ఎమ్మెలాడి’’తో మళ్ళీ పుట్టినట్లనిపించే కృష్ణశాస్త్రి –కాశి రాజుకవి

ఎమ్మెలాడి’’తో మళ్ళీ పుట్టినట్లనిపించే కృష్ణశాస్త్రి –కాశి రాజుకవి

మరుగునపడిన మధురపదం’’ఎమ్మెలాడి’’కి మళ్ళీ ప్రాణం పోసి ,ఆమెనే తన  ఊహా ప్రేయసిగా భావించి అమలిన శృంగారాన్ని అద్భుతంగా చిలికించి ,భావకవిత్వ ప్రాభవాన్ని మరలా  చిగురి౦పజేసే కావ్య౦’’ ఎమ్మెలాడి’’రాసి కృష్ణశాస్త్రిగారు మళ్ళీ పుట్టారా అన్నంత అద్భుత రచన చేశారు వస్తుతం లెక్కల మేస్టారైన  శ్రీ  కాశీరాజు లక్ష్మీ నారాయణ కవి .ఇప్పటికే కాఫీ శతకం ,భవానీ శతకం ,   వెంకటేశ్వర శతకం ,,ముకుందమాల పద్యానునువాదం రాసి కలానికి పదును పెట్టిన ఈకవి తన బృందం’’ భద్రగిరి-ధ్రువ కోకిల ‘’బృందం వారి వలలో పడి భావసు౦దరి  ఎమ్మెలాడిని సృష్టించుకొని ,శక్తి ధారపోసి  రాశారు .ఎక్కడా సభ్యతా మర్యాదలు దాటకుండా .కృష్ణశాస్త్రి గారు తన ఊహా ప్రేయసికి ‘’ఊర్వశి’’నండూరి వారు ‘’ఎంకి’’ పేర్లు పెట్టుకొని ప్రణయ సామ్రాజ్యాన్ని ఏలేశారు .ఈకవి పేరు పెట్టకుండా తన ఊహా  సుందరి ’ఎమ్మెలాడి బాహ్య అంతస్సౌ౦దర్యారాధన చేసి పులకించిపోయారు .ఆరసవాహినిలో మనల్నీ ముంచేశారు .కృష్ణశాస్త్రి గారు మరణిస్తే శ్రీశ్రీ ‘’షెల్లీ మళ్ళీ మరణించాడు ‘’అన్నాడు .నేను ఈ కవి ఈకావ్యం చూసి కృష్ణ శాస్త్రిగారు మళ్ళీ పుట్టారన్నాను.చక్కని తెలుగు ఛందస్సులో చివరమాత్రం వృత్తాలతో 336పద్యాలతో 6 శీర్షికలతో ఈకావ్యం అల్లారు భావకవిరాజు కాశిరాజు . ఈ కవితో నాకు అస్సలు పరిచయం లేదుకానీ ,ఆయన ముద్రించిన ప్రతిపుస్తకం నాకుపంపటం దానిపై నెట్ లో నాకు తోచినమాటలు రాయటం జరుగుతోంది .ఈపుస్తకం మార్చిలో విడుదలైంది బహుశా నాకు ఏప్రిల్ మే లలో పంపి ఉంటారు ఆవన్నెలాడి ఎందుదాగిందో కాని, నిన్ననే నా కంట బడింది .వదుల్తానా ?ఆబగా ఆమె సౌందర్యాన్ని  లావణ్యాన్నీ తళుకు బెళుకులను ,కటారు మిటారులను నిన్న సాయంత్రం పావుగంటలో జుర్రేశాను .ఆమెపై ఎలా ఏం రాయాలో ఆలోచించాను . శీర్షిక దొరక్కపోతే నా ‘’ఎలుక ‘’పరిగెత్తలేదు .ఇప్పుడే చిక్కింది .ఇక విజ్రు౦భిస్తున్నాను .మీరూ ఆస్వాదించండి .అన్నట్లు వ.పా.గారి బొమ్మేమో అనిపించే’’ కూచి’’ వారి కుంచె బొమ్మ ముఖ చిత్రం ’ఎమ్మెలాడి’’ సౌందర్యాన్ని మరింత ఇనుమడి౦పజేస్తే ,స్కాలిత్యం లేని ముద్రణ ఇంకొంచెం వన్నె తెచ్చింది .అరుదైన పదాలు కూడా అలవోకగా ప్రయోగించటమే,మనం బుర్ర గోక్కుండా అర్ధాలు కూడా అందజేశారు . కాక  మరో విషయం ’ఎమ్మెలాడి’’ వెలకూడా బహుతక్కువే అరవై రూపాయలే .కనుక అందరూ’’ స్వంతం ‘’ చేసుకోవచ్చు .

  ప్రభావం తో ప్రారంభించి ,ప్రన్ననం తో రెండోమెట్టు ఎక్కారు .’’భద్రగిరి ధ్రువకోకిల –భద్రక్ష్మా జాశ్రయ కవి పరభ్రుతములకున్  -రౌద్రారి శరః ప్రేరిత- క్షౌద్రము నందించ పనిచె కవితలు వ్రాయన్ ‘’తేనే అనటానికి క్షౌద్రం అనే మాట ఉందని   మనకు తెలీదు .’’రేత్రమ్మగు భావ సుందరి తలిర్చింది ‘’మదిలో .ఇక్కడ కూడారేత్రం అంటే అమృతం .కనిపించిన భావసుందరి –‘’పంచదార చిలుక ,పాలమీదితరగ-పుట్ట తేనే ఎడదపట్టు దేనె –నేరి జారిపడ్డ నింగి త్రోవరి బువ్వ-ఇంతి పూల బంతియే మ్మెలాడి’’ఆమె భ్రుకుటి బాపు బొమ్మలా ,ఇసుకవాలులో హీరా (పాము )నాట్యంలా శ్రోణిపై నటించు వేణితో ,నల్లత్రాచు పైపైకి పాకే శిరము నెక్కినట్లు  ,పడగమీద పూల బన్న సరంతో ,పుడమిలో ఎక్కడా లేని ముగ్ధ మోహన రూపం తో ,మల్లె కాయమానము అంటే మల్లెపందిరికి అల్లుకొన్న పూతీగగా ఉంది .కన్జరం లేదుకాని కన్జం(పొట్ట ) మాత్రం ఉంది  విరులసొగసు చూసి వి౦త కోరికపుట్టి –పలువిధ కుసుమాల కలిపి నూరి ముద్దగా నలువ చేసిన అ౦గన .తియ్యమాను అంటే చెరుకు దెబ్బ తీర్చింది నుడివిల్లునప్పెఅలరు తూపు నాసికము గా .విల్లునెక్కు బెట్టగావిరితెనేతో –ఇక్షురసం కారి ఆమె పెదవి రహి వహించింది  ఆమె లేత చెక్కిళ్ళు బంతులు –తాకితెఅవి తుమ్మపూలె అంటే ముడుచుకుపోతాయి .సిగ్గు మొగ్గలైన నుగ్గుల బుగ్గలామెవి .ఆమెను చూసి కవి మనసు సుడులు తిరిగింది .ఇలా ఆమె మనసులో కనిపించి కోర్కెలు రేపింది .

 ఆమె’’ ప్రాభవం’’ పై ఒక శీర్షికే పెట్టి రాశాడు కవి .  అడుగుల సవ్వడికి నేల నాట్య వేదిక  అవుతుంది .’’గ్రుడ్డుకాన్పులు’’ అంటే పక్షి సముదాయాలు గొంతులు సవరిస్తే ,భుజగభోగి అయిన నెమలి హృదయం పరవశించి నాట్యం చేస్తుంది .ఆమె క్రీగంట చూస్తె బ్రహ్మకైనా పుడుతుంది రిమ్మ తెగులు –కాపురాలలో కలతలు రేగుతాయి .తెల్లటిముగ్గుమీద నల్లటి గొబ్బెమ్మలా కళ్ళల్లో నీలి గుళ్ళు ఆమె చూపు మంచుపలకమీద అర్కుని కిరణాలుపడి ప్రతిఫలించినట్లు గా ఉంటుంది .

  ‘’ఊర్పు పాటపాడి ఉర్రూత లూగింప –కంటి రెప్ప దరువు కలిసిరాగ –గాలి కెదుటికురులు గరువు (చెంప )పై నర్తించ – కమిలి కెంపు లమరె గండములకు (చెక్కిళ్ళకు )  .ఇదీ ఆమె సోయగ ప్రాభవం .మొగలిపొదను చుట్టి పరవశించిన ‘’పుట్టపురుగు ‘’అంటే నాగుపాము వదిలిపెట్టలేక –బ్రహ్మవరం పొంది దళపుష్ప వేణియై-బుసలుకొట్టి ఎలమినెసగ ద్రోచిందట .బంధుకమ్ము (తెల్లజిల్లెడు)పై వజ్రపు పొడి లాగా ,కైరవం (తెల్లకలువ )పై రక్త కందచాయ ,పైడిబొమ్మమీద భాస్కర ప్రియ(కెంపు )చాయ లను మించే ఆమె దేహ ఛాయ.’’రజని’’గారి సూర్య స్తుతిలోని భావ విన్యాసమంతా ఇక్కడ ప్రత్యక్షం చేశాడుకవి.ఇన్ని ఆకర్షణలు పుష్కలంగా ఉన్నా ఆమె కు ‘’చెడు తలంపు లేశమైన లేదు ‘’కానీ భీత చిత్తమాత్రం కాదు .ఆమె ‘’సీతమ్మకోరిన పైడి లేడిని మించే పైడి లేడి ‘’అనిఅర్ధం చేసుకొన్నాడు మనభావకవి కాశీరాజు .ఆమె సోయగం ఎలాంటిది అంటే –‘’నేలక్రున్గిపోవు ,నిప్పు నివురుగప్పు –గాలి ఆకసములు కలుషితాలు –నీరు ఆవిరౌతుంది –‘’నిజముగా చెడనిది ‘’ఎమ్మెలాడిసోయగమ్మొకండే’’అని ఢ౦కాబజాయించి సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు .

  తరువాత శీర్షిక ‘’ప్రణయం ‘’వంద పద్యాలతో సుదీర్ఘం గా సాగింది .కవికి ఒంటరిజీవితం సొంటికొమ్ము అనిపించి ,కారమెక్కువై ,మమకారం లేకపోవటం తో ‘’నిజము తెలిసి నంత నీరజాక్షి యెడల-మనసు కలిగె,కలగ మనసుకలిగె’’.తలుపు దాల్పుడు అంటే బ్రహ్మచారి అయిన తనకుఆమెను చూడగానే  బ్రహ్మ చర్యం వదలాలనిపించగా –మంచుకాలం  మండు వేసవి అయింది.తపసుడు అంటే చంద్రుడు తపనుడయ్యాడు(సూర్యుడు ) .ఆమెసొగసును ఎంతతాగినా –గుండె నిండకుండే గుండె కుండ ‘’.పైకి కనుపించని ఆమె రూపాన్ని మనసులోకన్నుల్లో  నింపుకొని చూస్తూ ‘’జుర్రుకొందు సొగబు-జుంటి తేనియలమోవి –చిమ్ము మధురసమ్ము స్వీకరింతు  ‘’  అని ప్రతిజ్ఞ చేశాడు.ఇక ఆమెతో సరససల్లాపాలు చెట్టపట్టాలు ,ఊసులు అన్నీ ఊహించుకొన్నాడు .చేయి చేయి పట్టుకొని చెట్టపట్టాలేసుకొని గోదారి కోటిపల్లి రేవులు లోతానాలు, కోనసీమ కొబ్బరితోటల్లో విహారాలు,పాపికొండల్లో జలవిహారాలు ,చేయాలనుకొన్నాడు .’’పూలయ౦దుదాగి మురిపించకే సఖీ –ఇంద్రధనువు తేరు నెక్కిరావే –ప్రోలు సంతలో ‘’పూసమిఠాయి ‘’నైవేద్యం (అముదు )పెడతానన్నాడు .మల్లెపూల పొదరిళ్ళ దాగి ఉండకుండా వస్తే ‘’ఆధరం ఆనివైద్యం చేస్తా ‘’అని పిలిచాడు .పికరవాలు చి౦త తోపులో చీకటి తప్పుకు పిలుస్తున్నాయి.జంటలన్నీ జాతర చేస్తున్నాయి రమ్మన్నాడు .అందరాని ద్రాక్ష ‘’ఆమ్లికం ‘’అంటే పులుపు .అందని నువ్వు ఆమ్రరసం మామిడిపండురసం అనిఊరించాడు .రాజమండ్రిలో రంగులరాట్నం ఎక్కిస్తాననీ ,కాకినాడలో కాజాలకంటే మధురమైన పూతరేకుల పోడుములతో పొంగారే ఆమె పొందు లో తరిస్తానన్నాడు .’’మిధున హంసలమయిమిన్నేటి ఝరిలో –మిసిమి నాళా లను మెసవుదాము .తీర్ధ స్నానం చేయటానికి వచ్చే దేవతా స్త్రీలకూ వలపు తలపులన్నీ పంచుదాం రమ్మన్నాడు .సూర్యలంక రేవు సొగసులు చూస్తూ పిడత  తకింద పప్పుతిని అరకులోయలో అలసిసొలసి మోవిమోవికలిపి ము౦త మసాలాల రుచి చూద్దాం .’’మనం తప్ప వేరే మానవులే లేని కొత్తలోకం లో విహరిద్దాం .తమప్రేమ జీడిపాకం లా వదలకుండా సాగాలి ‘’అనికోరాడు

  ‘’చి౦త పూల రెవిక ,చెంగావి చీరను కాసే పోసికట్టి కదిలే వాల్చూపులు రువ్వి గుండె ఝల్లుమనిపించాలన్నాడు .పెరిమి సంతలో పీచుమిఠాయి కాకి ఎంగిలి చేసి తింటుంటే పక్కవారు ఫక్కుననవ్వాలట. వంగతోటలో సరసాలాడాలి రారమ్మన  న్నాడు .ఇక్కడ ఈ జంట ఎంకీ -నాయుడు బావ అనిపిస్తారు .అందమంతా తెచ్చి అపరంజిలో ముంచి మెరుగులుపెట్టి తావి కలిపి సుగుణాలు  పొదివి సుందరమూర్తిని చేసి ‘’కరుణ  నింప మరచే  కమలభవుండు ‘’అని నిట్టూర్చాడు

  నిశ్చలమైన తన మనోనిగ్రహం ఆమె పొంకాన్ని  చూసి కట్టు తప్పింది  నిశ్చల కాసార నీరం లో ఆమె కన్నుల ప్రతిరూపులు ఈదినట్లనిపించింది .తమప్రేమ యుగాయుగాల ‘’ప్రణయ౦పు యోష’’ జగజగాల గాఢ చనువు తరతరాల విడిపోని తపన ‘’మనమనంముల సంబర౦బు మనది ‘’అని ఊర్వశీపురూరువుల ప్రమద్వారా రురుల సావిత్రీ సత్యవంతుల ,శకుంతలా దుష్యంతుల ,నలదమయంతుల అచ్చమైన స్వచ్చమైన ప్రేమ అనుకోవచ్చు మనం.’’మధుపముం జూడ విరికేలమదువుపొంగు –మొయిలు వర్షింప     ,ధరఎల పులకరిం’’చు –కలువరాయని గని ఏలకడలిపొంగుపొలతి ని౦ జూడ నాకేల వలపుకలుగు ?””అని కృష్ణ శాస్త్రిగారిలా ప్రేమపుట్టటానికి కారణం అక్కర్లేదని తేల్చారు కవి .ఆమె కళ్ళలో  మెరుపు మెరిస్తే తానూ ఆ మెరుపు అవుతాడు .ఆమె నోటి పలుకుల చిలక ఔతాడు. ఆమె కేశాల తమం అవుతాడు చివరికి ‘’కులుకు నయ్యెదనీ మధ్య నలిగి పోవ ‘’అంటాడు ఇదంతా భావకవుల ఉన్మత్త లక్షణాలే .ఆమె జడలో పువ్వులు ,ఆమెనడకలలో హంస అవుతూ ‘’పసిడి నయ్యెద నీమేని పస వెలంగ ‘’’’అని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు .ఆమెవేసిన మంత్రానికి  తనమనసు మరులపంటపండింది .గుప్త వాంచలు అనే   ‘’తావులు తనువెల్లా వ్యాప్తమయ్యాయి .’’అప్పు రెక్కల దాల్చి విహాయసమున –వచ్చి వాలి ‘’సుఖంగా నివాసం చేసి ‘’చూత కిసలయ మద్భావ శోభ మెసవి –కూత వెట్టుము వాసంత కోకిలవలె ‘’అని అర్ధించాడు .వలపు పల్లకీ ఎక్కి ఇలకు దిగే వేల్పు చానలా వచ్చి జీవితం పండి౦చ మన్నాడు .ఇదంతా దేవులపల్లి వారి ధోరణే .

  తరువాత ‘’విరహం ‘’ఆమెకోసం కారుమబ్బులలో ,మేఘం జార్చిన కన్నీటి బొట్టులో ,వెతికాడు .ఆకాశం గగనం శూన్యం అంతా వెతికి శూన్యం అయ్యాడు .కాలువల్లో ,కాసార గమకాల్లో ,నదుల్లో సెలయేటి రొదల్లో వాగుల్లో ,పన్నీటి పరుగుల్లో ఎక్కడుందో తెలియలేదు .ఆమె జాడ విరులలో విరితావి ఝరులలో ,తరువుల్లో ఔషధీ గిరులలో తరగల్లో సముద్రపు నురుగులో ‘’తెర వెరు౦గక వరలుతున్నాడు .చేలల్లో, భూమాత చేలం లో ,పులుల్లో రాచిలక పలుకుల్లో ,తేనెల్లో బంబరగానం లో ,’’పుష్పరాగంపు కెంజాయ బుగ్గల్లో –బుగ్గల్లో పూసే నునులేత సిగ్గుల్లో –పులకించిన నిగ్గుల మొగ్గల్లో వెలుగులో కూడా కనిపించలేదు .మంచు దుప్పటికప్పిన మడులలో ,చలి వెలుగుల సందె పందిర్లో ‘’ప్రియ పరిష్వంగ నిశ్వాస రేచకం లో కన్నుపొడుచుకొని  వెతికినా కానరాలేదు .శృంగార సంయోగ హేలల్లో మొహాబ్ది వీచికలలో ఎక్కడ దాగిందో తెలియలేదు .సూన సౌగంధికాలలో సోక్కిందో ,నీటు నిష్కపు సౌరుల్లో నిక్కిందో తెలియలేదు .ఆమె రూపు హృదయం లో చుక్కగా చెక్కిందేమో ?కూర్మి భావాలు మదినిండా కుక్కిందేమో –రాగ నఖాలతో గుండె రక్కిందేమో ‘’అర్ధం కాలేదు విరహం లో ఉన్న కవిగారికి .

  ఆమె కనిపిస్తే ‘’జోడు గువ్వలై పూల గూడుకట్టి అతను చూపుల మకరందం తాగుతూ ,తిండీ తిప్పలు లేకుండా ‘’ప్రేమ లోకాన చరియించుదాము ‘’అని ఆహ్వానించాడు .తాను జీవితం అనే చిన్న చెట్టు. దానిపై చిలక లాగా వాలే చెలువం ఆమె .’’మొలకనవ్వుల రైళ్ళు మోము తోడ –కొత్త కోర్కెల పూదండ కొప్పు నునిచి –నవ వసంత సుశోభిత నవకమంది –ఆగమి౦చుము నా జీవ నాగమముగా ‘’అని పిల్చాడు .విప్ర లంభం  లో పుట్టిన వేదనాగ్ని ని అశ్రుధారలు కొంచెమైనా అర్పలేకపోయాయి .ఆమె ఒక పూదేన నిర్ఝరం. తాను  ప్రేమ వేసంగీ దాహార్తి పీడితుడు .ఊహల్లో విహరించీ విహరించి వేసారిపోయి దెబ్బతిని ‘’పెదవి చిట్లిశోణితము  స్రవించింది .బుగ్గలు మ౦కెనపూలయ్యాయి .ఆమె దర్శనభాగ్యం తో ఆతడి దాహం తీర్తుంది అన్నాడు .అంతకుముందు ఏ స్త్రీనీ పరకాయించి ఇలా చూడలేదని సంజాయిషీ చెప్పుకొన్నాడు .ఆమె సొబగుల వలలో చేపలాగా చిక్కుకొన్నాడు  .తానూ అస్ఖలిత దృఢ చిత్తుడు. అస్ఖలిత బ్రహ్మ చారి కూడా .కనుక ప్రస్ఖలుతుడిని చేయవద్దన్నాడు .ఆ చిల్కలకొల్కి పలికితే మత్యాలు రాలిపోతాయా అనుకొన్నాడు .ఒబ్బిడిగా కనిఇంచి బెబ్బులి అయిన తనను పిల్లిలా చేసిందట –‘’నీవే ప్రేయసి ,ప్రేమము –నీవే నా చెలియ,చెలిమి నీవే మనమౌ –నీవే ప్రాణము మానము –నీవే నా సుఖము  బాధ నిజముగ సఖియా ‘’అని మొత్తుకున్నాడు.తలిరాకు  వంటి బతుకును వలల సుడిలో తిప్పి ,పోయింది ఎడబాటుకు విలపించాడు .చివరకు ‘’నెలతల నమ్మ౦గ. గలుగు నిట్టూరుపులే ‘’అనే ఎరుకకలిగింది భావకవికి .

  చివరి భాగం ‘’పర్యాప్తం ‘’లో ప్రేమకు అర్ధం ,పరమార్ధం ఏమిటి ప్రేమ ఎలాకలుగుతుంది .ఎక్కడకలిగి ఎలా విక సిస్తుంది?అని ప్రశ్నలు వేసుకొని ప్రేమ అనే తలపు రెక్కలతో ప్రేమాటవిలో చరించే విహగాలకు ప్రేమ అనే గాలి మేపరి అంటే పాము ప్రేముడితో కాటు వేసి విరహాన్ని నింపుతాడు అని హితవు చెప్పారు .మదిలో రేగిన ఊహలు గరుత్మ౦తమ్ము చందంగా గిరి ఏవో ఎదమీటగా ముదాన్ని గూర్చే ప్రేమభావాలు గుర్తుకొచ్చి ఈకావ్యం రాసినట్లు కవి చెప్పారు .

  మంచి భావనా ,ధారాళమైన పద గు౦ఫనా ,గంగాఝరి లాంటి ప్రవాహవేగం పవిత్రత తో పెనవేసిన గొప్పకవిత్వం ఈ కావ్యం లో కవి కాశీరాజు గుప్పించారు .త్వరలో వీరినుంచి గొప్ప ప్రబంధం వెలువడుతుందని ఆశిస్తూ ,ఈ కావ్యాన్నీ ఆయనకవిత్వాన్నీ అభినందిస్తున్నాను .

  మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -7-7-21-ఉయ్యూరు  

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.