నా ప్రియ శిష్యుడు ,విద్యా వినయ సంస్కారి ,సరసభారతి ఉపాధ్యక్షుడు డా .గుంటక వేణు గోపాలరెడ్డి మరణం
ఇవాళ జులై 5 సోమవారం ఉదయం అన్నవరం లో స్వామి దర్శనం చేసుకొనిమా అబ్బాయి రమణ నాకు ఫోన్ చేసి వేణుగోపాలరెడ్డి చనిపోయినట్లు తనకు సదాశివ ఫోన్ చేసి చెప్పినట్లు చెప్పగా కొంత విచలితుడనయ్యాను.వెంటనే శివలక్ష్మికి మెసేజ్ పెట్టగా ఆమె ఫోన్లద్వారా తెలుసుకొని ఇవాళ ఉదయ౦ 5-30కు వేణు గోపాల్ పెదవోగిరాల స్వగృహం లో దాదాపు ఇరవై రోజులు కరోనాతో పోరాడి అలసి సొలసి జయించలేక చనిపోయినట్లు మెసేజ్ పెట్టి మళ్ళీ కన్ఫర్మ్ చేసి౦దికూడా .అప్పటికే రెండు సార్లు వేణు నంబర్ కు ఫోన్ చేసినా ,ఎవరూ లిఫ్ట్ చేయలేదు .అజాత శత్రువు, చెరగని చిరునవ్వే ఆభరణంగా ఉండే వేణు కరోనా కర్కశ కోరలకు బలి అవటం దారుణం ..
రెడ్డీ అనీ వేణు అనీ వేణుగోపాల్ అనీ నేను అతడిని ఆప్యాయంగా పిలిచేవాడిని అతడు ‘’మాస్టారూ ‘’అని అత్యంత వినయంగా పలికేవాడు ఈబంధం ఏనాటి నుంచి ?అని ఒకసారి ఫ్లాష్ బాక్ లోకి వెడితే –నేను ఉయ్యూరు హైస్కూల్ లో సైన్స్ మాస్టర్ గా పని చేస్తున్నరోజులవి . సంవత్సరం గుర్తులేదు కానీ నైంత్ క్లాస్ ఎ సెక్షన్ క్లాస్ టీచర్ గా ఉన్నాను ఇంగ్లీష్ లెక్కలు చెప్పేవాడిని .మిగిలిన హయ్యర్ క్లాసులకు సైన్స్ అదీ ఫిజికల్ సైన్స్ చెప్పేవాడినని జ్ఞాపకం .ఒకరోజు పోట్టిలాగు ఇన్ షర్ట్ వేసుకొని బెల్ట్ పెట్టుకొని ఒక పోట్టి నల్లని కుర్రాడిని వెంటబెట్టుకొని ,తెల్ల మల్లుపంచే తెల్ల అర చేతుల చొక్కాపైన ఉత్తరీయం తో , మంచి మీసకట్టుతో సైకిల్ మీద ఒకాయన తీసుకొచ్చి ఆ కుర్రాడి తండ్రినని నాకు పరిచయం చేసుకొన్నాడు .బగా ఒత్తుగా నున్నగా దువ్విన జుట్టు ,చిరునవ్వు ,చిరునవ్వు స్వంతం అయియన్ ఆకుర్రాడు మొదటి చూపుతోనే నామనసు గెలిచేశాడు.బాగా చదివి మంచిమార్కులు తెచ్చుకొని చాలా హుందాగా ఉండేవాడు .బెస్ట్ స్టూడెంట్ అనిపించాడు. .వాళ్ళనాన్న నెలకో సారి స్కూలుకు వచ్చి కుర్రాడి చదువు విశేషాలు నన్ను అడిగి తెలుసుకోనేవాడు .ఇదే జ్ఞాపకం ఆతర్వాత నేను అనేక స్కూళ్ళు మారటం ,అతడి గురించి మర్చేపోయాను .
2009లో సరసభారతి స్థాపించినప్పుడు ,ప్రతినెలా కార్యక్రమాలు చేస్తూ ,కరపత్రాలు ఎక్కడ వేయించాలా అనుకొంటుంటే ,మా బజారులోనే వాటర్ టాంక్ కు ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో ఒక జిరాక్స్ మెషిన్ డిటిపి చేసే ఒకరిద్దరు అమ్మాయిలూ ,దాన్ని మేనేజ్ చేసే ఒక పాంటు ఇన్ షర్ట్ వేసుకొన్న ఒక కుర్రాడి ఆఫీస్ కనిపించి లోపలి వెడితే ఆకుర్రాడు ‘’మాస్టారు నేను వేణు గోపాలరెడ్డిని హైస్కూల్ లో మీశిష్యుడిని ‘’అని పరిచయం చేసుకొన్నాడు .అప్పుడు పాతవన్నీ గుర్తుకొచ్చాయి. తెలుగు ఎం ఎ చేసి కొంతకాలం ఫ్లోరా స్కూల్ లో కొంతకాలం కాలేజిలో లెక్చరర్ గా పని చేసి అవేమీ అనుకూలించక ఈ దుకాణం పెట్టినట్లు చెప్పాడు .పామ్ఫ్లేట్స్ పావుఠావులో సగం ముక్కల్లో డిటిపి చేయించి అతనివద్దె జిరాక్స్ తీయించి 200కాపీలు యాభై రూపాయలకు వేయిన్చేవాడిని .మొదటి సారి కార్యవర్గం వేసినప్పుడు అతడిని ఉపాధ్యక్షుడిగా ఉండమని కోరితే ‘’మీకంటే చిన్నవాడిని .నాకు ఎందుకు మాస్టారూ ‘’అన్న వినయం అతడిది .సరసభారతి పుస్తకాలు రెండో మూడో అతనిదగ్గరే డిటిపి చేయించి బెజవాడలో ప్రింట్ చేయి౦చాను .నాకు ఎక్కడైనా తప్పులు కనిపించకపోతే అతడే భూతద్దం లోచూసినట్లు చూసి తప్పులు పట్టేసి తప్పులు లేకుండా ముద్రణకు గొప్ప సాయం చేసేవాడు. అతడు చూస్తె నేను మళ్ళీ చూసేవాడిని కాను .అతనికి తెలిసిన సాహితీ మిత్రుల్ని గుంటూరునుంచి ఆహ్వానించి ఉపన్యాసాలు ఇప్పించాము. సినీ గేయ రచయిత శ్రీ వనమాలీ ఇతనికి క్లాస్ మేట్ అని అయన్ను తీసుకు వద్దామని అనేవాడు కానీ కుదరలేదు .సరసభారతిసమావేశాలన్నిటికీ హాజరయ్యేవాడు వేదికపై అతిధులను పరిచయం చేసే బాధ్యత అతని అప్పగిస్తే, చాలా సంతృప్తిగా నిర్వహించేవాడు .ఒక సారి సరసభారతి పురస్కారమూ అందించి సత్కరించాము .మరో సారి మేము అమెరికాలో ఉండగా రోటరీ క్లబ్ వారితో కలిసి చేసే తెలుగు భాషా దినోత్సవ౦ లో ఎవరికీ పురస్కారాలివ్వాలని మా అబ్బాయి రమణ మెయిల్ పెడితే వేణుకు,సారదిగారికి అని చెబితే అలానే చేశారు .సుమారు మూడు నాలుగేళ్లనాడు అమరవాణి స్కూల్ లో బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గారి గురు పూజోత్సవం నాడు కవిసామ్రాట్ శ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మ అనే 92 ఏళ్ళ గుంటూరు జిల్లా కవిపండితుడు బహు గ్రంధకర్త కు సన్మానం చేస్తే ,ఆరోజు ఉపాధ్యాయ దినోత్సవానికి వేణు గోపాల రెడ్డిని కూడా సత్కరి౦ చాము అమరవాణివారు శర్మగారికి పూలకిరీటం చేయించి పెడితే ,రెడ్డి మా దంపతులకు పుష్ప కిరీటం చేయించి శాలువాకప్పి సన్మానం చేసి గురు భక్తీ చూపాడు .
కృష్ణాజిల్లా రచయితల సంఘం నిర్వహించిన జాతీయ ,అంతర్జాతీయ తెలుగు రచయితల సభకు తప్పక రుసుము సరసభారతి ద్వారాతనకూ వనమాలిగారికీ ,మిత్రులకు చెల్లించి అందరితోపాటు వచ్చేవాడు .సరసభారతి ఎజి అండ్ ఎస్ జి కాలేజిలో నిర్వహించే కార్యక్రమాలకు అతిని చెవిన వేస్తె చాలు ప్రిన్సిపాల్ స్టాఫ్ మొదలైన వారితో మాట్లాడి అన్నీ దగ్గరుండి చూసి విజయవంతం చేసేవాడు
అయిదా రేళ్ళక్రితం అపర అన్నపూర్ణ శ్రీ మతి డొక్కా సీతమ్మగారిపై మా శ్రీ సువర్చలా౦జ నేయ స్వామి దేవాలయం లో రెండు సభలు జరిపి ,అమెరికాలో ఉన్న ఆమె గారి మునిమనవడు గారబ్బాయి శ్రీ డొక్కా రాం గారు నెట్ ద్వారా తెలుసుకొని పది వేలరూపాయలు పంపిస్తే నాలుగు హైస్కూళ్లలో ఆమెపై వ్యాసరచన పోతీలునిర్వహించి ఆడబ్బును విజేతలకు పంచిపెట్టాం ఈ సభకు హైదరాబాద్ నుంచి రాం గారి తలి దండ్రులు కూడా వచ్చారు .ఆరోజు ముందురోజు జోరున వర్షాలు అయినా సభ జరిపాం .ఆరోజు వేణు తో ‘’పానుగంటి ‘’వారిపై మాట్లాడమంటే అద్భుత ప్రసంగం చేసి నాకే ఆశ్చర్యం కలిగించాడు .అతడు పానుగంటి వారిపై పిహెచ్ డి చేశాడుకూడా .
వాళ్ళ స్వగ్రామం పేద వోగిరాల అభి వృద్ధిలో అతని పాత్ర గొప్పది. ఆగ్రామానికి చెందిన వివిధ రంగాలలో ఎక్కడెక్కడో స్థిరపడినవారిని గ్రామానికి తీసుకువచ్చి సత్కరించిన చిరస్మరణీయమైన కార్యక్రమ లో రెడ్డి, శ్రీ సుబ్బారెడ్డి మొదలైనవారి పాత్ర మరువలేనిది .అప్పుడు వచ్చిన ఒక జిల్లాజడ్జి రెడ్డిగారితో నాకు పరిచయమై చాలా సార్లు ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకోన్నాం .రెడ్డి తనకూతురు ఉన్నతవిద్యకోసం బెజవాడలో కాపురం పెట్టి మూడేళ్ళు ఉండి ,మళ్ళీ స్వగ్రామానికి వచ్చేసి ఇల్లు రిపేర్ చెయి౦చు కొనిఅక్కడే ఉండి ఉయ్యూరు జూనియర్ కాలేజీ లో తెలుగు లెక్చరర్ గా పనిచేస్తున్నాడు .కారుకొన్నాడు దానిమీదే బెఅవాడ వెళ్ళిరావటం .ఇప్పటిదాకా కాలేజికి దానిమేదే వచ్చేవాడు .శ్రీ కాకుళంలో కృష్ణ దేవరాయల మహోత్సవాలకు కృష్ణా జిల్లా రచయితల సంఘం ఉత్సవాలు జరిపితే నన్నూ మిగిలినవారినీ కారులో తీసుకు వెళ్లి తీసుకోచ్చేవాడు .
గురుపూజోత్సవం నాడు టెన్త్ పాసైన పేద ప్రజ్ఞావంతులైన బాలబాలికలఎంపిక లో ఇంటర్ డిగ్రీ చదివే విద్యార్ధుల ఎంపిక విషయం లో సరసభారతికి బాగా సహకరించేవాడు .అతడు లిస్టు పంపాడు అంటే బహు నిర్దుష్టంగా ఉండేది అనుమానం లేకుండా ఆమోది౯ చేవాడిని .వేణు భార్య చాలా అణకువకలది భక్తురాలు .మా శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయానికి తరచూ పిల్ల, పిల్లాడితో వచ్చేది. నన్ను వాళ్లకు చూపించి ‘’నాన్నగారి గురువు గారు ‘’అని పరిచయం చేసేది .తానూ చేసి వారితో పాదాభి వందనం చేయి౦చేదోడ్డ ఇల్లాలు.రెడ్డీ అని ఫోన్ చేస్తే చాలు వెంటనే పలికి మాట్లాడేవాడు. లేకపోతె భార్య తాను చేయిస్తానని చెప్పేది .ఇంతటి మర్యాద మన్ననా ఉన్న వివేకశీలి చి. వేణు గోపాలరెడ్డి మరణించటం బాదాకరం .అతని ఆత్మకు శాంతి , ఉన్నత గతులు కలగాలని భగవంతుని ప్రార్ధిస్తూ .అతని కుటుంబానికి సాను భూతి తెలియజేస్తున్నాను .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-7-21 –ఉయ్యూరు
వేణు నాకు కూడా చాలా మం చి మిత్రులు. నా హృద య పూ ర్వక సం తాపం వ్యక్తం
చేస్తున్నాను. విజ యసార థి పె దప్రోలు.