అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -13
వెంకటాచలమొదలి ,సుబ్బలక్ష్మి దంపతులైన వారింటికి శేషాద్రి స్వామి ఒక రోజు వెళ్లి ,ఇంటివెనక ఉన్న నాలుగైదు చెట్లను చూపించి సుబ్బలక్ష్మి తో ‘’ఒక వేడుక చూపిస్తా చూడు ‘’అన్నారు .క్షణం లో వందలాదిచిలకలుగోరువంకలు కాకులు నానా జాతిపక్షులు చెట్లపై వాలాయి ‘’ఇవి తమపిల్లల్ని చూసుకోవటానికి పోవా ??’’అని అమాయకంగా ప్రశ్నిస్తే ‘’అలానా సరే ‘’అని పై ఉత్తరీయం నుంచి ఒక నూలుపోగుతీసి విసిరి ఫోఫో అన్నారు .క్షణం లో వెళ్ళిపోయాయి .సుందరేశం భార్య కనబడినప్పుడల్లాస్వామి ‘’యమపురి చూశావా ??’’అని అడిగేవారు .ఆమెకు చనిపోతాననిదిగులుపెరిగింది .మరోసారి వెళ్ళినా, స్వామి అదే ప్రశ్నవేస్తే ,’’చూడలేదు స్వామీ ‘’అంటే ‘’చూపిస్తా చూస్తావా ?’’అని ఆమె ఎడమ చేయిపయ్యికొని ,తన నోరు తెరచి చూడమన్నారు .స్వామి నోట్లో ఆమెకు ఘోరనరకం ,వికృతాకారులు రోదనలు వొడలు జలదరించే దృశ్యాలు కనిపించాయి .మూర్చపోయింది అయిదునిమిషాలకు కానీ స్మృతిరాలేదు. స్వామి తన ఉత్తరీయం తో ఆమె ముఖం పై విసురుతున్నారు.నెమ్మదిగాతెరుకొని ఇంటికి వెళ్లి అందరికీ చెబితే ఆశ్చర్యపోయారు .కొన్నాళ్ళకు మద్రాస్ లో జరిగే పెళ్లి శుభలేఖ వస్తే స్వామి పర్మిషన్ కోసం రాగా ‘’వెళ్ళవద్దు ‘’అన్నారు కానీ ,ఆమె బంధువులతోమాటవస్తుందని మద్రాస్ వెళ్ళింది .వెళ్ళిన మర్నాడే అక్కడ కలరా తగిలి చనిపోయింది ,రాబోయేమరణాన్ని స్వామి ఆనాడు సూచి౦చారన్నమాట .
వేంకటాచల మొదలిఒక సారి మద్రాస్ వెళ్లాల్సివచ్చి అసలే దొంగలభయంగా ఉందని స్వామినికలిసి చెప్పి ఒంటరిగా ఇంట్లో ఉన్న తనభార్య క్షేమసమాచారాలు చూడమని కోరగా సరేనన్నారు .ఒకరోజు రాత్రి సుబ్బలక్ష్మితో ‘’రేపురాత్రి మీ పక్కింట్లో దొంగతనం జరుగుతుంది నీకు భయం లేదు నేను మీ అరుగుమీద పడుకొని ఉంటాను ‘’అన్నారు .పక్కింటాయన ఇంట్లో ఉన్న బంగారం కరిగించి కడ్డీలామార్చి తలకింద పెట్టుకొన్నాడు .ఇది తెలిసిన మరోఆయన దాన్ని తస్కరించాడు .ఆయన లబోదిబో మంటుంటే స్వామి సుబ్బలక్ష్మిని పిల్చి దొంగ వచ్చిపోయాడు నీకు భయం లేదన్నారు .మర్నాడు రాత్రి పదకొండు గంటలకు స్వామి సుబ్బ లక్ష్మి ఇంటికి వచ్చి ఇంట్లో వారంతా భక్తితో స్వామిని ప్రశ్నిస్తుంటే సమాధానాలు చెబుతూ ఆమెను ‘’నీకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను అమ్మవార్ని ఇంద్రాది దేవతల్నీ చూపిస్తా పడుకో ‘’అనగా ఆమె పడుకుంటే ఆమె గుండెపై కుడి చేయి వేసి ‘’ఇప్పుడు చూడు ‘’అనగా ,ఆమెకుమగత వచ్చి శంఖధ్వానాలు మంగళారవాలు అమృతతప్రవాహం విద్యుత్ కాంతులు రసమయ గోళాలు ,వాటిమధ్య తెల్ల ఏనుగు దానిపై సుందరాకారుడు ,రుద్రుడు పార్వతి ,విష్ణువు ‘’చూడు అనగా ఇక చూడలేక మూర్చ పోయింది ‘’నీకు చూసే భాగ్యం లేదు కర్మ క్షయం కాలేదు గురకపెట్టి నిద్రపో ‘’అన్నారు .ఆమెకు నిద్రపట్టలేదు ఆదివ్య దర్శనం తో ఆమె చూపు పోయింది ,తడుముకొని నడవాల్సి వచ్చింది.మర్నాడు ఉదయం 11గంటలకు స్వామివచ్చి ‘’భయం లేదు నీ చూపు మళ్ళీ వస్తుంది ‘’అని తన ఉత్తరీయం తో ఆమె కళ్ళు తుడవగా ఆమెకు చూపువచ్చింది.
శ్రీ విద్యోపాసకులలో ప్రసిద్ధులైన ఎన్ .సుబ్రహ్మణ్యయ్యర్ ఉపాసనా రహస్యాలపై శ్రీనగర విమర్శ ,గురుతత్వ విమర్శ వంటి చాలా పుస్తకాలు రాశారు.మంత్ర శాస్త్ర విశారదుడుకూడా . గొప్పకర్మిష్టి. స్వామిపై అమితభక్తి .ఒకసారి స్వామిని దర్శించగా ‘’రేపు ఇలయనార్ కోవెలకు రా ‘’అన్నారు .బ్రాహ్మీ ముహూర్తం లోస్వామి ఆ ఆలయానికి వెళ్లగా అయ్యరూ రాగా స్వామి ఆయనకు పరాశక్తి రూపం లో దర్శనమిచ్చారు. అయ్యరు పరమానంద భరితుడవగా స్వామి ఆయనకు ఏదో ఉపదేశం కూడా చేశారు .
స్వామి బంధువు నటేశ అయ్యర్ కొడుక్కి విషజ్వరం మసూచీ తో బాధ పడుతు.కళ్ళు కూడా పోతే,ఎన్నివైద్యాలు చేసినా నయంకాకపోతే స్వామికి చెబితే ‘’వాడిని తెచ్చి ఇక్కడే వదిలి వెళ్ళు‘’అనగా అలాగే చేస్తానంటే ‘’నా దగ్గరకు అంటే అమ్మవారి సన్నిధిలో ‘’అనగా ,అలాగే చేయగా స్వామి పూజార్లకు చెప్పగా వారు రాత్రిపూజాదికాలుకాగానే వాడిని అమ్మవారి గర్భగుడిలో ఉంచి గుడికి తాళం వేసి వెళ్ళారు .మర్నాడువచ్చి తలుపులు తీస్తే,కుర్రాడి కళ్ళు జ్యోతుల్లా కాంతులీనుతూ చక్కగా ఉన్నాయి .ఈ అద్భుతాన్ని అందరూ చాలారోజులు చెప్పుకొన్నారు .
పదహారేళ్ళ వెంకటరామన్ కు రోజూ సంధ్యవార్చగానే అమ్మవారి గుడికి వెళ్లి దర్శనం చేసే అలవాటు .ఒఅరోజు గర్భాలయం వద్ద స్వామి కనిపించి ‘’ఎక్కడికి “’అంటే ‘’అమ్మవారి దర్శనం కోసం ‘’అంటే ‘’ఇక్కడే దర్శనం చేస్తావా ??’’అని అడిగితె ‘’మీరు చూపగలిగితే’’అనగా ,స్వామి వాడికి అడ్డంగా నుల్చోని ‘’ఇప్పుడు చూడు ‘’అనగా వాడి మనో నేత్రాల ముందు అమ్మవారు ‘’ఆపీత కుచాంబ ‘’దివ్య దర్శనమిచ్చింది .’’అమ్మవారి చీర రంగేమిటి అనిఅడిగితే ‘’పసుపు ‘’అనగా .కఠమాల?’’అంటే ‘’మల్లెమాల ‘’అనగా ‘’ఆభరణాలో ‘’అని అడిగితె ‘’ శిరసుపై కిరీటం ,ఒడిలో వడ్డాణ౦ ,కాళ్ళకు గొలుసులు ‘’అన్నాడు .’’ఇక లోపలి వెళ్లి చూడు ‘’అనగా లోపలి వెళ్లి అమ్మవారిని చూస్తె తాను బయట ఎలా ఉన్నఅమ్మవారిని చూశాడో సరిగ్గా లోపల అమ్మవారు అలాగే ఉంది .ఈ అనుభవాని గర్వంగా అందరికీ చెప్పుకొన్నాడు .
మధురలో ఒక సౌరాష్ట్ర కుటుంబానికి పిల్లల్లేరు .అమ్మవారు మీనాక్షీ దేవిపై వారికి అమితభక్తి .ఆమెతో మొరపెట్టుకొంటే తిరువన్నామలై వెళ్లి శేషాద్రి స్వామిని దర్శించమని చెప్పింది .మర్నాడు అక్కడికి చేరి స్వామికి నమస్కరిస్తే ‘’మిమ్మల్ని మీనాక్షీ దేవి పంపిందా?’’అంటే వాళ్ళు ఆశ్చర్యపోగా, దగ్గరకు పిల్చి ఇద్దరి కొంగులనుకలిపి ముడి వేసి ‘’ వెళ్లి రండి ‘’అనగా నాలుగు అడుగులు వేయగానే స్వామి కొంగుముళ్ళు విప్పి ‘’మీ కోరిక నెరవేరి పుత్రప్రాప్తి కలుగుతుంది ‘’అని దీవి౦చి పంపగా ,సంవత్సరం తిరిగేనాటికి వారికి పండ౦ టిమగపిల్లాడుపుట్టగా ‘’శేషాద్రి ‘’పేరు పెట్టుకొన్నారు .స్వామికీ ,పరదేవతకు అభేదమే అని మనం అర్ధం చేసుకోవాలి .కవికులగురువు కాళిదాస మహాకవి అందుకే ‘’దయమాన దీర్ఘ నయనాం -దేశిక రూపేణ దర్శితాభ్యుదయాం ‘’అన్నాడు. అమ్మ గుణ నిధిమాత్రమే కాదు, గురుమూర్తికూడా .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-7-21-ఉయ్యూరు