పొడుపు కథల శ్రీ గానలోల శతకం
శ్రీ పుట్రేవువెంకట సుబ్బారాయ మంత్రి గారి ద్వితీయ పుత్రుడు శ్రీ నాగ భూషణ కవి రాసిన శ్రీ గానలోల శతకం ఏలూరు రామా అండ్ కో వారు 1914లో ప్రచురించారు .వెల ఒక అణా.
శతకాన్ని వినాయకుని స్తుతి తో ‘’తండ్రికంటే గొప్పతనమున మున్ముందు –పూజనముల నందు పుణ్యుడు ‘’అన్నారుకవి. తర్వాత సరస్వతిని ‘’బాపనమ్మ యయ్యు బతి గల్గి యుండియు –రచ్చమీద కెక్కురమణి ‘’అన్నారుకొత్తగా.పోడుపులతో అర్ధం తెలుసుకోమని .తర్వాత అన్నీ పోడుపుపద్యాలే .దీని యర్ధమేమి గానలోల అనేది మకుటం.98 ఆటవెలది పద్యాల సౌందర్యం రాశీభూతమైన శతకం .
‘’నాల్గుమొగములుండు నలినోద్భవుడుగాడు –కనులు పదియునారు కలిగియుండు నాలుమగలకెప్పుడానందమిచ్చును –దీని యర్ధమేమి గానలోల ?’’ అంటే మంచం .’’పండ్లు నూరుగలవు ప్రాణ౦బులేదు .-జీవకోటి నెల్ల జిక్కబట్టు –నరుల తలలపైన నాట్య౦బు లాడును’’అంటే దువ్వెన .తలాతోకా ఉండి,కళ్ళులేకుండా పొడిచి తోకతో భూమిని పైకి లేపేది –గునపం .పైకేక్కుతాడుమనిషి కానీ గుర్రం కాదు ,పాలిస్తు౦దికానీ బర్రేకాదు.కదలదు ‘’అంటే తాటిచెట్టు .’’మూడుకన్నులుండు ముక్కంటి యనరాదు –కడుపు వీపునడుము కాళ్ళులేవు-తిరిగి ధాన్యములును దినుచు గ్రక్కుచుండు ‘’అంటే తిరగలి .
రెండు చెవులు ఉంటాయి చేతుల్లేవు కడుపు ఉంది నోరుకన్ను లేవు అగ్నిమీదకేక్కి భక్ష్యము లిచ్చేది –బూర్లేమూకుడు .వర్షాకాలం లో వేయకుండానే వచ్చే గొడుగు –పుట్టగొడుగు .నీరు మేతా అడక్కుండా అన్నికాలాల్లో బంటులా వెంటవచ్చేది -నీడ .’’కడుపున కనిపెంచి కన్నేనిచ్చినయట్టి –మామయు౦ డగాను మరచిపోయి –మామయందు రొకని’’అ౦టే చందమామ.రాజు అంటారు రాజ్యం లేదు లెక్క ఖచ్చితంగా చెప్పి చిక్కులు తీరుస్తున్దికానీ మంచీ చెడూ లేనిది –త్రాసు అదే తరాజు .రాణి అ౦టారుకాని రాచపిల్లకాదు,భరణిలో ఎప్పుడూ పడుకొనే ఉంటుందిదానిపేరు చెబితే దేవుళ్ళే దిగొస్తారు –సాంబ్రాణి .కారం అ౦టారుకానిఉప్పులాగాఉన్నా చప్పగా ఉంటూ ,నీళ్ళల్లో కరుగుతుదికాని నిప్పుతగిల్తే మండుతుంది –సురేకారం ‘’నేనే రేడు అంటుంది .ఏదో ఒకకాలం లోనే కాస్తుంది అందరికీ ఊరికే ఇస్తుంది –నేరేడు .
‘’నరుడు గట్టనట్టి మెరుగైన ఇండ్లలో –పాలు నిండి యుండు మేలుగాను –వానిద్రాగి నరులు వర్ధిల్లు చుందురు’’అంటే పాలిండ్లు.రాత గీతాలేని భారతం పామరజనం నోట్లో పలుకబడేది –చాటభారతం .రామాయణమే,రమ్యమే చదువు రాని వారు చదువుతారు –అదే లోకాభిరామాయణం . శుకం వనం శాఖ ఒకమాటలో ఉన్న ఔషధకూర –చిలకతోటకూర .గాడిద గుమ్మం ఆకు ఉన్న పదం –గాడిదగడపాకు .’’ వేయి కనులుండు వేల్పురేడా కాడు-కడుపు చెవులు నోరుకాళ్ళు లేవు –దాన్యరాశులేల్ల దనివార భుజియించు ‘’-జల్లెడ .
ఇలాగే తమాషాగా ఉండే మాటలు కనుక్కోవాలి –‘’అన్నదమ్ములేల యరఛి పోట్లాడుట –పిల్లలేల యరచు తల్లిజూచి –రెండు నొక్కమాట నుండును బరికింప ‘’అంటే పాలుకు అని అర్ధం పాలు అంటే భాగాలు పంచుకోవటం ,తల్లిపాలు అనీ కూడా .జనాల ఇళ్ళల్లో పుడుతు౦ది కాని సంతానం కాదు అంటుకుంటే నెత్తురే తాగుతుంది –నల్లి .వాణి అంటారు వాగ్దేవికాదు.జనం తనివారా తాగుతారు .కొత్త కుండలో కూర్చుంటుంది తప్పకుండా –తరువాణి.
‘’విట పురుషు నెల్ల వేశ్య నుంచగ నేల –పోయ్యిమీదకూడు పొంగనేల –రెండు నొక్కమాట నుండును పరికింప ‘’అంటే ‘’మరిగి ‘’వేశ్యను మరిగి అని మొదట్లో తర్వాత పోయ్యిమీదమరిగి అని అర్ధాలు .విటుడు వేశ్య ,చేప చిక్కేది- ఎర చేత.’’రాజుమీద నెక్కు రౌతుమీదను నెక్కు –నందినేక్కు పిదప పందినెక్కు-అమృతముపైనెక్కు అన్నిటిపైనా ఎక్కేది ఈగ . జుట్టు నేలవంచి గట్టి తపస్సు చేసి ప్రాప్తాలైన ఫలాలను పక్షులకు పంచిపెట్టేది-మర్రి చెట్టు .’’అన్నదమ్ము లేవురవని నుండిరి వారి –య౦దు పేరులేని యతని జూచి –నగలు బెట్టు చుండ్రు నరులు సంతసమున –‘’అనామిక అంటే ఉంగరపు వ్రేలు .
గర్భభారాన్ని మోసి కడుపార కంటే ,బిడ్డలని తెలిసినా ప్రేమలేకుండా తండ్రి చంపాలనుకొంటే, తల్లి రక్షిస్తుంది అందకుండా –పిల్లి .పడుపుకత్తే కాదు ఇతరులను ఎరగదు .స్త్రీలకు ఉపచారం చేస్తుంది కానీ సాని అంటారు చెవలాయలు –మంత్రసాని.జందెం ఉంటుంది బ్రాహ్మణుడుకాదు . వంగి ఉంటాడు కాని ముసలాడుకాడు .సిద్ధమైతే యుద్ధానికి రెడీ –విల్లు .చెట్టుకు పుట్టడు మనుషుల్లో తిరుగుతాడుకానీ వాడిని కాయఅంటారు –డిప్పకాయ . కాళ్ళు౦టాయి తుమ్మెదకాదు నల్లగా ఉంటుంది నమ్మరాదు నరుల తలలపై నాట్యమాడుతుంది –పేను .
‘’గర్భవాసమందు కన్నబిడ్డలనెల్ల –కనుల జూడలేక కరుణమాని –తనదు బిడ్డలనక తప్పక భక్షించేది-పాము.దుఃఖ ఫలాన్ని తెచ్చి మనుషులు రసం పిండి మరగగాచి పొట్టనిండా తినేది –చింతపండు .’’చలువ తియ్యదనము కలిగించునొకకల్లు –కూరలందు వేసి కకొనెడుకల్లు –మంచి వస్తువులను మర్దించు నొకకల్లు –వడగల్లు ,ఉప్పుగల్లు సన్నెకల్లు .చదువూ సంధ్యలు లేకపోయినా గోడమీద కూర్చుని శకునాలు చెప్పేది –బల్లి .మొదలు చివర మూడక్షరాలు కుతుకము ,కూర్మి కలది తలకిందు చేద్దాంటే కానిది –ముదము .కొ౦పతవ్వే కుత్సితుడైనా రాజుంటారు .పళ్ళు కప్పాలుగా ఇస్తారు –ఎలుకరాజు .
‘’జుట్టు విరబోసి బట్టలు పదిగట్టి –చెట్టుమీద నుండు చిట్టచివర –పొట్ట చి౦చెనేని పొడచూపు ముత్యముల్ ‘-దీని యర్ధమేమి గానలోల ?-మొక్కజొన్నపొత్తు
మీ- గబ్బిట దుర్గాప్రసాద్-12-7-21-ఉయ్యూరు ..