చుట్టుపక్కలవారు వద్దని చెప్పినా వాడు వినలేదు. మర్నాటి నుంచి ఆ పళ్ళకోట్లో లో ఒక్కపండు కూడా అమ్మకం జరిగేదికాదు .బండి తోలే మురుగన్ తల్లి ఉన్నామలై.అతడు వీధి అరుగుపై నిద్రిస్తుండగాస్వామి వారిట్లోకి వెళ్లగా అతని తల్లి ఆహ్వానించింది .గంజి ఉందా అని అడిగితె వెంటనే ఒక లోటా గంజి తెచ్చి స్వామి ముందుంచి కొడుకును నిద్రలేపింది .వాడు నిద్రపోయాను క్షమించు స్వామీ అన్నాడు .వాడిని ‘’బందడీతోలుతున్నావా ‘’అని అడిగితె ‘’గిరాకీ లేదుస్వామీ ‘’అంటే ‘’బండీ ఎద్దూ అమ్మేసేయ్యి ‘’అని వెళ్ళిపోయారు .మర్నాడు అతని ధనవంతుడైన చెన్నై బంధువు తనకూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అనే కబురుపంపాడు .పెళ్లి చేసుకొని బండీ ఎద్దూ అమ్మేసి చింతాద్రి పేటలో మామగారింట తల్లితొబాటుఇల్లరికపు టల్లుడుగా స్థిరపడ్డాడు .
మంగలి చొక్క లింగానికి స్వామిని చూసిన రోజు కాసుల పంట. అతడే స్వామికి క్షవరం చేస్తాడు .ఒకపక్క మీసం తీసేయ్యగానే చటాలన స్వామి లేచి వెళ్ళిపోయి అలాగే తిరిగేవారు .స్వామి క్షవరానికి డబ్బులు కుప్పుస్వామిలేక చిన్న గురుకులు ఇచ్చేవారు .ఒకరోజు స్వామి క్షవరం చేయమని చొక్క లింగాన్ని పిలిస్తే కుదురుగా కూచుని క్షవరం అయ్యేదాకా కూర్చు౦టేనే చేస్తాననగా అలాగే వపనం చేయిన్చుకొన్నారు .కానీ చొక్క లింగానికి ఆ రోజు ఎవరూ డబ్బు ఇవ్వలేదు .సాయంత్రం ఉసూరుమని ఇంటికి వెడుతుంటే అతడికి అయిదు రూపాయల నోటు దొరికింది .దేవ దాసీ అలిమేలు స్వామి ఇప్పచేట్టుకింద కూర్చునిఉండగా నమస్కరిస్తే,తనము౦దు పడిఉన్న ఎండిన చేమంతి పువ్వు ను ఆమెతలపై వాసన చూసి వేశారు .ఆవారం లో ఆమెకు ఒక షావుకారు వలన అధిక ధనం వచ్చిపడింది .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -1-7-21-ఉయ్యూరు