అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -14(చివరిభాగం )
మహా సమాధి
శేషాద్రిస్వామి 40ఏళ్ళు తిరువన్నామలై లో గడిపారు .మనసు కైవల్యం మీదకు మళ్ళింది ఈ విషయం చూచాయగా సుబ్బలక్ష్మమ్మకు చెప్పాలనుకొన్నారు .’’నిన్ను ఒకటి అడుగుతా ఖచ్చితంగా చెప్పు .నువ్వు చెప్పినట్లే చేస్తా .జనం తొందరపడుతున్నారు .ఇప్పుడున్నట్లే ఉండనా లేక కొత్త కుటీరం నిర్మించుకొని వెళ్లి పోనా ?’’.ఆమెకు స్వామిప్ర ప్రశ్నలోని మర్మ౦ తెలియక ‘’మీకు పైన ఉన్న అన్గోస్త్రం జారిపోతేనే తెలీదు .దీనికి తోడూ ఇంకో కుటీరమా ?ఉన్నచోటే యోగాభ్యాసం చేయండి ‘’’’అంది .ఆయన వదలలేదు కనపడినప్పుడల్లా ఇదే ప్రశ్న వేసేవారు .ఒకసారి విసిగిపోయి ‘’’కొత్తకుటీరం పై అంతమోజు ఉంటె అలాగే కట్టుకొని యోగం చెయ్యండి ‘’అన్నది. ‘’నా మనసులో కూడా ఇదే ఉంది నువ్వు కూడా చెప్పావుకనుక అలానే చేస్తా ‘’అని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు .ఆమె ఆజ్ఞ ఆయనకు పరమేశ్వరి ఆజ్ఞ..
కొన్నాళ్ళకు పోరుగూరివారు వచ్చి స్వామికి అభిషేకం చేయాలనుకొని కేశసంస్కారం చేయించి అభి షేకానికి సిద్ధపడగా ‘’నాకు స్నానం వద్దు జ్వరం రావచ్చు ‘’అన్నారు .వాళ్ళు మూఢ౦ గా వందలాది పన్నీరు బుడ్లు ఆయన శిరస్సుపై కుమ్మరించి అనేక బిందెలతో బావి నీరు తెచ్చి శివలింగానికి చేసినట్లు అభిషేకం చేశారు. ఊళ్ళో వాళ్ళూ రెచ్చిపోయారు .అభిషేకం పూర్తియ్యేసరికి బావిలో చుక్క నీరు లేదు .స్వామి వొళ్ళు తుడిచి విభూతిరాసి ఫోటో కూడా తీశారు .
ఆరోజు సాయంత్రమే స్వామికి జ్వరం తగిలింది .నలభై రోజులు జ్వరం తోబాధపడ్డారు .ఎంత జ్వరమైనా దిన చర్యలో మార్పు లేదు. చిక్కి శల్యమయ్యారు .జ్వరం తట్టుకోలేక ,చిన్న గురుక్కులు అరుగుమీద పడిపోయారు .అతడు సేవ చేయటం ప్రారంభించాడు .ఊరిజనాలకు తెలిసి త౦డోపతండాలు గా చేరారు .తిరువన్నామలైలో జరిగే ‘’కృత్తి కొత్సవానికి’’ మించిన జనం వచ్చారు స్వామిని చూడటానికి .వైద్యం చేయిస్తామంటే వద్దన్నారు .ఆహారమూ తీసుకోలేదు .నరసింహస్వామి నారాయణ శాస్త్రి ఉత్తరం రాసి స్వామి విషయం తెలియబర్చాడు .శాస్త్రి వెంటనే వచ్చివాలాడు. ఆయన్ను చూడగానే స్వామి కళ్ళు తెరవగా ఒక నారింజపండు స్వామికి సమర్పించగా ,దాన్ని వలిచి ,అందులో ఒక్కతొన మాత్రం చిదిపి వాసన చూశారు .వానచినుకులు, తడిగాలి. గురుకులు శాలువా తెచ్చి స్వామికి కప్పాడు .లేచి ఆశాలువతోనే స్వామి ఆలయానికి తూలుతూ వెళ్ళగా వెంట శాస్త్రి ,మాణిక్యం వెంటనడిచారు పడిపోకుండా పట్టుకొంటూ .దారిలో ఒకగుంటలో వాననీరు నిలిచిఉంటే ఆమోకాలిలోతు నీటిలో కూర్చున్నారు .జనం పెరిగారు .భరించలేక గుంటలోనే పడుకొన్నారు .రాత్రి ఎనిమిదికి అందరూ స్వామి వారికి దూరం గా జరిగి నిలిచారు. మాణిక్యం వెళ్ళిపోయాడు .స్వామివద్ద శాస్త్రి ఒక్కడే ఉన్నాడు .తెల్లవారుజామున మూడుకు గుంటనుంచి బయటకు వచ్చి ఆ తడి గుడ్డలతో గురుకులు ఇంటికి నడిచి వెళ్లి ,అలాగే పడుకొన్నారు .నరసింహస్వామిని సుందరకాండ పారాయణ చేయసాగాడు .స్వామి స్థితిలో మార్పు లేదు .సుబ్బలక్ష్మి రాగా ‘’చూశావా ?’’అనగా అప్పటికి ఆమె కు లైట్ వెలిగి ‘’నేను చెప్పిన కుటీరం, యోగాభ్యాసం ఇది కాదు స్వామీ ‘’అని వలవల ఏడ్చింది .
అది విభవ సంవత్సర మార్గశీర్ష మాసం .స్వామి జనన కాలం లో గురు శని శుక్రులు మేష వృశ్చిక కు౦భరాసుల్లో ఉన్న సమయాన్ని తనకైవల్య ముహూర్తంగా స్వామి నిర్ణయించుకొని ,శుక్రవారం అదే రాశులలో పద్మాసనం లో కూర్చున్నారు .అరుణాచల ఆది దంపతులను మనస్సులో నింపుకొని ,ఆన౦ద స్ఫురణతో ,రోమా౦చితులై ,భ్రువ మధ్యమం లో ప్రాణాన్నిఆవేశి౦పజేసి , సనాతన ,విశ్వ నియంత ,జ్యోతిర్మయుడు ,సర్వ పోషకుడైన పరమేశ్వరుని విభూతిలో తన ప్రాణవాయువులను కలిపేశారు .స్వామిలేని అరుణాచలం రాముడులేని అయోధ్య అయింది .
శేషాద్రి ద్రిస్వామి ఉపదేశామృతం
స్వామి ఉత్తమాధికారులకు ఉపదేశ దీక్ష నిచ్చేవారు .విఘ్నోప శాంతికి ‘’శుక్లాంబరధరం ‘’శ్లోకం మూడు సార్లు చదవాలి .ఈశ్వరుడు ఎవరో తెలుసుకొంటే శరీరం తానుగా మారుతుంది .ప్రమాదమే మృత్యువని సనత్సుజాతీయం చెప్పింది .దేహాత్మ బుద్ధిని వదలటమే మృత్యుంజయం.మన నవద్వారపురి లంక జ్ఞానాగ్ని తోనే దగ్ధమౌతుంది .రామాయణం చదవటం అంటే రాముని గుణాలు ఆచరి౦చ టమే .గురువే శివస్వరూపం ,శివుడే గురువు .జాతిభేదం మాతృభోగం వదిలితే సమాధి సిద్ధి .అగస్త్యమహర్షి సంబోధించిన ‘’రామరామ మహా భాగో ‘’అంటే చాలు మోక్షమే .సుందరకాండ జ్ఞానప్రదాత .రాముడు సర్వవ్యాపి కనుక ఆయన నామ స్మరణ చేయాలి .పాపాలు తొలగటానికి భారతం చదవాలి .
శ్రీరంగని సేవించినా ,హరికధ చెప్పినా మోక్షమే .శివ ,శక్తులు ఒకరికొకరు విడిచి ఉండనట్లు ,విభూతికి ,కు౦కుమకు భేదం లేదు ..శ్రీకృష్ణ కర్ణామృతం ,లలితా సహస్రనామం ,శివ సహస్రనామ౦ తప్పితే వేరే లోకం లేదు .చిత్తవృత్తి నిరోధమే రాక్షస సంహారం .కామ నాశనానికి ,ఇంద్రియ విజయానికీ అద్వైత దృష్టి అవసరం .సత్యం శాంతం సహనం మన పరిజనం ,మన పరివారం ఆత్మ బంధువులు .ఈగలాగా శుద్ధం ,చీమలాగా బలం,కుక్కలాగా విశ్వాసం ,రతీ దేవిలాగా ప్రేమా ఉన్నవాడికి గురుభక్తి సులభం .వేగిన గింజ మొలకెత్తనట్లు ఈశ్వర ప్రీతిగా చేసే కర్మలు బంధకాలుకావు .
పనసపండు తొనలాగా ఏశ్వరుడినిఆరాధి౦చాలి . దానితొన బీజాన్ని ఆవరి౦చి ఉంటుంది .ఈశ్వరుడు జగత్తుకు బీజం .ఆ బీజం లోంచి వచ్చిన జగత్తు ఈశ్వరుణ్ణి ఆవరించి ఉంటుంది .పనస తొనలోని గింజను తీసేసి దాన్ని తిన్నట్లుగానే ,పంచకోశ నిరాకరణం చేసి ఆత్మాను సంధానం చేయాలి .ఆత్మ బోధ ఉపనిషత్ ఓంకార ప్రశస్తిని ,అష్టాక్షరిమహిమను చెప్పింది .దీన్నిఅనుష్టిస్తే హృదయేశు డైనవాసుదేవ దర్శనం లభిస్తుంది .మహాభక్తుడైన గుహుడు గంగలోపడి మునిగిపోవటం అంటే దేహధ్యాసను వదిలేయటమే .
‘’అపసర్ప సర్ప భద్రం తే దూరం గచ్ఛమహాయశాః-జనమేజయస్య యజ్ఞాంతే ఆస్తీక వచనం స్మర’’ఇదే పాముమంత్రం .భోజనం చేసే టప్పుడు ఎవడు నాలుకద్వారా రసాన్ని ఆస్వాదిస్తాడో వాడిని తెలుసుకొంటే చాలు .సాధ్యమైనతవరకు ప్రవృత్తి నుంచి తప్పుకొని నివృత్తి ని అనుసరించాలి .త్రిభువనజనని జ్ఞానగంగే ప్రవాహం. శరీరమే కాశి. భక్తీ శ్రద్ధలే గయ.గురు చరణ ధ్యానయోగమే ప్రయాగ .తురీయుడైన విశ్వేశ్వరుడే ఆత్మా ,సాక్షి .అన్నీ శరీరం లోనే ఉంటె వేరే తీర్దాలు ఎందుకు ?
‘’కాశీ క్షేత్రం శరీరం ,త్రిభువనజననీ వ్యాపినీ జ్ఞాన గంగా- భక్తి శ్రద్ధా గయేయం-నిజగురు చరణధ్యానయోగః ప్రయాగః-విశ్వేశోయం తురీయః సకలజన మనః –సాక్షీ భూతో౦తరాత్మా దేహం స్వయం మదీయే యదివసతి –పునస్తీర్ధ మన్యత్కిమస్తి?’’(శంకర భగవత్పాదులు ).
సమాప్తం
ఆధారం -మొదటి ఎపిసోడ్ లో రాసినట్లే –బ్రహ్మశ్రీ కులుమణి నారాయణ శాస్త్రి గారు తమిళం లో రాసిన’’ శ్రీ శేషాద్రి స్వామి వారి జీవిత చరిత్ర ‘’కు శ్రీ విశాఖ గారు తెలుగు అనువాదం చేసి ,తెనాలి సాధన గ్రంధ మండలి వారు ప్రచురించిన ‘’శ్రీ శేషాద్రి స్వామి జీవితము.’’
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ – 10-7-21-ఉయ్యూరు